30, జనవరి 2017, సోమవారం

ఆశాకిరణం - కవిత - Pencil sketch

Pencil sketch - కవిత courtesy Smt. Ponnada Lakshmi
అంతరించిన ఆశాకిరణం.
నీరవ ప్రకృతి నిదురలో జోగుతున్నవేళ 
నీవు నామదిలో రేపుతున్న అలజడి.
నిశ్శబ్ధనిశీధిలో నీ స్మృతులతో
నీరు నిండిన కనులతో నేనొక్కర్తినే
నీ రాకకై ఎదురు చూసి చూసి అలసితిని.
నీకేల నా మీద దయ రాదు ప్రియా?
నీ మదిలో నా తలపే మాసిపోయేనా?
నిన్ను ప్రేమతో నిజముగ పిలిచిన
నీవు వచ్చి నన్ను లాలింతువని భ్రమసితిని.
నా గొంతు తడారిపోయేలా సఖా! సఖా! అని
నిన్నే పిలిచి పిలిచి విసిగి వేసారితిని.
నీకేమో నా పిలుపందదు,
నాకేమో నీ పై ఆశ చావదు.
నీ రాకకై ఎదురు చూస్తూ ఎన్ని
నిద్రలేని రాత్రులో? ఎంత తీరని ఆవేదనో?
నీకోసం ఆర్తితో, తపనతో నిరీక్షిస్తూ,
నిస్పృహతో నిస్సారంబై నిలిచితిని.
- పొన్నాడ లక్ష్మి

29, జనవరి 2017, ఆదివారం

నువ్వు-నేను-ఒక పుస్తకం


నా చిత్రానికి Jyothi Kanchi గారి కవిత.
గజల్ 78॥నువ్వు-నేను-ఒకపుస్తకం॥
~~~~~~~~~~~~~~~~~~~~
నీనవ్వులు పేర్చుకుంటు రాసుకున్న పుస్తకమిది
రాతలలో నీపేరును పలుకుతున్న పుస్తకమిది!!
మససుపొరల భావుకతలు వెలుగుదారి వెతికాయీ
కళ్ళలోని మెరుపులనే నిలుపుకున్న పుస్తకమిది!!
నీఊహలు పెనవేస్తూ ఊయలలే ఊగాయీ
మాటవినని కోరికలను కొసరుతున్న పుస్తకమిది!!
నీనడకల ముద్రలలో కలహంసలు కులికాయీ
మదిమువ్వలసవ్వడితో నవ్వుకున్న పుస్తకమిది!!
నీపిలుపులె మేఘాలకు ప్రేమలేఖ రాసాయీ
రాయబార రాయంచలు పంపుకున్న పుస్తకమిది!!
నీప్రేమను రంగరించి వర్ణాలే నిలిచాయీ
రవివర్మకు నవ్యతనే నేర్పుతున్న పుస్తకమిది!!
నీతోనే లోకమనీ నీడనడిచె సఖీ'జ్యోతి'
బంధానికి మరోచరిత కూర్చుతున్న పుస్తకమిది!!
JK..28-1-7
(చిత్రం--Pvr Murtyబాబాయ్ గారు.ధన్యవాదాలు బాబాయ్ గారూ)

25, జనవరి 2017, బుధవారం

కంటి చుక్క - పెన్సిల్ చిత్రం



నా పెన్సిల్ చిత్రానికి మిత్రుల కవితలు :

Pencil sketch - గజల్ courtesy Sri Madhav Rao Koruprolu
ఒక్క కంటి చుక్కలోన..ఎన్నివేల సంద్రాలో..!?
అసలు చిన్ని నవ్వులోన..ఎన్నికోట్ల దీపాలో..!?
ఎవరి తోడు కావాలట..వెలుగుతున్న తారకలకు..
చెలిమివాన జల్లులోన..ఎన్నిప్రేమ మంత్రాలో..!?
వాలుకనుల వాలిపోవు..పొద్దులెన్నొ పద్దెక్కడ..
చెలిచూపుల..సొగసులోన..ఎన్నిలేత మురిపాలో..!?
ఇంద్రధనువు వర్ణాలను..వర్ణించే పనేముంది..
తనవలపుల పుట్టలోన..ఎన్నివర్ణ చిత్రాలో..!?
ఏరి మూట కట్టే పని..వెర్రి ప్రయాస గాకేమి..
తన పలుకుల దారిలోన..ఎన్ని మౌన రతనాలో..!?
ఈ మాధవ గజల్ ఊట..ఎంత శక్తి అందించునొ..
తన ముద్దుల మూటలోన..ఎన్ని తత్వ గీతాలో..!?

Jyothi Kanchi   కవిత

మదిభావం॥నిను మరువలేక.!!
~~~~~~~~~~~~~~~~~~~
అక్షరమాలలు అల్లుతున్నా
అభిషేకించాలని
తరిగిపోని వర్ణాలను అద్దుతున్న
వన్నెలచిత్రానికి
భావుకతలముత్యాలను చుక్కలతీరు పేరుస్తున్నా
చంద్రునికోనూలుపోగులా
సరిగంచుచీర కుచ్చిళ్ళకు కుదురునేర్పిస్తున్న సవరిస్తూ
కాటుకకళ్ళకు మెరిసే మలామేదో పూస్తున్నా మరింతమెరవాలని
తోటలోరాంచిలకకు బుగ్గగిల్లడం చూపిస్తున్నా సిగ్గుమొగ్గేయాలని
ఇన్ని చేసి అసలు మర్చిపోయా
నీవులేవన్న నిజాన్ని....
పిచ్చిదాన్ని...గతంపచ్చిగానేవుందింకా......
JK25-1-17
(చిత్రం-Pvr Murty బాబాయ్ గారూ ధన్యవాదాలు బాబాయ్ గారూ!!)

