25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

అని యానతిచ్చె కృష్ణుడర్జునునితో విని యాతని భజించు వివేకమా - అన్నమయ్య కీర్తన


వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన : అన్నమయ్య కీర్తన

విశ్లేషణ : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi
~~~~~~~~~~~~~~~~
ఒక ప్రార్థన పద్యం🙏
తే.గీ
సకల ప్రాణుల సృష్టింప జాలుదీవు
సకల జీవుల పోషింప జాలుదీవు
దేవదేవ! జగత్పతీ! దీనబంధు!
నిన్నెరుంగుదు స్వయముగా నీవె తండ్రి!
(ఇ.వి. సుబ్రహ్మణ్యం గారిది)

కీర్తన పాఠం
**********
అని యానతిచ్చె కృష్ణుడర్జునునితో
విని యాతని భజించు వివేకమా ||
భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల
దీమసాన మోచేటి దేవుడ నేను
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడ నేను ||
దీపనాగ్నినై జీవదేహముల అన్నములు
తీపుల నరగించేటి దేవుడ నేను
ఏపున నిందరిలోని హృదయములోను నుందు
దీపింతు తలపు మరపై దేవుడ నేను ||
వేదము లన్నిటిచేత వేదాంతవేత్తలచే
ఆది నేనెరగతగిన ఆ దేవుడను
శ్రీదేవితోఁ గూడి శ్రీ వేంకటద్రి మీద
పాదైన దేవుడను భావించ నేను ||
🔹నాకు తెలిసినంతలో వివరణ
~~~~~~~~~~~~~~~~~~
అన్నమయ్య ఈ కీర్తనలో భగవద్గీత
15 వ అధ్యాయం పురుషోత్తమ యోగంలోని 13,14,15 శ్లోకాల భావాన్ని తీసుకొని సామాన్యులకు కూడ అర్థమయ్యేలా భగవంతుని విశ్వ వ్యాపకత్వాన్ని, ధారణ, పోషణ, రక్షణల నేర్పును చాటి చెబుతున్నారు.
ముందు ఆశ్లోకాలు , వాటి భావం చూద్దాం.
శ్లో॥
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా !
పుష్ణామి చౌషదీః సర్వాః
సోమో భూత్వా రసాత్మకః !!
శ్లో ॥
అహం వైశ్వానరో భూత్
వాప్రాణినాం దేహమాశ్రితః !
ప్రాణాపానస మాయుక్తః
పచామ్యన్నం చతుర్విధమ్ !!
శ్లో॥
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహమ్॥
🔹🔹పై మూడు శ్లోకాల భావం
————————-
భూమిలో ప్రవేశించి నేను నాశక్తితో సమస్త చరాచర జీవకోటిని ధరిస్తున్నాను. పోషిస్తున్నాను. రసస్వరూపుడైన, అమృతకిరణుడైన చంద్రడనై సకల ఓషధులకు పుష్టిని కలిగిస్తున్నాను.
జీవులలో వైశ్వానరుడనే జఠరాగ్నినై భక్ష్య,భోజ్య, చోష్య, లేహ్యములనే నాలుగు విధాల ఆహారాలను జీర్ణించుకునేటట్లు చేస్తున్నాను.
సమస్త హృదయాలలో అంతర్యామినై
స్మృతిని, విస్మృతిని, జ్ఞానాన్ని, సంశయ నివారణను(అపోహను)కలిగిస్తున్నాను.
వేదములు నేనే. వేదాంత కర్తనూ నేనె, వేదవిజ్ఞుడనూ నేనె.
—————-
పై శ్లోకాలను అన్నమయ్య కీర్తనలో పొందు పరిచారు. ఆ కీర్తన మీరు పైన చూసారు గనక కీర్తన భావం చూద్దాం.
🔹కీర్తన భావం 👇🏿
“కృష్ణుడు అర్జునునితో ఏమన్నాడో విని ఓ మనసా వివేకంతో గ్రహించి ఆ పరమాత్మను పూజింపరాదా!”
అంటూ అన్నమయ్య చరణాలు ఆ కృష్ణ పరమాత్మ మాటలుగా ఉత్తమ పురుషలో వ్రాసారు.
భగవానుడిలా అంటున్నాడు కీర్తనలో…
“నేనుఅంతర్యామిని. పంచభూతములలో నిండి ఉన్నవాడను. ఈ భూమిలో ప్రవేశించి ఈ ప్రాణికోటినంతా నేర్పుతో మోస్తున్నాను. పుట్టించినందుకు ప్రేమతో వారిని పోషించడానికి రసస్వరూపుడైన , అమృత కిరణుడైన చంద్రుడనై వాటికి శక్తినిచ్చే ఓషధులనూ, ధాన్యాలనూ పండిస్తున్నాను.
జీవుల శరీరంలో జఠరాగ్ని నేనై అన్నిరకాల ఆహార పదార్థాలనూ , ( భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయాలు) అరిగిస్తున్నాను.
హృదయంలో ప్రకాశించే జ్యోతి స్వరూపుడనై ఆలోచనలనూ, మరపునూ కూడ ప్రసాదిస్తున్నాను. (మరుపుకూడ జీవికి ఒక వరమే కదా!)
వేదాలు, ఉపనిషత్తులు, శృతి పురాణాదు లన్నింటిచేత మొదట తాను పండితులకు , తత్త్వజ్ఞులకు అర్థమై వారి వలన లోకానికి తెలుస్తున్నాను. ఈ వేంకటాద్రిపై నెలకొని అందరినీ అనుగ్రహిస్తున్నాను.”
బుద్ధి జీవి అయిన మనిషి అహంకారంతో అంతా నా గొప్పదనమే అనుకుంటాడు. ఏది కదలాలన్నా, ఏది జరగాలన్నా ఆ పరమాత్మ అనుకుంటేనే జరుగుతుంది. నీ ఉనికే ఆయన ప్రసాదించినదని మరిచిపోవద్దు.
ఇదే అన్నమయ్య చెప్పదలచినది.

