25, ఏప్రిల్ 2024, గురువారం

రాగ మాలిక - కథ


 మీ చిత్రం - నా కథ.


రాగమాలిక

రచన: మాలా కుమార్


మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడావిడిగా ఉంది.

వంటింట్లో నుంచి " మల్లీ ఇటురా తల్లీ" పిలిచింది పంకజం. తల్లి దగ్గరకు వెళ్ళి "ఏంటమ్మా ఇదంతా ?" అడిగింది మాలిక.


మాలిక ముంగురులు సద్దుతూ "మొన్న మనం వెళ్ళిన పెళ్ళిలో మీ నాన్నగారి స్నేహితుడి కొడుకు నిన్ను చూసి ఇష్టపడ్డాడట. ఈ రోజు మంచిదని, నిన్ను చూసేందుకు రావచ్చా? అని ఇందాక కబురు చేసారు. ఆరింటికి వస్తారు. ఇంకా సమయం ఉంది కదా కంగారేమీ లేదు. చిన్నగా తయారవ్వు" అంది.


"ఆ అబ్బాయి పేరు అనురాగ్. ఈ మధ్యనే యంటెక్  పాసయ్యాడు. నాగార్జున సాగర్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం లో చేరాడు. పిల్లవాడు బాగుంటాడు. బుద్దిమంతుడు. నేను చాలా సార్లు చూసాను. నువ్వు కూడా చూడు. నీకు నచ్చితేనే పెళ్ళి చేస్తాము. బలవంతం లేదు" అనునయంగా అన్నాడు అప్పుడే అటుగా వచ్చిన విశ్వనాథం.


పెళ్ళిచూపులల్లో అనురాగ్ ను చూసిన మాలికకి అభ్యంతరం ఏమీ కనిపించలేదు. తండ్రి చెప్పినట్లే అందంగా ఉన్నాడు. మర్యాదగా మాట్లాడాడు. అందరి ఆమోదంతో నెలలోపలే పెళ్ళి చేసుకొని మాలికని సాగర్ తీసుకెళ్ళాడు అనురాగ్.


"కొత్త పెళ్ళికుతురా రారా... నీ కుడికాలూ ముందు పెట్టిరారా" సరదాగా పాడుతూ భార్యను ఆహ్వానించాడు అనురాగ్.


భర్త ఆహ్వానికి మురిసిపోతూ, కొద్దిగా సిగ్గుపడుతూ లోపలికి అడుగుపెట్టింది. "సీతమ్మా వచ్చిందీ మొగుడింటికీ... సిగ్గంతా చేరిందీ కడకంటికీ..." మేలమాడాడు.


టూ బెడ్ రూంస్, కిచెన్, హాల్, చుట్టూ పూలమొక్కలున్న చిన్న తోట, లోపలంతా చక్కని ఫర్నీచర్, వంటగదిలో గాస్ స్టవ్, కొద్దిపాటి గిన్నెలు, సామానులు అన్నీ పొందికగా అమర్చి ఉన్న చిన్న క్వాటర్ ను ముచ్చటగా చూస్తున్న మాలికతో "ఇదే మన ప్రేమసౌధం. ఎలా ఉంది?" మార్ధవంగా అడిగాడు.


"చాలా బాగుంది.  అండీ... " ఏదో అనబోతున్న కస్తూరితో, "నో అండీ, బండీ. కాల్ మి రాగ్" అన్నాడు.


అమ్మో పేరు పెట్టి పిలవలా?  బామ్మ విన్నదంటే మొగుడిని పేరుపెట్టి పిలవటమేమిటే పిదపకాలం, పిదప బుద్దులు అని మొట్టికాయ వేస్తుంది అనుకుంటూ అప్రయత్నంగా తల తడుముకుంది మాలిక.


రాత్రి వంట చేసి డైనింగ్ టేబుల్ మీద సద్దుతున్న కస్తూరితో "ఇక్కడ కాదు. పద” కంచాలు, గ్లాస్ లు, కొన్ని గిన్నెలు ట్రే లో పెట్టి తీసుకుంటూ అన్నాడు. మిగిలినవి తను తీసుకొని ఎక్కడికబ్బా అంటూ రాగ్ ను అనుసరించింది. ఎప్పుడు అమర్చాడో డాబా మీద చాప వేసి ఉంది. ఇంకో వైపు తెల్లని పక్క పరచి ఉంది. మధ్యలో కొద్దిగా ఎత్తున్న చిన్న రౌండ్ టేబుల్ ఉంది. దాని మీద గిన్నెలు పెడుతూ కూర్చోమన్నట్లు చాప చూపించాడు. పౌర్ణమి రోజులేమో ఆకాశం లో చంద్రుడు తెల్లగా మెరిసిపోతున్నాడు. వెన్నెల కాంతిలో, డాబా మీదకు పరుచుకున్న సన్నజాజీ, చంబేలీ తీగల నిండుగా పూసిన పూవులు చుక్కలతో పోటీ పడుతూ, సువాసనలను వెదజల్లుతున్నాయి. పవనుడు చల్లగా, మృదువుగా మాలిక బుగ్గను తట్టాడు. ఒక్కసారిగా వళ్ళు జల్లుమంది మాలికకి.