23, జనవరి 2017, సోమవారం

చిత్ర కందాలు - హంసగీతి


నా చిత్రానికి హంసగీతి గారు వ్రాసిన చిత్ర కందాలు

చిత్ర కందాలు (Pvr Murty gari chitram)
************
కం
కవ్వించే కమల నయన
నవ్వించే నిన్ను చేరి నయగారముతో
దవ్వుంటూనే యడుగుచు
తవ్వించిందా గతాన్ని తహతహ లాడన్!!
కం
మరిమరి చెప్పిన వినవేం
గిరిగిరి గీసుకుని నీవు గిలగిల మంటూ
సరిసరి చాలింక కలత
సిరిసిరి మువ్వలను పట్ట చింత వలదురా!!
కం
తలుచుకుని దిగులు పడితే
వలపును కురిపించ తాను వచ్చుతలపుగా
తెలిసిన నీవే కుమిలిన
చెలిమిని కోరిన మనసుకు చెమరింతేగా!!
కం
కలత పడిన నిను జూడగ
నెలతకు మనసెంత కుములు నెమ్మిక తోడన్
తలపున తానే కలదని
మెలతే కలగా ముదమున మెల్లగ వచ్చున్!!
హంసగీతి
21.1.17

21, జనవరి 2017, శనివారం

నీ చూపులో మౌనము నీ పిలుపులో దూరము






నా చిత్రానికి హంసగీతి గారి కవిత ః 

// నేను రాసిన మరో పాట...Pvr Murty గారి చిత్రానికి.......నీ చూపులో మౌనము నీ పిలుపులో దూరము // (11)
పల్లవి
నీ చూపులో మౌనము నీ పిలుపులో దూరము
తెలిసాక నిదురే మరిచాయి నాకనులే
విధిరాత అనుకుంటూ విలపించింది నామనసే
ఎవరికెవరు దూరమౌనో
తెలిసేది ఎవరికీ .....మిగిలేది ఏమిటీ ...
చరణం
గారమెందుకు చేశావో నీకైనా తెలుసా
ఎన్ని కలలు కన్నామో గుర్తైనా ఉన్నాయా
నులివెచ్చని ఓదార్పు కోరితే
కన్నీటిని తుడవక కలహించి తరిమావు
నా జ్ఞాపకాలే నిను వీడి పోవు
నీ గుండెలో నిలిచాను నేను
తలచేది ఎవరినీ.......తొలిచేది ఏమిటీ. ........నీ చూపులో మౌనము
చరణం
దూరమెందుకు చేశావో అలిగానని అలుసా
గాయమైనా హృదయాలు నిన్నలలో నిలిచాయా
కనురెప్పగా కాచాలని వేడితే
కంటిపాపనే కాదు పొమ్మన్నావు
నా గుర్తులే నీవు మరిచిపోవు
నీ ప్రాణమై బతికాను నేను
చెప్పేది ఎవరికీ........చేసేది ఏమిటీ.. .......నీ చూపులో మౌనము
హంసగీతి
20.1.17

