8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ఆలోచనలు...ఆలోచనలు



కవిత courtesy : శ్రీమతి పొన్నాడ లక్ష్మి
ఆలోచనలు...ఆలోచనలు
అంతూ దరీ లేని ఆలోచనలు.

కన్నపిల్లల వ్యధలను తీర్చలేక
చేయూతనివ్వలేని అసహాయపు ఆలోచనలు..

ప్రమాదాలకు బలిఅయి, వందలాది ప్రయాణీకుల
హా..హా..కారాల తలపులతో ఆలోచనలు..

బోరుబావిలో పడి ఉక్కిరిబిక్కిరై, అయోమయావస్థలో
తుది శ్వాస విడిచిన చిన్నారుల గురించి ఆలోచనలు..

చెత్తకుండీలలో, మురుగు కాల్వలలో విసరివేయబడిన
పురిటికందుల ఆక్రందనలపై ముసురుకొనే ఆలోచనలు..

క్రూర రాక్షసుల కబంధ హస్తాలలో చిక్కుకొని, తమ
మాన ప్రాణాలను అర్పించుకున్న అబలల ఆర్తిపై ఆలోచనలు..

మందుమైకంలో దారితప్పి ప్రమాదాలకు గురై
తమని తామే ఆహుతి చేసుకుంటున్న యువతపై ఆలోచనలు..

వరద భీభత్సంలో సర్వం కోల్పోయి, నిలువనీడలేక
నిరాశ్రయులైన బడుగుజీవుల బతుకులపై ఆలోచనలు..

ఎవరినీ ఆదుకోలేక, ఆపన్న హస్తం అందించలేక.
జోరీగల్లా ముసిరే ఆలోచనలతో,
నిదుర లేని రాత్రులు ఎన్నో? ఎన్నెన్నో??

- పొన్నాడ లక్ష్మి

కామెంట్‌లు లేవు:

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత

మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు,  భగ...