10, మే 2021, సోమవారం

ప్రముఖ తత్వవేత్త " జిడ్డు కృష్ణమూర్తి "

 

  • ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త 'జిడ్డు కృష్ణమూర్తి; - నా pencil చిత్రం.

ప్రస్తుతం  కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది.   ఈ నేపథ్యంలో వీరు చెప్పిన కొన్ని అక్షర సత్యాలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. చదవండి. 




  • భయపడుతూ ఉన్నవాడే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు.

  • మనస్సు, హృదయం నిశ్చలంగా వుంటే ఉత్సాహం లభిస్తుంది.

  • అనుభవించడం జరగగానే అది అనుభూతి అవుతుంది. అంటే గతానికి సంబంధించినది అయిపోతుంది. అది జ్ఞానం క్రింద చలామణి అవుతుంది.

  • అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్దాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి.

  • రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.

  • ఒక చెట్టునుంచి రాలే ఆకు మృత్యువుకి భయపడుతుందా? ఒక పక్షి మృత్యువుకు భయపడుతూ జీవిస్తుందని అనుకుంటున్నావా? మృత్యువు ఎప్పుడు వస్తే అప్పుడు దానిని అది కలుసుకుంటుంది. అంతేగాని మృత్యువును గురించి ఆందోళన చెందదు. కీటకాలను పట్టుకు తింటూ, గూళ్ళు నిర్మించుకుంటూ, పాటలు పాడుకుంటూ, నిశ్చింతగా జీవించడానికి కుతూహలపడుతుంది. వాటంతట అవి విరామం లేకుండా ఆనందపడుతున్నట్లు కనిపిస్తాయి. వాటికి మృత్యువును గురించి చింతే ఉండదు. మృత్యువు ఆసన్నమైందా, రానీ వాటి పని అవి చేస్తాయి. ముందు ఏంజరుగుతుందో అనే ఆందోళన ఉండదు. క్షణం క్షణం సజీవంగా ఉంటాయి. మనకే, మనుష్యులకే మృత్యువు అంటే భయం. ఎప్పుడూ భయపడుతూంటాం. వృద్ధులు మృత్యువుకు చేరువగా ఉంటారు. యువకులు కూడా దీనికి ఎంతో దూరంలో ఉండరు. మృత్యుభావంతో మనం నిమగ్నులమై ఉంటాం. ఎందుకంటే మనకు బాగా తెలిసిన దాన్నిగాని, సంగ్రహించి పెట్టుకున్న దాన్నిగాని పోగొట్టుకోడానికి భయపడతాం. చేసుకున్న భార్యనుగానీ, భర్తనుగానీ, బిడ్డనుగానీ, స్నేహితునిగానీ పోగొట్టుకోడానికి భయపడతాం. మనం తెలుసుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. సంపాదించుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. మనం ప్రోగుచేసుకున్న వాటినన్నిటినీ - మన స్నేహితులను, మన ఆస్తులను, సంపత్తులను, మన గుణాలనూ, శీలాన్ని కూడా తీసుకువెళ్ళగలిగినప్పుడు మనం మృత్యువు అంటే భయపడం. అందుకే మృత్యువు గురించి, దాని తరువాత జీవితాన్ని గురించి, ఎన్నెన్నో సిద్ధాంతాలను సృష్టించుకుంటాం. కానీ అసలు విషయం మృత్యువు అంటే అది అంతం. దీనిని అనుభవించడానికి సమ్మతించం. తెలిసిన దానిని వదలదలచుకోము. కాబట్టి తెలిసినదానికి అంటిపెట్టుకుని ఉండడం వల్ల మనలో భయం కలుగుతూంది. అంతేగానీ తెలియని దానివల్ల కాదు. తెలియని దానిని తెలిసిన దానితో గ్రహించలేం. కానీ మన మనస్సు తెలిసినవాటితో ఉండి "నేను అంతం అయిపోతున్నాను" అన్నప్పుడు భయపడిపోతుంది.

1 కామెంట్‌:

Prasad Graphics చెప్పారు...

చాల బాగ చెప్పినారు మూర్తి గారూ. మనిషి పుట్టినప్పుడే చనిపోవడం ఖాయమైనట్లు కదా! దానికి బాధ పడడం నిజంగ అనవసరమే. 🙏

'కళాప్రపూర్ణ' వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి (charcoal స్కెచ్)

  'కళాప్రపూర్ణ'  వజ్ఝల   చినసీతారామస్వామి శాస్త్రి  (charcoal pencil sketch) వఝుల సీతారామశాస్త్రి  లేదా  వజ్ఝల చినసీతారామస్వామి శాస్...