18, జనవరి 2017, బుధవారం

తిక్కన - పోతన





ప్రాచీన కవుల పద్యాలలొ సంవదించే పద్యాలు కొన్ని పొతన గారి భాగవతంలొ అక్క డక్కడ గోచరిస్తాయని ఒక ఆక్షేపణ ఉంది. అది వాస్తవంగా అలోచిస్తే పొతన్నకు ఉత్కర్షే కాని అపకర్ష ఏ మాత్రమూ కాదు. అటువంటి విధంగా సంవదించే పద్యాలు పూర్వ కవుల పద్యాలతో సరిసమానంగానూ, కొన్నిచోట్ల పూర్వకవి పద్యాలను మెరుగులు దిద్దెవిగానూ ఉన్నాయి.
సంధి కార్యంకోసం రాయబారియై పాండవుల పంపున హస్తినాపురానికి విచ్చేసిన శ్రీకృష్ణుడిని పౌరకాంతలు సౌధాగ్రాలమీద నుంచి సందర్శించే సందర్భంలొ తిక్కనసొమయాజి ఈ పద్యం వ్రాసారు.
ప్రాణంబుతోఁ గూడ రక్కసి చన్నుల పాలు ద్రావిన ప్రౌఢ బాలుడితడె!
వ్రేల్మిడి చాణూరు విరిచి లోకముల మెచ్చించిన యా జగజ్జెట్టి యితడె!
దుర్వృత్తుఁడగు కంసుఁ దునిమి యాతని తండ్రిఁ బట్టంబు గట్టిన ప్రభువితండె!
సత్యభామకుఁ బారిజాతంబుపైఁ గలకోర్కి దీర్చిన రసికుం డితండె!
వెన్నలను గోపికా చిత్తవృత్తములును, నరసి మృచ్చిల నేర్చిన హరి యితండె!
శృతి శిరోభాగములఁ దన సుభగచరణ సరసి, జామోదమును గూర్చు చతురుఁడీతఁడె
తిక్కనగారి ఈ సీసానికి సమానంగా పొతన్నగారు మరొక సీసపద్యం వ్రాసారు. కంసుని ఆహ్వానం అందుకొని మథురానగరానికి విజయం చేసిన శ్రీకృష్ణ్ణుని అక్కడి స్త్రీలు మేడలమీద నుంచి చూస్తున్న దృశ్యమిది.
వీఁడటే! రక్కసి విగతజీవగఁజన్నుఁ బాలు ద్రావిన మేటి బాలకుండు
వీఁడటే నందుని వెలఁదికి జగమెల్ల ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు
వీఁడటే మందలో వెన్నలు దొంగలి దర్పించి మెక్కిన దాఁపరీఁడు
వీఁడటే! యలయించి వ్రేతల మానంబు సూరలాడిన లోక సుందరుండు
వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు, వీని బొందని జన్మంబు విగత ఫలము
వీనిఁ బలుకని వచనంబు విహగ రుతము, వీనిఁ జూడని చూడ్కులు వృథలు వృథలు.
ఇరువురు మహాకవులు సీసాలూ రసోల్లితాలే. హస్తినాపుర కాంతలకు కనిపిస్తున్నవాడు ప్రౌఢ వయస్కుడైన శ్రీకృష్ణుడు. మధురానగర నారీమణులకు కనువిందు చేస్తున్నవాడు నవయౌవనంతో నవనవలాడే గొపాలకృష్ణుడు. అందువల్ల పోతన్నగారి పద్యం కొంచెం శృంగారం వైపు మొగ్గింది. తిక్కన గారి పద్యంలో అర్థగాంభీర్యం, భావవైవిధ్యం అతిశయంగా ఉన్నమాట వాస్తవం. అయితే పోతన్నగారి పద్యంలో పాదాల మొదట “వీఁడటే వీఁడటే” అన్న దీర్ఘాంత పదాలు పౌరకాంతల ఆశ్చర్యాన్ని, ఆనందాన్నీ, ఉత్కంఠనూ, ఉత్సాహాన్ని వెల్లడిస్తున్నాయి. మునివేళ్ళపై నిలిచి, చేతులు చాచి, వేలు పెట్టి చూపిస్తున్నట్లు ఈ పద్యం లోని ఎత్తుగడలు స్ఫురింపజేస్తున్నాయి. ఈ పద్యాన్ని తిక్కన గారు తిలకిస్తే “నీ పద్యం అభినయయోగ్యమై దర్శనకుతూహలాన్ని అతిశయింపజేస్తున్నది తమ్ముడూ” అంటూ పొతన్నను అభినందించి ఆలింగనం చేసుకుంటాడేమో!
పోతన భాగవతం..వ్యాఖ్యానం : కరుణ శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి.
సేకరణ : పొన్నాడ లక్ష్మి.

