30, జనవరి 2016, శనివారం

జనరల్ కృష్ణారావు - శ్రధ్ధాంజలి


శ్రద్ధాంజలి - తెలుగు తల్లి ముద్దుబిడ్డ, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కొటికలపూడి వెంకట కృష్ణారావు (93) శనివారం తుదిశ్వాస విడిచారు. 1971 బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. ఆయన జమ్మూ కశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. జులై 11, 1989 నుంచి జనవరి 19, 1990 వరకు తొలిసారి జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా పని చేశారు. ఆ తర్వాత మళ్లీ రెండోసారి మార్చి 13, 1993, నుంచి 1998 వరకు గవర్నర్‌గా సేవలందించారు. కేవీ కృష్ణారావు 1923లో విజయవాడలో జన్మించారు. 1942 నుంచి 1983 వరకు ఇండియన్ ఆర్మీలో ఆయన సేవలందించారు. బ్రిటిష్ ఇండియా ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో పనిచేసిన ఆయన యువ ఆఫీసర్‌గా బర్మాలో, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో బెలుచిస్తాన్‌లో సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు విశిష్ట సేవా మెడల్ ఇచ్చి సత్కరించింది.

తెలుగు రచయిత్రులు - 1960
1960 లొ తెలుగు రచయిత్రుల కలయిక - రంగనాయకమ్మ, పాకాల యషోదరా రెడ్డి, రాఘవమ్మ (కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి, భానుమతి రామక్రీష్న, ఇల్లిందల సరస్వతీ దేవి, తురగా జానకీ రాణి, ఊటుకూరు లక్ష్మీకాంతం, తెన్నేటి లత)

వడ్డాణం


శ్రీమతి శశికళ ఓలేటి గారు facebook లో వ్రాసిన పద్యాలు 
వడ్డాణం
1. అడ్డాల., నాడ పిల్లకు.,
విడ్డూరపు తండ్రి యొకడు విత్తము హెచ్చన్,
నడ్డికి మువ్వల గొలుసుల
వడ్డాణము తెచ్చినట్టి వైనము గనరే!!
…………………………………………………
2. పెద్దది యాయెను తరుణిగ,
సద్దుగ బిరబిర పరుగిడి సవ్వడి జేయన్,
ముద్దుగ వడ్డాణ మమరె
అద్దాని నడుముకు జోడు హంసల తోడన్.
…………………………………………………
3. బిడియము పెరిగెను వడివడి,
పొడుగుగ, పొగడలె పెరిగెను పొలతిగ తానున్,
పిడికెడు నడుమున యొదిగెను
ఒడుపుగ వడ్డాణమదియె యూర్వశి బోలన్.
…………………………………………………
4. గడసరి మగనిని సరసిజ
అడిగెను వడ్డాణమొకటి నరవంకి జతన్
ముడిచిన మోమది వడలగ,
వడివడి చేయించి తెచ్చెవజ్రపు నగ తాన్.
…………………………………………………
( ఈ పద్యము కందముగా గ్రహించ వద్దని మనవి)
5. కాంచన మందున మెరయుచు,
కాంతల నడుములు ముదమున కౌగిళు లిడగన్,
కాంచిన శృంగార మొలుకు
కాంతుల రత్నము , పగడము కనువింద గుచున్.
************************
5. కాంచన మందున మెరయుచు,
అంచలు, సరములు, కమలము, లమరగ, తాదీ
వించుచు, సింగపు నడుముకు,
పెంచెను శోభను యనఘయె పేరిమి తోడన్.
…………………………………………………
6. వయ్యారము పెంపొందగ,
వెయ్యొంతులు విలువ నిచ్చు విరియగ సొగసుల్
అయ్యారే! వడ్డాణము
వెయ్యగ నెల్లరు సుదతులు వెలుగగ మోముల్. 29, జనవరి 2016, శుక్రవారం

దండ వంకీ యదియె దక్షిణ హస్తాన - దండ కడియాలు - పద్యాలు


.

