18, జులై 2018, బుధవారం

సముద్రాల రాఘవాచార్య

సముద్రాల రాఘవాచార్య - నా పెన్సిల్ చిత్రం.

సముద్రాల రాఘవాచార్య - నా పెన్సిల్ చిత్రం
ఈ రోజు సముద్రాల వారి జయంతి.

రామకథను వినరయ్యా
ఇహపర సుఖముల నొసగే
సీతారామకథను వినరయ్యా

పాట వినపడగానే మనకు తెలియకుండానే భక్తిభావంలో మునిగిపోతుంటాం. ఈ పాట1963 నాటి లవకుశ
చిత్రంలోనిది. అయినా అలాంటి సాహిత్యం మళ్లీ రాలేదంటే అతిశయోక్తికాదు. అంతటి గొప్పపాటను రాసింది
సముద్రాల రాఘవాచార్య. సినిమా రంగంలో సీనియర్ సముద్రాలగా అయన అందరికీ సుపరిచితులు. రామాయణం మొత్తాన్ని కేవలం నాలుగు పాటల్లో చెప్పి తన సాహితీ ఘనకీర్తిని చాటుకున్న గొప్ప రచయిత
సముద్రాల.
సముద్రాల రాఘవాచార్య గుంటూరు జిల్లా రేపల్లెకు సమీపంలోని పెదపులివర్రు గ్రామంలో1902 జూలై 19న లక్ష్మీ తాయారు దంపతులకు జన్మించారు. పండితవంశంలో జన్మించడం వల్ల ఆయనకు బాల్యం నుంచి సాహిత్యంపట్ల ఆసక్తి ఏర్పడింది. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే కవిత్వం రాయడం, చెప్పడం చేసేవాడు. ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివి 1925లో భాషాప్రవీణ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు.
పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు రాయడంతో సినీరంగప్రవేశం చేశారు. స్క్రిప్టులు, పాటలు రాయడంతో పాటు సినిమా నిర్మాతగా, దర్శకునిగా, నేపథ్యగాయకుడిగానూ తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. సముద్రాల పూర్తిస్థాయిలో పనిచేసిన తొలి సినిమా కనకతార. చందాల కేశవదాసు రాసిన నాటకాన్ని సరస్వతీ టాకీస్ వారు 1937లో సినిమాగా నిర్మించారు. ఈ సినిమాలో మొత్తం 12 పాటలుంటే ఏడు పాటలు రాఘవాచార్యనే రాశారు. అజ్ఞానంబున ఆశలు బాసీ, ఈ వసంత శోభా కాంచిన నామది పొంగిపోవుగా, ఏల ఈ పగిది తాలిమి మాలీ, కానరా మానరా హింస మానరా, దయారహితమీ దుర్విధి జీవా, దేవుని మహిమ తెలియగ వశమా, వారే చరితార్థులు భూమిన్ పాటలు ఆయన రాసినవే. ఈ సినిమాకు పాటలతోపాటు సంభాషణలు కూడా రాశారు. ఈ సినిమా సమయంలోనే బి.ఎన్.రెడ్డి, హెచ్.ఎం.రెడ్డిలు రోహిణీ పిక్సర్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి గృహలక్ష్మి సినిమాకు రచయితగా పెట్టుకున్నారు. ఆ తరువాత బి.యన్.రెడ్డి రోహిణి నుండి బయటకు వచ్చి వాహినీ సంస్థను స్థాపించారు. అలా వాహిని సినిమాలకు సముద్రాల ఆస్థాన రచయితగా మారిపోయారు. దాదాపు 80 సినిమాలకు వెయ్యి వరకు పాటలు రాసి తన ఖ్యాతిని ఇనుమడింపజేసుకున్నారు.

సానిసదనీపద మపదప మాపదని
మంచి సమయము రారా
ఇది మంచి సమయము రారా
చలమేల జేసేవౌరా
సముద్రాల రాసిన ఈ పాట తెలుగు చలనచిత్ర రంగ చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతంగా కీర్తికెక్కింది. పోతన (1942) సినిమా కోసం ఈ పాటను రాశారు. నిజానికి ఈ పాట పల్లవిలో కొంచెం మార్పు చేశారు. మూలంలో రారా సామి నీకు మ్రొక్కేరా అని ఉంటుంది. కానీ చలమేరా ఇంటికి రారా అన్న పంక్తిని చలమేల జేసేవౌరా అని మార్చారు.

తెరతీయగరాదా దేవా
తెరతీయగరాదా దేవా
తన వారూ పరవారలనీ
తరతమ భావములు మానీ
1947లో విడుదలైన పల్నాటి యుద్ధం చిత్రంలోని ఈ పాట చివరిగీతం. రణరంగంలో రక్తపాతాన్ని చూసిన బ్రహ్మనాయుడు, నాగమ్మ పరివర్తన హృదయాలతో రక్తసిక్తమైన చేతులు జోడించి గుడిలో పశ్చాత్తాపంతో చెన్నకేశవుని వేడుకొంటారు. తెరతీయరా అన్న అన్నమయ్య ధోరణిలో గీతాన్ని రాశారు సముద్రాల.
గృహలక్ష్మి సినిమాలోని కల్లుమానండోయ్ బాబూ, కళ్లు తెరవండోయ్ అన్న గీతం రాఘవచార్యకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ పాట ఆతర్వాత కాలంలో వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమాల్లో ప్రచార గీతంగా పనికివచ్చింది.