జతగూడిన ఇరు తనువులు - కవిత



నా చిత్రానికి శ్రీమతి Putcha Gayatri Devi గారి కవిత (courtesy : Facebook)
జతగూడిన ఇరు తనువులు
అనురాగపు సంగమములు
మధురమైన జ్ఞాపకాలు
నవజీవన సంగతులు
ఉహించని మన కలయిక
వలపుల శ్రీ రాగ మాలిక.
ఇరు మనసుల చేరిక
శృతిలయల జోడిక.
హంసధ్వని రాగములో
ఆహ్వానపు గీతమునై.
మనజీవిత రంగములో
రసగానము వినిపించన.
శుకపికముల కిలకిలలే
వేదమంత్ర ధ్వనులుగ.
నీ మాటల పొందికలే
తలంబ్రాల వేడుకగా.
నీ చుంబన గురుతులే
మట్టెలు మరి సూత్రములుగా.
జరిగేనోయి మన పరిణయం
మన ఆత్మలే సాక్షిగా.
పి. గాయత్రిదేవి.
sree Pvr Murty garu chitramunaku naa rachana.


నన్నయ - పోతన



ప్రాచీన కవుల పద్యాలలో సంవదించే పద్యాలు కొన్ని పొతన గారి భాగవతంలొ అక్క డక్కడ గొచరిస్తాయని ఒక ఆక్షేపణ ఉంది. అది వాస్తవంగా ఆలొచిస్తే పోతన్నకు ఉత్కర్షే కాని అపకర్ష ఏ మాత్రం కాదు. అలా రాసినందువల్ల పోతన్న గారికి తనకంటే పూర్వకవుల మీద ఉండే పూజ్యభావమూ, ఆదరాభిమానాలూ అభివ్యక్తమవుతాయి. అటువంటి విధంగా సంవదించే పద్యాలు పూర్వకవుల పద్యాలతో సరిసమానంగానూ, కొన్నిచోట్ల పూర్వకవి పద్యాలకు మెరుగులు దిద్దేవిగానూ ఉన్నాయి.
నన్నయ భట్టారుకులు ఆదిపర్వంలో మహాభారతాన్ని పారిజాతంతో పోలుస్తూ ఈ క్రింది పద్యం వ్రాసారు.
అమితాఖ్యానకశాఖలం బొలిచి, వేదార్థామలచ్చాయమై
సుమహావర్గ చతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో
త్తమ నానాగుణకీర్తనార్థ ఫలమై, ద్వైపాయనోద్యాన జా
త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై.
నన్నయగారి మీద గౌరవంతొ ఆయన భావాన్నే స్వీకరించి పొతన్న తన భాగవతాన్ని కల్పతరువుతో పోలుస్తూ అటువంటి మత్తేభాన్నే నడిపించాడు. చిత్తగించండి.
లలితస్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామమ్ము, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబు నై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
నన్నయగారి పారిజాతాన్ని, పొతనగారి కల్పవృక్షాన్నీ పోల్చి చూడండి. నన్నయగారి పద్యం లో రూపకాలంకారంతో కూడిన విశేషణాలు ఆరు ఉంటే పోతన్న గారి పద్యం లో పది విశేషణాలు ఉన్నాయి. నన్నయగారి అడుగుజాడల్లొ నడిచిన చక్కదనాల పద్యమిది. హృద్యానవద్యమైన ఈ పద్యం వంటి పద్యం ఆంధ్రసాహిత్యంలో మరొక్కటి లేదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పద్యాన్ని నన్నయ గారు వింటే “నా కంటె బాగా వ్రాశావోయి నాయనా!” అని పోతన్న గారి వీపు తట్టి ఆశీర్వదించి ఉండేవారు.
వ్యాఖ్యానం : కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి) 
- పొన్నాడ లక్ష్మి