శ్రీమతి శశికళ ఓలేటి గారి పద్యాలు చక్కని పద్యాలు  - వారి అనుమతితో ఇక్కడ పొందుపరుస్తున్నాను.
దండ వంకీ
*******
దండ ఒంకి యదియె దక్షిణ హస్తాన
ధగధగలుగ మెరయ దండి గాను.
పచ్చ,రవ్వ, కెంపు , పచ్చరించి పొదిగి
సొగసు కత్తె కెంతొ సొబగు లద్దె.
…………………………………………
అరటి దూట వంటి అందాల చేతికి
అమరె బంగరమున అర్ధ వంకి
వంక లేని వనిత వర్ఛస్సు మరిపెంచి
మురిపెముగను తొడిగె మురియ ముదిత.
……………………………………………
చేతి గాజు లెంతొ సింగార మొలుకుతూ
చేవ కూర్చె తరుణి చేతి కెంతొ
పోటికొచ్చెనదె పొళ్ళ బంగరు వంకి
కేకి బొమ్మ పెంచ, కేలు సొగసు.
……………………………………………
కలువ తూడు లవిగొ కరములు లలనవి
కోమలాంగి కేలు కోరె మగడు.
కండ లేని దండ కమరించె నాతడు
కమలజాక్షి వంకి కలికి సిరికి.
……………………………………………
వజ్రఖచిత మైన వడ్డాణమునకదె
సరిగ బోలు నట్టి సరసి ఒంకి
ఒంకరేమి లేని వొరు వరస పట్టెడ
వంక జాబిలల్లె సొంపు కూర్చె.
……………………………………………
జోడు హంస లవిగొ చూడ పతకమందు,
జాలు వారు గొలుసు జార గూడి
కాంతులీను తున్న కనకంపు ముత్యాల,
పచ్చ, కెంపు, కలిసి పసిడి ఒంకి.

28, జనవరి 2016, గురువారం

స్వాతంత్ర్య సమరయోధుడు - లాలా లజపత్ రాయ్ - పెన్సిల్ చిత్రంఈ రోజు స్వాతంత్ర్య సమారా యోధుడు లాలా లజపత్ రాయ్ జయంతి. ఈ సందర్భంగా నేను వేసిన పెన్సిల్ చిత్రం. ఈ మహనీయుని గురించి వికీపీడియా వారు ఏమంటున్నారో ఈ క్రింది లింకులో చదవండి.

https://te.wikipedia.org/wiki/%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE_%E0%B0%B2%E0%B0%9C%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D

27, జనవరి 2016, బుధవారం

ఓ. ప. నయ్యర్ - స్వర మాంత్రికుడు - నా పెన్సిల్ చిత్రం


ఈ రోజు స్వర మాంత్రికుడు ఓ.పి.నయ్యర్ వర్ధంతి. ఈ  సందర్భంగా నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం. ఓ.పి. నయ్యర్ నా అత్యంత అభిమాన సంగీత దర్శకుడు. ఈ క్రింది లింకులో ఆంధ్రభూమి లో రచయిత్రి గంటి భానుమతి గారు గతంలో వ్రాసిన వ్యాసం చదవండి.


