నేనొక చిత్రకారుణ్ణి - బహుశా బాపు గారు వేసిన చిత్రమనుకుంటాను. దానికి రంగులద్ది ఇక్కడ పోస్ట్ చేసాను.
రోజురోజుకీ మితిమీరిన ఆంగ్ల పదాలతో తియ్యని మన తెలుగు కలుషితం అవుతోంది.. ఈ విషయంలో నేను ఆవేదన చెందుతుంటాను. 'నీరు' అన్న పదం మరచిపోయారు, ఇప్పుడు వాటర్ అన్న పదం తెలుగులోకి చేరిపోయింది. ఇలా ఒకటేమిటి, ఎన్ని పదాలో అవసరాన్ని మించి మన భాషలో కలిపేసుకుంటున్నాం. ఇంక సినిమాలు, కధలు, నవలల సంగతి సరేసరి. చివరికి సినెమా పేర్లు కూడా ఇంగ్లీష్ పదాలనే వాడుతున్నారు, ఉదాహరణకి : లెజెండ్, ఇంటలిజెంట్, ఇగో, స్కెచ్, ఇత్యాదివి. ఇంతటి మార్పు మన తెలుగుకి తీసుకురావడం అవసరమా .. ఇది నన్ను వేధిస్తున్న ప్రశ్న. ఇలా ఎన్నొ పదాలు తెలుగు మన వాడుక భాషలోకి, సినిమాల్లోకి, కధల్లో కి, నవలల్లో కి చేరిపోతున్నాయి.
February 21 మాతృభాషా దినోత్సవం సందర్భంగా పలువురు మిత్రులు whatsapp లో మన తెలుగు భాషమీద ఉన్న మమకారాన్ని వ్యక్తపరచుకున్నారు. మన భాషలో వస్తున్న మార్పుకి ఆవేదన చెందుతూ, రచనలూ కవితలూ పెట్టారు. నా దృష్టికి వచ్చిన కొందరి రచనలు, కవితలు, పద్యాలు క్రిందన పొందుపరుస్తున్నాను.
-------------------------------------------------------------------------------------------------------------------
ఫిబ్రవరి 2016 శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా యిచ్చిన సమస్య "దేశభాషలందు తెలుగు లెస్స" అన్న పద్య పాదం తో పద్యం.
దీనికి సిలికానాంధ్ర సుజనరంజని
మాసపత్రిక మార్చి 2016 లో ప్రచురితమైన నా పద్యం.
సీ* ఏభాషలో మాట లేదేశ వసతైన
మురిపించి తెలిగించుముచ్చటలను
ఏభాషలో పాట లింపార సొంపార
స్వరముల రసహేల సంతరించు
ఏభాషలో యాస లెందేని వినిపించ
ఏప్రాంతవాసులోఎరుకపరచు
ఏభాషలో పద్యమేయింటపఠియించ
తెలుగింటి వారంచు తెలియబరచు
అట్టి సరస మధుర సాహిత్యసంగీత
ఆశుకవితల కలితావధాన లలిత
మాటపాటలందుమేటియైమెప్పించు
దేశ భాషలందు తెలుగు లెస్స
గండికోట విశ్వనాధం
--------------------------------------------------------------------------------------------------------------------------
మాతృ భా (ఘో )ష
మీరు మరచిపోతున్న
మాతృభాష ను నేను
ఆదరణ కరువవుతున్న
అమృత భాషను నేను
నన్నయ్య ఇచ్చాడు నాకు కావ్యగొరవం
చిన్నయ్య కూర్చాడు నాకు వ్యాకరణం
తిక్కన్న నాలోని సొగసుల్ని చూశాడు
పోతన్న నాలోని తీయదనం చూపాడు
అన్నమయ్య కీర్తనలో భక్తిరసం నేనేను
కృష్ణ శాస్త్రి పాటలోని ఆర్తియన్న నాదేను
గురజాడకు అందించా అభ్యుదయపు వాడి నేను
శ్రీ శ్రీ లో చూపించా కవిత్వంపు పదును
అన్ని భాషలలోన మిన్న నేనేనన్న
ఖ్యాతినే పొందాను
కనుకనే పొంగాను
తెలుగు తేటయన్న
మాటదక్కిందన్న
భావనతో మైమరిచా
ధన్యనంటు నే తలచా
శతకాలతో జాతికి నీతుల్ని నేర్పాను
ప్రబంధాలతో శృంగార లోతుల్ని చూపాను
అవధానపు ప్రక్రియలో ప్రత్యేకత చాటాను
ఆధ్యాత్మ భావాల అంచులే తాకాను
విన్నారా!
ఇది అంతా గతకాలపు వైభవం
చూశారా !
నేడు నాది శోచనీయ అనుభవం
నేను రానంటారు
నన్ను వద్దంటారు
అభివృద్ధి పథాన నా ఉనికి
ఆటంకం అంటుంటారు
అమ్మపాలతో పాటుగా అలవడేటి నన్ను
అమ్మ జోల పాట లోని హాయినయిన నన్ను
నేడు
అవహేళన చేస్తున్నారు
అల్పంగా చూస్తున్నారు
మనసారా నన్ను తాము
నేర్వలేని నిర్భాగ్యులు
నోరారా మాతృభాష
పలుకలేని పాపాత్ములు
నన్ను జీవచ్ఛవాన్ని చేస్తున్నారు
అన్యభాషా పదాల అతుకులేస్తున్నారు
అన్ని భాషలలోనున్న కొన్ని వేల పదాలను
అచ్చులతో చేయూతనిచ్చి
అక్కున చేర్చుకున్న నాకు
ఆ ఔదార్యగుణమే నేటికి
ఆత్మహత్యా సదృశమయ్యింది
నా భవితవ్యపు ఆశలిప్పుడు
భాషాభిమానుల చేతుల్లో విడిచాను
బడుగుభాషను కాను
మీ జీవనాడిని
కానివ్వండి మననిచ్చి
నన్ను చిరంజీవి ని.