భీష్మ - ఎన్టీఆర్

Ponnada Lakshmi
మహాభారత యుద్ధం లో శ్రీకృష్ణ పరమాత్మ తనకేమీ తెలియదని అంపశయ్య మీద ఉన్న భీష్మునితో అంటాడు. అప్పుడు మృత్యుముఖంలో ఉన్న భీష్ముడు చిన్న నవ్వు నవ్వి “తెలిసినా తెలిసినట్లు ఉంటావా పరమాత్మా” ఈ నాటకమంతా నీదే అన్న భావంతో అంటాడు. ‘భీష్మ’ చిత్రంలో ఈ సన్నివేశంలో శ్రీ రామారావు గారు అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఆ సన్నివేశంలో ఆయన నటన, వాచకం మరఛి పోలేము. అసలు భీష్మ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేశారు. మంచి వయసులో ఉన్నఆయన నూనూగు మీసాల నవ యువకుడిగా, తరువాత కురువంశ భారము మోసే మధ్యవయస్కుడిగా, చివరన వయోవ్రుద్దుడిగా ఆయన నటన అద్వితీయం. చారిత్రాత్మక పాత్రలలో, పౌరాణిక పాత్రలలో ఆయన అభినయం, ఆహార్యం నభూతో నభవిష్యతి.. నాయకుడి పాత్రలే కాక, ప్రతినాయకుడి పాత్రలు కూడా అంత అద్భుతంగా నటింఛి ఆ పాత్రల మీద కూడా అభిమానం కలిగేలా చేసారు. ఆ మహానటుడుకి ఇదే నా ఘన నివాళి.

14, జనవరి 2017, శనివారం

నీ స్మరణ చేయమని - తెలుగు గజల్



Rajeswari Srimallik గారి  తెలుగు గజల్ కి నా పెన్సిల్ చిత్రం 

నీ స్మరణ చేయమని పదమునే వేడితిని
నీ దరికి చేర్చమని పథమునే వేడితిని
నా తపో ఫలము నీ మనసుతో సంగమం
నీ తోడు నివ్వమని వరమునే వేడితిని
మృదువైన మమతలను మదిలోన పేర్చాను
ఇరువురిని కలపమని జగమునే వేడితిని
తొలివలపు వర్ణింప నలవికా దెవ్వరికి
 చరితలో నిలపమని కలమునే వేడితిని
నీ తోటి జతగూడి ప్రణయాన్ని రచియిస్తు
తీయగా పాడమని గళమునే వేడితిని
ఎల్లలే ఎరగనీ సఖ్యతను ఎదనింపి
మనలనే వీడమని ఎడమునే వేడితిని
సహచరుని కవ్వింపు ఓ 'రాజి' మధురమే
కౌగిలిని అడగమని సుఖమునే వేడితిని
@
గజల్ కౌముది

13, జనవరి 2017, శుక్రవారం

నీ తలలో మల్లియలా మిగలాలని ఉంది





నా ఈ చిత్రానికి గజల్ రచించిన శ్రీ మాధవరావు కొరిప్రోలు గారికి ధన్యవాదాలు.

గజల్ 1326.*** Pvr Murthy గారికి ధన్యవాద చందనములతో..
నీ తలలో మల్లియలా మిగలాలని ఉంది..!
నీ కన్నుల తడిచాటున ఒదగాలని ఉంది..!
అలాతిరిగి ఉన్నాసరె అటే వత్తు నేను..
నీ పెదవుల మెఱుపుతీవ కావాలని ఉంది..!
ఆశకేమి తెలియదులే నా ప్రేమ అర్థం..
నీ కలలకు పానుపుగా మారాలని ఉంది..!
ఏ పూవులు బాణాలుగ వేయలేను చూడు..
నీ మౌనపు వెన్నెలలో ఆడాలని ఉంది..!
రాలుతున్న చెమటచుక్క గాలికలుసు కాదు..
పవిత్రతకు క్రొత్తర్థం చెప్పాలని ఉంది..!
ఈ చెలిమిని ఓ కలిమిగ నిలుపుతున్న దేమి..?!
మాధవుడా..నీ గజలై..వెలగాలని ఉంది..!!