జడ సౌందర్యం - పెన్సిల్ చిత్రం

నా పెన్సిల్ చిత్రానికి శ్రీమతి శశికళ గారి పద్యాలు.  వారికి నా ధన్యవాదాలు 

జడ సౌందర్యం.
. జారి పోవ కురులు జలపాతమౌ రీతి,
నొడిసి పట్టి బిగియ జడగ కుదిరె!
పడగ మీద పొదుగు ఫణుల మణుల భంగి
సూర్య చంద్రు లమరె సుదతి జడను.
……………………………………………………………………
. కాలమేఘము లవె కమ్మెనా యనుభంగి,
ముఖము కప్పి యుంచు మొయిలె కురులు
విద్యులతను బ్రోలు విరుల మాల నరసి
విరహిణాయె బాల , వెదక శశిని.
……………………………………………………………………
. కేశ సంపదె గద పాశమేయగ నారి
లేశ మయిన జాలి లేక మదిని.
మోసపోదు రకట! ముదితవాల్జడ జూసి,
ముగ్దు లవ్వగ నదె, ముగ్ద కురులు.
…………………………………………………………………
బారెడంత జడను, బావుర మననీక,
భావుకముగ, నమరె, పాము జడకు
బంగ రమున కుప్పె ,సింగార మొప్పుచూ,
కన్నె వాలు జడన, గంట లవియె.
………………………………………………………………………
.సత్యభామ సొగసు, జడగంటలె తెలుపు
సరస మున్న మదిని, జడను త్రిప్పు
మూతి ముడిచి, పెదవి మునిపంట ,నలిగెనా!
అలక ధాటికి, జడ ,అలజడేగ!!!!……
…………………………………………………………………
. అయిన వారి యింట, యనఘ తానే బుట్టి,
అనతి కాలమందె ,యతివ దాయె
మురిసి, సరసి జడకు, మొగలిరేకు లనుచు
స్వర్ణ మయము జేసి, సరము జేర్చె

24, జనవరి 2016, ఆదివారం

ఆడపిల్ల - చిత్రాలు - పద్యాలు

నా చిత్రాలకి శ్రీమతి శశికళ ఓలేటి గారి పద్యాలు.

ఆడపిల్ల ఒక అపురూప వరం. ఆనందిద్దాము.
**********************
"
నాన్న! బువ్వ తినుమన, మనసు మెలిబెట్టు
చిన్ని చేతులదియె చేరదీయ.
అమ్మమళ్ళి పుట్టి యరెసనా! యనునట్లు
ఆట లాడి చూపు నాడ పిల్ల..
***************--****
భ్రూణ హత్య జేసి ప్రాణంబు హరియించి,
భూరి పాపమీవు మూట గట్ట,
తగ్గె గాద నిలను తగు యాడ శాతము
తగ్గు మీవిక మరి యెగ్గు వలదు.
*******************
:
ఆడ మగ యనుచును యాదుర్ద పడవద్దు
ఆలి మీద యుసురు అసలు ఒద్దు
మగని జన్యువులెగ మనుగడ శాసించు
తారతమ్య మంత తమరి వలెనె.
****************************
: 
అంత్య దశల లోను యాడ పిల్లయే చూచు
కంటి పాప వలెను గాచు నామె
అమ్మనాన్న లకును ఆలంబనగ నిల్చు,
ఎదురు నీదుచు మరి యెదను దాచు.
******************************
.
అంద మయిన పిల్ల చందమామ తునక.
కుందనాల బొమ్మ కుముద కళిక.
విందు చేయు చుండె విరజాజి సొగసుతో,
సంద డెంతో జేయు డెంద మొప్ప.
********************************
. ఘల్లు ఘల్లు మంటు గజ్జెలల్లన మ్రో,
,కల హంస బ్రోలు గడుసు నడక.
గలగలయను కేల 
గాజులందము గాంచ,
గౌతమదియె గాద కదల వడిగ!!
***-**************************
తేనె వంటి మాతృ తియ్యం దనము పంచి,
నాడదదియె మనకు నాత్మబంధు.
బిడ్డ, చెల్లి,భార్య,దొడ్డ తల్లిగ రూపు
లందలరుచు, విరియు లక్ష్మి యామె!!
************************-***
తీయ దనము నందు తేనెను మరిపించు,
కమ్మనయిన పిలుపు "అమ్మ" గాద!
కడుపు నిండ కుడిపి కనుపాపలా కాచి,
పెంచి పెద్ద జేయు పెన్నిధియదె!!
********************
అన్నదమ్ములనుచు అరయుచుండ మనసు,
బ్రతుకు కోరు చెల్లి భ్రాతృ ప్రేమ,
ఎన్నిజన్మలయిన ఎంచి చూప లేము,
అన్న రక్ష కోరు నాడ పడచు.


23, జనవరి 2016, శనివారం

జాజి మల్లె బ్రతుకు జాలి గొలుపు నాకుశ్రీమతి శశికళ ఓలేటి గారి ఆటవెలది  పద్యాలు చదివిన తర్వాత నాకు గుర్తుకొచ్చిన నా బొమ్మలు. ఎంత చక్కని పద్యాలో! ఎంత చక్కటి భావుకత!! 

