16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

పెళ్ళంటె పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు



మనసున మనసై



( మన వివాహ వ్యవస్థ గురించి ఈనాడు దినపత్రిక 'మకరందం' శీర్షిక లో వచ్చిన  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.  ఈ వ్యాసానికి నేను వేసిన చిత్రాలు జోడించాను)

మేళాలు.. తాళాలు..  పందిళ్లు.. సందళ్లు.. సంబరాలు.. సంతోషాలు..
వివాహ వేళ భౌతికంగా కనిపించే ఆనంద హేల ఇది.
ఇరు హృదయాలను పెనవేసే వైదిక క్రతువు వివాహం.
రెండు కుటుంబాలను గౌరవంగా కలిపే సంప్రదాయ విధి పెళ్లి.
ఎదుర్కోళ్లు మొదలు అప్పగింతల వరకు పెళ్లితంతులో ప్రతిదీ పరమార్థంతో కూడుకున్నదే! గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్న కొత్త దంపతులు వివాహ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. ఒకరికొకరు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి.
కల్యాణ ముహూర్తాలు సమీపిస్తున్న శుభవేళ... పరిణయ సందేశం మీ కోసం..
మన దేశానికి బలం కుటుంబ వ్యవస్థ. దీనికి మూలం వివాహం. రెండు నిండు జీవితాలను కలిపే వివాహం ఒక పవిత్రమైన విధి. భార్య, భర్తలో సగభాగం అవుతుంది కాబట్టే ఆమెను అర్ధాంగి అన్నారు. పార్వతీదేవి పరమ శివుడి శరీరంలోని ఎడమ భాగాన్ని పొందిందని సౌందర్యలహరిలో శ్రీ శంకరులు స్తుతించారు. వారి దాంపత్యం అందరికీ ఆదర్శప్రాయమని వర్ణించారు. పద్మ పురాణమైతే భార్యను తీర్థంగా చెప్పింది. అంటే తరింపజేసేదని అర్థం. మనిషి జీవన విధానాన్ని  నాలుగు దశలుగా విభజించారు. వీటిలో మొదటిది, శ్రేష్ఠమైంది గృహస్థాశ్రమం. ‘చతుర్ణాం ఆశ్రమాణాంహి గార్హ‌స్త్యం శ్రేష్ఠముత్తమం’ అని తీర్పు చెప్పింది రామాయణం. గృహస్థు లేనినాడు ఆహారమే దొరకదని వేదాలు కూడా వల్లించాయి. ఇలాంటి ఉన్నతమైన గృహస్థాశ్రమ స్వీకారానికి స్త్రీపురుషులను మంత్రాలతో సంస్కరించడమే వివాహం.
ఆకాశం, భూమి తమంత తాముగా ఫలవంతం కావు. సృష్టి నడవాలంటే భూమి, ఆకాశాల మధ్య ఒక సంబంధం ఉండాలి. ఆకాశం నుంచి పడే వాన భూమిని తడిపి అందులోని అంకురాలను మొలిపించి వృక్షాలుగా మార్చి చైతన్యవంతం చేస్తుంది. స్త్రీ పురుషుల జీవితాలు కూడా అంతే. వివాహం వల్ల చైతన్యవంతమవుతాయి. రెండు జీవితాలూ ఏకమై సార్థక్యాన్ని పొందుతాయి. అందుకే సర్వజగత్తులో ఉన్న చైతన్యానికి మూలంగా పెళ్లిని చెబుతారు. వివాహ బంధం ద్వారా ఒక్కటైన స్త్రీ, పురుషుడు కలిసి, మెలిసి జీవించాలని, పరస్పర సౌఖ్యాన్ని, సంతోషాన్ని పెంచుకుంటూ, పంచుకుంటూ తరించాలని శాస్త్రాలు నిర్దేశించాయి. ‘ఓ వధూవరులారా! మీరు ఈ లోకంలో చిరకాలం సఖ్యతతో జీవించండి. కొడుకులతో, మనుమలతో సంతోషంగా వర్ధిల్లండి అని రుగ్వేదం కూడా ఆశీర్వదిస్తుంది. జీవితాలను ఎలా పండించుకోవాలో వేదమంత్రాల రూపంలో వెల్లడించడం వివాహ క్రతువులోని అంతరార్థం. కన్యాదాన సమయంలో కన్యాదాత ‘ఈ వధువును స్నేహంగా చూసుకో’ అని వరుణ్ణి మంత్రపూర్వకంగా అభ్యర్థిస్తాడు.  సప్తపది ప్రక్రియలో ఏడో అడుగులో వరుడు, వధువును స్నేహితురాలిగా సంబోధిస్తాడు.పెళ్లింటి వీధి గుమ్మం దగ్గర వధూవరులను అడ్డగించి పేర్లు చెప్పిస్తారు. లౌకిక వ్యవహారంగా కనిపించే ఈ ఆచారం నిజానికి వేదసమ్మతం. అలా ఒకరినొకరు పలకరించుకునే క్రమంలో పరస్పరం మిత్రులవుతారని ఈ సందర్భంలో చెప్పే మంత్రార్థం. బిందెడు నీళ్లలో పడేసిన ఉంగరాన్ని తీసే క్రమంలో స్పర్శ తాలూకు స్నేహ పూర్వకమైన సాన్నిహిత్యం చిగురిస్తుంది.
మనిషి శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న జీవుడు పొందాల్సినవి నాలుగు. వాటిని పురుషార్థాలు అంటారు. వీటిలో మొదటిది ధర్మం. తరువాతి రెండూ అర్థం, కామం. ఈ రెండింటినీ ధర్మంగా పొందితే చివరిదైన మోక్షానికి దారిదొరుకుతుందని చెబుతారు. అర్థం ధర్మబద్ధం కావాలి. అంటే సంపాదన, ఖర్చు రెండూ ధార్మికంగా ఉండాలి. మనం ఏ పని చేసినా అది ధర్మచట్రంలో ఇముడుతుందా అనే విషయాన్ని పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలంటారు. కామం కూడా ఇంతే. ఇది సాధించాలంటే జీవితం ఒక క్రమ పద్ధతిలో సాగాలి. దీనికి సూత్రీకరణే వివాహం.
లోకంలోని ధర్మాల్లో దాంపత్య ధర్మం చాలా విశిష్టమైంది. ‘ఏది సుఖదుఃఖాల్లో ఏకరూపంగా ఉంటుందో, కష్టాల్లో ఉన్న హృదయాలకు గొప్ప ఊరటనిస్తుందో, దేని మాధుర్యాన్ని వార్ధక్యం కూడా హరించలేదో, ఇంద్రియాల శక్తి తగ్గేకొద్దీ ఏది పెరుగుతుందో, కాలం గడిచేకొద్దీ ఏది మరింతగా బలపడుతుందో అలాంటి దాంపత్య ధర్మం భద్రమగుగాక’ అని భవభూతి ఉత్తర రామాయణంలో అన్నారు. వివాహ సంస్కారంలో వధువు, వరుడు తమ హృదయాలు నీరులా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అంటే మిగిలిన జీవితమంతా మిత్రులుగా ఉండాలంటుంది వివాహ ధర్మం. వైవాహిక జీవితంలో ఆనందానికి, సుఖానికి పునాది ఇద్దరి మనసుల్లో  నుంచి పుడుతుంది. తమ ఇష్టమే నెగ్గాలనుకోవడం కన్నా ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడం ముఖ్యం. దంపతులకు సహనం చాలా అవసరం. వివాహ జీవితానికి ప్రేమ ఉద్యానవనం వంటిది. అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లే దంపతుల మధ్య ఉండే ప్రేమ చావు వరకు దంపతులను కలిపి ఉంచుతుంది. దీనికే హృదయ గ్రంథి అని పేరు. ప్రేమ అనేది ఒక దివ్యమైన ఆత్మానుభూతి. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేసే త్యాగం వల్లనే ఈ అనుభూతి సొంతమవుతుంది.ఇద్దరూ ఒకరినొకరు గెలిపించుకోవడంలో ఉన్న ఆనందాన్ని గుర్తెరిగితే ఆ ఇల్లు సుఖసంతోషాల సారమవుతుంది. అలాంటి ఇళ్లున్న సమాజం, దేశం ఆనంద నిలయాలవుతాయి.