(బాపు గారి చిత్రం ఆధారంగా నేను చిత్రీకరించిన చిత్రం - (వాటర్ కలర్స్)

19, ఫిబ్రవరి 2022, శనివారం

మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు | సహజివలెనుండేమి సాధించలేడు -- అన్నమయ్య కీర్తన

 వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన : మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు |
సహజివలెనుండేమి సాధించలేడు॥

విశ్లేషణ సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
చిత్రం : Pvr Murty
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi


మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు |
సహజివలెనుండేమి సాధించలేడు॥
వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు |
చెదరి మరచితే సృష్టి చీకటౌ |
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు |
నిదురించితే కాలము నిమిషమై తోచు II
వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ |
జాడతో నూరకుండితే జడుడౌను |
వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ |
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను II
మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెర వెరగ కుందితే వీరిడి యౌను
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును
పరగ సంచయించితే పాషండుడౌను II

—————————
🌻వివరణ నాకు తెలిసినంత
***********************
మానవజన్మ లక్ష్యాన్ని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన జీవన విధానాన్ని చెప్పిన కీర్తన ఇది. ఒకరకంగా వ్యక్తిత్వ వికాసానికి సూత్రాలు చెప్పారు అన్నమయ్య.

🔹పల్లవి

*మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు |
సహజివలె నుండేమి సాధించలేడు

మనిషైనవాడు ఉద్యోగి కావాలంటాడు. ఉద్యోగమంటే ప్రయత్నం. పసివాడు కూర్చోడం, పాకడం, నడవడం నుంచి జీవితంలో ఏది చేయగలిగినా అది ప్రయత్నం వల్లనే గానీ దానంతటది రాదు. అలాగే జీవన్ముక్తి కూడా ప్రయత్నం వలననే వస్తుంది. స్తోత్రం, లేదా నామం ఒక సారి పఠిస్తేనే పుణ్యం వస్తుందా? మోక్షం కలుగుతుందా? నిరంతర ధ్యానం, నమ్మకం , సహనం వీటితో పాటు మళ్ళీ తన కర్మాచరణలో లోపం లేకుండా చేయాలి.

సహ అంటే భూమి అని అర్థముంది. సహజ అంటే కొండో బండో కావచ్చు. బండరాయిలా పడుంటే ఏదీ సాధించలేవని అర్థం. సహజి కాలక్రమంలో పదం మారి ఉండవచ్చు.

