వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన " ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ-
పదము లివి రెండు సంపదలు సౌఖ్యములు"
విశ్లేషణ : డా. Umadevi Prasadarao Jandhyala గారు
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi గారు
~~~~~~~
~~~~~~


ప్రార్థన
~~~~~~
సీ॥
కమ్మతావులనీను కస్తూరి తిలకంబు మోము చందురునందు ముద్దుగుల్కఁ
గోటి సూర్యప్రభన్ నీటు మీఱెడు తేజు గల కౌస్తుభంబు వక్షమునఁ గ్రాల
నమృతబిందువు లీల నలరుచుండెడు
నాణి
ముత్తెంబు నాసాగ్రమునను వ్రేల
దరమధ్యముననుండి ధారగాఁ బడురీతి
నల ముత్తెముల సరు లఱుత మెఱయఁ
తే.గీ
గరజలజముల రత్నకంకణము లలరఁ
దనువు నెల్లెడ రక్తచందనము దనర
మురళిఁబాడుచు నాడెడు పుణ్యశీలు
భక్తపరిపాలు వేణుగోపాలుఁగంటి!
( వేణుగోపాల శతకం)


~~~~~~~~~
(॥పల్లవి॥)
ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ-
పదము లివి రెండు సంపదలు సౌఖ్యములు
(॥ఎదు॥)
1)గోపికానాథ గోవర్ధనధరా!శ్రీపుండరీకాక్ష జితమన్మథా!పాపహర సర్వేశ పరమపురుషాచ్యుతా!నీపాదములే మాకు నిధినిధానములు
(॥ఎదు॥)
2)పురుషోత్తమా !హరీ !భువనపరిపాలకా! కరిరాజవరద శ్రీకాంతాధిప!మురహరా సురవరా ముచుకుందరక్షకా!
ధరణి నీపాదములె తల్లియును దండ్రి
(॥ఎదు॥)
3)దేవకీనందనా దేవేంద్రవందితా!కైవల్యనిలయ సంకర్షణాఖ్య!శ్రీవేంకటేశ్వరా జీవాంతరాత్మకా!
కావ నీపాదములె గతి యిహముఁ బరము