-   వ్యాసం :  శ్రీ విజయదుర్గ (Courtesy :  Eenadu, makarandam 15th February 2018)

ఈ వ్యాసం చదువుతుంటే 'త్రిశూలం' చిత్రం లో 'పెళ్ళంటే పందిళ్ళు' పాట గుర్తుకొచ్చింది. ఈ పాట వీడియో లింకు కూడా క్రింద ఇస్తున్నాను. గీత రచయిత ఆచార్య ఆత్రేయ, సంగీతం : K.V. మహదేవన్, నేపధ్య గానం : బాలు, సుశీల.

పల్లవి: 



పెళ్ళంటే... 

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ 
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు 
ఆ...ఆ...ఆ...ఆ..... 

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ 
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు 

పెళ్ళైతే... 

పెళ్ళైతె ముంగిళ్ళు.. లోగిళ్ళు ముగ్గులు.. ముత్తైదు భాగ్యాలూ.... 
ముద్దూ ముచ్చట్లు.. మురిసే లోగుట్లు.. చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు.. 


పెళ్ళైతె ముంగిళ్ళు.. లోగిళ్ళు ముగ్గులు 
ముత్తైదు భాగ్యాలూ.... 


చరణం 1: 

గోదారి ఒడ్డున.. గోగుల్లు పూచిన వెన్నెలలో 
కొసరాడు కోర్కెలు.. చెరలాడు కన్నుల సైగలలో 
ఆ ఆ.. గోదారి ఒడ్డున.. గోగుల్లు పూచిన వెన్నెలలో 
కొసరాడు కోర్కెలు.. చెరలాడు కన్నుల సైగలలో 

మమతానురాగాల మరుమల్లెలల్లిన పానుపులూ... 
హృదయాలు పెదవుల్లో.. ఎరుపెక్కు ఏకాంత వేళల్లో 
వలపు పులకింతలో.. వయసు గిలిగింతలో.. 
వింతైన సొగసుల వేడుకలో.. 


పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ... 
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు 


పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. 
ఆ..... 

చరణం 2: 

కలలన్ని కలబోసి.. వెలసిన ఈ పంచవటిలో 
ఇల్లాలు నేనై.. ఇలవేల్పు నీవైన కోవెలలో 
ఆ... కలలన్ని కలబోసి.. వెలసిన ఈ పంచవటిలో 
ఇల్లాలు నేనై.. ఇలవేల్పు నీవైన కోవెలలో 

సిరిమువ్వ రవళుల మరిపించు నీ నవ్వు సవ్వడిలో... 
కులమన్నదే లేని అలనాటి వేదాల ఒరవడిలో 
సామగానాలము.. సరసరాగాలము 
ప్రేమికులమన్న కులమున్న లోకంలో 


పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ 
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు 

 

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.... 
 ఈ  వీడియో లింక్ క్లిక్ చేసి ఈ పాట వినవచ్చును.


https://www.youtube.com/watch?v=w7vlqnfH2us

కామెంట్‌లు లేవు:

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...