14, నవంబర్ 2021, ఆదివారం

ఆంజనేయ అనిలజ హనుమంతా నీ రంజకపు చేతలు సురలకెంత వశమా - అన్నమయ్య కీర్తన


 

కీర్తన : ఆంజనేయ అనిలజ హనుమంతా...

విశ్లేషణ సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi
ఆంజనేయ అనిలజ హనుమంతా నీ
రంజకపు చేతలు సురలకెంత వశమా
తేరిమీద నీ రూపు తెచ్చిపెట్టి ఆర్జునుడు
కౌరవుల గెలిచే సంగర భూమిని
సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట
నీరోమములు కావా నిఖిల కారణము
నీ మూలమునగాదే నెలవై సుగ్రీవుడు
రాముని గొలిచి కపిరాజాయెను
రాముడు నీ వంకనేపో రమణి సీతా దేవి
ప్రేమముతో మగువ పెండ్లాడెను
బలుదైత్యులను దుంచ బంటు తనము మించ
కలకాలమునునెంచ కలిగితిగా
అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి
నిలయపు హనుమంత నెగడితిగా
——————————-
విశ్లేషణ
~~~~~~~
ఓం నమో వేంకటేశాయ 🙏
ప్రార్థన 👇🏿
మ॥
నిజగర్భస్థిత శైవతేజము సమున్నిద్రాత్మతేజంబు గూ
డ జగత్ప్రాణుఁడమోఘ కేసరివనాటక్షేత్రమందర్థినిం
చజయశ్రీ మహిమాప్తి నయ్యు భయతేజంబుల్ రహిన్ మిశ్రమై
త్రిజగంబుల్ గొనియాడ బుట్టితివి గాదే నీవిలన్ మారుతీ!
(మారుతీ శతకము)
---------------------------------
పదకవితా పితామహుడు అన్నమయ్య ఈ కీర్తనలో పవన తనయుడు, వజ్రకాయుడు, రుద్రతేజుడు, మహా బలవంతుడు, చిరంజీవి, అన్నిటికీ మించి రామభక్తుడు అయిన ఆంజనేయుని కీర్తిస్తున్నాడు।
పల్లవిలో …
“హనుమంతా! నీరంజకపు చేతలగురించి వర్ణించడం ఆ దేవతలకు కూడ అసాధ్యం!”అంటూ హనుమంతుడు చేసిన లంకాదహనం తలుచుకొని పొంగిపోయాడు. రంజకము అంటే అగ్ని. అగ్నినేత్రుడైన రుద్రుని తేజమే ఆంజనేయునిగా రామావతార సమయంలో భూమిపై అవతరించింది. రుద్రాంశ సంభూతుడిని నిప్పేం చేయగలదు! వాళ్ళ (లంకలోని రాక్షసులు) నిప్పుతో వాళ్ళ నగరమే దగ్ధంచేసాడు!
హనుమంతుడు చిరంజీవి . ద్వాపరయుగంలో పాండవులకూ ఆయన మేలు చేయడం ప్రస్తావిస్తూ ‘తేరిమీద నీరూపు తెచ్చిపెట్టి …..’అంటూ “అర్జునుడు నిన్ను తన రథకేతనంపై నిలుపుకొని అర్జునుడు కౌరవులను రణరంగంలో గెలిచాడు”అని విజయాన్ని కలిగించే మహాశక్తి సంపన్నునిగా కీర్తించాడు.
అశ్వమేధ యాగం తలపెట్టిన ధర్మరాజు భీముడిని పురుషామృగం తెమ్మని ఆదేశించాడు. పురుషామృగం అంటే సగం మనిషి సగం జంతువుగా ఉన్న భయంకరాకారంగల జంతువు। అది తేవడానికి భీముడు వెళుతున్నప్పుడు అతడికి రక్షగా హనుమ తన రోమాలను ఇచ్చాడు. కీర్తనలో ప్రస్తావించిన ఈ విషయం హనుమంతుడిశక్తి ఆయన దేహంలోని అణువణువునా చివరకు రోమములలోకూడ వ్యాపించి ఉందని తెలియచేస్తోంది।
త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికీ మారుతికి ఉన్న అనుబంధం అజరామరం !
“స్వామీ పవన కుమారా! నీ వలననే గదా రామసుగ్రీవులకు మైత్రి ఏర్పడింది! నీ వలనననేగదా తన ఇల్లాలైన సీతను రావణుని చెరనుండి రక్షించి తిరిగి తాను పొందగలిగాడు!”అని ఆ సంఘటనలన్నీ గుర్తుచేసుకున్నాడు అన్నమయ్య తరవాత చరణంలో!
శ్రీమద్రామాయణంలో కనబడే అనేకబంధాలలో మైత్రి మాటొస్తే రామసుగ్రీవులను చెబుతాం. సుగ్రీవ మైత్రి అనే నానుడికూడ ఉంది.
వారిద్దరికీ స్నేహం కుదిర్చిన వాడు హనుమంతుడే. మంచి స్నేహితుడిని చూపడం కంటే మేలైన విషయం ఏముంటుంది?

మహా బలశాలి వాలి తన సోదరుడు సుగ్రీవుణ్ణి అపార్థం చేసుకొని అతణ్ణి చంపడానికి వెంటపడితే పోయి ఋష్యమూకంలో తలదాచుకున్నాడు. తన భార్యను వాలి తీసుకుపోతే నిస్సహాయుడై దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు రాముడి మైత్రి హనుమ వలన దొరికింది. తరవాత కథంతా మీకు తెలిసిందే. వాలిని శ్రీరాముడు సంహరించి సుగ్రీవుడిని కపిరాజును చేసాడు. సీతమ్మ జాడ కనుక్కొని , వారథి నిర్మాణం జరిపి, రామరావణ యుద్ధంలో రామునికి తానూ తన వానరసేన తోడుగా నిలబడి ఆ ఋణం తీర్చుకున్నాడు సుగ్రీవుడు।

ఆ మహాసంగ్రామంలో హనుమ పాత్ర ఎంత ముఖ్యమైనది! ఎంతమంది రాక్షసులను సంహరించాడు? ఎంత పరాక్రమం ప్రదర్శించాడు! తలుచుకుంటే “హనుమే లేకపోతే సీతారాముల పునస్సమాగమం కుదిరేదా!” అనిపిస్తుంది!
“ఇప్పుడు ఈ కలియుగంలో ఆ వేంకటపతి సన్నిధిన మంగాంబుధిలో కొలువై ఆ వేంకటేశ్వరుని దర్శింపవచ్చే భక్తులను అనుగ్రహిస్తున్నాడు।”అని అన్నమయ్య ఆ ఆంజనేయస్వామిని కీర్తిస్తుంటే మనం ఆదృశ్యాలను మనోయవనికపై చూస్తూ పరవశించి పోతాం!
మహాబలాయ వీరాయ చిరంజీవిన్ నమోస్తుతే
హారిణే వజ్రదేహాయ ఉల్లంఘిత మహాబ్థయే!
స్వస్తి
~~~~~~~~~~~~~~~~~
డా.ఉమాదేవి జంధ్యాల

కామెంట్‌లు లేవు:

'కళాప్రపూర్ణ" రావూరు వెంకటసత్యనారాయణ రావు

ఇతడు  కృష్ణా జిల్లా ,  ముచ్చిలిగుంట  గ్రామంలో జన్మించాడు. ఇతడు  కృష్ణా పత్రికలోను ,  ఆంధ్రప్రభ  దినపత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్...