జగమే మాయ బ్రతుకే మాయ

వేదాలలో సారమింతేనయా ఈ వింతే నయా 1953లో విడుదలైన దేవదాసు సినిమా కోసం సముద్రాల రచించిన పాట. భగ్నప్రేమికులైన దేవదాసు పార్వతిల ప్రేమ విఫలమై జీవితం మీద వైరాగ్యంతో తత్వాల్ని జీవిత సత్యాల్ని రంగరించి విషాదంగా ఆలపిస్తాడు. ఈ సినిమా ఆనాడు ఒక సంచలనం. ఇందులోని ప్రతిపాటా నేటికీ అందరి నోళ్లలో నానుతూనే ఉంది.
అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా, అందం చూడవయా ఆనందించవయా, ఓ దేవదా చదువు ఇదేనా, చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంత చీకటైతే, పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో ఇలా విజయవంతమైన పాటలన్నీ ఆయన కలం నుంచి జాలువారినవే.
కేవలం సంభాషణలు, పాటలు రాయడమే కాకుండా సముద్రాల వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకునిగా, దేవదాసు (1953), శాంతి (1952), స్త్రీ సాహసం (1951) చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. భక్త రఘునాథ్ చిత్రానికి పాటలు కూడా పాడారు. రాఘవాచార్యులను సీనియర్ సముద్రాల అంటే ఆయన కుమారుడు సముద్రాల రామానుజాచార్యులను సముద్రాల జూనియర్‌గా పిలిచేవారు. ఆయన కూడా పలు సినిమాలకు పాటలు రాశారు. ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన శ్రీరామకథ సినిమాకు చివరి పాటను రచించిన సముద్రాల రాఘవాచార్య మరుసటి రోజు 1968 మార్చి 16న మరణించాడు.

జననీ శివకామిని జయశుభకారిణి
విజయరూపిణి
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్నా అమ్మవు నీవే
నీచరణములే నమ్మితినమ్మ
శరణము కోరితినమ్మా భవాని నర్తనశాల (1963) సినిమా కోసం సముద్రాల రాసిన భక్తిగీతం. నేటికి దేవాలయాల్లో విరివిగా వినవచ్చే గీతం.

వందేమాతరం (మాటలు, పాటలు)
సుమంగళి (మాటలు, పాటలు)
దేవత (మాటలు పాటలు)
భక్త పోతన (కథ, మాటలు, పాటలు)
జీవన్ముక్తి (పాటలు)
గరుడ గర్వభంగం (మాటలు )
భాగ్యలక్ష్మి (మాటలు పాటలు)
పంతులమ్మ (మాటలు పాటలు)
స్వర్గసీమ (మాటలు పాటలు)
త్యాగయ్య (మాటలు పాటలు)
యోగి వేమన (మాటలు పాటలు)
రత్నమాల (మాటలు పాటలు)
లైలామజ్ను (మాటలు పాటలు)
కృష్ణావతారం (మాటలు పాటలు)
శ్రీరామకథ (చివరగా రచించిన సినిమా)
తారాశశాంకం (మాటలు,కొన్ని పాటలు)
(చివరగా విడుదలైన సినిమా)

మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి అనార్కలి
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
ఒక సంగీతభరిత గీతం. ఇది అనార్కలి చిత్రం (1955) కోసం సముద్రాల
రచించింది. మొఘల్ రాజు అక్బర్ దర్బారులో నర్తకి అనార్కలి అద్భుతంగా నాట్యం చేస్తుంది. ఆశ్చర్యచకితుడైన యువరాజు సలీం ఆమెను ప్రేమిస్తాడు. అనార్కలి సినిమాకు చాలా కీలకమైన పాటకోసం ఖవ్వాలి బాణిలో ఉత్తర హిందుస్తానీ తరహా కథక్ నాట్యంతో దీన్ని చిత్రీకరించారు. అద్భుత ప్రేమ దృశ్యకావ్యంగా ఈ సినిమా నిలిచిపోయింది.

జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే
లవకుశులు.. వాల్మీకి రచించిన రామాయణాన్ని గానం చేస్తూ ఆయోధ్య చేరి రాజవీధిలో గానం చేసే సందర్భంలోనిదీ గీతం.
లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో
తల్లి దీవెన తాతయ కరుణ వెన్ను కాయగా వెరువగనేలా
హయమును విడువుముగా
రాముడి అశ్వమేథ యాగానికి చెందిన అశ్వాన్ని బంధించి రాముని సోదరులు సైన్యంతో గానం చేసే సందర్భంలోనిది.
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా
ఈ పాటలన్నీ కూడా లవకుశ(1963) సినిమా కోసం సముద్రాల రాసిన పాటలు. రామయణాన్ని ఈ నాలుగు పాటల్లో వివరించారాయన.


(వ్యాసం : courtesy 'నమస్తే తెలంగాణ' పత్రిక)

కామెంట్‌లు లేవు:

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...