10, జనవరి 2017, మంగళవారం

నా మౌన దీక్షనే చెరిపేసి వెళ్ళింది - గజల్


Pvr Murty గారి పిక్ కి ఒక గజల్ ప్రయత్నం ...
నా మౌన దీక్షనే చెరిపేసి వెళ్ళింది ||
తన ప్రేమ తెమ్మెరతొ తాకేసి వెళ్ళింది ||
ఓ స్వప్న కాంక్షనె నాలోన నింపేసి
మరు ధ్యాస లేకుండ చేసేసి వెళ్ళింది ||
ఏమాయ ఏమిటో అరుదైన పులకింత
తనరూపు మనసంత నింపేసి వెళ్ళింది ||
తడికాలి ముద్రలతొ ఇల్లంత చుట్టేసి
ప్రతి అడుగుపై పేరు చెక్కేేసి వెళ్ళింది ||
తానంటె నేననీ విడదీయ వద్దనీ
చెంపపై తాకుతూ చిటికేసి వెళ్ళింది ||
నిద్దురే మరిచాను తనలోన నిలిచాను
ఊహంత ఊపిరిగ ముడివేసి వెళ్ళింది ||
........వాణి, 09 Jan 17

7, జనవరి 2017, శనివారం

భాష - యాస


నా పెన్సిల్ చిత్రం.
(విశాఖపట్నం సిటీబస్ లో విన్న cell phone సంభాషణ ప్రేరణతో)
ఏటే మాలచ్చిమి. నిన్న ఎన్నిసార్లు ఫోన్ సేసినా ఫొన్ తియ్యనేదేటి..?
ఏటో, నా ఫోన్ సిఛాప్ (switch off) అయిపోనాదే. నిన్న మా కోడలు డెలివరి అయినాదే. మొగ పిల్లాడు పుట్టాడు.
ఓలమ్మో .. అయితే నానమ్మ అయిపోనావన్నమాట. ఎక్కడ డెలివరి సేయించినావ్ .. ?
సెవెనిల్స్ (Seven Hills)
ఆ.ఆ.. ఆ ఆస్పిటల్ బాగానే ఉంటదిలే.. ఏటి నార్మలా .. సిజిరియనా..(cesarean) బోలెడు కర్సయ్యుంటది. నీకేటి.. మీ ఈరకత్తె (వియ్యపురాలు) ఆల్లూ పెట్టుకునుంటరు.
సిజిరియనే .. ఇయ్యాల రేపు నార్మలెక్కడుందే..?
నీ పెనిమిటి ఎట్టాగున్నాడే .. ?
ఆడా .. ఆడికి రెండు రోజులకాడ్నుండి గొంతు నొప్పి.. తాగి తొంగున్నాడు.
ఇన్ఫ్లెక్సన్ (infection) అయ్యుంటాది. ఇయ్యాల రేపు అందరికీ ఇన్ఫ్లెక్శన్ లే. మన నూకోలని (New Colony) లో ఇరవై రూపాయల డాక్టరున్నాడు గందా.. అక్కడ సూదిమందు ఏయించవే.. తగ్గిపోద్ది.
అలాగేనే.. ఊంటానే మరి .. బై ..

5, జనవరి 2017, గురువారం

మొదటి వారం






Pencil sketch - మొదటి వారం -
కవిత - courtesy Sri Vemuri Mallik

ప్రతీ నెలా మొదటివారం..
ఇచ్చుకోళ్ళతో మాసారంభం..
తెచ్చుకోళ్ళకే తిరుగుడనంతం..
పాలబిల్లు..పేపరు బిల్లు..
కేబులు బిల్లు..నిర్వహణ బిల్లంటూ..
బిల బిలా బిల్లు బిల్లంటూ జనాలు..
మందుల చిట్టా కిరాణ చిట్టా..
కాఫీ పొడంటూ గాస్ బుక్కంటూ..
బియ్యానికి గడువంటూ ఇల్లాలు..
బాంక్ కెళ్ళి గీకి గీకి తెచ్చుకున్న డబ్బులు..
పెన్నుతో గీసి కొట్టేసే లెక్కలు..
పోదుపునేర్చుకొమ్మంటూ రంకెలు..
తినేప్పుడు సద్దుకోరు..
తెచేప్పుడు ఆరాలంటూ..
ముక్తాయింపులు..
నూని చూసి వాడంటూ భర్తగారి డబాయింపులు..
వేళ్ళమధ్య సిగరెట్టు కేసి ఇల్లాలి వంకర చూపులు..
అబ్బబ్బా మధ్యతరగతి జీవులు..
అమ్మోయ్ నెల మొదటివార పీడితులు..!!

4, జనవరి 2017, బుధవారం

హరికధా పితామహుడు - ఆదిభట్ల నారాయణదాసు


Sasikala Volety with Pvr Murty. - నేను చిత్రీకరించిన బహుముఖ ప్రజ్ఞాశాకు ఆదిభట్ల నారాయణదాసు గారి బొమ్మ కి శ్రీమతి శశికళ ఓలేటి గారు రచించిన పద్య కుసుమాలు. వారికి నా ధన్యవాదాలు.

యొజ్జై హరికధఁ గూరిచి
ముజ్జగములు, యబ్బుర పడ, మూల పురుషుడై.
కం**************
2. సంగీత, నాట్య మిళితము,
వాంగ్మయ భూషిత, పురాణ భరిత, హరికధన్,
వాగ్దేవి కరుణ, నిచ్చెన్,
భాగవతోత్తముని భంగిఁ, భక్తితొ, భువికిన్.
***************
ఆ.వె3.
ఆది భట్టు యదియె యాది నారాయుణౌ,
లయను బ్రహ్మ వలె కళలను విరిసె.
రాసె వాసి మీర, రామ చంద్ర శతకం,
హరి కధామృతమును యరయ ప్రీతి.
***************
4.ఆ.వె.
కాళ్ళ గజ్జె కట్టి, కంచు కంఠము తోడ,
చిడత గొట్టు లయకు చేవ గూర్చ.
సంస్కృతాంధ్ర మందు సరిలేరు వారికి,
రాగ నవతి వృతము వ్రాసె భళిగ.
***************
5. ఆ.వె.
వన్నె దెచ్చె బిరుదు సాహితీ స్వర బ్రహ్మ.
తాత గారు వారు, తనదు(దనర) వృత్తి.
కంచు కంఠ మదియె కంఠీరవుని గాంచ,
సరసి జాక్షి దయతొ సంగతించ.
***************
శీ. P.V..R. మూర్తి గారి అద్భుత పెన్సిల్ చిత్రానికి.

2, జనవరి 2017, సోమవారం

గజల్ - భావగీతి


నా చిత్రానికి స్పందించి జ్యోతి కంచి గారు రచించిన గజల్
గజల్ ॥భావగీతి॥
~~~~~~~~~~
సూత్రమొకటి నిన్నునన్ను కలుపుతుంటె బాగున్నది!!
జతవీడని మంత్రమొకటి పలుకుతుంటె బాగున్నది!!
అంబరాన మేఘమాల నీకన్నుల దాగెనులే
నీచూపులు చిరుజల్లై జారుతుంటె బాగున్నది!!
మదిదోచిన దొరవైనా చోరతనమె నేర్చెనులే
నీచేతులు పెనవేస్తూ వెతుకుతుంటె బాగున్నది!!
నెలరాజే నింగివీడి నాచెంతకు చేరెనులే
నీరూపున నామదిలో నిండుతుంటె బాగున్నది!!
దొండపండు పెదవిఅంచు హసితమధువు తాగెనులే
నీనవ్వులు మువ్వలుగా మోగుతుంటె బాగున్నది!!
ముంగురులను సవరిస్తూ వేలికొసలు తాకెనులే
నీఊసులు గుసగుసగా వేడుతుంటె బాగున్నది!!
శ్వాసలోన నిన్నునిలిపి శృతిచేసెను ప్రియ'జ్యోతి'
మనబంధమె భావగీతి పాడుతుంటె బాగున్నది!!
...Jk2-1-17(చిత్రం Pvr Murtyబాబాయ్ గారు..ధన్యవాదాలుబాబాయ్ గారు)

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...