22, జులై 2024, సోమవారం

శ్రీరామచంద్రుడు


 

నా చిత్రానికి మిత్రులు, కవిగ శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి పద్య స్పందన యధాతధంగా

ప్రముఖ చిత్రకారులు శ్రీ PvrMurty గారు చిత్రించిన అయోధ్య రాముని చిత్రానికి నేను వ్రాసుకున్న పద్యభావన చిత్ర దాత కు ధన్యవాదాలు అభినందనలతో

జై శ్రీరామ్ 👌🙏👌

కం .

ఒకటే మాటకు నిలబడి

యొకటే సతి నీమమెంచి యుగపురుషుడవై

ఒకటే బాణము తోడుత

సకల జనుల గావుమయ్య జగదభి రామా

20, జులై 2024, శనివారం

మనము నా మధురోహలతో - పద్యం


నా చిత్రానికి శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి పద్య రచన:

శ్రీ Pvr Murty గారి అద్భుతమైన పెన్సిల్ స్కెచ్ కి

నాకలం కవిత కందరూపంలో 

అద్భుతంగా చిత్రించారు అభినందనలు సార్

కం.

మనమున మధురోహలతో

తనువెల్లా పులకరించి తమకము తోడన్

తనప్రియుని రాక కొరకై

ముని కన్నియ వేచియుండె మోహిత యగుచున్


పద్య రచన : శ్రీ వెంకటేశ్వర ప్రసాద్

18, జులై 2024, గురువారం

ఆనందనిలయ ప్రహ్లాదవరదా భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా॥పల్లవి॥ - అన్నమయ్య కీర్తన


 

ఆనందనిలయ ప్రహ్లాదవరదా
భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా॥పల్లవి॥


పరమపురుష నిత్య ప్రహ్లాదవరదా
హరి యచ్యుతానంత ప్రహ్లాదవరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాదవరదా
భరిత కల్యాణగుణ ప్రహ్లాదవరదా॥ఆనం॥


భవరోగసంహరణ ప్రహ్లాదవరదా
అవిరళ కేశవ ప్రహ్లాదవరదా
పవమాననుతకీర్తి ప్రహ్లాదవరదా
భవపితామహవంద్య ప్రహ్లాదవరదా॥ఆనం॥


బలయుక్త నరసింహ ప్రహ్లాదవరదా
లలిత శ్రీవేంకటాద్రి ప్రహ్లాదవరదా
ఫలితకరుణారస ప్రహ్లాదవరదా
బలివంశకారణ ప్రహ్లాదవరదా॥ఆనం !!


అన్నమయ్య కీర్తన - చిత్రాలు ః పొన్నాడ మూర్తి



5, జులై 2024, శుక్రవారం

అందం - కవిత

అందం - కవిత: మిత్రులు రాజా హుస్సేన్


అందం ..

నీ మోముదా?

ముంగురులదా?


నా మటుకు నేను

నీ హృదయ సౌందర్యాన్నే

ఇష్టపడతాను…!


బాహ్య సౌందర్యం

శిశిరమైతే…

అంతః సౌందర్యం 

వసంత శోభ.!!


(చిత్రం..పొన్నాడ మూర్తిగారు)


*ఎ.రజాహుసేన్..!!

 

3, జులై 2024, బుధవారం

కాలప్రవాహం - కవిత


 శ్రీ Pvr Murty గారి చిత్రానికి నా కవిత. 

మూర్తి గారూ ధన్యవాదాలండీ 🙏


దేవత ప్రత్యక్షమయే కాలాన

వాలిపోయే నా కనురెప్పలుతెరచి సూటిగా తనని చూడాలి 

తడబడుతూ పాలిపోయిన  నా పెదవులు  తనని చూసి

చిరునవ్వున విచ్చుకోవాలి


నా చుట్టూ ఉన్న నిశ్శబ్దపు గీతల మీదుగా

గుప్పిలి మూసుకోనున్న

గుప్పెడు గుండె సవ్వడి

తను ఆలకించాలి


గొంతు పెగిలి రాని నా ఆహ్వానం 

మన్నించి తాను వస్తే

తన ఆహ్వానానికి స్వాగతం పలికి

నా నుంచి నేనే

తనతో ప్రయాణం చేయాలి


వణికిపోయే నా చేతులకి

ఓ ఆసరా ఊతమిచ్చి

ఇక పదపదమంటూ

చివరి తెరని నా కనులపై వేసి

మౌనంగా తన వెంట 

తోడ్కొని పోయే నా నేస్తం 

రానే వచ్చిననాడు


ఆనాడు.. 


