24, ఫిబ్రవరి 2018, శనివారం

మనసున మల్లల మాలలూగెనే - దేవులపల్లి కృష్ణశాస్త్రి



మనసున మల్లెలు మాలలూగెనే

ఈ రోజు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి.


మిత్రులు శ్రీ Vinjamuri Venkata Apparao  గారి facebook పోస్ట్ నుండి సేకరణ - వ్యాసం తో పాటు నేను చిత్రించిన ఆ మహనీయుని pencil చిత్రాలు కూడా క్రిందన పొందుపరుస్తున్నాను. 
 .
మాట్లాడే భాషకు హృదయవీణలద్ది తేట తెలుగు స్వచ్చందనాలతో తెలుగు సినిమా పాటలను మూడు దశాబ్దాల పాటు హిమవన్నగంపై నిలిపిన అరుదైన కవులలో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒకరు. కోటి కోయిలలు ఒక్క గొంతుకతో తెలుగు పాట పాడితే ఎలా ఉంటుందో దేవులపల్లి పాటను విని మనం అనుభూతి చెందవచ్చు.
మావి చిగురు తినగానే కోయిల పలికేనా... ఆకులో ఆకునై పూవులో పూవునై.... నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది... గోరింట పూచింది కొమ్మా లేకుండా... ఆరనీకుమా ఈ దీపం... వంటి హృదయంగమ గీతాలను అందించిన కృష్ణశాస్తి తొలి సినిమా గీతం పాత 'మల్లీశ్వరి' చిత్రంతో మొదలు కావడం విశేషం.
ఒక దీర్ఘ నిరీక్షణ అనంతరం. ఇక కలుసుకోవడం అసంభవం అనిపించిన బావ తన కళ్ల ముందే కదులాడితే... ఆ వెన్నెలరాత్రి.. ఉద్యానవనం నీటి మడుగు దాపున తనను కలవబోయే మహత్తర క్షణాల్లో ఒక పల్లె పడచు హృదయం కొట్టుకునే గుండె చప్పుళ్లే కృష్ణశాస్త్రి మనసున మల్లెల మాలలు...
తెలుగు పాట ఇంత కమ్మగా, తీయగా ఉండేదా అని భవిష్యత్ తరాల తెలుగు వారు పొగుడుకునేటటువంటి అజరామరమైన సినిమా గీతాలు కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారాయి మల్లీశ్వరి నుంచి ప్రారంభించి ఆయన అందించిన సినిమా పాటలు సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు.
కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ కృష్ణశాస్త్రి రచన కృష్ణ పక్షము ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగాన్ని దీప్తింపజేసిన ఒక ముఖ్య క్షణం. ఇదే దాదాపు 50 ఏళ్ల తర్వాత మేఘ సందేశంలో సినిమా పాటగా మారి తెలుగు వారు గర్వంగా చెప్పుకునే గొప్ప గీతంలా చరిత్రలో నిలిచిపోయింది.
మల్లీశ్వరి సినిమాలో ఆయన తొలి గీతం చూద్దాం... పల్లెటూరులోని బావను వీడి అనుకోకుండా రాయలవారి అంతఃపురంలో నివసించవలసి వచ్చిన మల్లి.. తన బావను అదే అంతఃపురంలో కలుసుకునే క్షణం కోసం ఎదురు చూడవలసి వచ్చినప్పుడు... ఒక దీర్ఘ నిరీక్షణ అనంతరం. ఇక కలుసుకోవడం అసంభవం.. ముఖాముఖంగా చూసుకునే అవకాశం అసంభవం అనిపించిన బావ తన కనుల ముందు స్పష్టాస్పష్టంగా కదులాడితే... ఆ వెన్నెలరాత్రి.. ఉద్యానవనంలోని నీటి మడుగు దాపున కలవబోయే మహత్తర క్షణాల్లో ఒక పల్లె పడచు భావోద్వేగ హృదయం కొట్టుకునే గుండె చప్పుళ్లను కృష్ణశాస్త్రి గారు మనసున మల్లెల మాలలూగిస్తూ మనకు వినిపిస్తారు...
సున్నిత భావ ప్రకటనకు, ఒక ప్రియురాలి విరహ వేదనకు ఈ పాట ఒక సజీవ సాక్ష్యం... గువ్వల సవ్వడి వినిపించినా, గాలి కదులాడినా, కొలనులో అలలు గలగలమన్నా, కొంచెం దూరంలో వేణు గానం గాల్లో తేలుతూ హృదయాన్ని తాకినా నా బావే వచ్చాడంటూ ప్రకపించే ఒక తెలుగు ముగ్గ సుకుమార సౌందర్యాన్ని ఆ పాట, ఆ పాట చిత్రీకరణ నభూతో నభవిష్యతి అనేంత మహత్తరంగా మన కళ్లకు కట్టిస్తాయి. ఆ రాత్రి ఆ ప్రియురాలి మృత్యుశీతల అనుభవాన్ని ఆస్వాదించడానికైనా ఆ పాటను వినాలి. చూడాలి.
మీలో ఎవరైనా పాత తెలుగు మల్లీశ్వరిని చూసి ఉండకపోతే జీవితంలో ఒకసారైనా ఆ సినిమాను తెప్పించుకుని చూడండి. మన తర్వాతి తరాలవారికి తెలుగు సినిమా గొప్పతనం చూపించేందుకయినా ఆ సినిమా సిడి లేదా డివిడిని భద్రంగా పదిలపర్చుకోండి. మన భానుమతి పాడి, నటించినటువంటి జన్మానికో చల్లటి అనుభవం లాంటి ఆ పాటను తనివి తీరా వినండి.
మనసున మల్లెల మాలలూగెనె
కన్నుల వెన్నెల డోలలూగెనె
ఎంత హాయి ఈరేయి నిండెనో
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో కొమ్మల గువ్వల సవ్వడి వినినా

రెమ్మల గాలుల సవ్వడి వినినా
ఆలలు కొలనులొ గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చెవని నీపిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
గడియె యేని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో
ఎంత హాయి ఈరేయి నిండెనో

క్రింది లింకు క్లిక్ చేసి ఈ మధురగీతాన్ని వినండి.



23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మనిషి - కవిత


మిత్రులు శ్రీ Vemuri Mallik గారి కవిత కి నా చిత్రం వారి అనుమతితో. వారికి నా ధన్యవాదాలు. చదవండి.
మనిషీ నీవో వింతజీవివే..
తనువుని బంధించుకుంటూ..
మనసుకు బందీవై..
గెలిచాననుకుంటూ ఓడిపోతూ..
ఓటమి సైతం నీ గెలుపనుకుంటూ..
అందనివన్నీ పులుప‌నుకుంటూ..
అందినవన్నీ చేదని తలపోస్తూ..
నిజాన్ని ఒప్పుకోలేక..‌
అబద్ధమని చెప్పుకోలేక..
ఇలలో గిరిగీసుకుంటూ..
కలలో హద్దులు చెరుపుకుంటూ..
ఉన్న మాటలకు ఉలిక్కిపడుతూ..
అంతరాత్మ పీకినులిమి..
ఎదుటివాడికి వేలుచూపుతావు..
నిన్ను చూపే మూడు వేళ్ళకు..
గంతలు కడతావు..
లోకానికి ఓ హరిశ్చంద్రుణ్ణి నేనంటావు..
సఛ్చీలతే నా సొత్తంటావు..
ఆషాఢభూతినే అనుకరిస్తావు..
మన:తనువులుగా విడిపోతావు..
మనో వాక్కులంటూనే..
రెండు ముసుగులతో ఉంటావు..
మనిషీ నువ్వో రెండుకాళ్ళ వింతజీవన్నది నిజమనిపిస్తావు..‌!!

22, ఫిబ్రవరి 2018, గురువారం

తెలుగు తల్లి - మాతృభాష

నేనొక చిత్రకారుణ్ణి - బహుశా బాపు గారు వేసిన చిత్రమనుకుంటాను. దానికి రంగులద్ది ఇక్కడ  పోస్ట్ చేసాను.
రోజురోజుకీ మితిమీరిన  ఆంగ్ల పదాలతో  తియ్యని మన తెలుగు కలుషితం అవుతోంది.. ఈ విషయంలో నేను ఆవేదన చెందుతుంటాను. 'నీరు' అన్న పదం మరచిపోయారు, ఇప్పుడు వాటర్ అన్న పదం తెలుగులోకి చేరిపోయింది.  ఇలా ఒకటేమిటి, ఎన్ని పదాలో అవసరాన్ని మించి మన భాషలో కలిపేసుకుంటున్నాం. ఇంక సినిమాలు, కధలు, నవలల సంగతి సరేసరి. చివరికి సినెమా పేర్లు కూడా ఇంగ్లీష్ పదాలనే వాడుతున్నారు, ఉదాహరణకి : లెజెండ్, ఇంటలిజెంట్, ఇగో, స్కెచ్, ఇత్యాదివి. ఇంతటి మార్పు మన తెలుగుకి తీసుకురావడం అవసరమా .. ఇది నన్ను వేధిస్తున్న ప్రశ్న.    ఇలా ఎన్నొ పదాలు తెలుగు మన వాడుక భాషలోకి, సినిమాల్లోకి, కధల్లో కి, నవలల్లో కి చేరిపోతున్నాయి.

