26, జులై 2017, బుధవారం

చిత్ర కందాలు

Pvr Murty గారి చిత్రానికి
చిత్ర కందాలు
*************
ఆరు గజాలున్న జరీ
చీరట ముచ్చటగ కట్టి చెంగున దోపెన్
జీరాడే కుచ్చీళ్ళే
పారాడే నేలపైన పడతికి సొబగై!! (!)
జుట్టును కొప్పుగ ముడిచెన్
గట్టున కూర్చొని దిగులుగ గడియను జూసెన్
తట్టిన మగని స్పర్శకు
గట్టిగ యేడ్చెను వలవల కళ్ళొత్తుకునెన్!! (2)
పంచు కొనిరంట పేగును
తెంచుకు పుట్టిన కొడుకులు తెలివగ యకటా!
కొంచెము కూడ మరి కనిక
రించక వేరు పరిచిరి రిమ్మ తెగులుతో !! (3)
పెద్దతనమందు పెట్టిరి
హద్దు యొకరినొకరు జూడ హయ్యో సుతులే
ముద్దన్నారట విడిగా
బుద్ధిగ నుండమని జెప్పె పోషణ కొరకై !!(4)
మగని తలచె ముత్తైదువ
దిగులు పడుచు నింగికేసి దిక్కులు జూసెన్
నగవులు లేవే మోమున
పగలు గడవదాయె రాత్రి వంటరి తనమే!! (5)
బ్రతుకు తమకు భారంగా
చితిమాత్రందూరమేల చింతలు పడగన్
కతికిన మెతుకులు గొంతున
గతకాల జ్ఞాపకాలు కలలై నిలిచెన్ !! (6)
వచ్చిన పెనిమిటి భార్యకి
నచ్చిన సీతా ఫలమును నౌజును పెట్టెన్
తెచ్చినది సగం చేసిన
నొచ్చుకునె మగడు తిననని నోరు తెరవకన్ !! (7)
మురిపెముతో లాలనగా
మరిమరి బతిమాలి పెట్టె మగనికి సతియే
యరమరికలు లేక వగచి
దరిచేరెను వృద్ధ జంట దైన్య స్థితిలో!! (8)
దావానలమును మింగుతు
చీవాట్లకు బెదరకుండ సేవలు చేయన్
చావైనా బ్రతుకైనా
యేవైనా యొక్క చోట యిద్దరు చేరెన్ !! (9)
హంసగీతి
20.7.17

కామెంట్‌లు లేవు:

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత

మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు,  భగ...