30, డిసెంబర్ 2025, మంగళవారం

ఎన్నెన్ని చింతలో ఏమార్చ లేనులే ౹౹ కాలాన్ని నిలదీసి ఎదిరించ లేనులే - గజల్


 చిత్రానికి చిన్న ప్రయత్నం....


ఎన్నెన్ని చింతలో ఏమార్చ లేనులే ౹౹

కాలాన్ని నిలదీసి ఎదిరించ లేనులే ౹౹


చూపులో ధైర్యాలు చెలరేగు ప్రశ్నలూ

సందిగ్ధ తలపులే తప్పించ లేనులే ౹౹


రేపటిది ఆశయం ఈరోజు నడవాలి

బ్రతుకులో భారాన్ని ప్రశ్నించ లేనులే ౹౹


దేవుడే నమ్మకం పోరాటమాగదే

నిట్టూర్పు నెందుకో నిందించ లేనులే ౹౹


వద్దంటే ఆగునా కష్టాల వరదలే

చేయూత లేదనీ చెమరించ లేనులే ౹౹


దాగవే కన్నీళ్ళు దయతలచి గాయాన్ని

హర్షాన్ని కదిలించి చిందించ లేనులే ౹౹


ఓ వాణి మౌనంగ గేయమై పోయింది

చిత్రంగా ఊహలే తరలించ లేనులే ౹౹


....వాణీ కొరటమద్ది


Pic Pvr Murty  garu



18, డిసెంబర్ 2025, గురువారం

ఫిల్టర్ కాఫీ

 





Digital గా రంగుల్లో కూర్చుకున్న నా pen sketch.

దక్షిణాది రాష్ట్రాల్లో  ఫిల్టర్ కాఫీ రుచే వేరు. మరి మిథునం చిత్రంలో జొన్నవిత్తుల వారు రచించిన ఈ కవితే చెబుతుంది ఫిల్టర్ కాఫీ అంటే ఏమిటో!


చిత్రం : మిథునం (2012)

సంగీతం : స్వరవీణాపాణి 

సాహిత్యం : జొన్నవిత్తుల 

గానం : జొన్నవిత్తుల 

అనుదినమ్మును కాఫీయే అసలుకిక్కు..

కొద్దిగానైన పడకున్న పెద్దచిక్కు

కప్పు కాఫీ లభించుటే గొప్పలక్కు

అమృతమన్నది హంబక్కు

అయ్యలారా..ఆఆఆ...


జై కాఫీ... విశ్వాంతరాళంబులోనున్న

బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన

పానీయమే లేదు ముమ్మాటికీ..

అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ..

నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికీ..

ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే

పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు బెడ్ కాఫీ

కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టేస్టీశ్వరీ..

ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వకున్

సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరీ...

లోక ప్రాణేశ్వరి ప్రాణ దానేశ్వరి గంటగంటా

ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరీ..

స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి

నీ సారమంతా సుతారంగా జారంగ నోరూర

చూడంగ నా సామిరంగా నిజంగానె చచ్చేవిధంగా..

కాస్త తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా..

ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న

మూడంతా పాడయ్యి టైమంత వేస్టయ్యి

కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణల్ చేసి

కాంటాక్ట్సు సర్వంబు నాశమ్ము కావించుకొంటారుగా...

అందుకే నిన్ను అర్జంటుగా తెచ్చుకొంటారుగా..

దాచుకొంటారుగా కాచుకొంటారుగా చచ్చినట్టింక

ఇచ్చేంత సేపందరున్ వేచి ఉంటారుగా...

కాఫీనంతెత్తు పైనుంచి ఓకప్పులోవంచి

ఆ కప్పులోనుంచి ఈ కప్పులో పోసి

అట్నుంచి ఇంట్నుంచి ఇట్నుంచి అట్నుంచి

బాగా గిలక్కొట్టుచున్ నుర్గు ఉప్పొంగగా

తెచ్చి ఇస్తారుగా..

