14, జూన్ 2018, గురువారం

దుఃఖ మేఘ మల్హరి


దుఃఖ మేఘ మల్హరి - కవిత courtesy శ్రీ పాపినేని శివశంకర్ (అంతర్జాలం నుండి సేకరణ) - ఈ కవితకి నా పెన్సిల్ చిత్రం బాగుంటుందని జోడించాను. 

అప్పుడప్పుడూ శరీరం అశ్రువైతే మంచిది
ఆవేదనా దగ్ధమైతే మంచిది
సుఖించడమే అందరూ నేర్పారు
అన్ని పరిశోధనలూ భూమ్మీద మనిషి సుఖ పడడానికే చేశారు
ఏడ్పు-దిగులు-వేదన-విషాదం- విలాపం-దుఃఖం
మొదలైన మాటలన్నీ అంటరానివిగా తేల్చారు
ఇల్లు, ఒళ్ళు, చదువు, ఉద్యోగం, కారు, భార్య – అన్నే సుఖం కోసమే
దుఃఖమూ ఒక సత్యమేనని అందరికీ తెలీదు
గుండెలకాన విలపించడమూ తెలీదు
అప్పుడప్పుడూ దుఃఖాన్ని దయగా నీ పెంపుడు కుక్క పిల్లల్లే
దగ్గరికి తియ్యడం మంచిది
పూడిక తీసిన బావిలో నీరూరినట్లు కంట్లో నీరూరితే మంచిది
దు:ఖమంటే జ్వలన జలం – జలజ్వలనం
దుఃఖించే టపుడు నీ కళ్ళ వెనకాల లీలగా
ఒక కఠిన పర్వతం బొట్లు బొట్లుగా కరిగిపోతుంది
దు:ఖాంతాన నీ కళ్ళు నిర్మలమవుతాయి
నీ లోపల పరిశుభ్రమవుతుంది
నువ్వు వెలిమబ్బారిన ఆకాశమవుతావు
దు:ఖించిన వాడికే జీవితం అర్థమవుతుంది
దుఃఖం లేని ప్రపంచం అసంపూర్ణమవుతుంది
రెండు కళ్ళు రెండు అపురూప కార్యాల కోసం వున్నాయి
ఒకటి నీ దుఃఖం కోసం
రెండోది పరాయి దుఃఖం కోసం

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...