———————————————
శ్రీవారిపాదాలను కీర్తిస్తూ అన్నమయ్య వ్రాసిన పాటలలో ఒకటైన”ఎదురేది ఇంక మాకు ఎందుజూచిననూ…”అనే కీర్తన విశేషాలు తెలిసినంత వివరిస్తాను.
ఓ వేంకటపతీ నీ పాదయుగళిని సేవించే మాకిక ఎదురున్నదా? ఎందుకంటే అవే మాకు సంపదలు … సౌఖ్యప్రదాతలు!
1)మొదటి చరణంలో స్వామి వారికి వాడిన పదాలలోనే ఆ జగన్నాధుని విశేషమంతా కనబడుతుంది..
గోపికావల్లభా! గోవర్థనగిరి ధారీ!పుండరీకాక్షా! మన్మధునే జయించినవాడా!సమస్త పాపములను పోగొట్టే వాడా! పరమ పురుషా!అచ్యుతా! నీ పాదాలే మాకు నిధినిక్షేపాలు!
*ఎవరీ గోపికలు? వీరందరికీ ఆయన హృదయనాథుడై ప్రేమనెందుకు పంచాడు?
కృతయుగంలోని ఋషులు, త్రేతాయుగంలోని వానరులు ద్వాపర యుగంలో గోపికలైనారంటారు. ఋషులుగా ఉన్నప్పుడు తపస్సువలన దర్శనం వరకే లభించింది. ఆ పుణ్య విశేషం వలన
త్రేతాయుగంలో పరమాత్మతో కలిసి తిరుగుతూ మాట్లాడే భాగ్యం దొరికింది. ఇక ద్వాపర యుగంలో వారి కోరిక ఫలించి ఆయన ప్రేమను పొంది ఆలింగన భాగ్యాన్ని అందుకో గలిగారు. జీవాత్మ పరమాత్మకు చేరువ కావడానికి ఒక్కొక్క మెట్టూ ఎదగడం కనిపిస్తుంది… మనకు!
*గోవర్థన గిరిని ఎత్తిన ఘట్టంలో” ఇంద్రుని పూజించడం కన్నా గోవర్థన పర్వతాన్ని పూజించి , గోవులకు మంచి మేత పెట్టి వాటిని సంతోషపరచండి” అని కృష్ణుడు నందాదులకు చెబుతాడు। ఇంద్రుడు యాదవులపై కోపించి రాళ్ళవాన కురిపించినప్పుడు తన చిటికెన వ్రేలిపై గోవర్థన గిరినెత్తి గోవులను, గోపకులాన్ని కాపాడాడు . సమస్త దేవతలు కొలువైన గోవును మించిన దైవం లేదని, గోరక్షణ వలననే లోకరక్షణ జరుగుతుందనే సందేశం ఈ ఘట్టంలో ఉన్నది.
*అచ్యుత= చ్యుతి లేని వాడు. శాశ్వతుడు
*ఇక పుండరీకాక్ష పదం పవిత్రతకు సంకేతం పుండరీకాక్ష అనిముమ్మారు స్మరిస్తే అపవిత్రం పవిత్రమౌతుంది.
పుండరీకపు రేకలు విచ్చుకోవడం ఆత్మవికాసానికి సంకేతం. ఆ శ్రీహరి కనులు విచ్చుకున్న పుండరీకములు.
2)
స్వామీ! నీవు పురుషోత్తముడవు! లోకములను పరిపాలించే జగత్పతివి! గజేంద్రుని రక్షించిన వాడివి! లక్ష్మీ పతివి! ముచుకుంద మహర్షిని బ్రోచిన వాడివి . ఈ భూమిలో నీ పాదాలే మాకు తల్లీ తండ్రీ!
*నీవే దిక్కని నమ్మి శరణుగోరితే గతజన్మల పాపాలను తొలగించి శాపాలను బాపగల పరమాత్మ అనడానికి నిదర్శనం గజేంద్రమోక్షం.
*సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి పతి!
*దుష్టశిక్షకుడు( మురహరి)!
*తాను నేరుగా సంహరింపగల అవకాశం లేనప్పుడు లౌక్యంగా శత్రుసంహారం చేయగల తంత్రజ్ఞుడు!
ముచుకుందుడనే మహామునిని సాధనంగా వాడుకొని కాలయవనుడనే రాక్షసుని సంహరింపజేయడమే ఉదాహరణ!
3)
దేవకీ సుతుడవు! దేవేంద్రునికి పూజ్యుడవు! మోక్ష ధాముడవు! సంకర్షణ నామం కలవాడవు! నీవే జీవులలో అంతరాత్మవు. నీపాదములే మాకు ఇహ పరసాధకములు!
*హరికి సంకర్షణుడనే నామం ఉంది. అనగా ఆకర్షించే వాడు. లేదా ఆకర్షింపబడేవాడు. సంకర్షణుడంటే బలరాముడు.
మహావిష్ణువులోని శ్వేతవర్ణం కలుపుకొని ఆదిశేషుడు బలరాముడు కాగా, నీలవర్ణం కృష్ణుడిగా ఏర్పడ్డాయని కొన్ని గ్రంథాలలో ఉంది. దేవకీదేవి సప్తమగర్భసంకర్షణం తో బలరాముడు రోహిణి గర్భంలో చేరడం వలన కూడా సంకర్షణుడనే పేరు వచ్చింది.జీవులందరిలోనూ ఆత్మస్వరూపం ఆ పరమాత్మే! అటువంటి శ్రీమహావిష్ణువే కలియుగదైవం ఏడుకొండలస్వామి. ఆ శ్రీవారి దివ్య చరణార విందాలను శరణు కోరుదాం!
స్వస్తి

చం॥
బరువడినీదుపాదములె ప్రాపనినమ్మితినిక్క_మిత్తరిన్
బరులను వేడనొల్ల నిక బాలను ముంచిన నీటముంచినన్ నెరవగుగాక నీకయని నెమ్మది నెంచెతి నస్మదార్య నిర్భరనిరుపాధిక (ప్రణయ వైభవ మేర్పడఁ గంటి నచ్యుతా!
( అచ్యుత శతకం నుండి)
~~~~~।~~।~~~~~~
డా.ఉమాదేవి జంధ్యాల
చిత్రం-శ్రీ Pvr Murty
డా. బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ కీర్తనని అద్భుతంగా గానం చేశారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి