9, డిసెంబర్ 2021, గురువారం

వారం వారం అన్నమయ్య -- త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా

 



వారం వారం అన్నమయ్య -- 'త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజన్నాధ..

చిత్రాలు Pvr Murty
భావం / విశ్లేషణ Dr. Umadevi Prasadarao Jandhyala
సహకారం : Ponnada Lakshmi
~~~~~~~~~~~~~~~~~~~~~
హరి స్తుతి 🙏
—————————-
ఉ॥ ( భాగవతం)
తో యరుహోదరాయ!భవదుఃఖహరాయ !నమో నమః!పరే
శాయ!సరోజకేసర పిశఙ్గ వినిర్మల దివ్య భర్మ వ
స్త్రాయ!పయోజ సన్నిభ పదాయ! సరోరుహ మాలికాయ!కృ
ష్ణాయ!పరాపరాయ!సుగుణాయ! సురారిహరాయ! వేధసే.!
*కీర్తన 👇🏿
~~~~~~
త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా ॥
వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా ।
భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా ॥
బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద ।
సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా ॥
వటపత్రశయన భువనపాలన జంతు- ఘటకారకరణ శృంగారాధిపా ।
పటుతర నిత్యవైభవరాయ తిరువేంకటగిరినిలయ జగన్నాథా ॥
భావ సౌరభం👇🏿
~~~~~~~~
ఓ వేంకటపతీ! శ్రీనివాసా! ఓ లోకాధీశ్వరా! నీవే శరణు !(నీవు మాత్రమే రక్షింపగలవాడివి)
‘అన్యధాశరణం నాస్తి ! త్వమేవ శరణం మమ’అని ఆ అచ్యుతుని అంఘ్రికమలములనాశ్రయించడానికి ఆయనలో గల విశేషణాలను కొన్ని మననం చేసుకుంటున్న కీర్తన ఇది!
స్వామీ!నీవు వసుదేవుని సుతుడవైన వాసుదేవుడవు!
వామనుడవు! పొట్టిగావటువురూపంలో
వచ్చి త్రివిక్రముడిగా ఎదిగిన నీకు ఆకాశం నీ అడుగంత! భూమి రెండవ అడుగంత !
పురుష సింహుడవైన నీవు దుష్టసంహరణార్థం నరసింహునిగా అవతరించావు.
సంపదకు ప్రతీక అయిన లక్ష్మీ దేవికి పతివి!
పద్మపత్రములవలే నీకళ్ళు అందమైనవి .. విశాలమైనవి!
కృష్ణావతారంలో ఆదిశేషునికి అగ్రజుని స్థానమిచ్చిన విశాలహృదయుడవు!
పాలకడలిలో నీ విహారం!
కరిరాజును బ్రోచిన కరుణామూర్తివి!
భక్త సులభుడవు!
సోదరి సుభద్రకు ప్రీతిపాత్రుడివి!
దేవదేవుడివి!
కలియుగ దోషాలను పోగొట్ట గలవాడివి.
వటపత్రశాయివి! ( ఊర్థ్వ మూలమూ అధోశాఖలూ గల ఆధ్యాత్మిక భావ ప్రతీక అయిన మఱ్ఱి ఆకుపై పవళించిన వాడు.)
ఘటనాఘటన సమర్థుడవు!
( ఘటము= కుండ … కుమ్మరికుండ చేసినట్లు నీవీ లోకములలో సమస్తమూ తయారు చేయగలవాడివి)
రసరాజమైన శృంగారానికి అధిపతివి !
అటువంటి పరమపురుషుడవైన నీకి నిత్యమూ నీకు ఎనలేని వైభవమే!
శుభకరమైన సప్త గిరులే నీకు నివాసము! తిరుమలగిరి రాయా జగన్నాధా! శరణు శరణు!
పరమాత్మ లీలా విశేషాలు అనేకం!
ఈ కీర్తనలో పరమాత్మ సర్వ వ్యాపకత, సర్వ కారకత్వము, కరణత్వము, వాత్సల్యము, దక్షత, ఆర్త త్రాణ పరాయణత్వము, అందరినీ ఆనందింపజేసే కృష్ణత్వము, సుముఖత, సులభసాధ్యమైన స్వభావము, మహిమ, సమర్థత ఇత్యాది అద్భుత గుణములు మనకు కనబడతాయి. తరచిన కొలది ఎన్నో పారమార్థికమైన సత్యాలను దాచుకున్న కీర్తన ఇది!
ఉ॥( ఉమాదేవి)
వామన! వాసుదేవ!కరిబాధను దీర్చిన భక్తవత్సలా!
ప్రేమగలట్టి సోదరుడ వీవు సుభద్రకు నెల్లవేళలన్
భూమిన ధర్మరక్షణకు బుట్టుచునుందువు పెక్కుభంగులన్
శ్రీమల వేంకటేశ్వరుడ! శ్రీనరసింహుడ! నీకుమ్రొక్కెదన్!
~~~~~~~~~~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...