22, జులై 2022, శుక్రవారం

ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామభద్ర సీతారమణ సర్వేశ -- అన్నమయ్య కీర్తన


 


ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామభద్ర సీతారమణ సర్వేశ            //పల్లవి // 

వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే అరయ విరిగె వీపు లసురలకు వరుస వనవాసపు వ్రతము వట్టినపుడె పరులమతుల భీతి వట్టె రఘురామ         //ఏమని // 

వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే చొచ్చిరి పాతాళ మసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే కొచ్చి దైత్యు లాసదెగఁ గోసిరి శ్రీరామ        //ఏమని // 

అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ              //ఏమని //

 

భావము

ఉపాయముతో నీవు శివధనుస్సును విఱిచినపుడే వీరులైన రాక్షసుల వెన్నెముకలు విఱిగిపోయాయి. వనవాసం చేయుట అనే వ్రతానికి నీవు పూనినపుడే శత్రువులైన అసురుల మనస్సులలో భయం జనించింది

నేర్పుతో దండక అనే అడవిలోనికి నీవు ప్రవే శించినపుడే రక్కసులు భీతిచెంది బలిచక్రవర్తి నివాసమైన పాతాళం చేరి దాగుకొన్నారు

అవక తవకగా మాటాడిన సూర్పణఖ  పొడుగుపాటి ముక్కును నీవు తెగగోయించినపుడే దుర్మార్గులైన దానవుల ఆశలన్నీ తెగిపోయినవి. విజృంభించి నీవు మారీచునిపై బాణం వేసిననాడే దైత్యులు తమ సంబరములు మాని వేసినారు. శరణాగతుడైన విభీషణునికి నీవు ఆశ్రయ మొసగినపుడే సీతా పతీ !శ్రీనివాసా !దనుజులకు చీడ పట్టినది

(భావమూలము :విద్వాన్ ముదివర్తి కొండమాచార్యుల వారి అమృత సారము) అన్నమయ్య సంకీర్తన సంఖ్య 281సంపుటం 4 స్వర కర్త :శ్రీ జోశ్యభట్ల రాజశేఖర శర్మ గారు


(కీర్తన SVBCTTD APP వారి సౌజన్యంతో )


చిత్రాలు : పొన్నాడ మూర్తి 

ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఈ కీర్తనను అద్భుతంగా గానం చేసిన చి. జొన్నలగడ్డ శ్రీకర్ గొంతులో వినవచ్చును.

https://www.youtube.com/watch?v=LQHnCTorloU


ధన్యవాదాలు 

 


 

21, జులై 2022, గురువారం

అరియకుడి రామానుజ అయ్యంగార్ - కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు

Charcoal pencil sketch


అరియకుడి రామానుజ అయ్యంగార్ (19 మే 1890– 23 జనవరి 1967 --  కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. ఇతడు పాడటంలో సరికొత్త శైలిని అభివృద్ధి చేశాడు. దానిని అరియకుడి సంప్రదాయంగా అతని శిష్యులు అనుసరిస్తున్నారు. ఇతడు కర్ణాటక సంగీత కచేరీలలో నూతన పద్ధతులను స్థిరపరిచాడు.

1954లో ఇతనికి సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది. 1958లో భారత ప్రభుత్వం ఇతనికి పద్మభూష్గణ్ పురస్కారం  ఇచ్చి సత్కరించింది.


ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని కరైక్కుడి జిల్లా (ప్రస్తుతం శివగంగై జిల్లా) అరియకుడి పట్టణంలో 1980, మే 19 న జన్మించాడు.  ఇతడు మొదట పుదుక్కోటై మలయప్ప అయ్యర్, నమక్కల్ నరసింహ అయ్యర్‌ల వద్ద విద్యనభ్యసించాడు. తరువాత పెక్కు సంవత్సరాలు పట్నం సుబ్రమణ్య అయ్యరు శిష్యుడు పూచి శ్రీనివాస అయ్యంగార్ వద్ద శిక్షణ పొందాడు


ఇతడు తన మొదటి ప్రదర్శన 1918లో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో ఇచ్చాడు.

