22, నవంబర్ 2024, శుక్రవారం

పండు వాళ్ళ నాన్న - కథ


నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన


కథా శీర్షిక..



'పండు వాళ్ళ నాన్న'


          'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని వుంది. ఎప్పుడు వస్తావు? ఈ నెలలో నా పుట్టినరోజు వుంది. నీకు గుర్తుందా? మర్చిపోయావా? ఊరికే అంటున్నానులే… నీకు నా పుట్టినరోజు బాగా గుర్తు వుంటుందని నాకు తెలుసు.


        ప్రతీ పుట్టినరోజుకి నాకు బోలెడు బహుమతులు పంపుతూనే వుంటావు కదా? వాటిని చూసి నా ఫ్రెండ్స్ చింటూ, బబ్లూ అందరూ కుళ్ళుకుంటూ వుంటారు. ఎంచక్కా మీ నాన్న నీ దగ్గర లేకపోయినా, గిఫ్ల్ లు మాత్రం పంపుతూ వుంటాడు. బేటరీ కారు, క్రికెట్ కిట్, కొత్త కొత్త డ్రెస్సులు చాలా పంపుతాడు. మా నాన్నలైతే ఏవీ కొని పెట్టారు. నువ్వు చాలా లక్కీ అని అంటారు. 


      కానీ, నాన్నా! అవి వుంటే లక్కీ కాదు నాన్నా! నువ్వు నా దగ్గర వుంటేనే నేను లక్కీ అవుతాను. ఎప్పుడో చాలా రోజుల క్రితం వచ్చావట. అప్పుడు నాకు మాటలు కూడా సరిగ్గా రావు. నాతో నువ్వు మాట్లాడేవేమో కానీ… నేనైతే నీతో ఏదీ మాట్లాడలేదు. ఇప్పుడు ఫోనులో మాట్లాడుతున్నా నాకు సంతృప్తిగా లేదు. నీ పక్కనే కూర్చుని, నిన్ను గట్టిగా వాటేసుకుని నీతో బోలెడు కబుర్లు చెప్పాలనుకుంటున్నాను. మన పెరట్లో జామచెట్టు మీద ఉడుత నాకోసం జామకాయలు అస్సలు ఉంచడం లేదు. అన్నీ కొరికి పారేస్తోంది. నువ్వు వస్తే దాన్ని హుష్ హుష్ అని అదిలిస్తావని అమ్మ చెప్పింది. నీ తుపాకీ చూస్తే దానికి చాలా భయమట. అసలు నీ తుపాకీ అంటే  పరాయిదేశ సైనికులకు కూడా హడల్ అని అమ్మ చెప్పింది. నువ్వు మన దేశ సరిహద్దులో తుపాకీ పట్టుకుని నిలబడడం మూలంగానే… ఇక్కడ మేమంతా క్షేమంగా వుండగలుగుతున్నామని అమ్మ చెప్పింది. నాన్నా! మన దేశం మీదకి శత్రువులు వస్తే, డిష్యుం డిష్యుం అంటూ వాళ్ళని షూట్ చేసెయ్యి. నువ్వు చాలా గ్రేట్ అని మా టీచర్ చెప్పారు. నిన్ను ‘జై జవాన్’ అంటూ సెల్యూట్ చేయాలట కదా! 


     ఈ పుట్టినరోజు కి మాత్రం ఎలాగోలా నువ్వు తప్పకుండా రావాలి నాన్నా! మనిద్దరం చాలా కబుర్లు చెప్పుకోవాలి. నాకు వేరే గిఫ్ట్ ఏదీ వద్దు. నువ్వు రావడమే పెద్ద గిఫ్ట్. సరేనా? నీ కోసం ఎదురుచూస్తూంటాను. 


                               ఇట్లు

                              నీ బుజ్జి పండు.


    

                               ***


“అమ్మా!  నువ్వు చెప్పినట్లే నాన్నకి ఉత్తరం రాసి పోస్టు డబ్బాలో వేసేసాను. అది నాన్నకి ఎప్పుడు అందుతుందో, , అది చదివి నాన్న ఎప్పుడు వస్తాడో, ఏంటో? అయినా పుట్టినరోజుకి రమ్మన్నాను కదా! తప్పకుండా వచ్చేస్తాడు కదూ?” లోపలికి వస్తూ అన్నాడు పండు. 


           ఆశ్చర్యం…. అక్కడ నాన్న… ఉత్తరం ఇప్పుడేగా రాసాను. అంతలోనే  ఎలా వచ్చాడు? భలే భలే… నేను ఉత్తరం రాసినట్లు నాన్న మనసుకి తెలిసిపోయి, రెక్కలు కట్టుకుని, నా పుట్టినరోజు కోసం ఎగురుకుంటూ వచ్చేసాడు కాబోలు. 


        “నాన్నా! నా కోసం వచ్చేసావా? ఇక  నాతో పాటే వుంటావు కదూ!” అంటూ నాన్నని గట్టిగా హత్తుకుపోయారు పండు.


      “నీతోనే వుంటాను పండూ! ఇక మనిద్దరం రోజూ బోలెడు కథలు చెప్పుకుందాం. నిన్ను స్కూల్ కి తీసుకువెళతాను. చదువు చెపుతాను. మనిద్దరం కలిసి ఆడుకుందాము. సరేనా?” చంకలో క్రచెస్ సరిచేసుకుంటూ ఒంటి కాలితో లేచి నిలబడి, కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు పండు వాళ్ళ నాన్న. 


సమాప్తం.

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...