29, జూన్ 2018, శుక్రవారం

పొగాకు - పగాకు



వ్యాసానికి నా బొమ్మలు
పొగాకు- పగాకు (అంతర్జాలం నుండి సేకరణ - ఎవరు రాశారో తెలియదు. వారికి నా ధన్యవాదాలు)
'చుట్ట కాల్చబట్టే కదా దొరలింత గొప్పవాళ్లయినారు. చుట్ట కాల్చని యింగ్లీషువాణ్ని చూశావూ? చుట్ట పంపిణీ మీదనే స్టీము యం త్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా?' అంటూ కన్యాశుల్కంలో గిరీశం సెలవిచాడు. 'మీవల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే' అని వెంకటేశం తక్కువ చేసి మాట్లాడేటప్పటికి 'చుట్టకాల్చడంలో మజా' ఏమిటో ధర్మసూక్ష్మం వివరించేందుకు బృహన్నారదీయం దాకా వెళ్లిపోతాడు గిరీశం. ఖగపతి అమృతం తెచ్చేటప్పుడు పొంగి ఓ చుక్క భూమ్మీద రాలితే దాన్నుంచి పొగచెట్టు పుట్టిందంటూ గిరీశం దాని హిస్టరీ వివరిస్తాడు. అందుకే శ్రీశ్రీ 'ఖగరాట్‌ కృషి ఫలితంగా/ పొగాకు భూలోకమందు పుట్టెను గానీ/పొగచుట్టలెన్నియైనను/ సిగరెట్టుకు సాటిరావు సిరిసిరిమువ్వా!' అని పద్యమే చెప్పారు. ఈ చుక్క భూమ్మీద పడిందన్నాడే తప్ప భారతదేశంలోనే పడిందని చెప్పలేదు. కాబట్టి పోర్చుగీసు వాళ్లు క్రీస్తుశకం 1508లో టొబాకోని మన దేశం తీసుకువచ్చారని మనం నమ్మవచ్చు. పొగవచ్చేది, పొగనిచ్చేది కాబట్టి దానికి మనవారు పొగాకు అని పేరుపెట్టుకున్నారు. పొగాకును పగాకుగా పిలిచినా.. దీనికెంతో పరిణామక్రమం ఉంది. ఇప్పుడు సిగరెట్టు వెలిగించి గుప్‌గుప్పుమంటూ పొగమేఘాలు సృష్టించే పొగరాయుళ్లకు కొదవలేదు. వేళ్ల చివరలు చురుక్కుమనేదాకా సిగరెట్లను ఉఫ్‌మంటూ ఊదేయడం దమ్ము పీల్పు గాళ్లకు కొట్టినపిండి! సమయం, సందర్భం, స్థలంతో పనిలేకుండా సిగరెట్లు వెలిగించే చైన్‌స్మోకింగ్‌లు మనలో చాలామంది ఉన్నారు. డిమాండును గుర్తిం చడంలో మన ప్రభుత్వాలకు మించినవేవీలేవు. ఏటా బడ్జెట్‌లో సిగరెట్లపై భారీ వడ్డనలతో ఖజానాకు పెద్దమొత్తం జమచేసుకొంటున్నాయి. తొలినాళ్లలో జరిగిన అచ్చు తప్పు ఇప్పుడు పాలకులకు వరంగా మారింది. సిగరొత్తులు అని ఉండాల్సిందిపోయి సిగరెట్లుగా పడింది.. పొగాకు రాకముందే మనకు పొగపీల్చే అలవాటు ఉందనే చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అక్బర్‌ కాలంలోనే ధూమపా నంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పొగాకును ప్రమాదకరమైన కలుపుమొక్కగా జహంగీర్‌ పేర్కొన్నాడు. కొందరు మొగలాయి పాదుషాలు పొగాకు సేవనాన్ని నిషేధించి నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.


