29, జులై 2016, శుక్రవారం

ఆలింగన సౌందర్యం - పెన్సిల్ చిత్రం.


facebook లో సుధారాణి గారి కవిత ఈ బొమ్మకి బాగుంటుందనిపించింది. .చదవండి. సుధారాణి గారికి నా ధన్యవాదాలు.

ప్రియతమా......
నీ ఎదుట నిలిచిన.... ..తొలి క్షణం
నాక్కావాలి.....మళ్ళీ
నీ కళ్ళల్లోకి చూసిన.....తొలి క్షణం
నాక్కావాలి....మళ్ళీ
నీతో నడిచిన............ తొలి క్షణం
నాక్కావాలి...మళ్ళీ
నీతో మాట్లాడిన .........తొలి క్షణం
నాక్కావాలి....మళ్ళీ
నువ్వు కొంటెగా నవ్విన..తొలి క్షణం
నాక్కావాలి...మళ్ళీ
నిను స్పృశించిన .........తొలి క్షణం
నాక్కావాలి...మళ్ళీ
నీ చెక్కిలిపై ముద్దాడిన.. తొలి క్షణం
నాక్కావాలి ....మళ్ళీ
నీ కౌగిలిలో నలిగిన .....తొలి క్షణం
నాక్కావాలి... మళ్ళీ
నువ్వు సుతారంగా
నా ముంగురులు సర్దిన... తొలి క్షణం
నాక్కావాలి... మళ్ళీ
నువు పరవశాన నా కాలి
అందియలు తొడిగిన...... తొలి క్షణం
నాక్కావాలి.... మళ్ళీ
నువు పున్నమి రేయిన
వెన్నెలతో అభిషేకించిన....తొలి క్షణం
నాక్కావాలి....మళ్ళీ
నీ మాటల పాటల్లో ఛమేలిల
సౌగంధం గుభాళించిన....తొలి క్షణం
నాక్కావాలి....మళ్ళీ
వెన్నెల రాత్రి నక్షత్రాలను
కలిసి లెక్కెట్టిన........... తొలి క్షణం
నాక్కావాలి ... మళ్ళీ
నీ భుజంపై గోముగా
తల వాల్చిన............ తొలి క్షణం
నాక్కావాలి.....మళ్ళీ
నువు బంగారం అంటూ
హత్తుకున్న............. తొలి క్షణం
నాక్కావాలి ......మళ్ళీ
మధురమైన ఆ..... తొలి....క్షణాలన్నీ
నాక్కావాలి......మళ్ళీ......మళ్ళీ......
ఎందుకంటే....
నా ప్రాణం నువ్వు
నాలో వున్నది నువ్వు
నాదంటూ నువ్వే
నాదన్నదంతా నువ్వే..............

