21, ఆగస్టు 2017, సోమవారం

పునీతమైనదమ్మ పురుష జన్మా...

మగాడు మృగాడా .. ? (Courtesy : భరణి చిత్రలేఖ)
భరణి చిత్రలేఖ గారి ఆలోచన కి నా బొమ్మ. ఇంత మంచి రచన అందించినందుకు ఆమెకి నా అభినందనలు. శుభాశీస్సులు
"పునీతమైనదమ్మ పురుష జన్మా.....
ఆ జన్మకు పరిపూర్ణత ఇంటాయనమ్మా....!
ఔనూ......నాకర్థం కాక అడుగుతాను.. ఎందుకూ ఊరికే తప్పు చేసిన మగాళ్లను "మృగాళ్లు"...."క్రూర మృగాలు" అని ఆడిపోసుకుంటారు???
దీన్ని నేను ఆకురాయి మీద అరగంట సానబెట్టిన చురకత్తితో ఖండిస్తున్నా!!
జంతువులు జంతువులే! అవెలా కృూరమైనవి చెప్పండి.మనం దేవుని సృష్టిని నమ్మితే అవి శాకాహారులుగా కొన్ని..మాంసాహారులుగా కొన్ని సృష్టించబడినాయి.వేట వాటికి ప్రకృతి నిర్దేశించిన ధర్మం...అదీ ఆకలేసినపుడు మాత్రమే !
ఏ జంతువు మరొక
జంతువును "ఈవ్ టీజింగ్" చేసి కామెంట్లు చేసి ఏడిపించింది?
ఏ మృగం మరొక మృగంపై యాసిడ్ పోసి చావుకీ బతుక్కూ కాకుండా చేసింది?
ఏ మృగం కట్నకానుకల కోసం కిరసనాయిలు మీద పోసి తగలెట్టింది?
ఏ జంతువు మిగతా జంతువులను బలహీనమని ఎంచి వాటి మీద ఆధిపత్యానికి ఆరాట పడింది?
ఏ మృగం చూపులతో మాటలతో చేతలతో మరో జాతిని హింసించి పైశాచికానందం పొందుతుంది?
లేదే..మరెందుకు మృగాడూ అని పోలిక ...అవమానం కాకపోతే!!
వాళ్లని మృగాడూ అనే ముందు మరో యాంగిల్
ఏ జంతువు పక్కింటావిడ పచ్చని కాపురం చూసి కుళ్లి కుళ్లి ఏడ్చేది?
ఏ జంతువు దాని జాతికి అసూయే అలంకారమనే బిరుదు తెచ్చుకుంది?
ఏ జంతువు సూటిపోటి మాటలనాయుధాలుగా మలచి సాటి జంతువును హింసిస్తుంది?
ఏ జంతువు కూతురికి కోడలికి అల్లుడికి కొడుక్కి సెపరేట్ రూల్స్ పెట్టేస్తుంది?
ద్యావుడా!!? ఇన్ని లక్షణాలు మనలో పెట్టేసుకుని వాటి పేర్లతో తిట్టుకోడమేమీ??
కాబట్టి భరణీ..
క్రూర జంతువులూ మృగాలూ లేవు..కృూర మనుషులే ఉంటారు..
ఈ క్షణం నుండీ జీవితంలో ఎవరిని తిట్టాలనిపించినా లింగభేదంతో నిమిత్తం లేకుండా జంతువులతో పోలిక వాడనని...
సామాన్య జంతువులైన వాటిని అవమానించనని
సాంఘిక జంతువుగా....ఎదుటనున్న జిరాఫీ సాక్షిగా ప్రతిన బూనుతున్నాను !"

26, జులై 2017, బుధవారం

చిత్ర కందాలు

Pvr Murty గారి చిత్రానికి
చిత్ర కందాలు
*************
ఆరు గజాలున్న జరీ
చీరట ముచ్చటగ కట్టి చెంగున దోపెన్
జీరాడే కుచ్చీళ్ళే
పారాడే నేలపైన పడతికి సొబగై!! (!)
జుట్టును కొప్పుగ ముడిచెన్
గట్టున కూర్చొని దిగులుగ గడియను జూసెన్
తట్టిన మగని స్పర్శకు
గట్టిగ యేడ్చెను వలవల కళ్ళొత్తుకునెన్!! (2)
పంచు కొనిరంట పేగును
తెంచుకు పుట్టిన కొడుకులు తెలివగ యకటా!
కొంచెము కూడ మరి కనిక
రించక వేరు పరిచిరి రిమ్మ తెగులుతో !! (3)
పెద్దతనమందు పెట్టిరి
హద్దు యొకరినొకరు జూడ హయ్యో సుతులే
ముద్దన్నారట విడిగా
బుద్ధిగ నుండమని జెప్పె పోషణ కొరకై !!(4)
మగని తలచె ముత్తైదువ
దిగులు పడుచు నింగికేసి దిక్కులు జూసెన్
నగవులు లేవే మోమున
పగలు గడవదాయె రాత్రి వంటరి తనమే!! (5)
బ్రతుకు తమకు భారంగా
చితిమాత్రందూరమేల చింతలు పడగన్
కతికిన మెతుకులు గొంతున
గతకాల జ్ఞాపకాలు కలలై నిలిచెన్ !! (6)
వచ్చిన పెనిమిటి భార్యకి
నచ్చిన సీతా ఫలమును నౌజును పెట్టెన్
తెచ్చినది సగం చేసిన
నొచ్చుకునె మగడు తిననని నోరు తెరవకన్ !! (7)
మురిపెముతో లాలనగా
మరిమరి బతిమాలి పెట్టె మగనికి సతియే
యరమరికలు లేక వగచి
దరిచేరెను వృద్ధ జంట దైన్య స్థితిలో!! (8)
దావానలమును మింగుతు
చీవాట్లకు బెదరకుండ సేవలు చేయన్
చావైనా బ్రతుకైనా
యేవైనా యొక్క చోట యిద్దరు చేరెన్ !! (9)
హంసగీతి
20.7.17

