2, ఏప్రిల్ 2016, శనివారం

అన్నమయ్య పదాల్లో 'ఒడగు'

శ్రీ తాడేపల్లి పతంజలి గారు facebook లో  అన్నమయ్య వాడిన 'ఒడగు' పదానికి వివరణ ఇలా ఇచ్చారు. మాకు తెలియని విషయాలు తెలియజేస్తున్న పతంజలి గారికి ధన్యవాదాలు.

అన్నమయ్య పదం - పరమార్థం 03-04-2016 (Tadepalli Patanjali)
ఒడగు
నిఘంటువులు అర్థాలు చెప్పని అన్నమయ్య పదాల్లోఒడగుఒకటి. “ఒకటి కొకటికిని వొడగాయఅని ఒక కీర్తన మొదలుపెట్టాడు కవి. ఒడగు పదమున్న కీర్తన పరమార్థాన్ని దర్శించి ఒడగు పదాన్ని అన్నమయ్య ఎంత అందమయిన అర్థంలో ప్రయోగించాడో తెలుసుకొని పరవశిద్దాం.
పల్లవి: ఒకటి కొకటికిని వొడగాయ
సకలంబునకును సమరసమాయ
1: కలికినెమ్మోము కళల మెరుగులకు
లలిఁ దురుము మొగులు లావాయ
తొలి తొలి వలపుల తొలుకరికాలము
వలనుగ నిదిగో వచ్చెను నేఁడు
2: రమణి కంకణపురవళి వురుములకు
చెమటల సోనలు చెలరేఁగె
తమకపు టాసల తగువెదకాలము
తమలపు ముదమునఁ దలకొనె నేఁడు
3: పడఁతి బొమల సురపతి చాపములకు
సడులని ప్రియముల జడి వట్టె
బడి శ్రీవేంకటపతిరతికాలము
తొడరి యింతట నెదురుకొనె నేఁడు
( రేకు:1883-1 సం: 28-485)
పల్లవి:ఒక దానితో ఒకటి బాగా కలిసి పోయింది.పోలిక బాగా కుదిరింది.
సమస్తానికి అభేదం కలిగింది.
1: అలమేలుమంగమ్మ చక్కని మోములోని కళల మెరుపులకి 
ప్రేమగా కొప్పు అనే మేఘము అతిశయించింది. 
మొదటగా పుట్టిన ప్రేమలు అనే వర్ష కాలం
యుక్తమైన రీతిలో ఇదిగో ! రోజు వచ్చింది.
2: అలమేలు మంగమ్మ కంకణాల యొక్క (చేతినగలయొక్క) 
చప్పుళ్ల నే ఉరుములకి
చెమటలనే సన్నని వానలు బాగా విజృంభించాయి.
త్వరపడే మోహాల నే దప్పికల బాధల కాలము(వెద కాలము)
అమ్మ వేసుకొనే తములపాకుల సంతోషములో ప్రకాశించింది.
3: అలమేలు మంగమ్మ కనుబొమలనే ఇంద్రధనుస్సులకు
జారని ప్రియములనే ముసురు పట్టింది.
వెంబడిగా, క్రమముగా వచ్చు శ్రీ వేంకటేశ దేవుని రతి కాలము
ఇంతలోనే తొట్రుపడుతూ నేడు ఎదురుగా వచ్చింది.
పరమార్థం
రూపకము మీద రూపకము ప్రయోగించి కీర్తనకి ప్రాణం పోయటం అన్నమయ్య కవితా లక్షణం
.ప్రేమ అనేదానిని వర్ష కాలం తో పోల్చదల్చుకొన్నాడు. అలమేలుమంగమ్మ కొప్పు మేఘమయింది. ఆమె మోములోని కళలు మెరుపులయ్యాయి.ప్రేమలు అనే వర్ష కాలం ఇదిగో ! రోజు వచ్చింది.అని కవి భావన. భావనకు పరవశించని భావుకుడుండడు.
అలమేలు మంగమ్మ కంకణాల చప్పుళ్ళు ఉరుములు. ఉరుములకి చెమటలనే సన్నని వానలు బాగా విజృంభించాయి. ఎవరికి చెమటలు ? కవి చెప్పడు. నాయకుడయిన వేంకటేశునికి అని మనమే ఊహించుకోవాలి.
మోహాల దప్పికలనే బాధల కాలము - అమ్మ వేసుకొనే తములపాకుల సంతోషములో ప్రకాశించిందని ఒక భావన.శుభ్రంగా భోజన కార్యక్రమం పూర్తయిన తర్వాత హాయిగా. తాంబూలం సేవిస్తారు. నాయిక తాంబూల సేవనంలో మోహల బాధలు తొలగిపోయి సంతోషము ప్రకాశించిందంటేకవి చెప్పదలుచుకొన్నసుఖాల ధ్వనిఏమిటో- అర్థమయి- ఔరా అన్నమయ్యా! అని అనకుండా ఉండలేం.
వర్ష సమయములో మేఘాలపై చిత్రవర్ణాలతో ధనుస్సు ఆకారములో కనఁబడు సూర్యకిరణ సముదాయాన్ని ఇంద్రధనుస్సు అంటారు. అలమేలు మంగమ్మ కనుబొమలు ఇంద్రధనుస్సుల లాంటివి.కొప్పు మేఘము. మోము లోని కాంతులు మెరుపులు. బ్రహ్మండమైన ప్రేమ అనే ముసురు పట్టింది. ఇలా ఉన్నప్పుడు నిజానికి కాలంలో వచ్చే కాలం వర్ష కాలం. కాని వర్ష కాలం వచ్చింది అనలేదు కవి. శ్రీ వేంకటేశ దేవునిరతి కాలంఅన్నాడు. “ఒక దానితో ఒకటి ఒడగు( పోలిక) బాగా కుదిరింది”.అను కవి మాటలని మనం కూడా చెప్పుకొని ఆయనని అభినందించాలి. 


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Excellent explanation.

వావిలకొలను సుబ్బారావు - పండితకవులు - charcoal pencil sketch

పండితకవులు కీ. శే.    వావిలకొలను సుబ్బారావు -  నా charcoal పెన్సిల్ తో చిత్రీకరిణకుకున్న చిత్రం  వికీపీడియా సౌజన్యంతో ఈ క్రింది వివరాలు సేకర...