February 21 మాతృభాషా దినోత్సవం సందర్భంగా పలువురు మిత్రులు whatsapp లో మన తెలుగు భాషమీద ఉన్న మమకారాన్ని వ్యక్తపరచుకున్నారు. మన భాషలో వస్తున్న మార్పుకి ఆవేదన చెందుతూ, రచనలూ కవితలూ పెట్టారు.  నా దృష్టికి వచ్చిన కొందరి  రచనలు, కవితలు, పద్యాలు క్రిందన పొందుపరుస్తున్నాను.
-------------------------------------------------------------------------------------------------------------------

ఫిబ్రవరి 2016 శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా  యిచ్చిన సమస్య "దేశభాషలందు తెలుగు లెస్స" అన్న పద్య పాదం తో పద్యం.
 దీనికి సిలికానాంధ్ర సుజనరంజని
 మాసపత్రిక  మార్చి 2016 లో ప్రచురితమైన నా పద్యం.

సీ* ఏభాషలో మాట లేదేశ వసతైన
మురిపించి తెలిగించుముచ్చటలను
ఏభాషలో పాట లింపార సొంపార
 స్వరముల రసహేల సంతరించు
ఏభాషలో యాస లెందేని వినిపించ
ఏప్రాంతవాసులోఎరుకపరచు
ఏభాషలో పద్యమేయింటపఠియించ
 తెలుగింటి వారంచు తెలియబరచు
 అట్టి సరస మధుర సాహిత్యసంగీత
ఆశుకవితల కలితావధాన లలిత
మాటపాటలందుమేటియైమెప్పించు
దేశ భాషలందు తెలుగు లెస్స
      గండికోట విశ్వనాధం
--------------------------------------------------------------------------------------------------------------------------

మాతృ భా (ఘో )ష

మీరు మరచిపోతున్న
మాతృభాష ను నేను
ఆదరణ కరువవుతున్న
అమృత భాషను నేను

నన్నయ్య ఇచ్చాడు నాకు కావ్యగొరవం
చిన్నయ్య కూర్చాడు నాకు వ్యాకరణం
తిక్కన్న నాలోని సొగసుల్ని చూశాడు
పోతన్న నాలోని తీయదనం చూపాడు

అన్నమయ్య కీర్తనలో భక్తిరసం నేనేను
కృష్ణ శాస్త్రి పాటలోని ఆర్తియన్న నాదేను
గురజాడకు అందించా అభ్యుదయపు వాడి నేను
శ్రీ శ్రీ లో చూపించా కవిత్వంపు పదును

అన్ని భాషలలోన మిన్న నేనేనన్న
ఖ్యాతినే పొందాను
కనుకనే పొంగాను
తెలుగు తేటయన్న
మాటదక్కిందన్న
భావనతో మైమరిచా
ధన్యనంటు నే తలచా

శతకాలతో జాతికి నీతుల్ని నేర్పాను
ప్రబంధాలతో శృంగార లోతుల్ని చూపాను
అవధానపు ప్రక్రియలో ప్రత్యేకత చాటాను
ఆధ్యాత్మ భావాల అంచులే తాకాను

విన్నారా!
ఇది అంతా గతకాలపు వైభవం
చూశారా !
నేడు నాది శోచనీయ అనుభవం

నేను రానంటారు
నన్ను వద్దంటారు
అభివృద్ధి పథాన నా ఉనికి
ఆటంకం అంటుంటారు
అమ్మపాలతో పాటుగా అలవడేటి నన్ను
అమ్మ జోల పాట లోని హాయినయిన నన్ను
నేడు
అవహేళన చేస్తున్నారు
అల్పంగా చూస్తున్నారు

మనసారా నన్ను తాము
నేర్వలేని నిర్భాగ్యులు
నోరారా మాతృభాష
పలుకలేని పాపాత్ములు
నన్ను జీవచ్ఛవాన్ని చేస్తున్నారు
అన్యభాషా పదాల అతుకులేస్తున్నారు

అన్ని భాషలలోనున్న కొన్ని వేల పదాలను
అచ్చులతో చేయూతనిచ్చి
అక్కున చేర్చుకున్న నాకు
ఆ ఔదార్యగుణమే నేటికి
ఆత్మహత్యా సదృశమయ్యింది

నా భవితవ్యపు ఆశలిప్పుడు
భాషాభిమానుల‌ చేతుల్లో విడిచాను

బడుగుభాషను కాను
మీ జీవనాడిని
కానివ్వండి మననిచ్చి
నన్ను చిరంజీవి ని.

సింహాద్రి జ్యోతిర్మయి
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం
( న ర సం ) ఉపాధ్యక్షురాలు
21.2.2018. - Simhadri Jyotirmayi

--------------------------------------------------------------------------------------------------------------------------


వృక్షాగ్ర భాగాన పక్షమ్ము లదలించి‌
     పాడెడి కోకిల పాటలందు,
ఉద్యాన వనముల హృద్యత పురివిప్పి
      యాడెడి కేకి నృత్యములయందు,
హ్లాదమౌ మానస లహరుల దేలుచు
నడయాడు రాయంచ నడల యందు.,
గిరి శృంగముల నుండి ఝరులౌచు గలగల
 ప్రవహించు సెలయేటి పరుగులందు
పూవు తావుల,ఘంటికా రావములను,
జానపదములు సుడులెత్తు జనుల నోట
నీదు చరితమ్ము వినిపించు నిక్కువమ్ము
తెలియ తరమౌనె నీశక్తి తెలుగు తల్లి.

సకల భాషల వీడక సఖ్యగతిని
మెలగు చుండెడి భాష యీ తెలుగు భాష
దేశభాషల లెస్సరా తెలుగుభాష
దీని బ్రతికింప దీక్షను బూనుడయ్య.

మద్దూరి రామమూర్తి.
--------------------------------------------------------------------------------------------------------------------------

Hemadri Rao garu :
మిత్రులకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు:

 అమ్మభాషలో అమ్మదనం
మాతృభాషలో కమ్మదనం

అమ్మభాష అమృతం
మాతృభాష సమ్మోహితం

తెలుగుభాష తియ్యదనం
తెలుగు మాట కమ్మదనం

తెలుగు పలుకు తేనెలొలుకు
తెలుగు మాట వెలుగు బాట

తెలుగు పాట తేనేలోమాగినట్టి
తియ్య మామిడి ఊట

తెలుగు జిలుగు తాకని
నేల లేదేందు ఈ జగతిలోన

తెలుగు ప్రభలు ప్రసరిల్లు
నలు చెరగులు

తెలుగు రేఖలు విరజిల్లు
సుమ్మోహన పరిమళాలు

గగన సిగన త్రివర్ణ కేతనం ఎగురునందాక
ఆ చంద్ర తారార్కం
నిలుచునందాక

అమ్మ ప్రేమెంత కమ్మనిదో
తెలుగు మాటంత తియ్యనిది
------------------------------------------------------------------------------------------------------------------------
తెలుగు పలికే నేలపై పుట్టిన ఘనులము మనమంతా.....సిరులతో పనిలేదు తెలుగు భాష యనే  అనంత సిరిసంపదలకు వారసులం మనం......ఇంతటి మధురమైన తెలుగు భాషకు వారసులైన ప్రతీ తెలుగువాడి జన్మ ధన్యమే

* మధురం మధురం నా తెలుగు మధురం *
1.
కదళి  ఫలము  ద్రాక్ష  కర్జూరముల కన్న
పనస  జామ  రేగు  పండ్ల  కన్న
అచ్చ  తెనుగు  భాష  అత్యంత  మధురంబు
విశ్వ  సత్య  మిదియె  విశ్వసింపు

2.మధుర మకరంద మాధుర్య సుధలు నిండి
వీనులలరించి మురిపించు! విరుల భంగి
సొబగు లీనెడు నాభాష సోయగమ్ము
దేశ భాషలందునమేటి తెలుగు సుమ్ము

3.
పూత రేకులరిశె పూర్ణంపు భక్ష్యాలు
కాకినాడ కాజ కజ్జి కాయ
పాల కోవ పుణుగు బందరు లడ్డూల
తీపి కన్న నాదు తెలుగు మేటి.

