13, మే 2018, ఆదివారం

మాతృదేవోభవమాతృదేవోభవ - నా కలర్ pencil చిత్రం

శ్రి P.S. Narayana గారి ప్రశంస - " మూర్తి గారు మీరు మాకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు సందర్భానుసారంగా అందజేస్తున్నారు మీకు ధన్యవాదములు. కానీ మాతృ దినోత్సవం సందర్బంగా మీరు గీసిన చిత్రం అత్యంత అద్భుతమైన చిత్రం. గుక్క పెట్టి ఏడుస్తున్న చిన్నారి ఓదారుస్తూ తను పడుతున్న వేదనలో కూడా అమ్మ ప్రేమ, వాత్సల్యం కనిపిస్తున్నాయి.మీరు ఎంత అనుభవించి ఈ చిత్రాన్ని గీశారో... మీరు ధన్యులు "

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

నా చిత్రానికి శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి స్పందన :
మాతృదేవత
అమ్మ ఇంటి వేలుపురా
ఆలయాన దేవతరా
ఎన్ని చేసినా నీవు
కన్న ఋణము‌ తీర్చలేవు
తాళి మెడను పడగానే
తల్లికాగ తపిస్తుంది
కడుపున నువు పడినవేళ
వికారాలు సహిస్తుంది
తనువు భారమౌతున్నా
తనకు ముప్పు పొంచి ఉన్నా
నిండు నెలలు మోస్తుంది
నీకు పురుడు పోస్తుంది ". "
పేగు తెంచి ప్రాణమిచ్చి
ప్రేమకవచమేస్తుంది
అమ్మపాల అమృతాన
ఆయువునే పోస్తుంది
నిద్రసుఖములెరుగక
కంటిపాప తీరుగా
కాచుకుని పెంచుతుంది
కడుపుతీపి పంచుతుంది‌ ". "
ఉయ్యాలగ ఒడిని చేసి
ఊసులన్ని నేర్పుతుంది
అనుభవాలు పాఠంగా
ప్రపంచాన్ని చూపుతుంది
కష్టమంత తనదిగా
సుఖమంతా నీదిగా
కడుపులోన దాస్తుంది
భవిత బాట వేస్తుంది
చదువులతో పదవులతో
నీవెదిగితె పొంగుతుంది
పెళ్ళి చేసి తోడునిచ్చి
బాధ్యత నెరవేరుస్తుంది
నీ పిల్లలనెత్తి మురిసి
నీ చల్లని బ్రతుకు చూసి
తనివిచెంది తరిస్తుంది
తన తనువును విడుస్తుంది ". "
మాతృదినోత్సవ శుభాకాంక్షలతో అమ్మ కు అంకితం.
సింహాద్రి జ్యోతిర్మయి
టీచర్ @ OPS
13.5.2018


------------------------------------------------------------------------------------------
అమ్మకు వందనం అంటూ శ్రీ బూర దేవానండాం, సిరిసిల్లా నుండి ఇలా స్పందించారు
అమ్మ గర్భగుడిలో
నవమాసాలు పూజచేసి పొందాను ఈ రూపం
ఈ భువిపై కనులు తెరిచి
తొలినే చూశాను ఆ దేవత రూపం
అమ్మ అనే పదంలో అమృతముంది


