5, ఆగస్టు 2016, శుక్రవారం

భవరోగ వౖద్యుడవు పాటించ నీవొకడివే - అన్నమయ్య కీర్తన

ఓ చక్కని  అన్నమయ్య కీర్తన
భవరోగ వైద్యుడవు పాటించ నీవొకఁడవే
నవనీతచోర నీకు నమో నమో. IIపల్లవిII
అతివలనెడి సర్పా లధరాలు గఱచిన
తతి మదనవిషాలు తలకెక్కెను
మితిలేనిరతులఁ దిమ్మరివట్టె దేహాలు
మతిమఱచె నిందుకు మందేదొకో. IIభవII
పొలఁతులనెడిమహాభూతాలు సోఁకిన
తలమొలలు విడి బిత్తలై యున్నారుక్షతా
అలరుచెనకులచే నంగములు జీరలాయ
మలసి యిందుకు నిఁక మంత్రమేదొకో. IIభవII
తరుణులకాఁగిలనే తాపజ్వరాలు వట్టి
కరఁగి మేనెల్ల దిగఁగారఁజొచ్చెను
నిరతి శ్రీవేంకటేశ నీవే లోకులకు దిక్కు
అరుదుసుననుండే యంత్రమేదొకో
భావం:
దేవా! ఆలోచించి చూడగా సంసారమను జబ్బుకు నీవొకడవే వైద్యుడవు. ఓ వెన్నదొంగా! నీకు దండము ,నీకు దండము.
స్త్రీలనెడు పాములు పెదవులు గరచినంత పురుషులకు కామవిషములు తలకెక్కినవి. అంతులేని రతిక్రీడలలో మునిగి తేలుటచే శరీరములు తిమ్మిరి పట్టినవి. మతిమరుపు కలిగినది. ఈ విషం దిగుటకు, ఈ తిమ్మిరి వదులుటకు తగిన మందేదో!
స్త్రీ వ్యామోహం అనెడి పెద్ద భూతం సోకగా మనుజులు తలమొలలు వీడి ఒడలు తెలియక దిసమొలలుతో ఉన్నారు. కామక్రీడలకు సంబంధించిన నఖక్షత దంతక్షతాదులచే శరీరము అంతయు గీరలు పడినవి. ఈ దెయ్యమును విడిపించుటకు మంత్రమేదోకదా!!
అంగనల ఆలింగనములనెడి తాప జ్వరములు పట్టి శరీరములెల్ల చెమటలు కారుచున్నవి. శ్రీ వెంకటేశ్వరా ఈ విషమ పరిస్థితులలో ఉన్నవారికి నీవే రక్షకుడవు. ఈ చిక్కులనుండి విడివడి శాశ్వతమైన సుఖము పొందుటకు సాధనమైన యంత్రమేదో అనుగ్రహింప రాదా!!!
(పొన్నాడ లక్ష్మి)

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...