గొప్ప నిష్టాగరిష్టుల్ బరిస్తాలలోనన్

గరిష్టంబుగా కాఫీ తాగేందుకిష్టంబుగా పోవుగా..

షాపు మూసేయ వాపోవుగా..

సర్వ కాఫీ రసాంగీ సుదాంగీ శుభాంగీ

ప్రభాంగీ నమస్తే నమస్తే నమస్తే నమః

5, జులై 2025, శనివారం

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్


  సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్ 

~~~~~~~~🌺🔹🌺~~~~~~


వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలితనమూ వరమే! 

అనుభవాల ఆకావ్యం మనింట్లో ఉంటే ఉపయోగించుకోండి. అది పాతవస్తువుకాదు. ఉపయోగపడే ఉద్గ్రంథం! •••• అంటూ

చిత్రకారులు శ్రీ పి. వి మూర్తిగారి చిత్రించిన చిత్రానికి నేనిచ్చిన గజల్ రూపం!

~~~~~~~~~~~~~~

🔹॥గజల్॥( వార్ధక్యం)🔹


ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున

తీపి పెంచుకొని వంగదా!

ఎక్కుపెట్టిన ధనువు, గెలుపు సాధించాక  విశ్రాంతి పొందదా!


సాకారమైనట్టి స్వప్నాలచిహ్నాలు ముడతలై 

నిలిచాయి 

మడతలో నోటులా, మాసినా విలువతో తలయెత్తి నిలవదా! 


ఎన్ని బాల్యాలకో ఆకళ్ళముందరే మీసాలు వచ్చాయి!

పాతకథ కొత్తగా తిరగరాస్తున్నట్లు కనిపించి నవ్వదా!


తాను వేసిన మల్లె తలనిండ పూలతో తనముందు తిరిగింది

ఊయలూపిన అమ్మ మనవరాలై పుట్టి ఊయలే ఊగదా!


వార్థక్యమున బడిన వార్థిలా జీవితం పోరాడుతూఉంది 

ఈగుండె తనలోన కడలితీరంలాగ కథలెన్నొ దాచదా!


వెన్నెముక వంగినా,వంగనిది లోనున్న ఆత్మవిశ్వాసమే !

ఎండినా పనికొచ్చు చెట్టులా ఉండటం మంచిదని తలచదా! 


కళ్ళెదుటనే ఉన్న విలువైన గ్రంథాలు వృద్ధులే జంధ్యాల! 