15, జులై 2017, శనివారం

మదిభావం॥చిగురు సాక్ష్యం॥ - కవితనా పెన్ sketch కి శ్రీమతి Jyothi Kanchi కవిత.
మదిభావం॥చిగురు సాక్ష్యం॥
~~~~~~~~~~~~~~~~
ఎన్ని వసంతాలను చూసిందో
ఎన్ని హేమంతాల చలి కాచిందో
ఎన్ని వర్ణాలు దాల్చిందో
ఎన్ని వేదనలు తనలో దాచిందో
ఎన్ని ఆనందాలు మోసిందో
ఎన్ని అపస్వరాలను మరుగేసిందో
ఎన్ని భవబంధాల బీటలు పూడ్చిందో
ఎన్ని రాగద్వేషాలను కావడికుండలచేసిందో
ఎన్ని విత్తులను ఫలవంతం చేసిందో
ఎన్ని కత్తులమాటల మూటలు చూసిందో
రాలడానికి సిద్దంగా ఉందని అలుసుచేయక
పండుటాకే కదా అని పలుచన చేయక
"పండుటాకుకు అనుభవం ఎక్కువ"
కావాలంటే అడుగు
పక్కన మొలిచే చిరుచిగురే సాక్ష్యం.....!!
J K
(చిత్రం Pvr Murty బాబాయ్ గారు ...ధన్యవాదాలు బాబాయ్ )

14, జులై 2017, శుక్రవారం

నీ కోసం - కవిత

నీ కోసం - కవిత, courtesy : Sudha Rani

గుప్పెడంత గుండెను తడిమావు నువ్వనీ...
కనుల తడి వచ్చిందే నీకోసం
మౌనవీణ మధురంగా మీటావు నువ్వనీ....
హృదయ గీతం పాడుతున్నదీ నీకోసం
కనురెప్పల కౌగిలి అయ్యావు నువ్వనీ...
కనుపాపగా మార్చుకున్నదీ నీకోసం
ఆశల పల్లకి ఎక్కించావు నువ్వనీ....
దరహాసపూలు విరబూసాయి నీకోసం
వెన్నెలంత గుమ్మరించి అభిషేకించావు నువ్వనీ....
నా మనసు అర్పణ చేసాను నీకోసం
నేనున్నది నీకోసం....నువ్వున్నది నాకోసమని
నీ ఊసులకు నా చూపులనే ముడివేసా
విడిపోని బంధంగా....ప్రణయ రాగ మధురిమగా
అందమైన నా అంతరంగమా.....
పాడవే ఇక ఎప్పటికీ
'అతని' భావ గీతాన్నీ.......

11, జులై 2017, మంగళవారం

సి. యస్. ఆర్ ఆంజనేయులు - CSR Anjaneyulu

నివాళి - అలనాటి అద్భుత నటుడు సీయస్సార్ (CSR Anjaneyulu) జయంతి నేడు - నా charcoal చిత్రం.
సి.యస్.ఆర్. ఆంజనేయులు (జూలై 11, 1907 - అక్టోబరు 8, 1963) తెలుగు సినిమా నటుడు.
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం). ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి సి.యస్.ఆర్. ఆంజనేయులు. పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. స్థానం నరసింహారావుతో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు - ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళ వయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేసేడు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్‌గా, హాస్యనటుడి్‌గా విభిన్న పాత్రలకు జీవం పోసిన వాడు సీయస్సార్
జీవితం చిత్రంలో ఆయన నోట పలికించిన ఆ కాలంలో నేను కాలేజి చదువుకునే రోజుల్లో అనే డైలాగ్‌ అప్పట్లో అందరి నోట్లో తారకమంత్రలా నానుతుండేది. మధ్యవయస్సుల నుండి వృద్ధుల వరకూ ఎవరిని కదిపినా ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అంటుండే వారు. జగదేకవీరుని కథలో హే రాజన్‌ శృంగార వీరన్‌ అంటూ సీఎస్స్‌ఆర్‌ చెప్పిన డైలాగ్‌లు, రాజనాలతో కలిసి ఆయన పండించిన కామెడీ మరచిపోవడం సాధ్యం కాదు. విజయావారి నవ్వుల హరివిల్లు అప్పుచేసి పప్పుకూడులో సీఎస్సార్‌ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. వెయ్యి రూపాయిలు కావాలంటే పది మంది దగ్గరా పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గిరే అప్పుతీసుకో. వడ్డీ తీరిస్తే సరి. అసలు చెల్లించినప్పటి మాట కదా అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు పడీపడీ నవ్విస్తాయి.
Source : Wikipedia