సింహాద్రి జ్యోతిర్మయి
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం
( న ర సం ) ఉపాధ్యక్షురాలు
21.2.2018. - Simhadri Jyotirmayi
--------------------------------------------------------------------------------------------------------------------------
వృక్షాగ్ర భాగాన పక్షమ్ము లదలించి
పాడెడి కోకిల పాటలందు,
ఉద్యాన వనముల హృద్యత పురివిప్పి
యాడెడి కేకి నృత్యములయందు,
హ్లాదమౌ మానస లహరుల దేలుచు
నడయాడు రాయంచ నడల యందు.,
గిరి శృంగముల నుండి ఝరులౌచు గలగల
ప్రవహించు సెలయేటి పరుగులందు
పూవు తావుల,ఘంటికా రావములను,
జానపదములు సుడులెత్తు జనుల నోట
నీదు చరితమ్ము వినిపించు నిక్కువమ్ము
తెలియ తరమౌనె నీశక్తి తెలుగు తల్లి.
సకల భాషల వీడక సఖ్యగతిని
మెలగు చుండెడి భాష యీ తెలుగు భాష
దేశభాషల లెస్సరా తెలుగుభాష
దీని బ్రతికింప దీక్షను బూనుడయ్య.
మద్దూరి రామమూర్తి.
--------------------------------------------------------------------------------------------------------------------------
Hemadri Rao garu :
మిత్రులకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు:
అమ్మభాషలో అమ్మదనం
మాతృభాషలో కమ్మదనం
అమ్మభాష అమృతం
మాతృభాష సమ్మోహితం
తెలుగుభాష తియ్యదనం
తెలుగు మాట కమ్మదనం
తెలుగు పలుకు తేనెలొలుకు
తెలుగు మాట వెలుగు బాట
తెలుగు పాట తేనేలోమాగినట్టి
తియ్య మామిడి ఊట
తెలుగు జిలుగు తాకని
నేల లేదేందు ఈ జగతిలోన
తెలుగు ప్రభలు ప్రసరిల్లు
నలు చెరగులు
తెలుగు రేఖలు విరజిల్లు
సుమ్మోహన పరిమళాలు
గగన సిగన త్రివర్ణ కేతనం ఎగురునందాక
ఆ చంద్ర తారార్కం
నిలుచునందాక
అమ్మ ప్రేమెంత కమ్మనిదో
తెలుగు మాటంత తియ్యనిది
------------------------------------------------------------------------------------------------------------------------
తెలుగు పలికే నేలపై పుట్టిన ఘనులము మనమంతా.....సిరులతో పనిలేదు తెలుగు భాష యనే అనంత సిరిసంపదలకు వారసులం మనం......ఇంతటి మధురమైన తెలుగు భాషకు వారసులైన ప్రతీ తెలుగువాడి జన్మ ధన్యమే
* మధురం మధురం నా తెలుగు మధురం *
1.
కదళి ఫలము ద్రాక్ష కర్జూరముల కన్న
పనస జామ రేగు పండ్ల కన్న
అచ్చ తెనుగు భాష అత్యంత మధురంబు
విశ్వ సత్య మిదియె విశ్వసింపు
2.మధుర మకరంద మాధుర్య సుధలు నిండి
వీనులలరించి మురిపించు! విరుల భంగి
సొబగు లీనెడు నాభాష సోయగమ్ము
దేశ భాషలందునమేటి తెలుగు సుమ్ము
3.
పూత రేకులరిశె పూర్ణంపు భక్ష్యాలు
కాకినాడ కాజ కజ్జి కాయ
పాల కోవ పుణుగు బందరు లడ్డూల
తీపి కన్న నాదు తెలుగు మేటి.
4.
మాతృ భాష పట్ల మమకారమే లేని
వాడు హీను డౌను పశువుకన్న
తల్లి నేర్పియున్న తనభాషనేవీడ
మాతృద్రోహి యగును మహిన వాడు.
5.
విశ్వమందు చెరగు వివిధ భాషల లోన
నాదు తెలుగు మిన్న నాణ్యతెన్న
అంధుడైన వాడి కందుమాధుర్యము
నేలయెరుగ గల్గునిలన ఖలుడు
6.
తెలుగు భాషయనిన తేలికంచు దలచి
ఆంగ్లమొకటె యవని నధిక మంచు
భ్రాంతిలోన బ్రతుకు బానిస పుత్రులీ
తెలుగు తల్లి కంట నలుసు లైరి
ఒక ముఖపుస్తక స్నేహితుడి సహాయ సహకారములతో.. (Whatsapp నుండి సేకరణ)
22, ఫిబ్రవరి 2018, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
The power of 'Will' Usage - English grammar - illustration
When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
అన్నమయ్య కీర్తన "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు" _డా. Umadevi Prasadarao Jandhyala గారి వివరణతో చిత్రం : పొన్నాడ ...

కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి