19, మార్చి 2017, ఆదివారం

నీకై వేచిచూసిన ఆశలన్నీనా పెన్సిల్ చిత్రానికి శ్రీమతి అనుశ్రీ కవిత

!!! నిర్వేదం !!!

నీకై వేచిచూసిన ఆశలన్నీ
వెనుదిరిగి వచ్చేసాయి
నిరాశల నిట్టూర్పులుగా....
ఆ ఘడియలు గుర్తొస్తే
ఇప్పటికీ శూన్యమే నా మది
ఎప్పటికీ అగమ్యమే మనిద్దరిది.....!!
నిద్రను వెలేసి మనసును కాపేసి
వేదన నిండిన గొంతుని
వేడుకగా నీ ముందర నిలిపి
నా వలపుకు విలువిచ్చి
వస్తావేమో అని
పడిగాపులు పడ్డ ఆ క్షణాలు....
కళ్ళల్లో నిండిన కన్నీళ్ళు
నీ రాకను గమనించవేమో
అని కడ కొంగుతో పలు మార్లు తుడిచి
అశాంతి నిండిన చిరునవ్వును
పెదవులకు అంటించుకున్న ఆరోజులు
ఇప్పడూ ఎప్పుడూ మనసుకు
మానని గాయాలే....
నీలో మార్పు చూడాలని
నాపై ప్రేమ కలగాలని
మనిషిగా ఉన్నతమై ఎదగాలని
దేవుడి ముందర కూర్చుని
చదివిన స్తోత్రాలు చేసిన పూజలు
ఫలించని నా కోరికల్లా
నిర్వేదాన్ని మోసుకొస్తుంటే...
గడిచిన గతం
నడుస్తున్న వర్తమానం
నా ఓటమిని పదే పదే గుర్తుకుతెస్తుంటే...
నలిగిన నా హృదయాన్ని
అనునయించి అర్థించి జీర్ణించుకుంటున్నా
ఇదే జీవితమని ఇంతే మిగిలిందని....
బహుదూరపు బాటసారివై
మండే గుండెలకు ఆజ్యం పోస్తూ
నువ్వెంత దూరం వెళ్ళి తిరిగొచ్చినా
నువ్వు తెచ్చే నిస్పృహలను కొలిచే
ఓర్పులు లేవిక్కడ.....
సమాధిలో స్థిరపడ్డ
ప్రేమ నిండిన నా సహనం
బ్రతికి రాదిక...!!
వరమో శాపమో నిన్ను
మరిచిన నా మదికి
సదా నే కృతజ్ఞురాలినే.........!!

అనుశ్రీ.....

లాలమ్మ లాలనుచు -- ఉంగాల కబుర్లు చెప్పరా తండ్రీ

నా చిత్రానికి మిత్రుల కవితా స్పందన ॥చిట్టితండ్రి ॥ "ఉంగాల కబురులే చెప్పరా తండ్రీ" నా pencil చిత్రానికి  Umadevi Prasad...