కర్ణాటక సంగీత దిగ్గజం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ ఇతని గురించి ఇలా పేర్కొన్నాడు. "నేను అరియకుడి రామానుజ అయ్యర్ చేత చాలా ప్రభావితమయ్యాను. నేను ఇతనిలా పాడగలిగితే చాలు. నాకు ఇక పునర్జన్మ అక్కరలేదు". మరొక విద్వాంసుడు జి.ఎన్.బాలసుబ్రమణియన్ ఇతడు ఎదురు పడితే భక్తితో సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఇతడు మృదంగ కళాకారుడు పాలఘాట్ మణి అయ్యర్‌తో కలిసి అనేక కచేరీలు చేశాడు. ఇరువురికీ ఒకరి పట్ల మరొకరికి గాఢమైన స్నేహంతో పాటుగా గౌరవం ఉండేది. చెంబై వైద్యనాథ భాగవతార్అరియకుడి రామానుజ అయ్యంగార్ ఇద్దరూ తన రెండు కళ్ళని పాలఘాట్ మణి అయ్యర్ చెబుతుండేవాడు.


(సౌజన్యం ః వికీపీడియా)

 

17, జులై 2022, ఆదివారం

ఆకటి వేళల అలపైన వేలల తేకువ హరినామమే దిక్కు మరి లేదు - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన - ఆకటి వేళల అలపైన వేళలను :
చిత్రం : పొన్నాడ మూర్తి
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi.
ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు
కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు
ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు
సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు

భావం :

విశ్వాత్ముడు, విశ్వేసుడు, విశ్వమయుండైన ఆ విధాత తప్ప అన్యులెవరూ మనల్ని కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి తప్పించలేడు. ఆర్తితో ఒక్కమారు ఆ ఆపద్బాంధవుణ్ణి వేడుకుంటే చాలు. ఎన్ని బాధల బంధాల నుంచైనా విడుదల చేయించగలడు.
అదే విశ్వాసాన్ని అన్నమయ్య ఈ కీర్తనలో పరమాత్ముని ప్రార్ధించాడు.
ఆకలిగా ఉన్నవేళ అలసిపోయిన వేళ ఇలా ఎప్పుడైనా ఆ శ్రీహరి నామమే మనకు శరణ్యం. ఆ దివ్య నామమే “తేకువ” అంటే ధైర్యమని గుర్తుచేస్తున్నాడు.
‘కొరమాలి ఉన్నవేళ, కులము చెడిన వేళ … అన్న చరణంలో ఎందుకూ కొరగాని దుస్ఠితి దాపురించినప్పుడు, కులము చెడినప్పుడు, ఇతరుల చెరలో చిక్కి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, ఒరపైన అంటే ప్రకాశవంతమైన శ్రీహరి నామమే శరణమని, అంతకు మించిన మార్గమే లేదని ఆంటున్నాడు అన్నమయ్య.
ఆపద వచ్చిన వేళ ఆరడి పడిన వేళ .. అనే చరణంలో అహంకారాన్ని విడిచి బాధ్యతనంతా ఆ భగవానుడిపైనే వేస్తే తనే మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు అని అన్నమయ్య భావన.
"సంకెళబెట్టిన వేళ చంపబిలిచిన వేళ" .. ఈ చరణంలో సంకెళ్ళు వేసినా, చంపడానికి శత్రువులు దరిదాపులోకి వచ్చినా, పాప పుణ్యాలనే అప్పులు తీర్చమని కాలపురుషుడే అడ్డంగా నిలబడినా ఆ దీనబాంధవుడైన వేంకటేశుని నామమే గతియని, దానిని వదలి మంకుబుధ్ధితో అంటే మూర్ఖత్వంతో ఎంత ప్రయత్నించినా మరో దారి లేదని ముగుంపు పలుకుతున్నాడు అన్నమయ్య,

(శ్రీమతి బి. కృష్ణకుమారి గారి వ్యాఖ్యానం ఆధారంగా)

Sudershanacharya Tulasi
Like
Comment
Share

0

 

10, జులై 2022, ఆదివారం

ఎస్ ఎస్ వాసన్ - జెమినీ సంస్థ అధినేత - బహుముఖ ప్రజ్ఞాశాలి


Pen sketch 


బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మభూషణ్, జెమిని సంస్థ అధినేత S. S. Vasan (1904-1969) (pen sketch).