1)చ॥

వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు |
చెదరి మరచితే సృష్టి చీకటౌ |
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు |
నిదురించితే కాలము నిమిషమై తోచు II

‘భగవంతుడు ఉంటే కనబడడేం’అంటుంటారు.
(ఒక MLA ని కలవడం మనం అనుకోగానే జరుగుతుందా? )

మరిక భగవంతుడంటే విశ్వాధిపతి! జగన్నాటక కర్త! ప్రతివారికీ కనబడే అవసరం ఆయనకేముంది! మనం వెతకాలి. మనం కనబడమని మనసులో వేడుకోవాలి. అన్య చింతనలు వదలాలి. అదే లక్ష్యంగా శ్రమ పడాలి. భగవంతుణ్ణి పొందే మార్గాలు భాగవతంలో చెప్పారు కదా! ఏదో ఒక మార్గంలో అకుంఠిత దీక్షతో సాగితే భగవద్దర్శనం కలిగితీరుతుంది. వెతకాలి ఆయన ఉనికి కోసం!
మనసు చెదిరి పోతే మనకు మిగిలేది చీకటే. ఆపదలో స్మరిస్తాం. వేరే ప్రలోభాలకు గురై అంతలో మరిచి పోతాం. అప్పుడు మిగిలేది చీకటే. చీకటంటే అజ్ఞానమే!

మొదలు పెట్టి నడుస్తుంటే భూమిని కూడ చుట్టిరావచ్చు. సముద్రాలనే ఈదిన వారు, పర్వతాగ్రాలనే చేరిన వారు, ఆ సేతు హిమచలం నడవడమో, సైకిల్ తొక్కడమో చేసినవారు, కొత్త ఖండాలూ, దేశాలూ కనుక్కున్నవారు ఎందరో ఉన్నారు. అదంతా ప్రయత్నమే కదా!

ఇదీ అంతే. సంకల్ప బలంతో ఆపకుండా ముందుకు వెళ్ళాలి!
నిద్రపోతే నిమిషం కూడా ముందుకు పోలేం.తాబేలు కుందేలు కథ విన్నాం కద!

2చ॥
*వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ |
జాడతో నూరకుండితే జడుడౌను |
వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ |
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను!

ఇష్టం గా చేస్తే ఏ పనీ కష్ట మనిపించదు. హిరణ్య కశిపుడి వంటి రాక్షసులు వెదికారు. కానీ వాళ్ళు విరోధంతో, కనబడితే చంపాలని వెతికారు. కానీ ఆయన ప్రహ్లదుడి భక్తిని, నమ్మకాన్ని గెలిపించడానికే బయటికి వచ్చాడు.
ఏడుస్తూ ఎంత చదివినా తలకెక్కదు. ఏ పని చేసినా విసుక్కుంటూ చేస్తారు కొందరు. దానివల్ల సుఖము ఉండదు. ఇష్టం లేకపోతే చిన్నపనికూడా భారంగానే ఉంటుంది. ఇష్టంలేకుండా పెద్దవాళ్ళ పోడు పడలేక నేర్చుకునే సంగీతం రాణిస్తుందా? ఏదైనా అంతే!
జాడతో ఉరకడమంటే దేనికైనా ఎవరో ఆచూకీ చెబితేనో , ఉపాయం చెబితేనో మన మనసుకు పదునుండదు. మనంతట మనం వెతికి పట్టుకుంటే ఆ ఆనందమే వేరు. సోమరిగా పరుగెత్తితే మిగిలేది సోమరితనమే. భగవంతుడు ఎవరో చెబితే కనబడడు … ఒక్కొక్కరికి ఒక్కోరకంగా దర్శనమీయవచ్చు. ఆయన జాడ ఒకరు చెప్పేది కాదు.

మామూలు జీవితంలోనే మంచి రాంకు సాధించాలంటే, ఉన్నత మైన స్థాయికి ఎదగాలంటే తపస్సు చేసినట్లు చదవాలి, శ్రమించాలి కదా! ఓటమి ఒప్పుకోకూడదు!

ఇవేవీ కాదని సోమరిపోతుగా ఉంటే వాడిలో శ్రేష్ఠత ఉండదు. గుణము అంటే వన్నె. ఏదో చచ్చీచెడీ డాక్టరో, ఇంజనీరో , మరొకటో అయినా అందులో వన్నె కనబడదు( గుణహీనుడు).

3చ॥
* మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెర వెరగ కుందితే వీరిడి యౌను
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును
పరగ సంచయించితే పాషండుడౌను II

ముర అనే దైత్యుని చంపిన ఆ హరిని పూజిస్తే మోక్షం. మనలోని అసురుడిని చంపి మనం పేరు సాధించడమే నిజమైన పౌరుషం.
భయపడుతూ కుంగిపోతే పనికిమాలిన వాళ్ళమే ఔతాం.
శరణాగతికే ఆ వేంకటపతి కనబడతాడని గజేంద్ర మోక్షం చెబుతోంది. అంటే అంతా ఆయన మీద వేసి కూచోవడం కాదు. నూరు శాతం మనం ప్రయత్నించి , ఆయన అనుగ్రహమూ కోరాలి. అంతా నేనే చేస్తున్నాననే అహం విడిచి పెట్టాలి।

సంవత్సరాల శ్రమతో వేలకోట్ల రాకెట్ తయారుచేసిన సైంటిస్టులు దానిని పంపుతూ దేవుడికి మొక్కడం ఇదే. చేసిన ప్రయత్నం అనుకూలించడానికి దైవానుగ్రహం ఉండాలి। అది మోక్ష మైనా మరొకటైనా!

ఈ విధంగా ఈ నాటి కీర్తనలో ప్రతి వాక్యమూ అన్నమయ్య నిజజీవితానికి కూడా అన్వయించుకునేలా మార్గదర్శకత్వం చేసాడు!

అన్నమయ్య గొప్ప కౌన్సిలింగ్ ఇందులో ఉంది.

16, ఫిబ్రవరి 2022, బుధవారం

బప్పి లహరి.. సంగీత దర్శకుడు, గాయకుడు pen sketch

 తన సంగీతం, గానంతో జన హృదయాలను ఉర్రూతలూగించిన డిస్కో కింగ్ బప్పి లహరి ఇక లేరు. వారి గురించి ఈ క్రింది క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.


https://en.wikipedia.org/wiki/Bappi_Lahiri

 వీరు తెలుగు చిత్రాలకు కూడా సంగీతం అందించారు.  వివరాలు ETV సౌజన్యంతో ఇక్కడ పొందుపరుస్తున్నాను. చదవండి. 


డిస్కో కింగ్​ బప్పీ లహిరి ఫిబ్రవరి 16న తుదిశ్వాస విడిచారు. దీంతో భారత చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ బప్పీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్​ ఎలా ప్రారంభమైంది? ఆయన అందించిన పాటలు ఏంటి? సహా పలు విశేషాల ఆకాశంలో ఏ తార పిలిచిందో? తనకు కొత్త స్వరాలు కావాలని...ఆ లోకంలో ఎవరు ఆహ్వానించారో? డిస్కో పాటలు పాడుదువు రమ్మని  ..