అమ్మ చేతి స్పర్శలో స్వర్గముంది


అమ్మ ప్రేమానురాగాల ఒడి


ఆ దేవుడికైనా సేదతీర్చే చల్లని గుడి


అమ్మ అనే మాట


మనం పలికే తొలిమాట


అమ్మ పాడిన జోలపాట


మనం వినే తొలిపాట


ప్రతి గృహం దేవాలయం అయితే


అందులో కనిపించే దైవం అమ్మ


ప్రతీ మనిషి పూజించే


తొలి దైవం అమ్మ


అమ్మంటే ఆప్యాయత


అమ్మంటే ఆత్మీయత


అమ్మంటే ఆర్ధ్రత


అమ్మంటే ఆది దేవత


అమ్మ కరుణామయి


అమ్మ ప్రేమమయి


అమ్మ త్యాగమయి


అమ్మ అమృతమయి


పూరిగుడిసె లోని అమ్తైనా


అద్దాలమేడ లోని అమ్తైనా


తన బిడ్డపై చూపే


ప్రేమానురాగాలు ఒకే లాగుంటాయి


బాహ్యంగా అలంకరణలో


ఆస్తులలో అంతస్తులలో


తేడా కనబడవచ్చునేమోగాని


ప్రతి అమ్మ తనబిడ్డపై చూపే ప్రేమలో తేడా ఉండదు


అమ్మ చూపే ప్రేమను


ఆస్తులు అంతస్తులతో


తూచేది చూసేది కాదు


అమ్మను మించినది


అమ్మ కన్నా గొప్పనిది


ఈ ప్రపంచంలోనే లేదు


------------------------------------------------------------------------------------------------మిత్రులు పుష్యమి గారు whatsapp లో ఇలా స్పందించారు

ఆడపిల్ల ఒక అమ్మ


-------------------------------


అమ్మ...!


అది ఓ కమ్మనిపదం!


సురక్షితమైన..సుందరమైన..


జీవనపయనానికి


ఆలంబనగానిలిచే


అందమైన రధం!


జగన్మాత ఆయిన అమ్మేకదా ఈశృష్టికిమూలం!


ఆ అమ్మ లేనిదే ఈ లోకమే లేదుకదా!


ఒక్క విషయం గుర్తుంచుకో...


ఓ అమ్మలేనిదే...


మరో అమ్మరాదు.


అయితే...


ఈ కలికాలంలో-


సృష్టిప్రదాత అయిన


ఆ అమ్మకు అన్నీ అవరోధాలే.


అన్నీ అవమానాలే.


ఆడబిడ్డ-అనగానే


ఆవదం తిగినట్టు ముఖం...


మొదట తానెక్కణ్ణిచి


వచ్చానని ఆ లోచించలేని మూర్ఖత్వం..


అమ్మ లేకపోతే తానేలేననే సత్యాన్ని


తెలుసుకోని తెలివితక్కువతనం..


ఆవరించిఉన్నంతకాలం


అమ్మా ఒక ఆడదేనని


గ్రహించనంతకాలం...


ఇలా...


ఆడబిడ్డ అనగానే


కడుపులోనే తుంచేసే


దౌర్భాగ్యపు పరిస్థితికి


మంగళగీతం పాడలేం!


ఆలోచించాలి...


ఆడబిడ్డను ఈలోకానికి


ఆహ్వానించాలి!


ఆడబిడ్డను ఆదరించాలి!


ఆడపిల్లను గౌరవించాలి!


ఈ సృష్టి ఇలాగే కొనసాగాలంటే...


భ్రూణహత్యలు ఆపాలి.


స్త్రీజాతి ఎక్కడ గౌరవం


అందుకుంటుందో...


అక్కడ సౌభాగ్యం


వెల్లివిరుస్తుంది!


ఆడపిల్ల తల్లికి సాయం


తండ్రికి సౌభాగ్యం!


ఇంటికి కళతెచ్చేది...


చుట్టూ వెలుగులు నింపేది...


ఆడపిల్ల!


అంటే...


ఓ అమ్మ!


చేయకు...


ఆడపిల్లను చులకన!


అండగా..


నిలబడు ఆమెవెనుకన!
----------- పుష్యమి---
------------------------------------------------------------------------------------------------------------------------

సీ)


నిన్న రేపనికాదు
నేడు మాపనిగాదు౹
తీయనిబంధంబు
దినము దినము
*వయసు శైశవమేమి!
వార్ధక్యమదియేమి!
ఘనమైన కూరిమి
క్షణముక్షణము
*అన్నపానములిచ్చు
ఆరోగ్యమందించు౹
అమితానురాగంబు
అనవరతము
*చదువుసంధ్యలెగాదు
సంస్కారమున్ మప్పు౹
ఆజన్మవాత్సల్య
మపరిమితము
భారతీయసంస్కార
మప్రతిహతంబు
జననిపైజూపు మమతకు
"దినము" ఏమి!
వలదు పాశ్చాత్యవైఖరీ
వ్యసనగతులు
ప్రాణవాయువుగదతల్లి!
పాలవెల్లి!
తొమ్మిదినెలలుమోసి
నెత్తురునుపంచి
ప్రసవవేదనపిమ్మట
బయటపెట్టి
*మురిసి దీవించు
దేవతామూర్తి, నాదు
*నెమ్మదిని కమ్మనిది
అమృతమ్మదమ్మ!