ఆటవెలది పద్యాలు 

1.జాజి మల్లె బ్రతుకు జాలి గొలుపు నాకు

నోచుకొన వెపుడును నోము ఫలము
సందె పొద్దు వేళ శృంగారమౌ కాని
పగటి విరులు తప్ప, ప్రభువు కరుదు.
2. ఆడ పిల్ల నెప్పుడా జాజితో బోల్చి,
పంది రదియె వేయ , బలిమి కూడు.
జాణ యైన తాను, జాడించి బ్రతుకును
బేల యయిన, జాజి పూల తీరె.
3. మిగుల సంతసమున మేలుహారము జేరి
మురిసి పోవుచు నవి సరసి జేరు
భాగ్యవశమున నవి భగవంతు చేరినన్
చరిత మగును బ్రతుకు సఫలమగును.

4. సన్నజాజి చూడ చక్కనమ్మను బ్రోలు
రాతిరందు తరలు, రమణి సిగకె
సున్నితంపు సొగసు చూడ మరులు గొల్పు,
కొన్ని ఘడియ లున్న కూర్చు తావి.

5. విరిసి విరయ కుండ విరజాజి పూవులు,
విరిసినంత వరకు విడచి తావి
నేల రాలిపోయి నింగితారల పోలి,
ఫక్కుమనుచు నవ్వు పడతి వోలె.

6.
విశ్వమందు విరులు వేన వేలున్నను, 
సన్నజాజి కెపుడు సాటి రావు,
జాజి పూవు నిలుచు సౌందర్య , సుకుమార
కుసుమశరుని ప్రీతి కోమలి వలె!

7.
,వె
సన్నజాజి కెపుడు , సంతసంబేయగు
విరియ జాజి కెపుడు ,విసుగు రాదు
పరిమళములు నింపు పడతుల సిగలందు 
విడచి పోదు (పోవు) విరహ వేళలందు


21, జనవరి 2016, గురువారం

అక్కినేని నాగేశ్వరరావు - ద్వితీయ వర్ధంతి - నివాళి - పెన్సిల్ చిత్రాలు

ఈ రోజు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి ద్వితీయ వర్ధంతి. ఆ మహానటునికి  నా పెన్సిల్ చిత్రాల ద్వారా ఘన నివాళి.

కౌగిలింతల దినోత్సవం - Hugging Day


నేడు కౌగిలింతల దినోత్సవం. చిల్డ్రన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే లాంటివి మనకు తెలుసుకాని ఇలాటిది కూడా ఒకటుందా అని ఆలోచిస్తున్నారా..? 1986 జనవరి 21న కేవిల్ జాబోర్ని అనే వ్యక్తి అమెరికాలో Hugging Day ని పరిచయం చేశాడు. మరో విషయం ఏమిటంటే ఈరోజు అక్కడ పబ్లిక్ హాలిడే కూడా. కౌగిలింత ఓ చక్కటి అనుభూతి అనేది శాస్త్రవేత్తల అబిప్రాయం కూడా. అమితంగా అభిమానించే వారిని, ప్రేమించేవారిని కౌగలించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని ఇటీవలే ఓ రిసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. మరో విషయం ఏమిటంటే ఆత్మహత్యకు పాల్పడేవారు, చివరి క్షణంలో  తాము ప్రేమించే వ్యక్తులను కౌగలించు కోవాలని అనుకుంటారట. (sourrce ap7am.com)

ఈ బొమ్మలు నేను ఈరోజు కోసం ప్రత్యేకంగా వేసినవి కావు. అడపాతడపా వేసినవి ఇలా ఈరోజు కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను.

కౌగిలింత……శ్రీ. Pvr Murtyగారి అద్భుత పెన్సిల్ స్కెచెస్ కు నా ద్విపదలు.

1. సృష్ట్యాది మొదలుగా స్పృశియించి తెలుపు
సర్వ జీవులు తమ స్పందన, తపన.!!

