5, అక్టోబర్ 2020, సోమవారం

Pasupuleti Kannamba - పసుపులేటి కన్నాంబ


Pasupuleti Kannamba - my Pencil sketch 

 అత్తమామల ఆరడి లేదు...

ఆడబిడ్డ అదుపాజ్ఞలు లేవు....
ఆడబిడ్డ అదుపాజ్ఞలు లేవు....
సవతుల పోరా మొదలే లేదు..
బావల మరుదుల బాధే లేదు...
నా భాగ్యమే భాగ్యము. ...
నా బోటి స్త్రీ భాగ్యమే భాగ్యము.
పేరుకు నా పతి రాజే గాని...
పెత్తనమంతయు నాదే...
జ్ఞాతి అంకురము ఆర్పివైచితిని...
భూతలమంతయు నాదే...
భూతలమంతయు నాదే........
కన్నబిడ్డలు లేరు....కట్టుకున్న రాజు తప్ప! అయినా....అంతా తనే అనుభవించాలనే స్వార్థ పూరిత మనస్కురాలైన విలనీ రాణి పాత్రలో... 1946లో విడుదలైన... ముగ్గురు మరాటీలు లో....ఆవిడ గారి నటన అపూర్వం.
************
దేవుడు లేడూ.....సత్యం జయించదూ.....అంటూ....మద్రాసు నగర వీధుల్లో....ఆవిడ గారు....ఏడుస్తూ...జుట్టు విరబోసుకుని....పరిగెత్తుతూ....నటిస్తుంటే......
అది నటన అని తెలియని ప్రజలు....ఆమె వెంట పరుగెత్తుతుంటే.....పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారట!
అది లాంగ్ షాట్. కెమెరా ఎక్కడో మిద్దె మీద ఫిక్స్ చేసి తీస్తున్నారు. గృహలక్ష్మి(1938) మూవీ.
హీరో రామానుజాచార్యులు ఓ డాక్టర్. వేశ్య కాంచన మాల వల్లో పడి.....భార్యను నిర్లక్ష్యం చేసి, చివరకు హత్యానేరం మోపపడి చెరసాల పాలైతే.....భార్య ఉన్మాదావస్థలో....పిచ్చిగా అరుస్తూ పోతుంది.
ఆ సీన్ లో మద్రాస్ రోడ్లలో....ఆ నటీమణి నటన ఎందరినో ఆశ్చర్య పరచిందంటే అతిశయోక్తి కాదు!
************
పుట్టుకతోనే....భూదేవిని పునీతగా చేసింది! నిన్ను చేపట్టి...నీకీర్తి బ్రహ్మలోకం దాకా వ్యాపింప చేసింది! రఘువంశం మెట్టి..తన పాతివ్రత్యం చేత ఛాయాదేవి ని కూడ మరపింప చేసింది! నీ పితృ..పితామహులనే కాదు...ప్రపితా మహులను కూడా ఊర్ధ్వ లోకాలు పొందేలా చేసింది!
అట్టి పరమపావనికి...అగ్నిపునీతకు...అప్రతిష్టా! ఆ అమాయకురాలిని త్యజించడం....నీకు ప్రతిష్టా?!
లోకంలో ఎక్కడైనా కోడలి గుణదోషాలెంచవలసింది...అత్త. ముగ్గురత్తలం..అంత:పురం పాలిస్తుంటే....మాతో సంప్రదించకుండా...ఆ గుణవతిని వెళ్ళగొట్టడానికి...నీకేం అధికారముంది?!
సీతా పరిత్యాగం గురించి విని...ఆందోళనతో....శ్రీరామచంద్రుని....తల్లి కౌసల్య....ప్రశ్నిస్తున్న ఆ ధాటీ...తీరు....ఆ డైలాగ్ డెలివరీ...అనన్యం...అపూర్వం!.....లవకుశ...మూవీలో.
*************
పసుపులేటి కన్నాంబ. నంద్యాల లో అక్టోబర్ 5- 1911 న జన్మించి...కడపలో పెరిగి...నాటకాలతో....మద్రాస్ చేరుకున్న కన్నాంబ...13 ఏళ్ళకే......సావిత్రి, అనసూయ, చంద్రమతి పాత్రలకు పేరెళ్ళిపోయింది.
వారి హరిశ్చంద్ర నాటకాన్ని చూసి....అదే పాత్రధారులతో 1935 లో స్టార్ కంబైన్స్ వారు...మూవీగా తీస్తూ....చంద్రమతి పాత్ర...కన్నాంబకే ఇచ్చారు. అంతకు ముందు 1934 లో సీతాకల్యాణం లో చిన్న పాత్ర వేసినా పెద్ద పేరు రాలేదు!
జస్ట్ స్టేజి డ్రామా.....యథాతధంగా తీశారు! అప్పుడు టెక్నాలజీ లేదు. స్పాట్ లో రికార్డింగ్....మైక్ లు...మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవీ కనబడకుండా మేనేజ్ చేసి....టేక్ చేయడమే! పెద్దగా అరుస్తూ చెప్పాలి డైలాగ్ లు. పాటలు....పద్యాలు అవీ...ఇంకా గట్టిగా....సొంతంగానే పాడుకోవాలి! అయినా....మూవీ సూపర్ హిట్ అయ్యింది!
అప్పటికే...నాటకాల్లో రాటుతేలిన కన్నాంబ గారు....అదరగొట్టారు!
అసలు....నటనంటే....ఏమిటో.....డైలాగ్ డెలివరీ ఎలా చెప్తే....ఆకట్టుకోవచ్చో....మొట్టమొదట సినిమాలకు నేర్పింది....కన్నాంబ గారే అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు!