4.
మాతృ భాష పట్ల మమకారమే లేని
వాడు హీను డౌను పశువుకన్న
తల్లి నేర్పియున్న తనభాషనేవీడ
మాతృద్రోహి యగును మహిన వాడు.

5.
విశ్వమందు చెరగు వివిధ భాషల లోన
నాదు తెలుగు మిన్న నాణ్యతెన్న
అంధుడైన వాడి కందుమాధుర్యము
నేలయెరుగ గల్గునిలన ఖలుడు

6.
తెలుగు భాషయనిన తేలికంచు దలచి
ఆంగ్లమొకటె యవని నధిక మంచు
భ్రాంతిలోన బ్రతుకు బానిస పుత్రులీ
తెలుగు తల్లి కంట నలుసు లైరి

ఒక ముఖపుస్తక స్నేహితుడి సహాయ సహకారములతో.. (Whatsapp నుండి సేకరణ)

20, ఫిబ్రవరి 2018, మంగళవారం

మనసుకన్న విందుసేయు..మేఘబాల ఎవ్వరోయి - గజల్





మనసుకన్న విందుసేయు..మేఘబాల ఎవ్వరోయి..!?
చేమంతుల పసిడివాన..పూలబాల ఎవ్వరోయి..!?
ఊరించే తనచూపుల..ఊయలనే నిలిపెనుగా..
కవ్వించక కదిలించే..కలువబాల ఎవ్వరోయి..!?
ప్రతిరేయిని ముచ్చటగా..నిదురపుచ్చు చిత్రముగా ..
కలలవీణ మీటుతున్న..రాగబాల ఎవ్వరోయి..!?
నిదురించని కంటిపాప..ఎంత పరమ సాక్షి అసలు..
సున్నితమౌ మౌనసుధా..కావ్యబాల ఎవ్వరోయి..!?
గజలింటను నాట్యమాడు..చిరునవ్వుల మెఱుపుతీవ..
రెప్పపాటు మాటు నిలచు..గంధబాల ఎవ్వరోయి..!?
ఈ మాధవ అక్షరాల..గగనసీమ నేలేనే..
సర్వము మరి తానయ్యిన..సరసబాల ఎవ్వరోయి..!?

 (నా చిత్రానికి శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు అల్లిన గజల్)

19, ఫిబ్రవరి 2018, సోమవారం

పూవనిలో ఆమని - కవిత




పూవనిలో ఆమని (కవిత - Courtesy : Meraj Fathima)
నా చిత్రానికి ఓ video పాటలో అదనపు హంగులు అద్దిన రాణి రెడ్డి గారికి కృతజ్ఞతలు
మంచులో ముంచిన మల్లెవు నీవు,
మంచితో నిండిన మమతవు నీవు,
అరుణోదయంలో విచ్చిన మందారం నీవు
చంద్రోదయంలో విచ్చిన కలువవు నీవు
తెలిమబ్బుపై తేలియాడే తరుణం నీవు
తొలిపొద్దుపై తేటయని కిరణం నీవు
పగడపూలలో విరజిమ్మే సువాసన నీవు
ప్రగతి బాటలో నటించే జన సమూహం నీవు
అనురాగ సరాగాల ప్రవాహం నీవు
అందని అపురూపాల ప్రశంసవు నీవు
మంచు బిందువులు ముద్దాడిన నందివర్ధనం నీవు
మలినమంటని స్వచ్చమైన చందమామ నీవు
తూరుపు ఉషోదయ తుషార బిందువు నీవు
గంధర్వలోకాన పూవనిలో అరుదెంచిన ఆమని నీవు

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

పెళ్ళంటె పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు



మనసున మనసై



( మన వివాహ వ్యవస్థ గురించి ఈనాడు దినపత్రిక 'మకరందం' శీర్షిక లో వచ్చిన  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.  ఈ వ్యాసానికి నేను వేసిన చిత్రాలు జోడించాను)

మేళాలు.. తాళాలు..  పందిళ్లు.. సందళ్లు.. సంబరాలు.. సంతోషాలు..
వివాహ వేళ భౌతికంగా కనిపించే ఆనంద హేల ఇది.
ఇరు హృదయాలను పెనవేసే వైదిక క్రతువు వివాహం.
రెండు కుటుంబాలను గౌరవంగా కలిపే సంప్రదాయ విధి పెళ్లి.
ఎదుర్కోళ్లు మొదలు అప్పగింతల వరకు పెళ్లితంతులో ప్రతిదీ పరమార్థంతో కూడుకున్నదే! గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్న కొత్త దంపతులు వివాహ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. ఒకరికొకరు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి.
కల్యాణ ముహూర్తాలు సమీపిస్తున్న శుభవేళ... పరిణయ సందేశం మీ కోసం..
మన దేశానికి బలం కుటుంబ వ్యవస్థ. దీనికి మూలం వివాహం. రెండు నిండు జీవితాలను కలిపే వివాహం ఒక పవిత్రమైన విధి. భార్య, భర్తలో సగభాగం అవుతుంది కాబట్టే ఆమెను అర్ధాంగి అన్నారు. పార్వతీదేవి పరమ శివుడి శరీరంలోని ఎడమ భాగాన్ని పొందిందని సౌందర్యలహరిలో శ్రీ శంకరులు స్తుతించారు. వారి దాంపత్యం అందరికీ ఆదర్శప్రాయమని వర్ణించారు. పద్మ పురాణమైతే భార్యను తీర్థంగా చెప్పింది. అంటే తరింపజేసేదని అర్థం. మనిషి జీవన విధానాన్ని  నాలుగు దశలుగా విభజించారు. వీటిలో మొదటిది, శ్రేష్ఠమైంది గృహస్థాశ్రమం. ‘చతుర్ణాం ఆశ్రమాణాంహి గార్హ‌స్త్యం శ్రేష్ఠముత్తమం’ అని తీర్పు చెప్పింది రామాయణం. గృహస్థు లేనినాడు ఆహారమే దొరకదని వేదాలు కూడా వల్లించాయి. ఇలాంటి ఉన్నతమైన గృహస్థాశ్రమ స్వీకారానికి స్త్రీపురుషులను మంత్రాలతో సంస్కరించడమే వివాహం.
ఆకాశం, భూమి తమంత తాముగా ఫలవంతం కావు. సృష్టి నడవాలంటే భూమి, ఆకాశాల మధ్య ఒక సంబంధం ఉండాలి. ఆకాశం నుంచి పడే వాన భూమిని తడిపి అందులోని అంకురాలను మొలిపించి వృక్షాలుగా మార్చి చైతన్యవంతం చేస్తుంది. స్త్రీ పురుషుల జీవితాలు కూడా అంతే. వివాహం వల్ల చైతన్యవంతమవుతాయి. రెండు జీవితాలూ ఏకమై సార్థక్యాన్ని పొందుతాయి. అందుకే సర్వజగత్తులో ఉన్న చైతన్యానికి మూలంగా పెళ్లిని చెబుతారు. వివాహ బంధం ద్వారా ఒక్కటైన స్త్రీ, పురుషుడు కలిసి, మెలిసి జీవించాలని, పరస్పర సౌఖ్యాన్ని, సంతోషాన్ని పెంచుకుంటూ, పంచుకుంటూ తరించాలని శాస్త్రాలు నిర్దేశించాయి. ‘ఓ వధూవరులారా! మీరు ఈ లోకంలో చిరకాలం సఖ్యతతో జీవించండి. కొడుకులతో, మనుమలతో సంతోషంగా వర్ధిల్లండి అని రుగ్వేదం కూడా ఆశీర్వదిస్తుంది. జీవితాలను ఎలా పండించుకోవాలో వేదమంత్రాల రూపంలో వెల్లడించడం వివాహ క్రతువులోని అంతరార్థం. కన్యాదాన సమయంలో కన్యాదాత ‘ఈ వధువును స్నేహంగా చూసుకో’ అని వరుణ్ణి మంత్రపూర్వకంగా అభ్యర్థిస్తాడు.  సప్తపది ప్రక్రియలో ఏడో అడుగులో వరుడు, వధువును స్నేహితురాలిగా సంబోధిస్తాడు.పెళ్లింటి వీధి గుమ్మం దగ్గర వధూవరులను అడ్డగించి పేర్లు చెప్పిస్తారు. లౌకిక వ్యవహారంగా కనిపించే ఈ ఆచారం నిజానికి వేదసమ్మతం. అలా ఒకరినొకరు పలకరించుకునే క్రమంలో పరస్పరం మిత్రులవుతారని ఈ సందర్భంలో చెప్పే మంత్రార్థం. బిందెడు నీళ్లలో పడేసిన ఉంగరాన్ని తీసే క్రమంలో స్పర్శ తాలూకు స్నేహ పూర్వకమైన సాన్నిహిత్యం చిగురిస్తుంది.
మనిషి శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న జీవుడు పొందాల్సినవి నాలుగు. వాటిని పురుషార్థాలు అంటారు. వీటిలో మొదటిది ధర్మం. తరువాతి రెండూ అర్థం, కామం. ఈ రెండింటినీ ధర్మంగా పొందితే చివరిదైన మోక్షానికి దారిదొరుకుతుందని చెబుతారు. అర్థం ధర్మబద్ధం కావాలి. అంటే సంపాదన, ఖర్చు రెండూ ధార్మికంగా ఉండాలి. మనం ఏ పని చేసినా అది ధర్మచట్రంలో ఇముడుతుందా అనే విషయాన్ని పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలంటారు. కామం కూడా ఇంతే. ఇది సాధించాలంటే జీవితం ఒక క్రమ పద్ధతిలో సాగాలి. దీనికి సూత్రీకరణే వివాహం.
లోకంలోని ధర్మాల్లో దాంపత్య ధర్మం చాలా విశిష్టమైంది. ‘ఏది సుఖదుఃఖాల్లో ఏకరూపంగా ఉంటుందో, కష్టాల్లో ఉన్న హృదయాలకు గొప్ప ఊరటనిస్తుందో, దేని మాధుర్యాన్ని వార్ధక్యం కూడా హరించలేదో, ఇంద్రియాల శక్తి తగ్గేకొద్దీ ఏది పెరుగుతుందో, కాలం గడిచేకొద్దీ ఏది మరింతగా బలపడుతుందో అలాంటి దాంపత్య ధర్మం భద్రమగుగాక’ అని భవభూతి ఉత్తర రామాయణంలో అన్నారు. వివాహ సంస్కారంలో వధువు, వరుడు తమ హృదయాలు నీరులా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అంటే మిగిలిన జీవితమంతా మిత్రులుగా ఉండాలంటుంది వివాహ ధర్మం. వైవాహిక జీవితంలో ఆనందానికి, సుఖానికి పునాది ఇద్దరి మనసుల్లో  నుంచి పుడుతుంది. తమ ఇష్టమే నెగ్గాలనుకోవడం కన్నా ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడం ముఖ్యం. దంపతులకు సహనం చాలా అవసరం. వివాహ జీవితానికి ప్రేమ ఉద్యానవనం వంటిది. అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లే దంపతుల మధ్య ఉండే ప్రేమ చావు వరకు దంపతులను కలిపి ఉంచుతుంది. దీనికే హృదయ గ్రంథి అని పేరు. ప్రేమ అనేది ఒక దివ్యమైన ఆత్మానుభూతి. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేసే త్యాగం వల్లనే ఈ అనుభూతి సొంతమవుతుంది.ఇద్దరూ ఒకరినొకరు గెలిపించుకోవడంలో ఉన్న ఆనందాన్ని గుర్తెరిగితే ఆ ఇల్లు సుఖసంతోషాల సారమవుతుంది. అలాంటి ఇళ్లున్న సమాజం, దేశం ఆనంద నిలయాలవుతాయి.

-   వ్యాసం :  శ్రీ విజయదుర్గ (Courtesy :  Eenadu, makarandam 15th February 2018)

ఈ వ్యాసం చదువుతుంటే 'త్రిశూలం' చిత్రం లో 'పెళ్ళంటే పందిళ్ళు' పాట గుర్తుకొచ్చింది. ఈ పాట వీడియో లింకు కూడా క్రింద ఇస్తున్నాను. గీత రచయిత ఆచార్య ఆత్రేయ, సంగీతం : K.V. మహదేవన్, నేపధ్య గానం : బాలు, సుశీల.

పల్లవి: 



పెళ్ళంటే... 

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ 
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు 
ఆ...ఆ...ఆ...ఆ..... 

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ 
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు 

పెళ్ళైతే... 

పెళ్ళైతె ముంగిళ్ళు.. లోగిళ్ళు ముగ్గులు.. ముత్తైదు భాగ్యాలూ.... 
ముద్దూ ముచ్చట్లు.. మురిసే లోగుట్లు.. చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు.. 


పెళ్ళైతె ముంగిళ్ళు.. లోగిళ్ళు ముగ్గులు 
ముత్తైదు భాగ్యాలూ.... 


చరణం 1: 

గోదారి ఒడ్డున.. గోగుల్లు పూచిన వెన్నెలలో 
కొసరాడు కోర్కెలు.. చెరలాడు కన్నుల సైగలలో 
ఆ ఆ.. గోదారి ఒడ్డున.. గోగుల్లు పూచిన వెన్నెలలో 
కొసరాడు కోర్కెలు.. చెరలాడు కన్నుల సైగలలో 

మమతానురాగాల మరుమల్లెలల్లిన పానుపులూ... 
హృదయాలు పెదవుల్లో.. ఎరుపెక్కు ఏకాంత వేళల్లో 
వలపు పులకింతలో.. వయసు గిలిగింతలో.. 
వింతైన సొగసుల వేడుకలో.. 


పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ... 
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు 


పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. 
ఆ..... 

చరణం 2: 

కలలన్ని కలబోసి.. వెలసిన ఈ పంచవటిలో 
ఇల్లాలు నేనై.. ఇలవేల్పు నీవైన కోవెలలో 
ఆ... కలలన్ని కలబోసి.. వెలసిన ఈ పంచవటిలో 
ఇల్లాలు నేనై.. ఇలవేల్పు నీవైన కోవెలలో 

సిరిమువ్వ రవళుల మరిపించు నీ నవ్వు సవ్వడిలో... 
కులమన్నదే లేని అలనాటి వేదాల ఒరవడిలో 
సామగానాలము.. సరసరాగాలము 
ప్రేమికులమన్న కులమున్న లోకంలో 


పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ 
మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు 

 

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.... 
 ఈ  వీడియో లింక్ క్లిక్ చేసి ఈ పాట వినవచ్చును.


https://www.youtube.com/watch?v=w7vlqnfH2us

13, ఫిబ్రవరి 2018, మంగళవారం

మధుబాల

మధుబాల

తన రంగస్థల నామమైన మధుబాల  గా ప్రసిద్ధి చెందిన ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి, (1933 ఫిబ్రవరి 14 - 1969 ఫిబ్రవరి 23 మధ్యకాలంలో) ఒక ప్రసిద్ధ హిందీ చిత్ర నటి. ఆమె 1950లు మరియు 1960ల ప్రారంభంలోని అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు, వీటిలో ఎక్కువభాగం కావ్య స్థాయిని పొందాయి. తన సమకాలికులైన నర్గీస్ మరియు మీనా కుమారిలతో పాటు, ఆమె అత్యంత ప్రతిభావంతులైన హిందీ చిత్ర నటీమణులలో ఒకరిగా విస్తృత గౌరవాన్ని పొందారు.
      మధుబాల మహల్ తరువాత అనేక విజయవంతమైన చిత్రాలను పొందారు. తనకు మరియు తన కుటుంబానికి ఆర్థిక రక్షణను కల్పించాలనే వత్తిడితో, ఆమె తన కౌమారదశలోని మొదటి నాలుగు సంవత్సరాలలో ఇరవై-నాలుగు చిత్రాలలో నటించారు. ఫలితంగా, ఆ సమయంలోని విమర్శకులు ఆమె నటనా సామర్ధ్యం కంటే అందమే గొప్పగా ఉందని విమర్శించారు. చిత్ర పాత్రల ఎంపికలో అజాగ్రత్త కూడా దీనికి కారణం. తన కుటుంబానికి ఏకైక ఆధారంగా, ఆమె ఏ చిత్రంలోనైనా నటించడానికి అంగీకరించి, ఒక అద్భుత నటిగా తన గుర్తింపు హానికి కారణమయ్యారు. తరువాత ఆమె దీనికి పశ్చాత్తాపం వ్యక్తం 
ఆమె మరింత గౌరవపదమైన చిత్రాలలో సమర్ధవంతమైన పాత్రలలో కనిపించాలనే ఆశయం కలిగిఉండేవారు. బిమల్ రాయ్ యొక్క బిరాజ్ బహు (1954) దీనికి ఒక ఉదాహరణ. ఈ నవల చదివిన మధుబాల, చిత్ర అనుసరణలో ప్రధాన పాత్రను పోషించాలని ఆశించారు. ఆమె తన మార్కెట్ ధరను అడుగుతుందనే ఉద్దేశంతో (అత్యధికాలలో ఒకటి), బిమల్ రాయ్ అప్పుడే ఎదుగుతున్న కామినీ కౌశల్కు ఆ పాత్ర ఇచ్చారు. తన పాత్రను కోల్పోవడానికి కారణం తెలిసినపుడు, మధుబాల, తాను ఈ చిత్రంలో ఒక రూపాయి ప్రతిఫలంతో అయినా నటించేదానినని బాధపడ్డారు. ఒక మంచి నటిగా తన ప్రతిష్ఠను పెంచుకోవాలనే కోరిక ఆమెకు అంతగా ఉండేది.
ఒక నటిగా, మధుబాల పరిశ్రమలో ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. ఆమె సహనటులు ఆకాలంలో అత్యంత ప్రసిద్ధి చెందినవారు: అశోక్ కుమార్రాజ్ కపూర్, రెహ్మాన్, ప్రదీప్ కుమార్, షమ్మీ కపూర్దిలీప్ కుమార్సునీల్ దత్ మరియు దేవ్ ఆనంద్. మధుబాల ఆ కాలంలోని అనేక ప్రసిద్ధ ప్రధాన నటీమణుల సరసన కూడా నటించారు, వీరిలో కామినీ కౌశల్, సురయ్య, గీతా బాలి, నళిని జయవంత్ మరియు నిమ్మి ఉన్నారు. ఆమెతో పనిచేసిన దర్శకులు అత్యంత విస్తృతి కలిగి గౌరవింపబడినవారిలో కొందరు: మెహబూబ్ ఖాన్ (అమర్ ), గురు దత్ (Mr. & Mrs. ' 55 ), కమల్ అమ్రోహి (మహల్ ) మరియు K. ఆసిఫ్ (ముఘల్-ఏ-ఆజం ) . ఆమె నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించి నాతా (1955) అనే చిత్రాన్ని నిర్మించారు, దానిలో ఆమె కూడా నటించారు.
1950లలో, ఆ సమయంలో తీయబడిన అన్నిరకాల చిత్రాలలో నటించి, మధుబాల తనను తాను వైవిధ్యమైన నటిగా నిరూపించుకున్నారు. బాదల్ (1951) చిత్రంలో ఆమె మూస ధోరణిలో ఉత్తమ స్త్రీ పాత్ర ధరించారు మరియు తరువాత వచ్చిన తరానా (1951)లో ఎదురులేని అందమైన పల్లెటూరి పడుచుగా నటించారు. సాంప్రదాయ ఆదర్శ భారత స్త్రీగా ఆమె సంగ్ దిల్ (1952)లో ఒదిగిపోయారు మరియు మార్గం తప్పిన వారసురాలు అనితగా గురుదత్ వ్యంగ్య చిత్రం Mr. & Mrs. ' 55 (1955)లో హాస్యపాత్రలో నటించారు. 1956లో ఆమె చారిత్రాత్మక వస్త్రాలంకరణతో కూడిన షిరిన్-ఫర్హాద్ మరియు రాజ్-హత్ వంటి విజయాలను పొందారు. సమకాలీన పాత్రల చిత్రణలో సమానమైన విజయంతో, సాంఘిక చిత్రం కల్ హమారా హై (1959)లో ద్వంద్వ పాత్రలతో ఆమె గుర్తిండిపోతారు. మధుబాల, పొగ త్రాగే నాట్యకారిణి బెల్లా, మరియు సంప్రదాయపరమైన సాత్వికురాలైన ఆమె సోదరి మధు పాత్రలను పోషించారు.
అకస్మాత్తుగా-1950ల మధ్యలో, మెహబూబ్ ఖాన్ యొక్క అమర్ (1954) వంటి పెద్ద చిత్రాలతో సహా ఆమె చిత్రాలు, వాణిజ్యపరంగా ఎంతో అపజయాన్ని పొందడంతో ఆమెపై "బాక్స్ ఆఫీసు విషం"గా ముద్ర వేయబడింది. 1958లో వరుస విజయాలతో ఆమె తన వృత్తిజీవితాన్ని మలుపు తిప్పారు: హౌరా బ్రిడ్జ్ చిత్రంలో అశోక్ కుమార్కు ప్రతిగా మధుబాల అసాధారణమైన ఆంగ్లో-ఇండియన్ క్యాబరే గాయనిగా నటించారు, ఈమె కలకత్తా చైనాటౌన్ చీకటి ప్రపంచం యొక్క కష్టనష్టాలకు గురవుతుంది. ఆమె సాహసోపేతమైన (ఆ కాలానికి) పాశ్చాత్య శైలితో, ప్రవహించే కురులు, లోతైన జాకెట్లు, బిగుతైన కాప్రి పాంట్లు మరియు అతికినట్లుండే చైనీయుల దుస్తులతో పెద్ద ప్రభావాన్ని కలిగించారు. ఆ చిత్రం కొరకు ఆషా భోస్లే నేపథ్యగానం చేసిన మధుబాల యొక్క సౌఖ్యాలతో కూడిన దివిటీ పాట ఆయె మెహెర్బాన్, శ్రోతలలో బాగా ప్రజాదరణ పొంది, ఈ నాటికీ విస్తృతంగా హౌరా బ్రిడ్జ్ తరువాత ఫాగున్ ‌లో భరత్ భూషణ్‌కు ప్రతిగా, కాలాపానీలో దేవ్ ఆనంద్‌కు, శాశ్వత విజయాన్ని పొందిన చల్తీ కా నామ్ గాడీలో ఆమె కాబోయే భర్త కిషోర్ కుమార్‌తోనూ మరియు బర్సాత్ కి రాత్ (1960)లో మరలా భరత్ భూషణ్‌కు ప్రతిగా నటించారు.
ఉదహరించబడుతూ మరియు ప్రసిద్ధిపొందుతూ ఉంది.
1960లో ఆమె విజయాలను దృఢపరచుకున్నారు, మరియు ఆమె సూపర్-స్టార్ స్థాయి ఆమెకు కావ్యసంబంధ భారీ-బడ్జెట్ చారిత్రకం, ముఘల్-ఏ-ఆజంతో స్థిరపడింది. ఈ చిత్రం ఆమె వృత్తి జీవితంలో మణిగా మరియు ఆ దశాబ్ద చిత్రనిర్మాణానికే మణిగా భావించబడింది.