బ్రిటీష్‌వాళ్ల నుంచి మనవాళ్లు ముక్కుపొడుం పీల్చడం నేర్చుకున్నారు.. అదీ పండితప్రకాండులే లెండి. ఇంగ్లీషువాళ్లకు సంబంధించినదేదైనా గొప్పదేనని సురేంద్రనాథ్‌ బెనర్జీ అంతటి వాడు శ్లాఘించాడు ఏ నేషన్‌ ఇన్‌ ది మేకింగ్‌ పుస్తకంలో. అందుకే 'నస్యం పండిత లక్షణం' అన్నారు. వార్ని చూసి మధ్యతరగతి జీవులు కూడా పొడుండబ్బా తీసి ఓ పట్టుపట్టేవారు. అగ్నిహోత్రావధాన్లు పొడుం కోసం కొట్లో పొగాకు నిల్వ చేసేవాడు. కాలక్రమంలో ముక్కుపొడుంను సిగార్స్‌, చుట్టలు చుట్టచుట్టేశాయి. కోవెలలో చుట్టకాల్చడంలో ఉన్న మజా ఏమిటో కడుపునిండిపోయేటట్టు చెబుతాడు గిరీశం. చర్చిల్‌నో, చాసోనో గుర్తుకు తెచ్చుకొంటూ దర్జాగా చుట్టకాల్చే భూస్వాములు, పెత్తందారులు లేని ఊరుండేది కాదు. ఆ తర్వాత చుట్టల పరువు కూడా లుంగచుట్టుకుపోయి సిగరెట్లు వచ్చాయి. 'సరదా సరదా సిగరెట్టూ యిది దొరల్‌ తాగు భల్‌ సిగరెట్టు' అంటూ సినీకవి గానం చేశారు. ఈవేళ సిగరెట్టు ముట్టించని కుర్రోళ్లు చాలా అరుదుగానే కని పిస్తారు. కుర్రోళ్లే కాదు, పబ్బులు, క్లబులు తిరిగే అమ్మాయిలూ మాకు దమ్ములాగే దమ్ముందని పోటీపడుతున్నారు. అయితే ధూమపానం దురలవాటన్నారు మన పెద్దలు. మృత్యుమార్గం అంటున్నారు నేటి వైద్యనిపుణులు. అయినా సిగరెట్‌, బీడీ, చుట్టలకు గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. 'పదపడి ధూమ పానమున బ్రాప్తములౌ పదమూడు చేటులన్‌' అంటూ పూర్వకవి సిగరెట్ల వల్ల వచ్చే పదమూడు ఆపదలను వివరించారు. యువతీయువకులకు సిగరెట్‌ ఓ వ్యసనంగా మారింది. దీన్ని వ్యసనంగా మన పూర్వీకులు ఎంచలేదు. 'వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబును దండంబు పరుసదనము' అంటూ వ్యసనాలను ఏడు రకాలుగా విభజించి సప్తవ్యసనాలు అన్నారు. ఇప్పుడు సప్త బదులు అష్ట వ్యసనాలు అని చెప్పడం బాగుంటుంది. అదీ ఎంతగా మారిందంటే..'సీమ దేశాన బుట్టి మా దేశ మొచ్చినావు, ఉత్తర భూములందు ఉదయమయినావు, దక్షిణ భూములకొచ్చి ధన్యుల మము చేసినావు, నీ మహిమ వర్ణింప నెవరితరమమ్మా' అంటూ పొగాకును వేనోళ్ల పొగిడేంతగా! సిగరెట్టు వ్యసనం ఎంతటి ప్రమాదకరమో ఓ చిన్న ఉదాహరణ చూడండి. జమ్మూ- కాశ్మీరు ఆరోగ్యశాఖ రిటైర్డు డైరెక్టర్‌జనరల్‌ డాక్టర్‌ అలీబక్ష్‌ 30 సిగరెట్లు కొనుక్కోవడానికి లక్షన్నర రూపాయలు తగలేశారు. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఆయన్ని కాశ్మీరు తీవ్రవాదులు కిడ్నాప్‌ చేసి రెండు రోజులు బందీ చేశారు. సిగరెట్‌ కాల్చకుండా నిమిషం బతకలేని అలీబక్ష్‌ తీవ్రవాదులతో ఓ బేరం కుదుర్చుకున్నారు. ఒక్కో సిగరెట్‌కు రూ.5000 చెల్లించి తీవ్రవాదుల నుంచి సిగరెట్లు పొందారు. ఆయన 30సిగరెట్లు కాల్చి లక్షాయాభైవేలు వదిలించు కున్నారట. మనవాళ్ల గొప్పలు ఇలా ఉన్నా.. సిగరెట్లు మాత్రం జనం ఆరోగ్యానికి పొగబెడుతున్నాయి. ముందు సరదాగా, తర్వాత వ్యసనంగా మారి ఇంటిని, వంటిని కాల్చేసుకుంటున్నవారి సంఖ్య దేశంలో నేడు కోట్లలోనే ఉంది.