అందుకేనేమో బప్పీ లాహిరీ...మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. 
'ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ'... అంటూ తెలుగు సినీ సంగీత ప్రియులు పాడుకునేలా చేసిన సంగీత కెరటమాయన. ఇక అదే ఆకాశంలో మెరవడానికి ఇక్కడి నుంచి పయనమయ్యారు. 'చుక్కల పల్లకిలో...చూపుల అల్లికలో' అంటూ ప్రేమ గీతం పల్లవించినా...'వానా వానా వెల్లువాయే' అంటూ ప్రణయ తరంగాల మోత మోగించిన బప్పిలహిరి స్వరాలు... మన మనసుకు ఉల్లాస హారాలయ్యాయి. 'పాపా రీటా...'అంటూ డిస్కో సంగీతంతో ముంచెత్తిన.. 'బోయవాని వేటుకు గాయపడిన కోయిల' అంటూ మధురంగా మెలోడీతో అలరించిన... ఆయన పాటల హోరు... మన గుండెల్లో జోరు పెంచాయి. ఇక మీదట ఆయన గంధర్వ లోకాన్ని డిస్కో ఆడించవచ్చేమో...! ఇప్పటికే ఆయన మనకిచ్చిన స్వరాలు మాత్రం అమృతఝరులై సంగీతప్రియుల గుండెల్లో వినిపిస్తూనే ఉంటాయి. Bappi lahiri Disco king: "డిస్కో ఎలక్ట్రానిక్‌ సంగీతం నడిచొస్తుంటే బప్పీలానే ఉంటుంది. ఒంటి నిండా రకరకాల ఆభరణాలతో బంగారు కొండలా మెరిసిపోయే ఆయన ఆహార్యమూ ఆ పాటల్లాగే ఎప్పటికీ ప్రత్యేకమే." అని అభిమానుల ప్రశంసలందుకొనే బప్పీలాహిరీ 1952 నవంబరు 27న పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలో జన్మించారు. ఆయన అసలు పేరు అలోకేష్‌ లాహిరీ. ఆయన తల్లిదండ్రులు అపరేష్‌ లాహిరీ, బాన్సురి లాహిరీ. ఇద్దరూ శాస్త్రీయ సంగీత గాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లకు ఒక్కగానొక్క సంతానం బప్పీ. మూడేళ్లకే తబల వాయించడంతో మొదలుపెట్టిన చిచ్చరపిడుగు ఆయన.


సేకరణ : సౌజన్యం  ETV భారత్ 

14, ఫిబ్రవరి 2022, సోమవారం

హాస్య నటుడు రాజబాబు - చిత్ర నివాళి

 

రాజబాబు - pencil sketch


Comedian Rajababu Death Anniversary: 14th February 

తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుల పేర్లు చెప్పాల్సి వస్తే రాజబాబు పేరు తప్పకుండా ఉంటుంది. ‘హాస్యనట చక్రవర్తి’గా ఎన్నో వెలకట్టలేని పాత్రలు పోషించారాయన. కథానాయకుడు ఎవరైనా సరే! ఆయన ఉంటే చాలు. సినిమా సగం హిట్టయినట్టే అన్నది ఆనాటి దర్శక-నిర్మాతల నమ్మకం. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రాజబాబు ఒకానొక దశలో హీరోలకు సమానంగా పారితోషకం అందుకునే వారట!

ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35వేల రూపాయలు. రాజబాబు పారితోషికం 20వేల రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకూ 35వేల రూపాయలు కావాల్సిందేనని పట్టుపట్టారు రాజబాబు. 'ఎన్టీఆర్ హీరో.. మీరు కమెడియన్’ అని నిర్మాత అంటే, ‘అయితే హీరోనే కమెడియన్‌గా చూపించి సినిమాను విడుదల చేయండి' అని సమాధానం ఇచ్చారట. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే బుర్రకథ, హరికథలతో నవ్వులు పంచేవారట. స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కెరీర్‌ తొలినాళ్లలో అవకాశాలు లభించక ట్యూషన్లు చెప్పుకొంటూ బతికారు.జగపతి వారి 'అంతస్తులు' సినిమాలో నటించినందుకు రాజబాబు అందుకున్న పారితోషికం 1300 రూపాయలు. రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం అదే. ఆ తరువాత హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయిదు రూపాయల కోసం గంటల తరబడి టి.నగర్‌లో నిలబడిన చోటు ముందు లక్ష రూపాయల ఖరీదైన కారులో వెళ్తూ గతాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకునేవారట. తనలా కష్టాలు పడుతున్న చాలామందిని అప్పట్లో ఆదుకున్నారు.

జగపతి వారి 'అంతస్తులు' సినిమాలో నటించినందుకు రాజబాబు అందుకున్న పారితోషికం 1300 రూపాయలు. రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం అదే. ఆ తరువాత హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయిదు రూపాయల కోసం గంటల తరబడి టి.నగర్‌లో నిలబడిన చోటు ముందు లక్ష రూపాయల ఖరీదైన కారులో వెళ్తూ గతాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకునేవారట. తనలా కష్టాలు పడుతున్న చాలామందిని అప్పట్లో ఆదుకున్నారు.