తన స్వల్ప జీవితంలో, మధుబాల 70కి పైన చిత్రాలలో నటించారు. మూడు జీవిత చరిత్రలు మరియు ఆమెపై ప్రచురించబడిన అనేక వ్యాసాలలో, ఆమె మర్లిన్ మోన్రోతో పోల్చబడ్డారు మరియు భారతీయ సినీ పరిశ్రమలో అదేవిధమైన గుర్తింపును కలిగిఉన్నారు. బహుశా సహాయక పాత్రలు లేదా క్యారెక్టర్ పాత్రలకు మళ్లించకముందే ఆమె చనిపోవడం కారణంగా, ఈ నాటికీ మధుబాల భారతీయ సినిమా యొక్క శాశ్వతమైన మరియు ప్రసిద్ధిచెందిన వ్యక్తిగా మిగిలారు. 1990లో మూవీ పత్రిక నిర్వహించిన ఒక ఎన్నికలో చిత్ర అభిమానులపై కొనసాగుతున్న ఆమె ఆకర్షణ నొక్కిచెప్పబడింది. మధుబాల అన్ని కాలాలలోను ప్రసిద్ధిచెందిన శ్రేష్టమైన హిందీ నటిగా, సమకాలీన ఐతిహాసిక నటీమణులైన మీనా కుమారి, నర్గీస్ మరియు నూతన్‌లను త్రోసిరాజని 58% ఓట్లను పొందారు. ఇటీవల కాలంలో రిడిఫ్.కామ్ ఇంటర్నేషనల్ వుమెన్స్ డే 2007 స్పెషల్‌లో (చూడుము బాహ్యలింకులు), బాలీవుడ్ యొక్క ఉత్తమ నటీమణుల జాబితాలో మధుబాల రెండవ స్థానాన్ని పొందింది,ఎప్పటికీ" ఈ వ్యాసం ప్రకారం, చివరి జాబితాలో స్థానం పొందిన నటీమణులు"...నటనా నైపుణ్యాలు, ప్రత్యేక ఆకర్షణ, బాక్స్‌ఆఫీస్ ఆకర్షణ, వైవిధ్యత మరియు గుర్తింపు స్థాయిలపై ఆధారపడ్డారు --మరియు వారిలో ప్రతి ఒక్కరూ చిత్రాలలో ప్రముఖపాత్ర పోషించి నూతన ఒరవడి ప్రవేశపెట్టారు.......
ఆమె చనిపోయిన 35 సంవత్సరాల తరువాత, 2004లో ముఘల్-ఏ-ఆజం యొక్క ఒక డిజిటల్‌గా వర్ణీకరించబడిన రూపాంతరం విడుదలైంది, ఈ చిత్రం మరియు మధుబాల అన్ని ప్రాంతాలలోని చిత్ర ప్రేక్షకులలో మరొకసారి విజయాన్ని సాధించారు.
గత దశాబ్దంలో, మధుబాలపై అనేక జీవిత చరిత్రలు మరియు పత్రికా వ్యాసాలూ విడుదలై, ఆమె వ్యక్తిగత జీవితం మరియు వృత్తి గురించి అంతకు ముందు తెలియని విషయాలను వెల్లడించాయి. పర్యవసానంగా 2007లో, శినెయ్ అహూజా మరియు సోహ అలీ ఖాన్ నటులుగా ఖోయా ఖోయా చాంద్ అనే హిందీ చిత్రం నిర్మించబడింది - దీని కథాశం మధుబాల మరియు ఇతర శ్రేష్టులైన చిత్ర వ్యక్తుల జీవితాలలోని కొన్ని సంఘటనలపై కొంతవరకు ఆధారపడింది.
2008లో మధుబాల జ్ఞాపకార్ధం ఒక తపాలా బిళ్ళ విడుదల చేయబడింది. ఈ బిళ్ళ భారతీయ తపాలాచే ఈ నటీమణి చిత్రాలను చూపుతున్న ఒక పరిమిత విడుదల బహుమాన సమూహంగా రూపొందింది. మాజీ నటులు నిమ్మి మరియు మనోజ్ కుమార్‌లు ప్రారంభించిన ఈ ఉత్సాహభరిత వేడుకలో, స్నేహితులు మరియు మధుబాల కుటుంబంలో మిగిలిఉన్న సభ్యులు పాల్గొన్నారు. ఈ విధంగా గౌరవించబడిన మరొక ఏకైక భారతీయ నటి నర్గీస్ దత్.
1950లో రక్తంతో దగ్గిన తరువాత మధుబాల గుండెకు సమస్య ఉన్నట్లు గుర్తించబడింది. ఆమెకు వెంట్రిక్యులర్ సెప్టల్ లోపం, సాధారణంగా "గుండెలో రంధ్రం"గా పిలువబడే లోపం ఉన్నట్లు కనుగొనబడింది. ఆ సమయంలో, గుండెశస్త్రచికిత్స అంత ఎక్కువగా అందుబాటులో లేదు. 
మధుబాల అనేక సంవత్సరాల పాటు చిత్రపరిశ్రమ నుండి తన జబ్బుని దాచిపెట్టారు, కానీ 1954లోని ఒక సంఘటన ప్రసార సాధనాలచే విస్తృతంగా తెలియచేయబడింది: S.S. వాసన్ చిత్రం బహుత్ దిన్ హుయే కొరకు మద్రాస్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె సెట్‌పై రక్తం కక్కుకున్నారు. ఆమె తిరిగి కోలుకునేవరకు వాసన్ మరియు అతని భార్య ఆమెను సంరక్షించారు. ఆమె తన పనిని కొనసాగించి తననుతాను A-గ్రేడ్ నటిగా నిరూపించుకున్నారు.
ఆమె ఆరోగ్య సమస్య కారణంగా మధుబాల కుటుంబం ఆమె పట్ల అత్యంత రక్షణతో ఉండేది. స్టూడియోలలో చిత్రనిర్మాణం జరిగే సమయంలో, ఆమె ఇంటి-నుండి తయారయి వచ్చిన ఆహారాన్ని మాత్రమే తినేవారు, అంటురోగాల బారిన పడే అవకాశాలను తగ్గించడానికి ఒక బావి నీటిని మాత్రమే వాడేవారు. కానీ ఆమె పరిస్థితి పూర్తిగా వికటించి, 1969లో 36 సంవత్సరాల వయసులో చనిపోయారు. జబ్బుతో ఉన్నప్పటికీ, 1950లలోని ఎక్కువ చిత్రాలలో మధుబాల విజయవంతంగా నటించారు.
1960లో, మధుబాల పరిస్థితి దిగజారడంతో ఆమె చికిత్స కొరకు లండన్ వెళ్లారు. సంక్లిష్టమైన హృదయ శస్త్రచికిత్స దాని శైశవదశలో ఉండి ఆమెకు నయం కావడానికి కొంత ఆశను అందించింది. పరీక్షించిన తరువాత వైద్యులుశస్త్రచికిత్స చేయడానికి నిరాకరించి, ఈ ప్రక్రియ వలన జీవించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఒప్పించారు. ఆమె విశ్రాంతి తీసుకోవాలని మరియు అతిగా ఒత్తిడికి గురవరాదని సలహాఇచ్చారు, ఆమె మరొక సంవత్సరం బ్రతుకుతుందని ఊహించారు. తన మరణం ఆసన్నమైందని తెలుసుకున్న మధుబాల, భారతదేశానికి తిరిగివచ్చారు, కానీ మరొక 9 సంవత్సరాలు జీవించడం ద్వారా అంచనాలను అధిగమించారు.
1966లో, తన ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదలతో, మధుబాల, రాజ్ కపూర్‌కు ప్రతిగా చాలాక్ చిత్రంతో తిరిగి నటించాలని ప్రయత్నించారు. చిత్ర మాధ్యమం ఆమె "పునరాగమనాన్ని" ఎంతో ఆర్భాటం మరియు ప్రచారంతో వెల్లడించింది. ఆ సమయంలోని చిత్రాలు అప్పటికీ అందమైన మధుబాలను చూపాయి కానీ ఆమె వివర్ణంగా మరియు కళాహీనంగా కనిపించింది. ఏదేమైనా, కొన్ని రోజుల చిత్రీకరణ తరువాత, ఆమె బలహీనమైన ఆరోగ్యం ఆమెను పడిపోయేటట్లు చేసింది, మరియు ఆమె చిత్రం అసంపూర్తిగా మరియు విడుదల కాకుండా నిలిచిపోయింది.
ఇకమీదట నటించే అవకాశం లేకపోవడంతో, మధుబాల ఆమె దృష్టిని చిత్రనిర్మాణంపై కేంద్రీకరించింది. 1969లో ఆమె ఫర్జ్ ఔర్ ఇష్క్ అనే చిత్రంతో ఆమె దర్శకత్వం వహించడం ప్రారంభించారు. ఏదేమైనా, ఈ చిత్రం ఎప్పుడూ నిర్మించబడలేదు, నిర్మాణ పూర్వ దశలోనే, మధుబాల జబ్బుకు లోనై 1969 ఫిబ్రవరి 23న, తన 36వ పుట్టినరోజు జరిగిన కొద్దికాలానికే మరణించారు. ఆమె తన కుటుంబ సభ్యులు మరియు భర్త కిషోర్ కుమార్‌చే శాంటా క్రుజ్ శ్మశానవాటికలో తన డైరీతోపాటు ఖననం చేయబడ్డారు. జుహు/శాంటా క్రుజ్ ముస్లిం శ్మశాన వాటికలోని మధుబాల సమాధి స్వచ్ఛమైన పాలరాయితో చెక్కబడింది మరియు కురాన్ నుండి ఆయత్లు వాటితోపాటు శ్లోకాలు ఆమెకు అంకితం చేయబడ్డాయి. వివాదాస్పదంగా, నూతన సమాధులకు చోటు కల్పించే ఉద్దేశంతో 2010లో ఆమె సమాధి ధ్వంసంచేయబడింది.

(వివరాలు 'వికీపీడియా' నుండి సేకరణ - ఈ వ్యాసానికి నేను చిత్రీకరించిణ రెండు న పెన్సిల్ చిత్రాలు జోడించాను)

శివరాత్రి



శివయ్య - నా రేఖా చిత్రం.

