25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

అని యానతిచ్చె కృష్ణుడర్జునునితో విని యాతని భజించు వివేకమా - అన్నమయ్య కీర్తన


వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన : అన్నమయ్య కీర్తన

విశ్లేషణ : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi
~~~~~~~~~~~~~~~~
ఒక ప్రార్థన పద్యం🙏
తే.గీ
సకల ప్రాణుల సృష్టింప జాలుదీవు
సకల జీవుల పోషింప జాలుదీవు
దేవదేవ! జగత్పతీ! దీనబంధు!
నిన్నెరుంగుదు స్వయముగా నీవె తండ్రి!
(ఇ.వి. సుబ్రహ్మణ్యం గారిది)

కీర్తన పాఠం
**********
అని యానతిచ్చె కృష్ణుడర్జునునితో
విని యాతని భజించు వివేకమా ||
భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల
దీమసాన మోచేటి దేవుడ నేను
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడ నేను ||
దీపనాగ్నినై జీవదేహముల అన్నములు
తీపుల నరగించేటి దేవుడ నేను
ఏపున నిందరిలోని హృదయములోను నుందు
దీపింతు తలపు మరపై దేవుడ నేను ||
వేదము లన్నిటిచేత వేదాంతవేత్తలచే
ఆది నేనెరగతగిన ఆ దేవుడను
శ్రీదేవితోఁ గూడి శ్రీ వేంకటద్రి మీద
పాదైన దేవుడను భావించ నేను ||
🔹నాకు తెలిసినంతలో వివరణ
~~~~~~~~~~~~~~~~~~
అన్నమయ్య ఈ కీర్తనలో భగవద్గీత
15 వ అధ్యాయం పురుషోత్తమ యోగంలోని 13,14,15 శ్లోకాల భావాన్ని తీసుకొని సామాన్యులకు కూడ అర్థమయ్యేలా భగవంతుని విశ్వ వ్యాపకత్వాన్ని, ధారణ, పోషణ, రక్షణల నేర్పును చాటి చెబుతున్నారు.
ముందు ఆశ్లోకాలు , వాటి భావం చూద్దాం.
శ్లో॥
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా !
పుష్ణామి చౌషదీః సర్వాః
సోమో భూత్వా రసాత్మకః !!
శ్లో ॥
అహం వైశ్వానరో భూత్
వాప్రాణినాం దేహమాశ్రితః !
ప్రాణాపానస మాయుక్తః
పచామ్యన్నం చతుర్విధమ్ !!
శ్లో॥
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహమ్॥
🔹🔹పై మూడు శ్లోకాల భావం
————————-
భూమిలో ప్రవేశించి నేను నాశక్తితో సమస్త చరాచర జీవకోటిని ధరిస్తున్నాను. పోషిస్తున్నాను. రసస్వరూపుడైన, అమృతకిరణుడైన చంద్రడనై సకల ఓషధులకు పుష్టిని కలిగిస్తున్నాను.
జీవులలో వైశ్వానరుడనే జఠరాగ్నినై భక్ష్య,భోజ్య, చోష్య, లేహ్యములనే నాలుగు విధాల ఆహారాలను జీర్ణించుకునేటట్లు చేస్తున్నాను.
సమస్త హృదయాలలో అంతర్యామినై
స్మృతిని, విస్మృతిని, జ్ఞానాన్ని, సంశయ నివారణను(అపోహను)కలిగిస్తున్నాను.
వేదములు నేనే. వేదాంత కర్తనూ నేనె, వేదవిజ్ఞుడనూ నేనె.
—————-
పై శ్లోకాలను అన్నమయ్య కీర్తనలో పొందు పరిచారు. ఆ కీర్తన మీరు పైన చూసారు గనక కీర్తన భావం చూద్దాం.
🔹కీర్తన భావం 👇🏿
“కృష్ణుడు అర్జునునితో ఏమన్నాడో విని ఓ మనసా వివేకంతో గ్రహించి ఆ పరమాత్మను పూజింపరాదా!”
అంటూ అన్నమయ్య చరణాలు ఆ కృష్ణ పరమాత్మ మాటలుగా ఉత్తమ పురుషలో వ్రాసారు.
భగవానుడిలా అంటున్నాడు కీర్తనలో…
“నేనుఅంతర్యామిని. పంచభూతములలో నిండి ఉన్నవాడను. ఈ భూమిలో ప్రవేశించి ఈ ప్రాణికోటినంతా నేర్పుతో మోస్తున్నాను. పుట్టించినందుకు ప్రేమతో వారిని పోషించడానికి రసస్వరూపుడైన , అమృత కిరణుడైన చంద్రుడనై వాటికి శక్తినిచ్చే ఓషధులనూ, ధాన్యాలనూ పండిస్తున్నాను.
జీవుల శరీరంలో జఠరాగ్ని నేనై అన్నిరకాల ఆహార పదార్థాలనూ , ( భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయాలు) అరిగిస్తున్నాను.
హృదయంలో ప్రకాశించే జ్యోతి స్వరూపుడనై ఆలోచనలనూ, మరపునూ కూడ ప్రసాదిస్తున్నాను. (మరుపుకూడ జీవికి ఒక వరమే కదా!)
వేదాలు, ఉపనిషత్తులు, శృతి పురాణాదు లన్నింటిచేత మొదట తాను పండితులకు , తత్త్వజ్ఞులకు అర్థమై వారి వలన లోకానికి తెలుస్తున్నాను. ఈ వేంకటాద్రిపై నెలకొని అందరినీ అనుగ్రహిస్తున్నాను.”
బుద్ధి జీవి అయిన మనిషి అహంకారంతో అంతా నా గొప్పదనమే అనుకుంటాడు. ఏది కదలాలన్నా, ఏది జరగాలన్నా ఆ పరమాత్మ అనుకుంటేనే జరుగుతుంది. నీ ఉనికే ఆయన ప్రసాదించినదని మరిచిపోవద్దు.
ఇదే అన్నమయ్య చెప్పదలచినది.

(బాపు గారి చిత్రం ఆధారంగా నేను చిత్రీకరించిన చిత్రం - (వాటర్ కలర్స్)

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...