గంటల చొప్పున నటించిన నటుడాయన. ఒక గంట ఎన్టీఆర్ తో నటిస్తే, మరో గంట శోభన్ బాబు, ఇతరుల చిత్రాల్లో నటించిన రికార్డు రాజబాబు సొంతం. డబ్బుకు, పరపతికి కొదవ లేదు. కుటుంబంతో గడపలేనంత తీరికలేకుండా ఉండేవారు. ఒకప్పుడు మద్రాస్ లో కేవలం మంచినీళ్ళు తాగి రోజులు వెళ్ళదీసిన  రాజబాబు .. క్రమంగా  హీరోను మించిన పాపులారిటీ, డబ్బు సంపాదించారు. ఆ రోజుల్లోనే రాజబాబు లక్షల్లో పారితోషకం తీసుకున్నారు. 

ఫిబ్రవరి 14 రాజబాబు  వర్ధంతి సందర్భంగా నా చిత్ర నివాళి.


(ETV భారత్ చదివి తెలుకున్న విషయాలు మీతో పంచుకుంటున్నాను)

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల - అన్నమయ్య కీర్తన


నా facebook post యధాతధంగా :

వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన : "మేలుకో శృంగార రాయ మేటి మదనగోపాల..."
విశ్లేషణ డా. Umadevi Prasadarao Jandhyala ,
చిత్రం పొన్నాడ మూర్తి
సహకారం: శ్రీమతి Ponnada Lakshmi
~~~~~🍀🙏🍀~~~~~~

ఓం నమో వేంకటేశాయ 🙏
మొదట ఒక ప్రార్థన పద్యం.

శా॥
కస్తూరీ తిలకోజ్వల స్మిత ముఖా! కైవల్య లక్ష్మీ సఖా!
హస్తోదంచిత శంఖచక్ర రుచిరా!
హస్తీంద్ర రక్షాపరా!
అస్తోకామృత వర్షవేణు నినదా! యానంద లీలాస్పదా!
తస్త్రానేక జనాభయప్రదకరా!
ధారాధరాశ్రీధరా!
(రాధికా స్వాంతనం)
అన్నమయ్య తనస్వామిని అన్ని కోణాలలోనూ చూసి పరవశించాడు. ఆయన మహిమలు, అవతారప్రభలు, దుష్టశిక్షణ, శిష్టరక్షణాది సంఘటనలు, ప్రతి చేత వెనుక గల పరతత్వము …. ఇలా ఎన్నో! కృష్ణావతారంలో బాలుడిగా చేసిన అల్లరి , రసశేఖరునిగా ఆయన శృంగారం, వీరునిగా ఆయన ప్రతాపం , దుర్మార్గుల పట్ల ఆయన చూపిన రౌద్రం, రాజకీయదురంధరునిగా ఆయన వ్యూహరచన , గురువుగా బోధ ఇలా అనేకం అన్నమయ్య కీర్తనలలో కనబడతాయి!
ఇప్పుడు ఈ వారం అన్నమయ్య కీర్తన
‘మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల’గురించి చెప్పుకుందాం.
ఊయలలో కన్నయ్యకు లాలి పాటలు పాడిన అన్నమయ్యే శృంగార మూర్తి అయిన మదన గోపాలుడికి మేలుకొలుపూ పాడుతున్నాడు!

🔹కీర్తన పాఠం
**********
ప॥
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా
చ॥
సందడించే గోపికల జవ్వనవనములోన
కందువదిరిగే మదగజమవు
యిందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద
చ॥
గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా
సతుల పదారువేల జంట కన్నులఁ గలువలు
కితమై పొదిమిన నా యిందు బింబమ
చ॥
వరుసంగొలనిలోనివారి చన్నుఁగొండ
లపై
నిరతివాలిన నా నీలమేఘమా
శిరినురమున మోచి శ్రీవేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా!
💥వివరణ 👇🏿
అన్నమాచార్యుల వారు స్వామిని ‘శృంగార రాయా’అని సంబోధించారు. వీరశృంగారాలు సమపాళ్ళలో ఉన్నవాడు స్వామి! ఆయనలోని శృంగార కోణాన్ని దర్శింపజేస్తున్నారు అన్నమయ్య !
ఆ మోహనరూపుడైన గోపాలుని సౌందర్యానికి జగత్తంతా స్త్రీ పురుష భేదం లేకుండా మత్తిల్లిపోయింది. గోపకాంతలంతా మనసు పారేసుకొని పరుగులు పెట్టారు.మువ్వగోపాలుడు మదనగోపాలుడై రాసక్రీడలతో రంజింప చేసాడు.
ఇవన్నీ తలుచుకుంటూ ‘మదన గోపాలా మేలుకో !’ అంటూ వ్రాసిన మేలుకొలుపు కీర్తన ఇది!
“ఓమదన గోపాలా మేలుకోవయ్యా! నీ అందంతో మమ్మల్ని మత్తులో ముంచి నువ్వు నిద్రపోతున్నావా? మాపాలిటి పెన్నిధివి నీవు ! నమ్మిన వారిని పాలముంచే నిధానము నీవు !”
ఈ కీర్తన శృంగారానికి పరాకాష్ఠ!
మదన గోపాలుని రసికతను ఎలా వర్ణించాడో చూడండి.
“గోపికల యౌవనమనే అరణ్యంలో విచ్చలవిడిగా తిరిగే మదపుటేనుగవు నీవు!
చందమామ వంటి ముఖంకలిగిన సత్యభామ హృదయపద్మంలోని సువాసనను మరిగిన గండుతుమ్మెదవు నీవు.
రుక్మిణీదేవి కౌగిలి అనే పంజరంలో సంగమ వేళ ముద్దులొలికే రాచిలుకవు నీవు.
పదహారు వేలమంది గోపికల కలువలవంటి కన్నులలో ముందే పుట్టిన చంద్ర బింబానివి! మేలుకో స్వామీ “
సాధారణంగా చంద్రోదయమయ్యాక కలువలు విచ్చుకుంటాయి. కానీ ఇక్కడ ఈ చంద్రుడికి ఎంత తొందరంటే అవి విచ్చుకోక ముందే వచ్చేసాడు. ఇంకా వివరంగా చెబితే కలువలవంటి కళ్ళు చందమామ వంటి వదనంలో కదా విచ్చుకున్నాయి! కనక ముందే చంద్రుడు వచ్చినట్లు లెక్క!
తరవాత చరణంలో మోహనకృష్ణుని
అల్లరి శృతిమించింది.
“సరస్సులో జలకాలాడుతున్న గోపికల స్తన గిరులపై తిరిగే నీలమేఘమా !
ఇప్పుడు వేంకటాద్రిపై శ్రీని ( లక్ష్మీ దేవిని) వక్షస్థలాన మోస్తూ గొప్ప వరాలనిచ్చే కల్పతరువా! మేలుకోవయ్యా!”
ఇదండీ అన్నమయ్య తన మనోనేత్రంతో దర్శించిన శ్యామసుందరుని శృంగార చేష్టలు!
శృంగార రాయనికి సింగారాల సిరికి
ప్రణమిల్లుతూ స్వస్తి 🙏
~~~~~~~~~~~
కం॥
శృంగారంబున మేటివి
యంగనలను మోహపెట్టి యాడింతువయా!
ముంగొంగు బసిడి వీవని
చెంగును జాపుదుము నీదు చిత్తము కరుగన్ !
( స్వామికి నా పద్యకుసుమం),
~~~~~~~~~~~~~
డా.ఉమాదేవి జంధ్యాల
చిత్రం- శ్రీ Pvr Murty గారు

 

7, ఫిబ్రవరి 2022, సోమవారం

ప్రకృతిలోన అందాలను పెంచుతుంది “శ్రీ పంచమి”

వసంత పంచమి సందర్భంగా నా చిత్రానికి మిత్రులు RVSS Srinivas గారు రచించిన గజల్ గజల్ ఛందస్సుతో వ్రాసిన వసంతగీతం | ప్రకృతిలోన అందాలను పెంచుతుంది “శ్రీ పంచమి” వేలపూల పరిమళాన్ని పూసుకుంది “శ్రీ పంచమి” తోటలలో కళలెన్నో నింపుతుంది “శ్రీ పంచమి” భ్రమరాలకు స్వాగతాలు పలుకుతుంది “శ్రీ పంచమి” పుష్పశరుని బాణాలకు బాసటగా నిలుస్తుంది పడుచువారిలో ప్రేమను నాటుతుంది "శ్రీ పంచమి" శ్వేతవర్ణకమలప్రియకు భక్తితోటి ప్రణమిల్లును సరస్వతీ పూజలోన మునుగుతుంది “శ్రీ పంచమి” అరకులోయలో వణికే భూములపై 'నెలరాజా వలిసపూల కంబళ్ళను కప్పుతుంది “శ్రీ పంచమి”

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

"ఇంతకాలమో కదా ఈ దేహధారుణము" - అన్నమయ్య కీర్తన

వారం వారం అన్నమయ్య.. "ఇంతకాలమో కదా ఈ దేహధారుణము"

చిత్రం- శ్రీ పొన్నాడ మూర్తిగారు
విశ్లేషణ - డా. ఉమాదేవి జంధ్యాల
సహకారం : శ్రీమతి Ponnada Lakshmi