శివరాత్రి గురించి అద్భుత వ్యాఖ్యానం (Whatsapp నుండి సేకరణ}

"వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నారు.
దేవతలను అమరులుగా చేసేందుకు ‘అమృతం’ కావాలి.

‘అమృతం’ కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది ‘హాలాహలం’.
‘హాలాహలం’  కాలకూట విషం. అది నిలువునా ప్రాణులని  చంపేస్తుంది.

ఆ తర్వాత  అమృతం వస్తే ఎంత? రాకపోతే ఎంత?
హాలాహలం వరకు  ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది?

అప్పుడు ఒక ‘బైరాగి’ ముందుకొచ్చాడు.
అతడు బేసి  కన్నుల వాడు. గోచిపాత వాడు.
అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరయ్య.

చర్మమే ఆయన దుస్తులు......
భస్మమే ఆయన ఆభరణాలు.....

స్మశానమే ఆయన ఇల్లు......
భూతాలు ఆయన మిత్రులు ........

"లోకాల... కోసం నేను విషాన్నిమింగేస్తాను." అన్నాడు.
"రేపు రాబోయే అమృతం కోసం నేడు హాలాహలం తాగేస్తాను" అన్నాడు.

హాలా హల విషమంటే మాటలా? విషం దహించి వేస్తుంది. ఆవిరులు ఊపిరిని ఆపేస్తాయి.
అయినా విషాన్ని ఖుషీగా తాగేస్తానంటున్నాడు తిక్క శంకరయ్య.

"నాకోసం విషాన్ని తాగుతున్నావా తండ్రీ?" ఆప్యాయంగా అనుకుంది పాము.
అంతే చర చర బిర బిర వచ్చి విషం మంటలను తగ్గించేందుకు ఆ శంకరయ్య గొంతుకు చుట్టుకుంది.

విషం గొంతు దిగితే చతుర్దశ భువనాలు ధ్వంసమైపోతాయి.
కాబట్టి అది గొంతు దిగకుండా భార్య ‘పార్వతి’ వచ్చి ఆయనలో తాను సగమైంది.
గొంతును అదిమి పట్టుకుంది.

"జగత్తు కోసం విషం తాగుతున్న ఓ చక్కనయ్యా... నీకు చల్లదనాన్ని పంచుతా".
అంటూ చంద్రుడు శంకరయ్య తలపై కూచుని వేదన తగ్గించే చల్లదనాన్నిచ్చాడు.
శిరోభారం తగ్గించేందుకు గంగ చిరుజల్లులు కురిపించసాగింది.

..
విషం గొంతులో ఉంది.
శంకరయ్య నీల కంఠుడయ్యాడు...
గరళ కంఠుడయ్యాడు....
స్థితి కంఠుడయ్యాడు.
తల తిరుగుతోంది.
మత్తు ఆవహిస్తోంది.
విషం తన పని తాను చేసుకుంటోంది.
రాత్రి గడిస్తే కానీ విషయం అవగతం కాదు.
..
"అయ్యో మాకోసం త్యాగం చేస్తున్నావు. నీకోసం మేముంటాము" అంటూ, సప్త లోకాలు, చతుర్దశ భువనాలు, ముక్కోటి దేవతలు, శతకోటి జనాలు, అశేషకోటి జీవాలు రాత్రి తెల్లవార్లూ అతడిని కనిపెట్టుకుని నిద్ర మాని జాగారం చేశాయి.

‘సమాజం’ కోసం పనిచేసేవాడికి ‘సమాజమే’ తోడు.
‘లోకహితం’ కోరేవాడికి లోకమే హితం చేకూరుస్తుంది.
‘జనం’ కోసం విషం తాగిన వాడు. 
అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు.

ఆ రాత్రి శివరాత్రి అయ్యింది!!!
.
.
.

కాసిన్ని నీళ్లు పోసి మూడు ఆకులేసి కొంచం బూడిద పూస్తే సంబర పడిపోయే శివయ్య కు ఇంతకన్నా గొప్పగా అక్షర నీరాజనం ఉండదేమో .....

11, ఫిబ్రవరి 2018, ఆదివారం

సంస్కార నిధులు - వృధ్ధాప్యం




సంస్కార నిధులు
(Courtesy : ఈనాడు దినపత్రిక)

భీష్మ పితామహుడి గురించి ప్రస్తావిస్తూ, తిరుపతి వేంకట కవులు ‘ఆతడు అనేక యుద్ధముల నారియు తేరిన వృద్ధమూర్తి’ అని ప్రకటించారు. వాస్తవానికి ఆ మాట లోకంలో వృద్ధులందరికీ వర్తిస్తుంది. వృద్ధి అనే మాటకు పెరగడం అని అర్థం. వృద్ధత, వార్ధక్యం, వార్ధకం, వృద్ధాప్యం అనే మాటలన్నీ... వృద్ధి అనే ధాతువులోంచే వచ్చాయి. వ్యక్తిత్వంలో, సంస్కారాల్లో, జ్ఞానంలో, వైరాగ్య భావంలో, వివేకంలో గణనీయమైన ఎదుగుదల వృద్ధాప్యానికి శోభ చేకూరుస్తుంది. ‘సముద్రాలు దాటాడట కాళ్లు తడవకుండా, జీవితాన్ని దాటలేడు కళ్లు తడవకుండా’ అని కవి వసీరా చెప్పినట్లు- జీవన సమరంలో రకరకాల ఆటుపోట్లకు గురికాకుండా ఏ మనిషి జీవితమైనా కడతేరదు. కనుక ప్రతి వృద్ధుడూ ఎంతో కొంత జ్ఞానవృద్ధుడే! ఆ అనుభవాన్ని గౌరవించాలని శాస్త్రాలు బోధించాయి. వృద్ధులు ఎదురైతే అభివాదన శీలంతో ప్రవర్తించాలని భారతం ఆనుశాసనిక పర్వం సూచించింది. ‘వృద్ధు వచ్చునపుడు... అతనికి ఎదురులేచి ప్రణతి చేసెనేని’ ఆయువు పెరుగుతుందని చెప్పింది. దాన్నే అభ్యుత్థానం అనీ అంటారు. అంటే ఎదురేగి నమస్కరించడం! చాలామంది ఈ సూచనను పెడచెవిన పెడతారు. వృద్ధాప్యాన్ని చిన్నచూపు చూస్తారు. అనుభవాన్ని చాదస్తంగా భావిస్తారు. ఎవరినో ఎందుకు- భీష్ముడంతటి జ్ఞానవృద్ధుణ్నే శిశుపాలుడు తెలివి తక్కువవాడు అన్నాడు. రాజసూయం చివరిలో అగ్రపూజకు కృష్ణుడే అర్హుడని భీష్ముడు ప్రకటిస్తే ‘ముదివెర్రి’ పలుకులుగా వాటిని శిశుపాలుడు ఆక్షేపించాడు. ‘వృద్ధుల బుద్ధులు సంచలింపవే (స్థిరంగా ఉండవు కదా) అని నిండుసభలో వృద్ధాప్యాన్ని అవమానించాడు.

వృద్ధాప్యం అనేది బొండుమల్లె పొదలపై ఆరవేసిన పట్టుబట్ట లాంటిది. దాన్ని దులిపితే అనుభవ సౌరభాలు గుప్పుమంటాయి. ‘నిర్మలంబన జాల నెరయు చిత్తంబన నల్లని వెండ్రుకల్‌ తెల్లనయ్యె...’ ఆవేశం, ఉద్రేకం వంటి చిత్త వృత్తులన్నీ తొలగిపోయి మనసు నిర్మలంగా మారిందనడానికి సూచనగా జుట్టు నెరిసింది- అని భాగవతం ముదిమి ప‌రిప‌క్వత‌ను ఆవిష్కరించింది. అయితే, లోకం ‘మెరిసేదంతా మేలిమి కాదు, నెరిసేదంతా అనుభవమూ కాదు’ అంటుంది. ముసలాళ్లందరినీ ఒకే గాటన కట్టేస్తుంది. కనుకనే మనిషి ముసలాడవకూడదు, పెద్దవాడవాలి. ‘కావలె నీవు నేను బహు కర్సనమొప్పగ (కృషి ఫలించి) వృద్ధ జీవులం కావలె’ అని కవులు సూచించారు. అది పరిణతికి చిహ్నం. కన్యాశుల్కంలో మధురవాణి రామప్పంతులుతో చెప్పిన ‘చట్లకు చావ(చేవ) నలుపు, మనిషికి చేవ తెలుపు’ అనే సామెతకు తాత్పర్యం అదే! ఆ పరిపక్వతనే పోతన ‘ఇంద్రియంబుల కోర్కులిక ఒల్లననుభంగి...’ ఇంద్రియ సంబంధిత వాంఛలను ఇక దగ్గరకు రానివ్వను- అని సూచిస్తున్నట్లుగా, ‘ఉడుగక తల చాల వడక చొచ్చె...’ తల అడ్డంగా ఊగుతోంది- అన్నాడు. మనసులోంచి విషయ వాంఛలు రాలిపోయేందుకే మన పెద్దలు గృహస్థాశ్రమం అంచున వానప్రస్థానాన్ని సూచించారు. వనాల్లోకి(అడవుల్లోకి) వెళ్లడమంటే- మనిషి తనలోకి తాను ప్రవేశించడం, పరిపూర్ణ వైరాగ్య చింతనతో కాలం సద్వినియోగం చేసుకోవడం అని అర్థం. నాగరికతకు దూరంగా ఈ రోజుల్లో మన పల్లెల్లో ఏకాంతంగా జీవిస్తున్న వృద్ధులందరూ ఒక రకంగా వానప్రస్థాశ్రమ జీవులనే చెప్పుకోవాలి. ప్రతికూల భావాలనేవి పూర్తిగా అణిగిపోయి, సానుకూల దృక్పథంతో ‘ఇక మంచికి పట్టుగొమ్మయైపోయెను మానసంబు’ అని అనుకోగల స్థితినే పెద్దరికం అంటారు. అలాంటివారిని సినారె చెప్పినట్లు ముసలాళ్లనకూడదు, వయోధికులు అనాలి. భీష్ముడి చివరి దశలో ధర్మజుడిలా వారిని ఆశ్రయించి వారి జీవన అనుభవసారాన్ని జుర్రుకోవాలి.

పల్లెటూళ్లకు ప్రయాణం అనేసరికి మనలో చాలామందికి ప్రాణాలు లేచొస్తాయి. ఎందుకంటే అక్కడ పండుటాకులు మనల్ని ప్రేమగా పలకరిస్తాయి. ఆత్మీయ బంధాలనేవి ఆర్థిక సంబంధాలుగా క్షీణించని రోజుల్లో వృద్ధ భారతం మనిషిని వెచ్చగా స్వాగతించేది, బతుకు పచ్చగా శ్వాసించేది, నాగరీకపు ఉక్కబోతను తీర్చేది. పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని బతుకు పాఠాలు బోధించేది. ‘చేతులారంగ శివుని పూజింప వలయు, దయయు సత్యంబు నిత్యము తలప వలయు’ అంటూ పసి హృదయాల్లో పసిడి భావాలను మొలకెత్తించేది. ముసలితనం గొంతును వణికిస్తుంటే దాన్ని కమ్మని గమకంగా మార్చి ‘మందార మకరంద మాధుర్యాలు’ చవి చూపించేది. సంస్కారాలను అలవరచేది. వృద్ధులను దూరంగా ఉంచడమంటే- జాతి సంస్కార నిర్మాతలను దూరం చేసుకోవడమే! వారికి ఆ వయసులో ఇంకొకరిపై ఆధారపడక తప్పదు. ‘ముగ్గుబుట్ట వంటి తలా, ముడుతలు తేరిన దేహం, కాంతిలేని గాజుకళ్లు తనకన్నా శవం నయం’ అంటూ మహాకవి శ్రీశ్రీ ‘భిక్షు వర్షీయసీ’ అనే ప్రసిద్ధ గీతంలో వర్ణించిన వృద్ధాప్యం- ఒక ఆసరాను కోరుకుంటుంది. బాల్యంలో తాను వేలుపట్టి నడిపించిన చేయి తనకిప్పుడు చేతికర్రగా ఉపయోగపడాలని ఆశపడుతుంది. దురదృష్టవశాత్తు, దేశంలోని 60శాతం వృద్ధులకు అలాంటి చేయూత లభించడంలేదని ‘హెల్ప్‌ ఏజ్‌ ఇండియా’ సంస్థ తన సర్వే నివేదికలో తేల్చి చెప్పింది. 71శాతం వృద్ధులు గ్రామాల్లో నివసిస్తుండగా, వారి పిల్లలు ఎక్కడో దూరంగా పట్టించుకోకుండా ఉంటున్నారట. ‘శీతగాలి రానీయకు శిశిరానికి చోటీయకు’ అని కృష్ణశాస్త్రి కోరుకొన్నట్లుగా, చివరి దశలో మనిషి నిశ్చింతగా జీవించాలంటే, కవికర్ణ రసాయనకర్త చెప్పినట్లు ‘జనక జానంద బీజత్వంబు గైకొను...’ తల్లిదండ్రుల ఆనందానికి తామే మూలకారణమయ్యే సుపుత్రులు వారికి లభించాలి. అంతకన్నా వేరే దారి లేదు!

(Courtesy :  ఈనాడు సంపాదకీయం  -  నా పెన్సిల్ చిత్రాలు జతచేసాను)

10, ఫిబ్రవరి 2018, శనివారం




నా గీతల్లో గీతలకి చక్కని కవిత అల్లిన Jyothi Kanchi కి శుభాశీస్సులు.


గెలుపు
~~~~~
రుధిరాలను నింపుకున్న ఆచూపుల్లో...
ఈ గీతల్లో నన్ను నేను ఎలాచూసుకున్నా
పెద్దగీతకు చిన్నగీతననే నీచుల్కనే!
వీలైనన్ని సాయంత్రాలు దులుపుతునేఉన్నా
వార్ధక్యపు ఛాయలేవీ నాప్రేమనంటకుండా
మనసైన మాటలేవో
నాల్గెైనా తెస్తావనే ఆశతెగకుండా!!
ఎంతవద్దనుకున్నా
నాచూపు నీదారిన పోసిన పూలను రాతిరికోసిన చుక్కలను మోస్తూనే వుంటాయిలా....
వసంతాలెపుడూ మూగబోవులే అనుకున్నదో
రెక్కతెగినకోయిల
ఇపుడదేపనిగ యుగళాక్షరాలు వెతుక్కుంటోది
వసంతం పచ్చబడక వెక్కిరిస్తోంది
మృదువైన చూపులిపుడు చుర్కుమంటున్నాయి....
నీవు గీచిన ఆంక్షలగీతలు
మనతలరాతలుగా మారకముందే...మేలుకో
స్పష్టంగానో,,ఇష్టంగానో ఒక్కమాటచెప్పనా
నువ్వు గెలిచాననుకుంటున్నావు
నిజమే...
నీలోని నేననే సంతోషాన్ని కొద్దికొద్దిగా ఓడిపోతూ........
(చిత్రం చూడగానే స్ఫురించిన భావన....
మీ ప్రతిగీతా భావనల ఊట బాబాయ్ గారూ.....)

సాధన - Sadhana


నా సాధన లో 'సాధన' (అలనాటి మేటి నటి 'సాధన' 'అస్లీ నక్లీ' చిత్రం నుండి నా పెన్సిల్ చిత్రం)

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

టి. బాలసరస్వతి - T. Balasaraswati


భరతనాట్యం నృత్యకారిణి పద్మ విభూషణ్ టి. బాలసరస్వతి గారి వర్ధంతి సందర్భంగా నా స్మృత్యంజలి. (నా పెన్సిల్ చిత్రం).
దేవదాసి కుటుంబంలో జన్మించిన టి.బాలసరస్వతి భరతనాట్యకళ ప్రపంచ లలితకళల పటంలో ప్రముఖస్ధానం అలంకరించటానికి తమవంతు కృషి చేసి భరతనాట్యానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ టి. బాలసరస్వతి గారి మీద ఒక documentary ని కూడా నిర్మించారు.
Tribute to Padma Vibhushan T. Balasaraswati, great Bharata Natyam dancer on her death anniversary today. Her rendering of Bharatanatyam, a classical dance style originated in the South Indian state of Tamil Nadu, made this style of dancing well known in different parts of India and many parts of the world.

‘మధురవాణి ' నోట గురజాడ ' సుభాషితం !!

 ఈనాడు facebook లో నా చిత్రాలతో వచ్చిన వ్యాసం .  *సాని ' దానికి మాత్రం "నీతుండొద్దా" ?  *‘మధురవాణి ' నోట గురజాడ ' సుభా...