అప్పట్లోనే తమిళ, తెలుగు రంగాలు రెండింటిలోనూ....సూపర్ స్టార్ గా వెలుగొంది....నాగయ్య గారితో సమానంగా పారితోషికం తీసుకున్నది ఒక్క కన్నాంబ గారే!
************
హరిశ్చంద్ర(1935), ద్రౌపది వస్త్రాపహరణం(36), కనకతార(37),సారంగధర(37),గృహలక్ష్మి(38),మహానంద(39), చండిక(41),.......
1941 లో నిర్మాత - దర్శకుడు అయిన కడారు. నాగభూషణం గారితో వివాహం. ఇద్దరూ కలిసి...రాజ రాజేశ్వరి నాట్యమండలి స్థాపించడం...అది క్రమేణా రాజరాజేశ్వరి కంబైన్స్ గా మారి మూవీస్ తీయడం....షుమారు 30 సినిమాలు తీశారు సొంతంగా తెలుగు & తమిళం కలిసి!
కన్నాంబ గారు షుమారు 170 మూవీస్ చేశారు. తల్లిప్రేమ(41), కన్నగి(42), సుమతి(42),మహామాయ(45)మాయాలోకం(45), మాయామశ్చీంద్ర(45),పాదుకా పట్టాభిషేకం(45),......ఈ మూవీస్ ఏవీ కూడా ఇప్పుడు చూడలేం. కాలగర్భంలో కలిసి పోయాయి!
కేరక్టర్ ఆర్టిస్ట్ గా వేసిన మూవీస్ మాత్రం కొన్ని చూడగలం. ముగ్గురు మరాటీలు(46), పల్నాటి యుధ్ధం(47),మనోహర(54),అనార్కలి(55), రాజ మకుటం(1960), జగదేక వీరుని కథ, ఆడపెత్తనం, కుటుంబ గౌరవం, తోడికోడళ్ళు, లవకుశ వంటివి....చూస్తే...కన్నాంబ గారి నటనా వైధుష్యం ద్యోతకమౌతుంది.
***********
రాజ రాజేశ్వరి కంబైన్స్ ఆఫీస్ & ఇల్లు.....అంటే...ఆ రోజుల్లో...ఓ పెద్ద అన్న సత్రమే మద్రాస్ మహానగరంలో!
తమ జాతకాలు సినీ సీమ లో పరీక్షించుకోదలుచుకున్న వారికి వారి ఇల్లు....ఓదార్పు నిచ్చే మజిలీ! రేలంగి, పద్మనాభం...ఇంకా ఎందరో....వారి ఇంట ఉండి...పైకి వచ్చిన వారే!
ఎవ్వరికీ....కాదని చెప్పలేని కరుణా మూర్తులు కన్నాంబ దంపతులు!
లక్షల్లో ఆదాయం....అప్పట్లో బంగారు కాసులు డబ్బాల్లో పోసి...పోపుల డబ్బాల మధ్య పెట్టుకునే వారట కన్నాంబ గారు. అదో తరహా జాగ్రత్తేమో!
పిల్లలు లేరు. రాజ రాజేశ్వరి అని పేరు పెట్టుకుని ఓ పాపను పెంచి పెద్ద చేసి...దర్శకుడు సి.ఎస్. రావు కిచ్చి పెళ్ళి చేశారు.
30 సినిమాలు తీస్తే....అన్నీ ఆడవుగా! కొన్ని నష్టాలు తెచ్చాయి. దానధర్మాలు మాత్రం తగ్గలేదు!
వచ్చిన ఆస్తి....వచ్చినట్లే కరిగి పోయింది. ఆస్తులు సంపాదించడం కంటే...నిలుపుకోవడమే కష్టం మరి!
ఇక పెంచిన కూతురి భర్త....సి.ఎస్. రావ్. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు.....రాజసులోచనను. వారి దాంపత్యం కూడా సజావుగా సాగలేదు! అది అప్రస్తుతం.
1964 మే- 7 వ తేదీ....53 ఏళ్ళకే....మృత్యువాత పడ్డారావిడ! భర్త కృంగి పోయారు.
కన్నాంబ గారి చివరి మూవీ ...నాగయ్య గారి భక్త రామదాసు. కొంత డబ్బింగ్...చివరి సీన్లో...టి.జి.కమలాదేవి గారు చెప్పారు!
వారి ఆచారమో...మరి భర్త కడారు నాగభూషణం గారి సెంటిమెంటో గానీ...కన్నాంబ గారిని సమాధి చేసేప్పుడు....పట్టుచీర తో...నగలతో...సమాధి చేస్తే....
మరుసటి రోజు పాలు పోసేందుకు వెళ్ళినప్పుడు....సమాధి త్రవ్వి...పట్టుచీర, నగలు...దొంగలు దోచుకుని...పోయారట!
పెద్ద భవంతులలో గడిపిన కడారు నాగభూషణం గారు.....చివరి రోజుల్లో చిన్న గదిలో గడిపారు!
ఓ ట్రంకు పెట్టె, ఓ కుర్చీ...నేల మీద చాప. అంతే!
కానీ గది గోడమీద...కన్నాంబ గారి చిత్ర పటం మాత్రం....అద్భుతంగా ఉండేదట మహా తేజస్సుతో....నిలువెత్తు చిత్రం!
ఈ రోజు కన్నాంబ గారి జయంతి(5-10-1911).

(వివరాలు తెలియజేసిన మిత్రులు Prasad Kvs గారికి ధన్యవాదాలు)

కామెంట్‌లు లేవు:

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...