29, జులై 2016, శుక్రవారం

కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు - అన్నమయ్య కీర్తన


కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
ప్రమదంబులునింతంతని పలుకంగ రాదు
1. మించిన చొక్కులు మీరిన యాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలపులు యెడపని వలపులు
పంచ బాణుని పరిణత(తు)లూ
2.కనుగవజలములు కమ్మని చెమటలు
అనయము జెలులకు నాడికలు
తనువున మరపులు తప్పని వెరపులు
వినుకలి కనుకలి వేడుకలు
3.మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీ వేంకటపతి చిత్తములు
తావుల పూతలు దర్పకు వ్రాతలు
ఆ విభుగూడిన యలసములు
తాత్పర్యము
పద్మంలో కూర్చుని ఉండే మా అమ్మ అలమేలు మంగమ్మ వైభవములు, ప్రౌఢతనములు ,చక్కదనములు,సంతోషాలు ఇంతింతని చెప్పటానికి వీలు కానివి.పరిమితి లేనివి.
1. మా తండ్రి వేంకటేశునితో ముద్దూ ముచ్చట్లు ఆడుతున్న సమయంలో ఆమె పరవశాలు హద్దుదాటి పోతాయి. ఎంత తీరిన ఇంకా ఏవేవో అపేక్షలు చెలరేగిపోతుంటాయి. తన పంచేంద్రియముల భాగ్యమే భాగ్యము. వాటికి ఎప్పుడూ తృప్తి పొందిన అవస్థలే. అనేకంగా ఇద్దరూ కలబోసుకొనే తలపుల్లో మరీ బాగున్న కొన్నింటిని ఎంచుకొంటూ, విడదీయని వలపులను పంచుకొంటూ, అయిదు బాణాలు కలిగిన మన్మథుడు ఇద్దరి మధ్యా అభివృద్ధిని పొందుతుంటే మా అమ్మ వైభవాలు ఎన్నని వర్ణించను!
2. మా అయ్య వేంకటేశుడు చేసిన చిలిపిచేష్టలను తలుచుకొని మా అమ్మ కళ్ల వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయ్య మళ్లీ రాబోతున్నాడనే తియ్యటి భావన రావటంతోనే ఏవేవో అనుభావాలు కలిగి పద్మినీజాతి సౌగంధ్యం కలిగిన మా అమ్మ శరీరం నుండి కమ్మటి చెమటలు వస్తున్నాయి. వీటిని అర్థం చేసుకోలేని పెద్దలు - అలమేలు మంగమ్మని ఏదో అన్నారని -మా అమ్మ పక్కన ఉన్న చెలులకు ఎప్పుడూ నిందలు వడ్డిస్తున్నారు. తన శరీరం నిండా పారవశ్యాలు. మా అయ్య వేంకటేశుడు రావటం కాసింత ఆలస్యమైతే చాలు - చిగురుటాకులా వణికిపోతూ తనకి లేనిపోని భయాలు.. ఒకరకంగా ఇవన్నీ చూడటానికి, వినటానికి ఆనందం కలిగించే విషయాలు.
3. మా అయ్య వేంకటేశుడు ఏ రస భరిత చేష్ట చేసాడో తెలియదు కాని - తన పెదవి నిండా తళతళా కాంతులు. ముద్దులు నింపుకొన్న నవ్వులు. ‘చిత్తం వేంకటేశా! మీదయ ..అలాగే” అనే వినయాలు. సుగంధ పరిమళాల పూతలు కొత్తగా మా అమ్మ ఒంటి మీదికి చేరాయి. ఆ మన్మథుడు నఖ క్షతాలతో ఏవేవో శృంగారపు రాతలు మా అమ్మ ఒంటి మీద వ్రాస్తున్నాడు. మా ప్రభువు వేంకటేశుని కలిసిన తర్వాత మా అమ్మకు తీరని అలసటలు.
(ఈ కీర్తనకి తాత్పర్యం అందించిన డా. పతంజలి తాడేపల్లి గారికి ధన్యవాదాలు)

కామెంట్‌లు లేవు:

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...