------------------------------------------------------------------------------


మిత్రులు రాజేంద్ర గణపురం స్పందన

అమ్మ

. ......

..


సీ॥కన్నీటి కోర్చింది । కష్టాలు సైచింది
కన్న బిడ్డ కొరకే । కలలు కంది


పొట్టను కోసిన । పురుడోసు కున్నది


అమ్మగ నినుచూచి । హత్తు కుంది


నిదురకు నోర్చింది । నీవంటె ముర్సింది


ముక్కును కడిగింది । మోము గాను


చనుబాల నిచ్చింది । చక్కగఁ బెంచింది


కంటితో కాపల । కాచు కుంది


ఆ॥వృద్ధు రా,లనిపుడు । వృద్ధాశ్రమాలకు


పంపు సుతుఁడు యెంత । పాత కుండు


నర్సపురనివాస । నటరాజ ఘనమోక్ష


విశ్వకర్మ రక్ష । వినుర దీక్ష


.


.


. పద్య రచన


. రాజేందర్ గణపురం


. 13/ 05/ 2018


అందరకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు...!


చిత్ర దాత..Pvr Murty..గారు


--------------------------------------------------------------------------------------


శ్రీమతి వైదేహి కస్తూరి గారు whatsapp లో మాతృ దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలియజేసారు. చదవండి.తల్లుల దినోత్సవః వెనుక సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉంది. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు.


‘జూలియవర్డ్‌ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది. ఆమె 1905 మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్‌ జెర్విస్‌ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది.


1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమె రికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ.. అమ్మలగన్న పిల్లలారా.. తల్లులు తాకిన బిడ్డల్లారా.. వృద్దాప్యం మరో పసితనం. అమ్మను పిల్లలుగా చూసుకోవడం మాతృరుణం తీర్చుకునే అవకాశం. అమ్మను అక్కున చేర్చుకోవడం మనందరి కర్తవ్యం. వారిపై ఆత్మీయతను కురిపిద్దాం.. అమ్మలను మురిపిద్దాం.. మళ్ళీ మళ్ళీ మనల్నే కనాలని పరితపిద్దాం. తాను పస్తులుండైనా బిడ్డ కడుపు నింపే నిస్వార్థ ప్రేమ అమ్మకు తప్ప ఎవరికి సాధ్యమవుతుంది. వైకల్యం ఉన్న పిల్లలకు ఒంట్లో జీవం ఉన్నంత వరకు సేవలు చేస్తూ.. తన కష్టాన్ని అమృతంగా అందించే గొప్ప మనసు ఎవరికుంటుంది. బిడ్డ సంతోషం కోసం ఎంతటి కష్టానైనా ఎదుర్కొనేది.. ఎంతటి అవమానాన్నైనా భరించేది అమ్మ మాత్రమే. ప్రతి ఏడాది మే నెలలో వచ్చే రెండో ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటారు.

లోకంలో అందరికంటే మిన్న అమ్మ.. బిడ్డ కడుపులో పడడంతోనే తల్లిలో మాతృత్వం పొంగుకొస్తుంది. ఇక బిడ్డ భూమ్మీద పడింది. కుడి ఎడమ చేయి అన్న బేధం లేకుండా పిల్లల సేవలో నిమగ్నమై ఉంటుంది అమ్మ. ఆ ప్రేమను చాకిరీ అంటే పొరపాటే. ఆ సేవే తల్లికి సంతృప్తినిచ్చేది. జీవితం ధన్యమైనట్లు భావించేది అమ్మ. పాపాయిని కంటికి రెప్పలా కాపాడుకునేది అమ్మ. రాత్రిళ్ళు కూడా కలతనిద్రలో కనిపెట్టుకొని ఉంటుంది అమ్మ. కన్ననాటి నుంచి కడతేరే దాకా నిరంతరం ప్రేమను పంచుతుంది అమ్మ. ఆ అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమను పంచాల్సిన బాధ్యత మనపై ఉంది. అమ్మను ప్రేమిద్దాం.. ప్రేమ పంచుదాం.

భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ.. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. కానీ, నేటి అమ్మ ఆధునికతకు నిదర్శనంగా నిలుస్తోంది.

కొందరు అమ్మతనంలోని కమ్మదనాన్ని దూరం చేసుకుంటున్నారు. ‘నేడు మాతృదినోత్సవం’ సందర్భంగా తల్లులంతా ఒకసారి తమ బాధ్యతలు గుర్తుంచుకోవాలి. పిల్లల్ని కడుపులో పెట్టుకు చూసే నాటి అమ్మలను ఆదర్శంగా తీసుకోవాలి.

‘‘అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం...’’

అన్ని బంధాలకు వారధి కుటుంబ వ్వవస్థకు సారథిగా ఉంటూ తన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఎన్ని బాధ్యతలు ఉన్న తప్పున చేసిన పిల్లలను మొదట్లో దండిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ కుటుంబ వారథిగా, సారథి తల్లి నిలుస్తుంది.

ఒకప్పుడు వంటగదికి మాత్రమే పరిమితమైన అమ్మ బాధ్యతలు నేడు బహుళంగా పెరిగాయి. భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా, సమాజంలో అసమనతలు ఎండగడుతూ ఆరోగ్య సమాజ నిర్మాణానికి అనేక బాధ్యతలు చేపడుతుంది. బిడ్డల బాగుకోరుతూ, తను కష్టాలు పడుతూ వారిని కంటిరెప్పలగా కాపాడుకుంటూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్నపిల్లల బాధ్యత తండ్రి కంటే తల్లికే అధికంగా ఉంటుంది. అటు ఇల్లును చక్కబెడుతూనే... ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ...ఇటు చిన్నారుల విషయంలో కూడా శ్రద్ధ్ద తీసుకోవడంలో అమ్మదే ప్రధాన పాత్ర. పిల్లల విషయంలో ఆత్మసైర్థ్యం కలిగించాల్సిన పెను బాధ్యత కూడా ఆమెపైనే ఉంటుంది. పిల్లలు ప్రాణాపాయస్థితిలో ఉన్న సమయంలో తను ప్రాణాలను అర్పించైనా పిల్లలను కాపాడేందుకు సహించేది సృష్టిలో అమ్మ ఒక్కటే. తాను పస్తులుండైనా సరే పిల్లల కడుపు నింపుతుంది.

అమ్మను మించిన దైవం మరోకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా...చివరికి ఆమెను పట్టించుకోకపోయినా... క్షమించే గుణం అమ్మకు మాత్రమే ఉంది. తుదిశ్వాస విడిచే వరకు పిల్లల క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే.

ఇంతటి అపూరూపమైన అమ్మ కోసం మదర్స్ డేనుజరుపుకుందాం.సంవత్సరానికీ ఒకసారికాదు ప్రతీ రోజు జరుపుకొని మాతృమూర్తులను సంతోషంగా ఉంచుదాం."

----------------------------------------------------------------------------------------------------------------------------------------
Mother's Day అని ప్రపంచంలో పలుదేశాల్లొ జరుపుకుంటుంటారు. మన దేశంలో ఈ అంశంపై భిన్న వాదాలు ఉన్నాయి. ఎవరి అభిప్రాయాలు వారివి. ఈ విషయంలో whatsapp లో ఓ మిత్రుని స్పందన చూడండి ః

సంవత్సరానికి ఒక సారి మాతృదినోత్సవం అని జరుపుకోవడం ద్వారా ఆ ఒక్క రోజూ వృద్ధాశ్రమానికి వెళ్ళి అమ్మని పలకరించి వచ్చేవారు కొంతమంది, ఇంట్లో ఉన్న అమ్మకు ఏదో ఒకటి కొనేసి సరి పెట్టే వారు ఇంకొంత మంది.


ఏదో ఒక రోజని కాకుండా రోజూ మాతృ దినోత్సవం జరుపుకోవడం మన భారతీయ సాంప్రదాయం.