2.మాతృ గర్భముననె మాయ కౌగిలిలొ
మాధుర్య మందెద మ్మదెమాతృ స్పర్శ!!

3.కనులు విప్పిన నిను కంటిపాప వలె
కరముల ప్రోదులో కౌగిలించు నమ్మ.!!

4. పొదివి పట్టుకునిన పెదవి విచ్చునదె
పదములన్నియు నేర్పు పొదుగు యదియె!!!

5. గాఢమైన పరిష్వంగమున నీ తండ్రి,
గారమెంతయుఁ జేయు గాంభీర్య మొలక!!

6.కౌగిలిచ్చిన నాన్నె కావలై నిన్ను,
గైకొని పోవదె కఠిన మార్గమున.!!

7.స్నేహ హస్తము జాపి చెంత జేర్చుకుని,
జీవితాంతము నీకు చేదోడు నిలుచు

8. చెలిమి కౌగిలి లోని చిలిపితన మదె
చినబోవ నివ్వని స్నేహ దుర్గమది.!!!

9. యవ్వన మందించు జవ్వని పొందు.
గువ్వ జంట లలెను సవ్వడించెదరు.

10.ప్రియ పరిష్వంగాన లయమై, నయముగ,
పరవశించు రదియె నొరుల కౌగిలిలొ!!

11.ముదిమి మీద బడగ ముచ్చట్లు కరువు
మనుమడు వాటేయ మరుపాయె వయసు!!

12. నిర్వేదమున నీవు నీర్గారినపుడు,
నీవారి కౌగిలే నీ వ్యధ తీర్చు.

13. వేదనంతయు దీర్చి వెత హరియించు,
సేద తీర్చునదియె చిన్మయుని బిగి.

14. విడువ కెన్నడు నీవు విభుని కౌగిలిని,
వినును గుండెల సడి విన్నవించు మదె!!!

15,.ఆలింగనము సేయు మాత్మ భవు నకు
ఆర్తులన్ని హరించు ఆపన్న మదియె.!!!
*****************************21-01-2016.
VOLETI SASIKALA.

19, జనవరి 2016, మంగళవారం

కె. ఎల్. సైగల్ - నివాళి - పెన్సిల్ చిత్రం

మంచుపర్వతాల మీద సాగిపోయే ఒక మనోహర స్వర జలపాతం కె. ఎల్‌. సైగల్‌. తాను బతికింది నాలుగు దశాబ్దాలే అయినా, తన విలక్షణ గానంతో కోట్లాది సంగీత ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేశారాయన. తొలిరోజుల్లో రఫీ, ముకేశ్‌, కిశోర్‌ ఆయనను అనుకరించడానికి సిద్ధమైనవారే. ‘జబ్‌ దిల్‌ హీ టూట్‌ గయా’ అనే పాట సైగల్‌ గళ
విశేషానికి ఒక మచ్చు తునక. ‘శాజహాఁ’ సినిమా కోసం మజ్రూహ్‌ సుల్తాన్‌పురి రాసిన ఈ గీతాన్ని నౌషాద్‌ స్వరపరిస్తే, సైగల్‌ తన గాన వైదుష్యంతో ప్రాణం పోసిన వైనాన్ని మరోసారి మనసారా వినండి...జబ్‌ దిల్‌ హీ టూట్‌ గయా, హమ్‌ జీ కే క్యా కరేంగే

జబ్‌ దిల్‌ హీ టూట్‌ గయా....
(మనసే విరిగిపోయాక . నేను జీవించి మాత్రం ఏం చేస్తాను?
మనసే విరిగిపోయాక....)


