11, ఫిబ్రవరి 2018, ఆదివారం

సంస్కార నిధులు - వృధ్ధాప్యం




సంస్కార నిధులు
(Courtesy : ఈనాడు దినపత్రిక)

భీష్మ పితామహుడి గురించి ప్రస్తావిస్తూ, తిరుపతి వేంకట కవులు ‘ఆతడు అనేక యుద్ధముల నారియు తేరిన వృద్ధమూర్తి’ అని ప్రకటించారు. వాస్తవానికి ఆ మాట లోకంలో వృద్ధులందరికీ వర్తిస్తుంది. వృద్ధి అనే మాటకు పెరగడం అని అర్థం. వృద్ధత, వార్ధక్యం, వార్ధకం, వృద్ధాప్యం అనే మాటలన్నీ... వృద్ధి అనే ధాతువులోంచే వచ్చాయి. వ్యక్తిత్వంలో, సంస్కారాల్లో, జ్ఞానంలో, వైరాగ్య భావంలో, వివేకంలో గణనీయమైన ఎదుగుదల వృద్ధాప్యానికి శోభ చేకూరుస్తుంది. ‘సముద్రాలు దాటాడట కాళ్లు తడవకుండా, జీవితాన్ని దాటలేడు కళ్లు తడవకుండా’ అని కవి వసీరా చెప్పినట్లు- జీవన సమరంలో రకరకాల ఆటుపోట్లకు గురికాకుండా ఏ మనిషి జీవితమైనా కడతేరదు. కనుక ప్రతి వృద్ధుడూ ఎంతో కొంత జ్ఞానవృద్ధుడే! ఆ అనుభవాన్ని గౌరవించాలని శాస్త్రాలు బోధించాయి. వృద్ధులు ఎదురైతే అభివాదన శీలంతో ప్రవర్తించాలని భారతం ఆనుశాసనిక పర్వం సూచించింది. ‘వృద్ధు వచ్చునపుడు... అతనికి ఎదురులేచి ప్రణతి చేసెనేని’ ఆయువు పెరుగుతుందని చెప్పింది. దాన్నే అభ్యుత్థానం అనీ అంటారు. అంటే ఎదురేగి నమస్కరించడం! చాలామంది ఈ సూచనను పెడచెవిన పెడతారు. వృద్ధాప్యాన్ని చిన్నచూపు చూస్తారు. అనుభవాన్ని చాదస్తంగా భావిస్తారు. ఎవరినో ఎందుకు- భీష్ముడంతటి జ్ఞానవృద్ధుణ్నే శిశుపాలుడు తెలివి తక్కువవాడు అన్నాడు. రాజసూయం చివరిలో అగ్రపూజకు కృష్ణుడే అర్హుడని భీష్ముడు ప్రకటిస్తే ‘ముదివెర్రి’ పలుకులుగా వాటిని శిశుపాలుడు ఆక్షేపించాడు. ‘వృద్ధుల బుద్ధులు సంచలింపవే (స్థిరంగా ఉండవు కదా) అని నిండుసభలో వృద్ధాప్యాన్ని అవమానించాడు.

వృద్ధాప్యం అనేది బొండుమల్లె పొదలపై ఆరవేసిన పట్టుబట్ట లాంటిది. దాన్ని దులిపితే అనుభవ సౌరభాలు గుప్పుమంటాయి. ‘నిర్మలంబన జాల నెరయు చిత్తంబన నల్లని వెండ్రుకల్‌ తెల్లనయ్యె...’ ఆవేశం, ఉద్రేకం వంటి చిత్త వృత్తులన్నీ తొలగిపోయి మనసు నిర్మలంగా మారిందనడానికి సూచనగా జుట్టు నెరిసింది- అని భాగవతం ముదిమి ప‌రిప‌క్వత‌ను ఆవిష్కరించింది. అయితే, లోకం ‘మెరిసేదంతా మేలిమి కాదు, నెరిసేదంతా అనుభవమూ కాదు’ అంటుంది. ముసలాళ్లందరినీ ఒకే గాటన కట్టేస్తుంది. కనుకనే మనిషి ముసలాడవకూడదు, పెద్దవాడవాలి. ‘కావలె నీవు నేను బహు కర్సనమొప్పగ (కృషి ఫలించి) వృద్ధ జీవులం కావలె’ అని కవులు సూచించారు. అది పరిణతికి చిహ్నం. కన్యాశుల్కంలో మధురవాణి రామప్పంతులుతో చెప్పిన ‘చట్లకు చావ(చేవ) నలుపు, మనిషికి చేవ తెలుపు’ అనే సామెతకు తాత్పర్యం అదే! ఆ పరిపక్వతనే పోతన ‘ఇంద్రియంబుల కోర్కులిక ఒల్లననుభంగి...’ ఇంద్రియ సంబంధిత వాంఛలను ఇక దగ్గరకు రానివ్వను- అని సూచిస్తున్నట్లుగా, ‘ఉడుగక తల చాల వడక చొచ్చె...’ తల అడ్డంగా ఊగుతోంది- అన్నాడు. మనసులోంచి విషయ వాంఛలు రాలిపోయేందుకే మన పెద్దలు గృహస్థాశ్రమం అంచున వానప్రస్థానాన్ని సూచించారు. వనాల్లోకి(అడవుల్లోకి) వెళ్లడమంటే- మనిషి తనలోకి తాను ప్రవేశించడం, పరిపూర్ణ వైరాగ్య చింతనతో కాలం సద్వినియోగం చేసుకోవడం అని అర్థం. నాగరికతకు దూరంగా ఈ రోజుల్లో మన పల్లెల్లో ఏకాంతంగా జీవిస్తున్న వృద్ధులందరూ ఒక రకంగా వానప్రస్థాశ్రమ జీవులనే చెప్పుకోవాలి. ప్రతికూల భావాలనేవి పూర్తిగా అణిగిపోయి, సానుకూల దృక్పథంతో ‘ఇక మంచికి పట్టుగొమ్మయైపోయెను మానసంబు’ అని అనుకోగల స్థితినే పెద్దరికం అంటారు. అలాంటివారిని సినారె చెప్పినట్లు ముసలాళ్లనకూడదు, వయోధికులు అనాలి. భీష్ముడి చివరి దశలో ధర్మజుడిలా వారిని ఆశ్రయించి వారి జీవన అనుభవసారాన్ని జుర్రుకోవాలి.