సుధామయి

కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు - అన్నమయ్య కీర్తన


కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు
ప్రమదంబులునింతంతని పలుకంగ రాదు
1. మించిన చొక్కులు మీరిన యాసలు
పంచేంద్రియముల భాగ్యములు
యెంచిన తలపులు యెడపని వలపులు
పంచ బాణుని పరిణత(తు)లూ
2.కనుగవజలములు కమ్మని చెమటలు
అనయము జెలులకు నాడికలు
తనువున మరపులు తప్పని వెరపులు
వినుకలి కనుకలి వేడుకలు
3.మోవి మెరుంగులు ముద్దుల నగవులు
శ్రీ వేంకటపతి చిత్తములు
తావుల పూతలు దర్పకు వ్రాతలు
ఆ విభుగూడిన యలసములు
తాత్పర్యము
పద్మంలో కూర్చుని ఉండే మా అమ్మ అలమేలు మంగమ్మ వైభవములు, ప్రౌఢతనములు ,చక్కదనములు,సంతోషాలు ఇంతింతని చెప్పటానికి వీలు కానివి.పరిమితి లేనివి.
1. మా తండ్రి వేంకటేశునితో ముద్దూ ముచ్చట్లు ఆడుతున్న సమయంలో ఆమె పరవశాలు హద్దుదాటి పోతాయి. ఎంత తీరిన ఇంకా ఏవేవో అపేక్షలు చెలరేగిపోతుంటాయి. తన పంచేంద్రియముల భాగ్యమే భాగ్యము. వాటికి ఎప్పుడూ తృప్తి పొందిన అవస్థలే. అనేకంగా ఇద్దరూ కలబోసుకొనే తలపుల్లో మరీ బాగున్న కొన్నింటిని ఎంచుకొంటూ, విడదీయని వలపులను పంచుకొంటూ, అయిదు బాణాలు కలిగిన మన్మథుడు ఇద్దరి మధ్యా అభివృద్ధిని పొందుతుంటే మా అమ్మ వైభవాలు ఎన్నని వర్ణించను!
2. మా అయ్య వేంకటేశుడు చేసిన చిలిపిచేష్టలను తలుచుకొని మా అమ్మ కళ్ల వెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అయ్య మళ్లీ రాబోతున్నాడనే తియ్యటి భావన రావటంతోనే ఏవేవో అనుభావాలు కలిగి పద్మినీజాతి సౌగంధ్యం కలిగిన మా అమ్మ శరీరం నుండి కమ్మటి చెమటలు వస్తున్నాయి. వీటిని అర్థం చేసుకోలేని పెద్దలు - అలమేలు మంగమ్మని ఏదో అన్నారని -మా అమ్మ పక్కన ఉన్న చెలులకు ఎప్పుడూ నిందలు వడ్డిస్తున్నారు. తన శరీరం నిండా పారవశ్యాలు. మా అయ్య వేంకటేశుడు రావటం కాసింత ఆలస్యమైతే చాలు - చిగురుటాకులా వణికిపోతూ తనకి లేనిపోని భయాలు.. ఒకరకంగా ఇవన్నీ చూడటానికి, వినటానికి ఆనందం కలిగించే విషయాలు.
3. మా అయ్య వేంకటేశుడు ఏ రస భరిత చేష్ట చేసాడో తెలియదు కాని - తన పెదవి నిండా తళతళా కాంతులు. ముద్దులు నింపుకొన్న నవ్వులు. ‘చిత్తం వేంకటేశా! మీదయ ..అలాగే” అనే వినయాలు. సుగంధ పరిమళాల పూతలు కొత్తగా మా అమ్మ ఒంటి మీదికి చేరాయి. ఆ మన్మథుడు నఖ క్షతాలతో ఏవేవో శృంగారపు రాతలు మా అమ్మ ఒంటి మీద వ్రాస్తున్నాడు. మా ప్రభువు వేంకటేశుని కలిసిన తర్వాత మా అమ్మకు తీరని అలసటలు.
(ఈ కీర్తనకి తాత్పర్యం అందించిన డా. పతంజలి తాడేపల్లి గారికి ధన్యవాదాలు)