ముళ్లపూడి 'తనను తాను చంపుకొంటూ, ఎదుటివాణ్నీ చంపడానికి మనిషి కనిపెట్టిన మారణాయుధం సిగరెట్‌' అని ఓ డైలాగ్‌ వదిలారు. ఖజానా నింపుకోడమే లక్ష్యంగా ఉన్న పాలకులు మాత్రం సిగరెట్‌ పెట్టేలపై 'సిగరెట్‌ కాల్చడం ఆరోగ్యానికి హానికరం' అని చట్టబద్ధ హెచ్చరికలతో సరిపెడు తున్నారు. మన దేశంలో సిగరెట్‌, బీడీ, చుట్ట, హుక్కా తాగినా.. గుట్కా, పాన్‌ పరాగ్‌, ఖైనీ, జర్దా వంటివి నమిలినా, మరేవైనా పొడిరూపంలో పీల్చినా.. వెరసి పొగబారిన పడి ప్రాణాలు కోల్పో తున్న వారిసంఖ్య ఏటేటా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో నమోదవుతున్న కేన్సర్‌ కేసుల్లో 66శాతానికి పొగాకే కారణం. గుండె సంబంధిత వ్యాధులతో చని పోయేవారిలో 85శాతం ధూమపానమే కారణమని వైద్యపరిశోధన మండలి తేల్చింది. నోటి కేన్సర్‌ మరణాల్లో 90శాతం పొగతాగడం, ఆ ఉత్పత్తులు నమలడమే కారణమని ప్రజారోగ్య పౌండేషన్‌ పేర్కొంది. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 60లక్షలమంది, మన దేశంలో పది లక్షలమంది విగతజీవులవుతున్నారు. పొగ పీల్చేటప్పుడు గుండె నిమిషానికి పదినుంచి20సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. అంతేకాదు, ప్రతిసారీ 15నుంచి 20శాతం వరకు రక్తపోటు పెరుగుతుంది. పొగాకు ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని శిక్షార్హ నేరంగా ప్రకటించినా, అది అమలు కావడంలేదు. గుట్కాపై చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. పొగాకు ఉత్పత్తుల విక్రయం, వినియోగంపై పంజాబ్‌, చండీగఢ్‌లో నిషేధించారు. దేశంలో మొట్టమొదటి పొగాకు రహిత జిల్లాగా కేరళలోని కొట్టాయం నిలిచింది. నాగాలాండ్‌ రాజధాని కోహిమా ప్రాంతంలోని గరిపెమా, హర్యానాలోని శంకరపుర గ్రామాల్లో కూడా పొగతాగడంపై ప్రజలే స్వచ్ఛందంగా నిషేధం విధించుకొన్నారు. పగ తగదంటూ 'భారతం'లో చెప్పిన పద్యాన్ని కొద్దిగా మార్చి 'పొగ అడగించుటెంతయు శుభంబు..' అని చెబితే ధూమపానప్రియులకు నచ్చడంలేదు.
( సేకరణ - విశాలాంధ్ర newspaper 2nd April 2016)

కామెంట్‌లు లేవు:

టి. జి. కమలా దేవి సినీ నటి, స్నూకర్ క్రీడాకారిణి

  టి. జి. కమలాదేవి - my  charcoal pencil sketch, slide created by me.  టి.జి.కమలాదేవి   ( డిసెంబర్‌ 29 ,   1930   -   ఆగస్టు 16 ,   2012 ) (...