14, అక్టోబర్ 2020, బుధవారం

కూచిపూడి నృత్యకళాకారిణి డా. శోభానాయుడు

       

 Dr. Sobha Naidu, Kuchipudi Exponent - My pencil sketch

డా. శోభానాయుడు (1956-14th October 2020)

దేశం గర్వించదగ్గ నాట్యకారిణి పద్మశ్రీ డా.శోభానాయుడు. పురుషులు మాత్రమే కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తున్న కాలాన్ని దాటుకుని వచ్చి.. మహిళలు సైతం కూచిపూడి ఘన పతాకను రెపరెపలాడించగలరని నిరూపించిన కళాకారిణుల్లో అగ్రేసర విదుషీమణి ఆమె! అభినయానికి నిలువెత్తు సాక్షి సంతకం శోభానాయుడు. ఆమె నాట్య ప్రస్థానంలో.. సాత్వికాభినయానికి చిరునామాగా నిలిచే నృత్యరూపకాలెన్నో! 

జగమెరిగిన కూచిపూడి నాట్యాచార్యులు డా.వెంపటి చినసత్యం దగ్గర గురుకుల పద్ధతిలో పాఠాలు నేర్చుకున్నారు శోభానాయుడు. నాట్యకారిణిగా ఆమె చేయని ప్రయోగం లేదు. ఎక్కని వేదికా లేదు. కూచిపూడి అంటే శోభానాయుడే అన్నంత పేరు తెచ్చుకున్నారు. అనంతరం, తన నాట్య సంస్థ ‘శ్రీనివాస కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ’ ద్వారా అనేక మందిని తీర్చిదిద్దారు. శిష్య ప్రశిష్యులు పదివేల పైచిలుకే! వారంతా అమెరికా, యూరప్‌, రష్యా వంటి దేశాల్లో కూచిపూడి నాట్య వైభవాన్ని చాటుతున్నారు.   గురువు పేరు నిలబెడుతున్నారు.  

అభినయ సౌందర్యం

అభినయ ప్రదర్శనలో శోభానాయుడు దిట్ట. సంప్రదాయ పద్ధ్దతిలో అనేక నాట్యప్రదర్శనలిచ్చారు. భామాకలాపం, శ్రీకృష్ణ పారిజాతం వంటి రూపకాల్లో ఆమె అభినయం సత్యభామను ప్రత్యక్షం చేస్తుంది. సంభాషణలు లేకుండానే, హావభావాలతో  రసానుభూతిని కలిగిస్తాయి ఆమె పాత్రలు! శోభానాయుడు పదిహేను పైచిలుకు నాట్యరూపకాలకు దర్శకత్వం వహించి నిర్మించారు! కళ్యాణ శ్రీనివాసం, శ్రీకృష్ణ శరణం మమ, విప్రనారాయణ, ‘జగదానంద

కారక..’గా జగద్విఖ్యాతమైన త్యాగరాజ రామాయణం, నవరస నటభామిని, సర్వం సాయిమయం, భగవద్గీతాసారమైన సంభవామి యుగేయుగే, విజయోస్తుతే నారీ, స్వామి వివేకానంద.. ఆమె దర్శకత్వం వహించిన రూపకాల్లో కొన్ని. ఇవేకాకుండా, నూటికిపైగా ’సోలో’ ప్రదర్శనలను రూపొందించి ప్రచారం చేశారు. జాతీయ అంతర్జాతీయ వేదికలపైన నృత్య ప్రదర్శనలిచ్చిన శోభానాయుడు వాగ్గేయకారుల కీర్తనలను విరివిగా ప్రచారం చేశారు. తిరుమల నాదనీరాజనం వేదికగా అనేక ప్రదర్శనలిచ్చారు. పలుకుతేనెల తల్లి, అలరులు కురియగ, తగునయ్య హరి..  వంటి కీర్తనలను ఆమె ప్రదర్శించినప్పుడు అలమేలు మంగమ్మను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేది ప్రేక్షకులకు.

సందేశాత్మకం..చండాలిక

సంప్రదాయరీతిలో సాగిన శోభానాయుడు నృత్యప్రదర్శనలన్నీ ఒక ఎత్తయితే, రవీంద్రనాథ్‌ టాగోర్‌ రచన ‘చండాలిక’ మరొక ఎత్తు. అస్పృశ్యతను నిరసించే ఆ బెంగాలీ రచనను.. యస్వీ భుజంగరాయ శర్మ నృత్యానికి అనుగుణంగా అనువదించారు. అందులో అంట రానియువతి పాత్రలో.. చండాలికగా శోభానాయుడు నర్తించిన తీరు ప్రేక్షకులతో  కంట తడి పెట్టిస్తుంది. అంటరానితనాన్ని మించిన అకృత్యం లేదనే గొప్ప సందేశాన్నిస్తుంది! ఈ రూపకాన్ని కొన్ని వందలసార్లు ప్రదర్శించి, సమసమాజ నిర్మాణానికి  నాట్యం ద్వారా కృషి చేశారు శోభానాయుడు. కూచిపూడికి అంకితం కావాలనే దృఢ సంకల్పంతో సినిమా అవకాశాలను కూడా త్రుణప్రాయంగా వదులుకున్నారు ఆమె. లేకపోతే, కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలోని ఓ చిత్రంలో కథానాయికగా కనిపించేవారు. భారత ప్రభుత్వం నుంచి ఆమె పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ శాస్త్రీయ నృత్య చూడామణి ప్రదర్శనను తిలకించడానికే సృష్టికర్త పైలోకాలకు రప్పించు కున్నాడేమో!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌,  తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సంగీత విద్వన్మణి, తమిళనాడు కృష్ణగానసభ నుంచి నృత్య చూడామణి..  వంటివి శోభానాయుడు అందుకున్న పురస్కారాల్లో కొన్నిమాత్రమే!

-- గంధం బసవశంకరరావు


Courtesy ; Namaste Telangana


- గంధం బసవ శంకరరావు

 

కామెంట్‌లు లేవు:

కళాప్రపూర్ణ ద్వారం భావనారాయణ రావు charcoal pencil sketch

ఈ చిత్రంలో వ్యక్తి కీర్తిశేషులు ద్వారం భావనారాయణ రావు.   ఇతడు ద్వారం వెంకటస్వామి, జగ్గయ్యమ్మ దంపతులకు 1924 జూన్ 15 తేదీన  బాపట్లలో   జన్మించ...