28, జులై 2016, గురువారం

అన్నమయ్య, వేమన - సారూప్యత


అన్నమయ్య - వేమన.
ఆంధ్రావనిలో అవతరించిన మహాకవుల్లో అగ్రగణ్యు లైన ప్రజాకవులూ, ఆధ్యాత్మిక కవియోగులు - ఒకరు తాళ్ళపాక అన్నమయ్య, ఇంకొకరు వేమన్న.
తాళ్ళపాక అన్నమాచార్యులు వేంకటపతి మీద వింత వింతలుగా ముప్పదిరెండు వేల సంకీర్తనలను రచించి, ప్రజాకవియై, భక్తిమాత్రమే కాక ఎన్నో అంశాలను స్పృశించి అన్నివర్గాల ప్రజలకి స్పూర్తి నిచ్చి అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
ఇక వేమన యోగి. ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే మకుట పద్యాలద్వారా అఖండ శివ కేశవాభేద పరబ్రహ్మ తత్వాన్ని చాటుతూ మానవతావాదిగా నిల్చి, నిర్మొహమాటంగా జాతిలోని తెలుపు నలుపులని సున్నితంగా విమర్శించి ప్రజా హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న సాహిత్యమూర్తి.
అన్నమయ్య, వేమనలిరువురి భాషలో, భావాల్లో, పదాల్లో, పదబంధాల్లో ఎన్నో సామ్యాలు స్పష్టంగా గోచరిస్తాయి. అందులో కొన్ని.
ఒక వెర్రివాడు తనమెడలో కట్టుకున్న శివలింగం మీద నమ్మకం లేక పర్వతానికి(శ్రీశైలం) శివుణ్ణి దర్శించడానికి వెళుతున్నాడట. అలాగే తనలోనే అంతర్యామియై యున్న పరమాత్ముడిని కానలేక ఎక్కడో దేవుణ్ణి వెదుకుతున్న అజ్ఞానిని గూర్చి అన్నమయ్య వేమన్నలు ఏమంటున్నారో తిలకించండి.
అరుత లింగము గట్టి యది నమ్మజాలక
పరువత మేగిన బత్తుడనైతి
సరుస మేకపిల్ల చంక బెట్టుక నూత
నరయు గొల్లనిరీతి అజ్ఞానినైతి. అని అన్నమయ్య ఆత్మవిమర్శ చేస్తుండగా వేమన్న ఇలా వివరించాడు.
అరుత లింగముంచి అదియును జాలక
పర్వతమున కేగు పామరుడు
ముక్తి కాననగునే మూఢాత్ముడగుగాక
విశ్వదాభిరామ! వినుర వేమ!
మనసులోని ముక్తి మరి యొక్క చోటను
వెదకబోవు వాడు వెర్రివాడు
గొర్రె చంక బెట్టి గొల్ల వెదుకు రీతి
విశ్వదాభిరామ! వినురవేమ !
మరొక చోట మానవుని చంచల మనస్సును కూర్చి ఈ అనుభవ కవియోగులిలా హెచ్చరించారు.
‘పాయదీసి కుక్కతోక బద్దలువెట్టి బిగిసె
చాయకెంత కట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమది కలకాలము చెప్పినా
పోయిన పోకలే కాక బుద్ది వినీనా’
కుక్కతోక వంకర, దాని వంకర తీర్చడం బ్రహ్మతరం కాదు. అట్లే మనస్సు చపలత్వం కూడా.. అని అన్నమయ్య వ్యాఖ్యానించగా దానినే వేమన్న ఇలా వివరించాడు.
కుక్కతోక దెచ్చి గొట్టంబు చేర్చిన
క్రోవి చెంతనుండు కొంత తడవు
ఎంత చెప్పు చెడుగు పంతంబు మానునా
విశ్వదాభి రామ! వినుర వేమ!
ఇంకా ఇలాంటి సామ్యాలు చాలా ఉన్నాయి. మరోసారి చెప్పుకుందాం.
సేకరణ: ఇక్కడా అక్కడా, -- పొన్నాడ లక్ష్మి.

21, జులై 2016, గురువారం

పెన్సిల్ చిత్రం - తలపోత


ఒక side కి తిరిగి చూస్తున్న ముఖారవిందాన్ని profile view అంటారు. అలా చూస్తున్న ఓ అందమయిన అమ్మాయి photo reference గా తీసుకుని పెన్సిల్ తో వేసుకున్న బొమ్మ ఇది. ఈ బొమ్మ కి చక్కని తెలుగు గజల్ అందించిన శ్రీమతి ఉమాదేవి ప్రసాద్ రావు జంధ్యాల గారికి ధన్యవాదాలు.

నిదురచెడ నిశిరేయి కలలోన కనిపించు 
వదలమని బతిమాల ఒడిలోన పవళించు
చిరునవ్వుతోతాను చిత్తమే దోచాడు
సిగ్గేయు కోరికలు చెవిలోన వినిపించు!
రథమెక్కి వస్తాడు రాణినీవంటాడు
చేతిలో చెయ్యేసి వనిలోన విహరించు!
అంతలో జాబిల్లి నూయలగ తెస్తాడు
శౌర్యమే చేయుప్రతి పనిలోన కనిపించు!
నవలలో నాయకుడు కవితలో ప్రేమికుడు
వీరాధివీరుడే బరిలోన అనిపించు!
ఎవరినీ నన్నొక్క మాటఅననీయడే
మురిపాలు వలపుదోసిలిలోన తాగించు!
నాపేరు శ్వాసించు నాకొరకె జీవించు
నేనేది అడిగినా తృటిలోన తెప్పించు!
ఊర్వశివి నీవంటు కవితలే రాస్తాడు
ప్రేమసుమములనునా సిగలోన పూయించు!