పిలుపు కోసం ఎదురుచూసేటి వేళనూ ప్రేమనే పంచదా!

~~~~~~~~~

డా. ఉమాదేవి జంధ్యాల

17, జూన్ 2025, మంగళవారం

జన్మల వరమై..పుడితివి కదరా..! గజల్


 

కృత్రిమ మేధ సహకారంతో రంగుల్లో రూపు దిద్దుకున్న నా పెన్సిల్ చిత్రం. ఈ చిత్రానికి మిత్రులు,  ప్రముఖ గజల్ రచయిత ‌‌శ్రీ  మాధవరావు కొరుప్రోలు గారు రచించిన తెలుగు గజల్. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను



జన్మల వరమై..పుడితివి కదరా..! 

అమ్మను బొమ్మను..చేస్తివి కదరా..! 


కష్టం నాదను కొనెనీ యశోద.. 

సేవా భాగ్యము..ఇస్తివి కదరా..! 


అన్నుల మిన్నవు..మిన్నది ఎక్కడ.. 

బ్రహ్మాం డమునే..దాస్తివి కదరా..! 


ఎవరా పూతన..ఏమా చేతన.. 

పాలను ప్రాణము..పడితివి కదరా..! 


శకటా సురుడే..చిక్కెను అకటా.. 

ఆటగ తీసుకు..కొడితివి కదరా..! 


తింటివి వెన్నలు..వేడుక మీరగ.. 

సఖులకు ప్రేమగ..పెడితివి కదరా..! 


చూడగ నిజముగ..దొంగవు మాధవ.. 

హృదిలయగా నువు..ఉంటివి కదరా..!

కన్నులెర్ర జేయవచ్చు..జ్ఞానమిడే నాన్నముద్దు..! - గజల్



మిత్రులు, ప్రముఖ గజల్ రచయిత శ్రీ మాధవరావు కొరుప్రోలు  గారు రచించిన గజల్

"మాన్యశ్రీ Pvr Murty గారికి నమస్సుమాలతో..సరికొత్త నాన్న గజల్.. ఆత్మీయ నేస్తాలందరికీ హృదయపూర్వక స్వాగతం



కన్నులెర్ర జేయవచ్చు..జ్ఞానమిడే నాన్నముద్దు..! 

లెక్కలేల కట్టవచ్చు..చూపునిడే నాన్నముద్దు..! 


చిన్నప్పుడు తనభుజాన..వాలిన ఓ జ్ఞాపకమది.. 

వీపుపైన తట్టుటలో..బలమునిడే నాన్నముద్దు..! 


బొమ్మలేల గీయవచ్చు..తనచేతుల చలువతీపి.. 

వేలుపట్టి నడచువేళ..వెలుగునిడే నాన్నముద్దు..!


చైతన్యపు శిఖరమనగ..కన్నులెదుట తానేనోయ్.. 

ఆశయాల సాధనలో..వేగమిడే నాన్నముద్దు..! 


బంధాలకు అతీతమౌ..మౌననిధిని తూచుటెట్లు.. 

అంచనాల కందనంత..భాగ్యమిడే నాన్నముద్దు..! 


బద్ధకమది వదిలించే..చర్నకోల తన పిలుపే.. 

కలనుకూడ వెన్నంటే..ఊపునిడే నాన్నముద్దు..!


శ్రమధర్మపు నిర్వచనం..మరిమాధవ ప్రతిబింబం.. 

స్వేదం చిందే వేదపు..వాక్కునిడే నాన్నముద్దు..!"

16, జూన్ 2025, సోమవారం

బ్రతుకు బరువుగ మారెనేలనో - గజల్


 చిత్రానికి చిన్న ప్రయత్నం....


Pic Pvr Murty  babai garu 🙏


బ్రతుకు బరువుగ మారెనేలనొ సంగతేమిటి చెప్పలేను ౹౹

నిన్నలన్నీ వెతలకథలే శీర్షికేమిటి చెప్పలేను ౹౹


ఆర్తినిండిన అనుభవాలే ఏమిచెయ్యను పేర్చుకుంటూ

నవ్వు నటనగ రూపుదాల్చెను ఋజువు ఏమిటి చెప్పలేను౹౹


మోయలేనే మనసుభారం మరలిరావా ఒక్కసారి

తలనువంచని తపనలెన్నో ఆశ ఏమిటి చెప్పలేను౹౹


గాయమెందుకు కుములుతున్నది కాలమెందుకు మౌనమైనది

ఎదనుగుచ్చే ప్రశ్నలెన్నో భావమేమిటి చెప్పలేను ౹౹


గౌరవానికి అర్థమన్నది ఇచ్చినపుడే తెలుసుకుందువు

విలువలెరిగిన జీవితానికి లక్ష్యమేమిటి చెప్పలేను ౹౹


......వాణి కొరటమద్ది

ఎన్నెన్ని చింతలో ఏమార్చ లేనులే ౹౹ కాలాన్ని నిలదీసి ఎదిరించ లేనులే - గజల్

 చిత్రానికి చిన్న ప్రయత్నం.... ఎన్నెన్ని చింతలో ఏమార్చ లేనులే ౹౹ కాలాన్ని నిలదీసి ఎదిరించ లేనులే ౹౹ చూపులో ధైర్యాలు చెలరేగు ప్రశ్నలూ సందిగ్ధ...