వేరే ఏ మతంలోనూ చెప్పని విధంగా సనాతనధర్మంలో తల్లి గురించి చాలా గొప్పగా చెప్పారు. వినాయక వ్రతకల్పంలో విఘ్నాధిపత్య వృత్తాంతంలో విఘ్వాధిపత్యం ఎవరికి ఇవ్వాలని శివపార్వతులు ఆలోచిస్తూ, ముల్లోకాల్లోనూ ఉన్న అన్ని తీర్థాల్లోనూ ఎవరు మొదట స్నానం చేసి వస్తారో వారికిస్తామని అంటారు. నెమలి వాహనం పైన ఎంతో వేగంగా వెళ్ళగలననే గర్వంతో కుమారస్వామి బయల్దేరతాడు. భారీ కాయం మరియు ఎలుక వాహనం మీద వేగంగా ఎలా వెళ్ళగలనని వినాయకుడు చింతిస్తూ కూర్చుంటాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి తల్లితండ్రులను మించిన తీర్థాలు ఏముంటాయని చెప్తూ తల్లి తండ్రులకు మూడు ప్రదక్షిణలు చేయమని సూచిస్తాడు. వినాయకుడు అలా చేయడంతో కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా అంతకు ముందే వినాయకుడు స్నానం చేస్తూ కనిపిస్తాడు. దాంతో ఆ ఆధిపత్యం వినాయకునికే అప్పగిస్తారు.

ఇక్కడ మనకు తల్లితండ్రుల గొప్పదనం ఏమిటో ఒక్క వృత్తాంతంలో తెలియ జేసారు.

తైత్తిరీయోపనిషత్తులో మాతృదేవోభవ అని అన్నారు. తల్లే దైవం అని దాని అర్థం.

గీతలో పరమాత్మ న మాతుః పరదైవతమ్ అని అన్నాడు. అంటే తల్లిని మించిన దైవం లేదని భావం.

తల్లి కాళ్ళకు నమస్కారం చేయడం కోటి యజ్ఞాల ఫలం. సనాతనధర్మంలో తల్లికున్న విలువ ఎనలేనిది. కానీ ఇతర దేశాల్లో ఈ విలువను తక్కువ చేసారు. కొన్ని మతాల్లో తల్లికి నమస్కరించడం నేరం. ఇంకొక మతంలో నాకంటే ఎక్కువ తల్లిని ప్రేమించరాదని దేవుడే అంటాడు.

భక్త పుండరీకుని అనుగ్రహించడానికి సాక్షాత్ పాండురంగడు వచ్చినపుడు నేను తల్లితండ్రులకు సేవ చేస్తున్నానని, అదయ్యే వరకూ వేచి యుండమని కృష్ణుని కోరతాడు పుండరీకుడు.

శ్రవణ కుమారుడు నడవలేని స్థితిలో ఉన్న తన తల్లి తండ్రులను తానే మోసాడు.

జగన్నాథుడైన కృష్ణుడు తన తల్లి యశోద యొక్క మాతృప్రేమను పొందాడు.

ఛత్రపతి శివాజీని వీరుని తీర్చిదిద్దింది తన తల్లి జిజియాబాయి.

సన్యాసం స్వీకరించిన యతీశ్వరులకు అన్ని మానవ సంబంధాలూ తెగిపోతాయి. ఒక్క మాతృసంబంధం తప్ప. అందుకే పీఠాధిపతులందరూ తమ తల్లులకు విధిగా నమస్కరించవలసినదేనని శాస్త్రం చెబుతోంది.

ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ సంస్కృతిలో తల్లి గొప్పదనానికి ఒక అంతం లేదు.

విదేశీయుల మాయలో పడకుండా, మన సంస్కృతి చెప్పిన విధంగా మన తల్లులను జీవించినంత కాలం, అలా జీవన అనంతంరం కూడా బాగా చూసుకుందాం. ఆ తల్లి రుణాన్ని తీర్చడానికి ప్రయత్నిద్దాం…..జై మాతా…….

ఇక్కడున్న మన వారిని గుర్తు చేసుకుని మన తల్లులను మనం గౌరవిద్దాం….ఈ ఒక్కరోజే కాదు…. ప్రతిరోజూ…

మధుర గాయని పి. లీల - P. Leela

మధుర గాయని పి. లీల జయంతి సందర్భంగా నా pencil చిత్రం. వ్యాసం 'విశాలాంధ్ర (16 July 2011)' సౌజన్యంతో సంగీతం వింటే మానసిక ప్ర...