"అండీ... ఎంత బాగుంది ఇక్కడ" పరవశంగా అంది.


వెన్నెలలో విందు పసందు అంటూ మాలిక వడిలో తలవాల్చి "తల నిండా పూదండ దాల్చిన నారాణి" అని పాడుతున్న అనురాగ్ జుట్టు నిమురుతూ, కొత్తకాపురం ఎంత మధురంగా మొదలయ్యింది అనుకుంది, చెప్పలేని, వర్ణించలేని భావనతో! వెన్నెల రోజులల్లో డాబా మీద కూర్చొని, సన్నజాజీ, చంబేలీల సువాసన ఆస్వాదిస్తూ, పాటలు పాడుకుంటూ, భోజనం చేయటం అందమైన అనుభవం మాలికకి. పెళ్ళవుతే జీవితం ఇంత బాగుంటుందా? చదివింది చాలులే ఇంక హాయిగా పెళ్ళి చేసుకోండి అని తన స్నేహితులకు చెప్పాలి అనుకుంది. అదే మాట రాగ్ తో అంది. ఆహా అంటూ పెద్దగా నవ్వేసాడు రాగ్. నవ్వుతున్న రాగ్ ను ప్రేమగా చూస్తూ, రాగ్ జుట్టును సుతారంగా కదిలించిన చిరుగాలితో "సడి చేయకో గాలి సడి చేయబోకే" అని హెచ్చరించింది. కాసేపు ఇద్దరూ ఓ మధురమైన భావనలో ఉండిపోయారు.


రాగ్ చాలా మృదుస్వభావి, భావకుడు. చక్కని గాయకుడు కూడా. పాటలంటే చాలా ఇష్టం. అందుకే అనురాగ్ ను రాగ్ చేసాడు. ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చాక "పదపద కృష్ణమ్మ ఇంకా నిన్ను చూపించలేదేమని కోపం చేస్తోంది పద" హడావిడి చేసాడు.


డాం దగర పరిసరాలు ఆహ్లాదంగా ఉన్నాయి. చిన్నగా నడుచుకుంటూ డాం దగ్గరగా వెళ్ళారు. తెరిచిన గేట్ ల నుండి పొగలు చిమ్ముతూ, గంతులు వేస్తూ దూకుతోంది కృష్ణమ్మ. గాలికి కదులుతున్న చీరను ఓ చేత్తో పట్టుకొని, వెంట్రుకలను మరో చేత్తో సవరించుకుంటూ కృష్ణమ్మ పరవళ్ళను చూస్తోంది మాలిక. చిరుజల్లులను అక్షింతల్లా చల్లుతూ నవవధువును ఆప్యాయంగా పలకరించింది కృష్ణమ్మ. చిన్నచిన్న గులాబీరంగుపూలున్న తెల్లచీర, వదులుగా వేసుకున్న పొడవాటి జడలో సన్నజాజులమాల, కృష్ణమ్మ చల్లిన అక్షింతలతో కొద్దిగా తడిసిన చీరలో ముగ్ధమనోహరంగా ఉన్న మాలికను పరవశంగా చూస్తూ...


"వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ, తీగ రాగమైన మధురిమ కన్నావా"


అని పాడుతున్న రాగ్ వైపు చిరుసిగ్గుతో నవ్వుతూ చూసింది మాలిక.


వడ్డున ఉన్న శివాలయంలో శివుని అర్ధభాగం లో ఉన్న గౌరి వారిని ముచ్చటగా చూస్తోంది. అది చూసిన గంగ "నీకేం తల్లీ హాయిగా విభుని ఆక్రమించుకొని ఎన్ని రాగాలైనా తీస్తావు" అంటూ కోపంగా కాస్త ధారను పెంచింది.


"నీకు మాత్రం ఏమయ్యింది? మొగుడి నెత్తినెక్కి తాండవమాడుతున్నావుగా!" అని తడిసిన కొంగును గంగ మీదకు దులపరించింది గౌరి చిరాగ్గా!


పెళ్ళాల గొడవకు తపోభంగమయి "హూం" అని హుంకరిస్తూ కళ్ళు తెరిచాడు శివయ్య. అంతే ఇద్దరూ గప్ చుప్...


సవతులపోరు తెలియని రాగమాలికలు పాటలపల్లకీ ఎక్కి కృష్ణమ్మ అనురాగంలో తడిసి ముద్ద అవుతున్నారు.


(నిన్ననే ఈ చిత్రం చూసాను. నేను కవితలు రాయలేను. నిన్న ఈ చిత్రం చూడగానే ఇలా అనిపించి ఈ మినీ కథ రాసాను. ఇది కథా? కథకు కళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు అనకండి. ఇలా అనిపించింది, అలా రాసేసాను. ఇక చదివేవాళ్ళ కంటిసిరి :))

కామెంట్‌లు లేవు:

కొర్రపాటి గంగాధరరావు - శతాధిక నాటక రచయిత - charcoal pencil sketch

నా chaarcoal పెన్సిల్ ద్వారా చిత్రీకరించుకున్న చిత్రం.  శ్రీ కొర్రపాటి గంగాధరరావు : వీరు మే 10, 1922 న మచిలీపట్నం లో జన్మించారు.   నటుడు, దర...