జీవితంలో ఎన్ని సమకూర్చుకున్నా, ఏం సంపాదించుకున్నా, హృదయ నావలోకి వాటన్నిటినీ చేర్చుకుని హాయిగా సాగిపోవాలని కదా మనిషి ఆశ! లాహిరి లాహిరి లాహిరిలో అంటూ లోకాన్నే మరిచిపోయి ఓలలాడాలని కదా! కానీ, ఆ సమస్తాన్నీ సాకల్యంగా స్వీకరించే హృదయమే తునాతునకలైపోతే, ఇంక జీవితం ఏముంటుంది? జీవితాపేక్ష ఏముంటుంది. అందుకే, ఇంక బతికుండి మాత్రం ఏంచేస్తామనిపిస్తుంది? సరిగ్గా అదే సమయంలో ఒక్కోసారి ఏ ఓదార్పో, ఏ ఆధారమో లభించి హృదయంలో కొత్త ఆశలు మోసెత్తవచ్చు. జీవితం కొత్తగా చిగురించనూ వచ్చు. కాకపోతే ఆ పరిణామాలేవో చోటు చేసుకునేదాకానైతే, ఏముందిలే జీవితం అనిపిస్తుంది. జీవించడంలో అర్థమే లేదనిపిస్తుంది.
 
ఉల్ఫత్‌ కా దియా హమ్‌నే,, ఇస్‌ దిల్‌ మే జలాయా థా 

ఉమ్మీద్‌ కే ఫూలోఁ సే ఇస్‌ ఘర్‌ కో సజాయా థా
ఇక్‌ భేదీ లూట్‌ గయా, హమ్‌ జీ కే క్యా కరేంగే /జబ్‌ దిల్‌ హీ/

(ప్రేమ జ్యోతిని నేనీ హృదయంలో వెలిగించాను
ఆశలపూలతో ఈ ఇంటిని అలంకరించాను. కానీ, అయినవారే ఒకరు అంతా కొల్లగొట్టేశారు. నేనింక బతికుండి మాత్రం ఏం చేస్తాను?)

ఏళ్ల పర్యంతంగా రకరకాల చీకట్లలో మ్రగ్గిన హృదయ నావలోకి ఏ ఒక్క కాంతి కిరణం చొరబడినా ఒక పండగే అనిపిస్తుంది. అలాంటిది కోటి దివ్వెల కాంతితో తనరారుతూ తన హృదయ వేదికమీద కదలాడిన ప్రేమను చూస్తే ఏం చేస్తారు? ఆ ప్రేమనొక అఖండ జ్యోతిగా జీవన లోగిలిలో దేదీప్యమానంగా వెలిగించుకుంటారు. ఆ లోగిలినే కాదు మొత్తం భవనాన్నే అనంతమైన ఆశా పుష్పాలతో అలంకరించుకుంటారు. కానీ, అప్పటిదాకా తనవారే అనిపించిన వ్యక్తే తన లోకాన్ని ధ్వంసం చేసేస్తే ఇంకేముంది? కళ్లముందే అంతా కకావికలమై, జీవన వ్యవస్థ అంతా తునాతునకలైపోతుంది. ఆ శిధిలాల కిందినుంచి లేవడం ఇక ఎప్పటికీ సాధ్యం కాదనిపించినప్పుడు ఇంక జీవించడంలో ఏ అర్థమూ లేదనిపిస్తుంది.

మాలూమ్‌ నా థా ఇత్‌నీ ముష్కిల్‌ హైఁ మేరీ రాహేఁ

ముష్కిల్‌ హై మేరీ రాహేఁ
అర్మాన్‌ కే బహేఁ ఆసూ, హస్‌రత్‌ నే భరీ ఆహేఁ
హర్‌ సాథీ ఛూట్‌ గయా హమ్‌ జీ కే క్యా కరేంగే / జబ్‌ దిల్‌ హీ /
(నా దారులు ఇంత కఠినతరమని తెలియదు నాకు 
ఆశల కన్నీళ్లు పారాయి, ఆకాంక్షలు దారుల్లో నిట్టూర్పులే నింపాయి 
ప్రతి మిత్రుడూ వెళ్లిపోయాడు.. నేనింక బతికుండి మాత్రం ఏం చే స్తాను?)

