10, మార్చి 2022, గురువారం

అంగర సూర్యారావు - రచయిత , విశాఖపట్నం


Pencil sketch

కీశే శ్రీ అంగర సూర్యారావు. గారు.(జూలై 4, 1927 - జనవరి 13, 2017)

ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. 'సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం. ఆయన సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత.
1927 జూలై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు.


విద్యాభ్యాసం మండపేట, రామచంద్రపురంలలో జరిగింది.


1949లో విశాఖపట్నంలో విద్యాశాఖలో గుమాస్తాగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యారావు విశాఖనగరంపై ప్రేమను పెంచుకొని, బదిలీలు ఇష్టపడక పదోన్నతులను వదులుకొని రిటైర్ అయ్యేవరకూ గుమాస్తాగానే వుండిపోయారు.

రచనలుః

తొలి రచన 1945లో ' కృష్ణా పత్రిక' లో వచ్చింది. ( వ్యాసం)
మొదటి కథ ' వినోదిని ' మాస పత్రికలో ప్రచురితమయింది.
' చిత్రగుప్త', ' చిత్రాంగి', ' ఆనందవాణి', ' సమీక్ష', వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి.
1948 నుండి 1958 వరకు ' తెలుగు స్వతంత్ర' లో కథలు, స్కెచ్ లు వచ్చాయి.
' ఆంధ్ర సచిత్ర వార పత్రిక', ' భారతి సాహిత్య మాస పత్రిక', 'ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక'లలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. పలు నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.

పుస్తకాలు

కళోద్ధారకులు ( నాటికలు - 1956)
శ్రీమతులు - శ్రీయుతులు ( నాటికలు - 1959 )
నీలి తెరలు ( నాటకం - 1959)
పాపిష్టి డబ్బు ( నాటికలు - 1960 )
ఇది దారి కాదు ( నాటకం - 1967)
ఎనిమిది నాటికలు ( 1976 )
చంద్రసేన ( నాటకం - 1976 )
రెండు శతాబ్దాల విశాఖ నగర చరిత్ర ( 2006 )
సమగ్ర విశాఖ నగర చరిత్ర - మొదటి భాగం ( 2012)
సమగ్ర విశాఖ నగర చరిత్ర - రెండవ భాగం ( 2014)
60 ఏళ్ళ ఆంధ్ర సాహిత్య చరిత్రలో పురిపండా ( అముద్రితం)
ఉత్తరాంధ్ర సమగ్ర సాహిత్య చరిత్ర ( అముద్రితం)
రచన శైలి
సూర్యారావు గారు కథల కంటే నాటక రచనకే ప్రాధాన్యత ఇచ్చారు.నాటక రచనకు వీలుకాని ఇతివృత్తాలు తట్టినప్పుడు కథలుగా రాశారు. 1976 తరువాత రాసిన కథల సంఖ్య తక్కువ. 1996లో ప్రచురింపబడిన ఏడడుగుల వ్యాపార బంధం ఆయన చివరి కథ.
నిశితమైన వ్యంగ్యం వుపయోగించి ఎదుటి వాడిని చకిత పరచడమూ, సున్నితమైన హాస్యంతో నవ్వినచడమూ, తప్పు చేసి తప్పుకొనే మనిషిని నిలువునా నిలదీయడమూ వీరి నాటికలు, నాటకాలలోని ప్రత్యేకత.
వీరి రచనలలోని పాత్రలు సమాజంలో మన చుట్టూ తిరుగుతుండేవే. అందుకనే వారి రచనలు సజీవమైనవి...సత్య దూరం కానివి. వీరి నాటికలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ నాలు మూలాల రంగస్థలాలకెక్కాయి.
రచనలో మాత్రమే కాక నాటక ప్రయోగంలో సూర్యారావు గారికి మంచి అనుభవమూ, అభినివేశమూ ఉంది. రంగశాల అనే సంస్థను స్థాపించి, దానికి అధ్యక్షులుగా వుండి ప్రయోగాత్మక కృషి చేసారు.
వీరి చరిత్ర రచన అన్ని తరాల వారికీ ఆసక్తిదాయకంగా వుండే విధంగా సాహిత్య ఆధారాలు, జీవిత చరిత్రలు, నాటి పత్రికల వార్తలు, ప్రభుత్వ గెజిట్ల ఆధారంగా సాగుతుంది.సబ్ హెడ్డింగ్స్ తో సంక్షిప్తంగా చదివించే శైలిలో సాగే వీరి' సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచనా శైలి అనేకమందికి చరిత్ర రచనకు స్ఫూర్తిని ఇచ్చింది.

సాహిత్య సేవ:

1949లో ప్రారంభించిన ' విశాఖ రచయితల సంఘం' వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.
1965 - 1978 సంవత్సరాల మధ్య ' కవితా సమితి ' సెక్రటరీ గానూ,
1974 నుండి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగానూ ఉన్నారు.
పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు
ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు పొందినది (1978).
1979లో ఎనిమిది నాటికలు సంపుటిని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు M.A. పాఠ్యగ్రంధాలలో ఒకటిగా ఎంపిక చేసారు.
2015లో ' జాలాది ఆత్మీయ పురస్కారం' ను అందుకున్నారు.
2015 లోనే ' బలివాడ కాంతారావు స్మారక అవార్డు' ను అందుకున్నారు.
మరణం
వీరు తమ 90వయేట విశాఖపట్నంలోని తమ స్వగృహంలో జనవరి 13, 2017న మరణించారు.

(విశాఖపట్నం మహనీయులు చిత్రీకరణలో భాగంగా నేను నా పెన్శిల్ తో చిత్రీకరించిన కీ. శే. అంగర సూర్యారావు గారి చిత్రం - విషయ సేకరణ ఇక్కడా అక్కడా)

కామెంట్‌లు లేవు:

టి. జి. కమలా దేవి సినీ నటి, స్నూకర్ క్రీడాకారిణి

  టి. జి. కమలాదేవి - my  charcoal pencil sketch, slide created by me.  టి.జి.కమలాదేవి   ( డిసెంబర్‌ 29 ,   1930   -   ఆగస్టు 16 ,   2012 ) (...