వీరి గురించి టూకీగా :

సుబ్రమణ్య శ్రీనివాసన్, సినీ నామధేయం ఎస్.ఎస్.వాసన్, జెమినీ స్టూడియోస్ అధినేత. . తన రెండు సంవత్సరాల వయస్సులో తండ్రి మృతిచెందినా కృంగిపోలేదు. వాసన్ ఆలోచనలకు పేదరికం అడ్డంకి కాలేదు. ఒకొక్క అడుగూ ముందుకువేస్తూ పలు రంగాల్లో ఉన్నత శిఖరాలను అందుకున్నాడు. వీరు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.
'పద్మభూషణ్' పురస్కారం అందుకున్నాడు. భారత ప్రభుత్వం వీరి గౌరవార్ధం తపళాబిళ్ళ విడుదల చేసింది.

చాల ముందు చూపు కల వ్యక్తి, దానికి చక్కటి ఉదాహరణ ఒకటి ఉంది.
ఇప్పుడు మనం చూస్తున్న, అమెజాన్, ఫ్లిఫ్కార్ట్, లాగా 1925 లోనే పోస్టల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేసి, ఎవరికి ఏ వస్తువు కావాలన్నా, పోస్ట్ ద్వారా సప్లై చేసే వారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్ లాగా, పోస్టల్ మార్కెటింగ్ అన్న మాట. అసలు సినీ పరిశ్రమకు ఏమి సమబంధం లేని వాసన్ గారు జెమినీ స్టూడియో స్థాపించడానికి వెనుక కూడా ఒక ఆసక్తికరమయిన కధ ఉంది. ” ఆనంద వికటన్ ” అని పత్రిక స్థాపించిన వాసన్ గారికి కొంత మంది సినీ పరిశ్రమకు సంబంధించిన వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. 1941 లో అగ్ని ప్రమాదానికి గురి అయి నష్టాలలో ఉన్న” “మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్” అనే స్టూడియో వేలానికి వచ్చింది,

ఆ స్టూడియో ను వాసన్ గారు 86 ,425 రూపాయలకు కొన్నారు. వాసన్ గారు ఆ స్టూడియో కి “జెమినీ స్టూడియో” అని నామకరణం చేసారు. అప్పట్లో వాసన్ గారు చాల తరచు గ గుర్రపు పందాలకు వెళుతుండే వారట, అయన తన ఫేవరెట్ గుర్రం ” జెమినీ స్టార్ ” అనే గుర్రం మీద పందెం కాసే వారట, ప్రతి సారి ఆయనకు విజయమే, భారీ మొత్తం లో డబ్బులు గెలిచే వారట. ఆలా గెలిచిన డబ్బుతోనే స్టూడియో కొన్నారని,అందుకే తన లక్కీ హార్స్ పేరును స్టూడియో కి పెట్టారు అని ఒక కధనం. కానీ వాసన్ గారు “మిధున రాశి” కి చెందిన వారు కావటం తో తన స్టూడియో కి జెమినీ అని పేరు పెట్టారు అంటారు మరి కొందరు. విజయ వంతమయిన చిత్రాలకు మారు పేరుగ మారారు, ఎంతగా అంటే శ్రీ శ్రీ వంటి మహా కవి, ” సినిమా బాగా నడిస్తే వాసన్, లేకుంటే ఉపవాసన్ ” అని నిర్మాతల గురించి చమత్కరించేటంత.

(సేకరణ : ఇక్కడా అక్కడా) 

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...