16, మార్చి 2026, సోమవారం

నిందాస్తుతి - కథానిక


 కథా  శీర్షిక: "  నిందా స్తుతి" 


స్వీయ రచన, ప్రముఖ పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ Pvr MurtyMoorthy గారి బొమ్మకు కథ- భవాని కుమారి బెల్లంకొండ కథానిక.  


""ఎందుకో ఆ నవ్వు"


అటు తిరిగి ఉన్న సుహాసిని పెదవులపై ఒక సన్నని  హాసరేఖ కదలాడింది ఆ ప్రశ్నకి.


రవిచంద్ర అదే ప్రశ్న మళ్ళీ రెట్టించాడు 


"పేరు సుహాసిని  అయినందుకా ఆ నవ్వు "భార్య భుజం మీద చేయి వేస్తూ అన్నాడు రవిచంద్ర 


జవాబు చెప్పలేదు సుహాసిని మళ్ళీ అటు తిరిగి  అదే సన్నని నవ్వు నవ్వింది.


" నాకు తెలుసు నీకు నవ్వెందుకొస్తుందో , అందగత్తెవి కదా అందుకు, అలనాటి నటి బి. సరోజా దేవి మించిన అందం కదా నీది,  పైగా ఈ తెలి పూల నీలం రంగు చీరలో పివిఆర్ మూర్తి చిత్రానికి ప్రాణం పోసినట్టుగా ఉన్నావు కదా! అదీ నీ గర్వం   అనుకుంటా" అన్నాడు రవిచంద్ర.


జవాబు చెప్పకుండా మళ్లీ నవ్వింది సుహాసిని.


" సరే! నా సంగతేమిటి? అందంగా లేనా ఈ పంచ కట్టులో, అసలేం బాలేనా ఈ మీస కట్టులో "అన్నాడు గమ్మత్తుగా రవిచంద్ర.


 అప్పటికి నోరు విప్పింది సుహాసిని,  "నేనన్నానా పంచ కట్టలో బాగా లేరని" అన్నది.


 "అయినా నీకు చాలా గర్వంలే, గంధర్వకన్య లా  ఏ ఆభరణాలు ధరించకపోయినా, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా  అందరి కళ్ళు నీ మీదే అన్న గర్వం నీకు" అన్నాడు రవిచంద్ర.


 "ఎందుకు నవ్వానో  చెప్పకపోతే ఇవాళ ఫంక్షన్ కి బయలుదేరరా" అన్నది సుహాసిని కనుబొమ్మలు ముడిచి." అయినా "సిసిఎంబి" (CCMB) లో సైంటిస్ట్ కదా మీరు , ఇలా పంచ కట్టులో ఫంక్షన్ కి వస్తారని ఎవరు ఊహిస్తారు?" అన్నది నవ్వుతూ సుహాసిని.


" ఓహో!  సైంటిస్ట్ అయితే, ఇంక వాడు  పిచిక గూడుగా అయిపోయిన తెల్లని జుట్టుతో, గాంధీ గారి కళ్ళజోడుతో, పిచ్చి చూపులు చూస్తూ కనిపించాలన్నమాట! లేకపోతే రంగు రంగుల పిచ్చి పూల  బుష్ షర్ట్ వేసుకొని ఉండాలన్నమాట అంతేనా" అన్నాడు.


 "మహాప్రభో! నేను అలా ఏమీ అనలేదు ఈ పంచ కట్టులో  పెళ్లిరోజు ఎంత అందంగా ఉన్నారో,  ఈరోజు అంతే వున్నారు  మహానుభావా, అయినా మన జంటని అంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు గా" అన్నది.


 "అయినా నువ్వు పెద్ద మోసగత్తెవిలే" ఆనాడు రవిచంద్ర కవ్విస్తునట్టుగా.


"నేనా, నేనేం మోసం చేశాను మిమ్మల్ని?" అన్నది చిరుకోపంగా. 


"పెళ్లి చూపుల్లో  ' నా చదువుకు తగ్గ జాబ్ తప్పకుండా చేస్తాను అన్నావు, ఇప్పుడేమో హాయిగా ఇంట్లోనే కూర్చుని, నా కళ్ళు బైర్లు కమ్మేలా తళుకు లీనుతూ , నా మతి పోగొడుతున్నావు, అసూర్య పశ్యవై" రోజు, రోజుకీ మెరిసిపోతున్నావు" అన్నాడు గొప్ప పారవశ్యం తో.


"అవును, పెళ్లికి ముందు అవసరమైతే చేద్దామనుకున్నా, కానీ పెళ్లయ్యాక అయ్యగారు ఎంత పెద్ద సైంటిస్ట్    అని తెలిసి, ఇంకెందుకు నేను కష్టపడటం అనుకొని జాబ్ గురించే ఆలోచించటం మానేశా, అయ్యగారు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన దగ్గర నుండి ఆ మైక్రోస్కోప్లో కళ్ళు పెట్టి, ఏం పరిశోధనలు చేసి అలసిపోయి వస్తారోనని ని ఇంటికి రాగానే అలసట పోయేలా స్వాగతిస్తుంటే, మోసం చేశా నని నా మీద నింద వేస్తారా"  కినుకగా అన్నది సుహాసిని.


రవిచంద్ర నవ్వేశాడు, " అయితే నీకు దీటుగావున్నానంటావు, ఈ పంచ కట్టులో  నేను చాలా బాగున్నాను అంటావు, అంతేనా"


" అంత లేదులెండి, దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పంచ కట్టులో వున్న అందం ఇంకెవరికి రాదు లెండి" అన్నది నవ్వు దాచుకుంటూ.


" అంటే నేను ఆయన అంత అందగాడిని కాదంటావ్, అంటే నీ ఉద్దేశం సైంటిస్టులు గడ్డం పెంచి, పిచ్చిపిచ్చిగా ఉండాలం టావు, నాలా రొమాంటిక్ గా ఉండకూడదా" కొంటెగా ప్రశ్నించాడు. 


 సుహాసిని నవ్వుతూ, " ఇంక ఆపండి మహానుభావా, పెళ్లిరోజు ఎంత అందంగా ఉన్నారో,  ఇద్దరు బిడ్డల తండ్రయినా, ఈరోజు కూడా అంతే బాగున్నారు. మీరెంత  రొమాంటిక్ మనిషో  నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? మీ  మాటలు ఎవరైనా వింటే నన్ను మాటలతో ఏడిపిస్తున్నారనుకొంటారు,  ఇంక బయలుదేరండి   మహాప్రభో, ఫంక్షన్ కి లేటవుతోంది" అన్నది సుహాసిని ముందుకు అడుగేసి. 


(సమాప్తం )"

కామెంట్‌లు లేవు:

నిందాస్తుతి - కథానిక

 కథా  శీర్షిక: "  నిందా స్తుతి"  స్వీయ రచన, ప్రముఖ పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ Pvr MurtyMoorthy గారి బొమ్మకు కథ- భవాని కుమారి బెల్లం...