పల్లెటూళ్లకు ప్రయాణం అనేసరికి మనలో చాలామందికి ప్రాణాలు లేచొస్తాయి. ఎందుకంటే అక్కడ పండుటాకులు మనల్ని ప్రేమగా పలకరిస్తాయి. ఆత్మీయ బంధాలనేవి ఆర్థిక సంబంధాలుగా క్షీణించని రోజుల్లో వృద్ధ భారతం మనిషిని వెచ్చగా స్వాగతించేది, బతుకు పచ్చగా శ్వాసించేది, నాగరీకపు ఉక్కబోతను తీర్చేది. పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని బతుకు పాఠాలు బోధించేది. ‘చేతులారంగ శివుని పూజింప వలయు, దయయు సత్యంబు నిత్యము తలప వలయు’ అంటూ పసి హృదయాల్లో పసిడి భావాలను మొలకెత్తించేది. ముసలితనం గొంతును వణికిస్తుంటే దాన్ని కమ్మని గమకంగా మార్చి ‘మందార మకరంద మాధుర్యాలు’ చవి చూపించేది. సంస్కారాలను అలవరచేది. వృద్ధులను దూరంగా ఉంచడమంటే- జాతి సంస్కార నిర్మాతలను దూరం చేసుకోవడమే! వారికి ఆ వయసులో ఇంకొకరిపై ఆధారపడక తప్పదు. ‘ముగ్గుబుట్ట వంటి తలా, ముడుతలు తేరిన దేహం, కాంతిలేని గాజుకళ్లు తనకన్నా శవం నయం’ అంటూ మహాకవి శ్రీశ్రీ ‘భిక్షు వర్షీయసీ’ అనే ప్రసిద్ధ గీతంలో వర్ణించిన వృద్ధాప్యం- ఒక ఆసరాను కోరుకుంటుంది. బాల్యంలో తాను వేలుపట్టి నడిపించిన చేయి తనకిప్పుడు చేతికర్రగా ఉపయోగపడాలని ఆశపడుతుంది. దురదృష్టవశాత్తు, దేశంలోని 60శాతం వృద్ధులకు అలాంటి చేయూత లభించడంలేదని ‘హెల్ప్‌ ఏజ్‌ ఇండియా’ సంస్థ తన సర్వే నివేదికలో తేల్చి చెప్పింది. 71శాతం వృద్ధులు గ్రామాల్లో నివసిస్తుండగా, వారి పిల్లలు ఎక్కడో దూరంగా పట్టించుకోకుండా ఉంటున్నారట. ‘శీతగాలి రానీయకు శిశిరానికి చోటీయకు’ అని కృష్ణశాస్త్రి కోరుకొన్నట్లుగా, చివరి దశలో మనిషి నిశ్చింతగా జీవించాలంటే, కవికర్ణ రసాయనకర్త చెప్పినట్లు ‘జనక జానంద బీజత్వంబు గైకొను...’ తల్లిదండ్రుల ఆనందానికి తామే మూలకారణమయ్యే సుపుత్రులు వారికి లభించాలి. అంతకన్నా వేరే దారి లేదు!

(Courtesy :  ఈనాడు సంపాదకీయం  -  నా పెన్సిల్ చిత్రాలు జతచేసాను)

కామెంట్‌లు లేవు:

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...