3, నవంబర్ 2020, మంగళవారం

"సాని - దొరసాని" - విశ్వనాధ వారి చమత్కారం


కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ


 తెలుగు జాతికి మొదటి జ్ఞానపీఠ్ ను తెచ్చిన ఘనుడు - నా pencil చిత్రం

సాని - దొరసాని (courtesy : post by Smt. Vijaya Durga in facebook)


సాహిత్యమరమరాలు
సురవరం ప్రతాపరెడ్డి ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకు కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సదుద్దేశంతో ఆయనను ఒక సంస్థానాధీశురాలి దగ్గరికి తీసుకెళ్లారు. నాడు సంస్థానాధీశులకు సివిల్, క్రిమినల్‌ అధికారాలు ఉండేవి. నాటి మర్యాదలను అనుసరించి ఆమె పరదాకు ఆవైపు, ఇవతలివైపు విశ్వనాథ కూర్చున్నారు.
‘‘మీరు చాలా సంప్రదాయికులనీ, మంచి కవిత్వం వ్రాస్తారనీ విన్నాను. కానీ మీరు ‘సాని’ పాటలు కూడా వ్రాశారేమిటండీ?’’ అని ప్రశ్నించిందామె.
ఆమె తన ‘కిన్నెరసాని’ పాటలను గూర్చి అడుగుతున్నదని విశ్వనాథకు అర్థమైంది. ‘‘అమ్మా! అది ఈ ప్రాంతంలో ఒక వాగు పేరు. ఆ పేరుతో పాటలు వ్రాశానే గాని, వాటిల్లో ఎలాంటి అశ్లీలమూ లే’’దని ఎంతచెప్పినా ఆమె వినిపించుకోలేదు. ‘మీరు ఎన్నైనా చెప్పండి సాని సానే’ అని ముక్తాయించింది. ఇది విశ్వనాథ అహాన్ని దెబ్బ తీసింది. ‘‘అమ్మా, ఇందాకటినుంచీ పనివాళ్లు మిమ్మల్ని దొరసానీ! అని పిలుస్తున్నారు గదా, దాని సంగతేవిటి? ఇక వస్తాను, సెలవు’’ అని లేచి వచ్చేశారు.
ఇది చూస్తున్న ప్రతాపరెడ్డి, ‘‘ఎంతపని చేశావయ్యా, ఆమె కోపిస్తే ఏమైనా చేయవచ్చు’’ అన్నారట. అందుకు విశ్వనాథ, ‘‘ఆ ఏం చేస్తుంది, చంపుతుందా? నిజం చెప్పడానికి భయపడటం కన్నా చావడమే నయం’’ అన్నారట. అప్పుడు ప్రతాపరెడ్డి నవ్వుతూ, ‘‘ఏది ఏమైనా మీరీ వేళ నూటపదహార్లు పోగొట్టుకున్నారు’’ అన్నారట.
అందుకు విశ్వనాథ ‘‘నా అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోలేదు, అదే నాకు పదివేలు’’ అన్నారట.
(పురాణంవారి ‘విశ్వనాథ ఒక కల్పవృక్షం’ ఆధారంగా)

ఇక సాని అంటే ఏమిటో చూద్దాం..
సాని అనే పదం మనకు సుపరిచితమే కానీ దాని అర్థం మాత్రం
మనకు వేరుగా వ్యవహారంలో గమనిస్తాం.
సాని అంటే సంపూర్ణ సంగీత పరిజ్ఞానం కలది అని.
స - నుండి ని - వరకు పరిపూర్ణ సంగీత పాండిత్యాన్ని సంపాదించుకొన్న
గంధర్వాంగనకు సాని అని బిరుదునిచ్చేవారు.
ఈ బిరుదుపొందిన ప్రథమ సంగీత విద్వాంసురాలు రంభయే అయి ఉండాలి.
తరువాత కాలంలో సాని అనేది ఒకబిరుదుగా ఉండేది.
ఈ బిరుదును సంపాదించుకోవడానికి ప్రతి దేవనర్తకి ఎంతో కష్టపడాల్సివచ్చేది.
కొందరు రాణులకు గౌరవప్రదంగా ఈ బిరుదు ఉండేది.
పిల్లలమర్రిలోని ఎరుకలేశ్వరునికి దేవాలయం కట్టించిన
బేతరాజు భార్యపేరు ఎర్రక్కసాని.
ఎరుకలసాని, మంత్రసాని, దొరసాని అనే పదాలు
గౌరవప్రదమైనవే కాని నీచమైనవికావు.
రానురాను ఈ పదం విశిష్టత అంతరించి కళంకాన్ని ఆపాదించే
నీచమైన అర్థంగా మారిపోయింది.

(ఈ సమాచారం డా. నటరాజు రామకృష్ణ గారి రుద్రగణిక నుండి.)


కామెంట్‌లు లేవు:

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...