తాము నడిచి వెళ్లే దారిలో ఎన్నెన్ని బాధలు ఉంటాయో ఎలప్రాయంలో ఎవరికీ ఏమీ తెలియదు. అందుకే ప్రతి విఘాతానికీ హృదయం విలవిల్లాడుతుంది. ఆశలన్నీ కన్నీటిమయం అవుతున్నప్పుడు, ఆకాంక్షలన్నీ నిట్టూర్పుల మయం అవుతున్నప్పుడు జీవితం శోక సముద్రమే అవుతుంది. ఇతరమైన ఐశ్వర్యాలూ, ఆనందాలూ ఎన్ని పోయినా, కనీసం స్నేహితులైనా కడదాకా మనతో ఉండిపోవాలని కోరుకుంటాం.. కానీ, ఆ స్నేహితులు కూడా దూరమైపోతే, జీవించడంలో అర్థమేం కనిపిస్తుంది. కాకపోతే ఒక చోట హృదయం ముకుళించుకుపోతే మరోచోట అది వికసిస్తుంది. ఒక చోట ప్రాణరహితంగా కనిపించే హృదయమే ఒకచోట అనంతమమైన చైతన్యంతో తొణకిసలాడుతుంది. ఈ నిజాన్నే మనం తరుచూ విస్మరిస్తూ ఉంటాం. అడుగడుగునా అంతులేని నైరాశ్యానికి లోనవుతాం. నిజానికి అన్నీ తెలిసిన ఆత్మ ఘటనాఘటనాలకు అతీతంగా సాగిపోతూనే ఉంటుంది. సుఖదుఃఖాలకు అతీతంగా జీవనయానాన్ని 

కొనసాగిస్తూనే ఉంటుంది.

(ఆంధ్రజ్యోతి 19th జనవరి 2016 సౌజన్యం తో)17, జనవరి 2016, ఆదివారం

బ్రహ్మనాయుడు - పల్నాటి యుద్ధం - ఎన్టీఆర్ - పెన్సిల్ చిత్రం


ఈ రోజు మహానటుడు ఎన్టీఅర్ వర్ధంతి. ఆ మహానటునికి స్మ్రుతంజలి ఘటిస్తూ నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం. పోషించిన పాత్ర : బ్రహ్మనాయుడు, చిత్రం : పల్నాటియుద్దం. నేను ఎన్నో తెలుగేతర చిత్రాలు చూసాను. కాని మన ఎన్టీఅర్ పోషించిన  ఇటువంటి పాత్రలు అంత సమర్ధవంతంగా పోషించిన మరొక  నటుడిని చూడలేదు. ఎన్టీఆర్  రాజకీయ రంగప్రవేశం కారణంగా వారు తెలుగు చిత్రసీమ కి అందించిన సేవలకు గుర్తింపుగా అందవలసినన్ని పురస్కారాలు అందలేదు. కాని తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు, నాయకుడు ఎన్టీఅర్ ఒక్కడే. అందుకే ఆయనన యుగపురుషుడు గా తెలుగు ప్రజలచే కీర్తింపబడుతున్నాడు.

15, జనవరి 2016, శుక్రవారం

కొమ్మకొమ్మన దాగివిజయ లక్ష్మి శర్మగారి గానం
కొమ్మ కొమ్మన దాగి
రాగాలు చిలికించే
కోకిలమ్మ నీకు కోటి దండాలు
కోకిలమ్మ నీకు కోటి దండాలు
పూల మాగాణిలో సౌరభాలు నీవి
కొండ కోనలు దాటి వినిపించు నీ రవళి
నీ చిన్నిగళములో శృతి లయల సంగమం
పాడవే ప్రతి పూట తియ్యగా నీ నోట
పాడవే ప్రతి పూట తియ్యగా నీ నోట
పాట నీ గొంతులో పల్లవించిన చాలు
మేను మై మరచి ఉయ్యాలలూగు
విశ్వమే తలయూచి నీ ఎదుటే నిలుచువేలా
పాడవే ప్రతి పూట తియ్యగా నీ నోట
పాడవే ప్రతి పూట తియ్యగా నీ నోట

Iravati Karve - Anthropoligist - charcoal pencil sketch

My charcoal pencil sketch of Iravati Karve Irawati Karve was a pioneering Indian sociologist, anthropologist, educationist and writer from M...