20, జులై 2016, బుధవారం

ఎన్టీఆర్ ఆకర్షణ శక్తి


''యువచిత్ర'' బ్యానర్పై మంచి సినిమాలు తీసిన కె మురారి ''నవ్విపోదురు గాక..'' అనే పేరుతో 520 పేజీల్లో తన జీవితచరిత్ర రాసుకున్నారు. మూడేళ్ల క్రితం అది వెలువడినప్పుడు దానిలోని నాలుగైదు విషయాలను పట్టుకుని పుస్తకాన్ని వివాదాస్పదంగా చిత్రీకరించారు. నిజానికి దానిలో ఆయన చాలా విషయాలు బాగా రాశాడు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వ్యవసాయ కుటుంబాలు రాజకీయాల్లోకి రావడం యిత్యాది అనేక విషయాలు విపులంగా తన కోణంలో రాశారు. ఎన్టీయార్గురించి ఆయన రాసిన ఒక సంఘటన రాస్తున్నాను. 
''
గోరింటాకు'' (1979) షూటింగు కోసం మురారి తన యూనిట్తో వైజాగ్వెళ్లారు. అప్పటి కింకా నటుడుగానే వున్న ఎన్టీయార్పోలీసుల కోసం నిధులు సేకరించడానికి రైల్లో వచ్చారు. ఎవరో ఎన్టీయార్కు చెప్పారు - 'ఊళ్లో దాసరిగారి దర్శకత్వంలో సినిమా షూటింగు జరుగుతోంది' అని. నిర్మాతెవరో కనుక్కుని ఆయన అనుమతి తీసుకుని ఆర్టిస్టులందరినీ పెరేడ్గ్రౌండ్స్లోని కార్యక్రమానికి తీసుకురమ్మనమని ఎన్టీయార్మనిషిని పంపారు. అతను తన వద్దకు రాగానే మురారికి ఒళ్లు మండింది 'ఆయన ప్రోగ్రాం కోసం మనం షూటింగు కాన్సిల్చేసుకుని వెళ్లడమేమిట'ని. డైరక్టరు దగ్గరకి పంపితే ఆయనే కుదరదంటాడు అనుకుని మనిషిని పంపితే దాసరి 'అలాగే, అందరం వస్తాం' అని చెప్పి పంపించేశారు. భోజనాల దగ్గర విషయం తెలిసి మురారికి చికాకేసింది. ఆయన ఎయన్నార్కు వీరాభిమాని కావడం, స్వతహాగా అహంభావం, దూకుడు వుండడంతో దాసరితో ''కావాలంటే మీరు వెళ్లండి, నేను రాను'' అని చెప్పేశారు. సావిత్రి అది విని ''అలా అనవచ్చా? మేమందరం వుండగా నీ దగ్గరకే మనిషిని ఎందుకు పంపారు? నిర్మాతగా గౌరవం యిచ్చినట్లే కదా'' అన్నారు. మురారికి ఏం చెప్పాలో తెలియకుండా ఆలోచిస్తూంటే 'సాయంత్రం ఫంక్షన్కు దండలు ఏర్పాటు చేయండి' అని దాసరి ప్రొడక్షన్వాళ్లకు చెప్తున్నారు. మురారికి యింకా పట్టుదల వచ్చింది - '' దండలు మీరందరూ వేస్తే వేయండి, నేను అక్కడకు వచ్చినా దండా అదీ ఏం వేయను'' అన్నారు.
మురారికి చాలా ఆత్మీయుడైన శోభన్బాబు అప్పుడు ''నువ్వు అక్కడికి వెళ్లగానే ఆయన నిన్నే ముందు పిలుస్తారు, నువ్వు దండ వేస్తావు. తర్వాత నీ మాటలు, చేతలు నీ అధీనంలో వుండవు'' అన్నారు. మురారి తెల్లబోయి చూస్తే ''అవును, నువ్వు ఆయన దగ్గరకు వెళ్లగానే ఆయన కళ్లలోకి చూడగానే నీ మతి మతిలో వుండదు. ఆయన ముఖంలో అంతటి ఆకర్షణశక్తి వుంది.'' అని రెట్టించారు. ''సోదె కబుర్లు చెప్పకు'' అని మురారి కొట్టి పారేశారు. ''నేను చెప్పినట్లు నువ్వు లేచి వెళ్లి ఆయనకి దండ వేస్తావు. దమ్ముంటే పందెం కాయి'' అన్నారు శోభన్‌. పక్కనే వున్న నటుడు చలం, దాసరి కూడా శోభన్వైపు మాట్లాడుతూ పందెం అన్నారు. ''ఓడిపోతే రేపు మీ అందరికీ లంచ్లో స్వీట్లు, కోడి కూర'' అన్నారు మురారి పంతంగా. సావిత్రి నవ్వుతూ విన్నారు. 