సాగిపోయే ఆ కాలంలో

తనతో నేను కలిసిపోయి


నా కాలం, నా గమనం

ఆగిపోయినదని

గమనించిననాడు

కాల ప్రవాహంలో

కనుమరుగైన శిలాఫలకమై పోతాను.


కలవల గిరిజారాణి.


ఇదివరలో భావుకలో వ్రాసిన కవిత ఇది.

29, జూన్ 2024, శనివారం

తెలగాణ్య అగ్రగణ్య తేజము - పీవీ నరసింహారావు


 నా చిత్రానికి మిత్రుడు పొన్నాడ మురళి గారి భావ వ్యక్తీకరణ

తెలగాణ్య అగ్రగణ్య తేజము, రాజ్య పూజ్యము పీవీ

ఇల నిలిచి గెలిచిన పలు ప్రజ్ఞల పండిత ప్రతిభా జీవి !!


శిల నుండి చెక్కిన సుందర శిల్పమోలే ఖ్యాతి గాంచినావు

పలుభాషలనవలీలగ నేర్చి విశ్వమున ఘనతనొందినావు !!


విలువల రాజకీయము సల్పి మేలు పదవులెన్నో చేపట్టినావు

మలుపుల కుటిల మర్మముల కౌటిల్య కౌశలము చూపినావు !!


తలవని తలపున తలుపు తట్టిన అత్యున్నత పదవి

కలి కష్ట కాలమున చేపట్టి, హస్తిన నేలిన జగజ్జెట్టీవీవు !!


మలి సంధ్యన భరత భువినేలి మేటి పాలనందించినావు

పలు విధముల విపణి వీధుల తెరిచి విత్త విస్తరణ చేసినావు !!


అలుపెరుగక శ్రమ సలిపి ఆర్ధిక పరిపుష్టి చేకూర్చినావు

నేల నలు చెరగుల మన ఖ్యాతినినుమడింపజేసినావు !!


కలనైనా ఇల మరువదు నిను...ఓ మాన్య ధన్య చిరంజీవి

మేలిమి బంగరు వన్నెల మేటి, పాములపర్తి వెంకట నరసింహ ఠీవి !!

25, జూన్ 2024, మంగళవారం

ఏకాంత సమారాధన - కవిత



Ammu Bammidi కవితకి నా చిత్రం. సమ్మతించిన అమ్ముకి ధన్యవాదాలు. శుభాశీస్సులు


ఏకాంత సమారాధన

( కృష్ణార్పణం ; శుభోదయం)

🌹🌹🌹🌹🌹🌹🌹🌹


గాలి తరంగాలకెంత ఇష్టమో..!

నీ చూపును భుజాలపై మోసుకుని

నేరుగా నా కళ్ళలోకి చేర్చాలని!!


ఎన్నాళ్ల తర్వాతో ఆ కలయిక!

వసంతంలా ఒక్క ఉదుటున 

ఆ చూపు నన్నల్లుకోగానే..

మనసు పువ్వై విరబూస్తుంది..!


ఊపిరి ఎన్ని సార్లు ప్రవహించిందో..

ఇరు మనసుల మధ్య వారధి కట్టాలని!!


పరస్పర యోగక్షేమాల పలకరింపుల్లో

గుండె అంచును 

ఎన్నిసార్లు తాకిందో సంతోషం.!


ఒకే కొమ్మకు రెండు లతలల్లుకున్నట్టు

ఒకే రేఖపై ఇరు చూపులూ ఏకమై 

అప్రమేయంగా పలికిన మౌనరాగం

ఒక్క క్షణమే అయినా..

ఆజన్మాంతం సరిపడా ప్రణయకావ్యమేగా!!


చిమ్మచీకట్లో దారి చూపే

నక్షత్రాల వెలుగు.. ఆ చూపు..!

కష్టాల చీకట్లో తోడు నిలిచే 

కిరణఖడ్గం ఆ చూపు!


రోజూ వేలాది కృత్రిమ నవ్వుల 

పలకరింపుల కన్నా..

నీ కంటి చూపుతో జరిపే

ఏకాంత సమారాధన ఒక్కటి చాలుకదా

నా ఉనికి తెలపడానికి..!!


- ఎస్. అమ్మూ బమ్మిడి



https://www.facebook.com/share/p/8mKi2q4LBz4ETYLC/?mibextid=oFDknk


శ్రీరామచంద్రుడు

  నా చిత్రానికి మిత్రులు, కవిగ శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి పద్య స్పందన యధాతధంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ PvrMurty గారు చిత్రించిన అయోధ్య రామ...