సాయంత్రం మీటింగుకి వెళ్లినపుడు యూనిట్కు సకల మర్యాదలు జరిగాయి, వాళ్ల కార్లను వేదిక దాకా వెళ్లనిచ్చారు, ముందు వరుసలో కూర్చోబెట్టారు. వేదికపై ఎన్టీయార్మైక్వద్దకు వచ్చి 'అందరికీ స్వాగతం, యువచిత్ర యూనిట్టంతా వచ్చినందుకు నిర్మాత మురారి గారికి ధన్యవాదాలు'' అని ''రండి మురారిగారూ'' అంటూ వేదికపైకి పిలిచారు. శోభన్బాబు చెప్పినదానిలో మొదటిది నిజమైంది. మురారికి ఆనందంతో బాటు అనుమానం, కాళ్లలో వణుకు ప్రారంభమైంది. కదలలేదు. సావిత్రిగారు నవ్వుతూ చెయ్యి తట్టి ''నిన్నే పిలుస్తున్నారు, వెళ్లు'' అన్నారు. ''నీ పని అయ్యిందిలే'' అన్నట్టు చలం చూస్తున్నారు. శోభన్బాబు మాత్రం ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని లేచి నిలబడి తన చెయ్యి పట్టుకుని స్టేజి దాకా తీసుకెళ్లారు. కాస్త అయోమయస్థితిలోనే యీయన వేదికపైకి వెళ్లారు. ఎన్టీయార్రాజసంగా తన చూపులతోనే వేదికపై మురారి స్థానాన్ని సూచించారు. వెళ్లి కూర్చున్నారు. తర్వాత దాసరి, సావిత్రి, శోభన్‌, చలం - అందర్నీ వేదికపై ఆహ్వానించారు. సావిత్రి పైకి రాగానే రామారావుగారి పక్కన పదహారణాల తెలుగింటి యిల్లాలులా వున్న ఆయన భార్య బసవతారకం గారికి నమస్కరించారు. అది చూడగానే మురారి అసంకల్పితంగా లేచి తనూ ఆవిడకు నమస్కరించారు.
కాస్సేపటికి దాసరి మైక్తీసుకుని యూనిట్అందర్నీ పరిచయం చేయడం మొదలుపెట్టారు. మొదటగా మురారి పేరు చదివారు. ఈయన బింకంగా, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో దండ తీసుకోకుండా ఎన్టీయార్వద్దకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దండ వేయకూడదని, కేవలం నమస్కారం పెట్టి వచ్చేద్దామని మురారి ప్లాను. కానీ కాస్సేపు పోయాక చూస్తే యీయన దండ వేయడం, పెద్దాయన 'రండి మురారిగారూ' అంటూ దగ్గరకు తీసుకోవడం జరిగాయి. ఇదెలా జరిగిందో తనకే తెలియలేదంటారు మురారి. తన ఆత్మకథలో ''నా చేతికి ఎవరు దండ యిచ్చారో, నేను ఎలా వేశానో నాకే తెలియదు. చలం అంతకుముందే అన్నారు - 'ఆయన ముఖంలోని తేజస్సు మనల్ని మనకి తెలియకుండానే ఆకర్షణలో పడేస్తుంది' అని. తర్వాత ఏం జరిగిందో నాకు యిప్పటికీ గుర్తు లేదు. తెలియని అనుభూతి. నాలో నేను లేను. నిజంగానే ఆయన రారాజు.'' అని రాసుకున్నారు.
తన అవస్థ చూసి చలం, శోభన్బాబు నవ్వుతూంటే మురారికి కోపం రాలేదట. తెలియని ఆనందపు మైకంలో వాళ్లకి మనసులోనే ధన్యవాదాలు చెప్పారట. మురారి మైకం, తన్మయత్వం గమనించిన శోభన్ఆయన కుర్చీలో కూర్చోబోతూంటే కిందపడి పోతాడేమో అన్నట్లుగా లేచి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టారు. మర్నాడు షూటింగు లంచ్లో అందరికీ స్వీట్లు, కోడికూర. ''మురారి పందెం ఓడితే యిలా వుంటుందన్నమాట'' అన్నారు సావిత్రి. 'ఇది ఓడడం కాదు, ఓడి గెలవడం' అనుకున్నారు మురారి లోలోపల. -

(Courtesy : Sri Kameswararao Anappindi, photo courtesy : Sri Sambasivarao Nulu)

త్రిపురనేని గోపీచంద్

త్రిపురమేని గోపీచంద్ + charcoal pencil sketch  త్రిపురనేని  గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 - నవంబర్ 2, 1962) సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత,...