~~~~~~~~🙏~~~~~~~~
మొదట ఒక ప్రార్థన ( ఆదినారాయణ శతకం)
శా॥
యావజ్జీవము దేహసౌఖ్యమునకై యతినించువారై భవ
త్సేవన్జేయుట మాని లోభ రతులై చీకాకును బొంది యో
దేవాదుర్వ్యసనంబులంబడుదురింతేకాని,యీ మానవుల్ న
నీవే మూలమటంచుఁగొల్వరిల దండ్రీ యాదినారాయణా!

కీర్తన పాఠం
***********
ప || ఎంతకాలమో కదా ఈ దేహధారణము
చింతా పరంపరల చిక్కువడ వలసె॥
చ॥
వడిగొన్న మోహంబు వలలతగులై
కదా
కడలేని గర్భనరకము లీదవలసె
నడిమి సుఖములచేత ననుపు
సేయక కదా
తొడరి హేయపు దిట్టి దూరాడ వలసె
2)పాపపుంజములచే పట్టువడక కదా
ఆపదలతోడి దేహము మోపవలసె
చూపులకు లోనైన సుఖము కానక కదా
దీపన భ్రాంతిచే తిరుగాడ వలసె ॥
౩.)
హితుడైన తిరువేంకటేశు కొలువక కదా
ప్రతిలేని నరక కూపమున బడవలసె
అతని కరుణామృతంబబ్బకుండక కదా
బతిమాలి,నలుగడల పారాడవలసె
———————-
🔹వివరణ నాకు తెలిసినంత
ప ||
ఎంతకాలమో కదా ఈ దేహధారణము
చింతా పరంపరల చిక్కువడ వలసె॥
*అన్నమయ్య కీర్తనలు వేదోపనిషత్తుల సారాన్ని , గీతా సారాన్ని ఇముడ్చుకున్నచింతనామృతాలు.
జీవుడు జన్మించి భగవచ్చింతనతో, కర్మాచరణ చేస్తూ ధర్మ వర్తనుడూ, స్థితప్రజ్ఞుడూ అయి జీవించనంత కాలం జన్మలు పొందుతూనే ఉండాలి. దేహాన్ని ధరిస్తూనే ఉండాలి.అసంఖ్యాకమైన చింతల వరుసలలో చిక్కుకుంటూనే ఉండాలి.
1)
చ॥ వడిగొన్న మోహంబు వలల తగులైకదా
కడలేని గర్భనరకము లీదవలసె
నడిమి సుఖములచేత ననుపు
సేయక కదా
తొడరి హేయపు దిడ్డి దూరాడ వలసె

*అద్వైత సిద్ధి కలగనంత కాలం మోహ పాశంలో చిక్కుకుంటూనే ఉండాలి. మెలికలు పడిన మోహపు వలలో పడినన్నాళ్ళూ అంతులేని గర్భనరకం అనుభవిస్తూనే ఉండాలి.
మధ్యలో వచ్చిన ఐహిక భోగాలను నిరాకరించక పోవడం వలన, వాటిని అధిగమించక పోవడం వలనకదా నీచమైన సన్న యోనిమార్గాలలో దూరవలసి వస్తోంది!
అరిషడ్వార్గాలు ఒకటుంటే మిగతావి వాటంతటవే వచ్చి చేరతాయి. మోహాన్ని వదలలేకపోతే అసూయ, కోపం, అదుపులేని తనం అన్నీ ఉంటాయి.

2)పాపపుంజములచే పట్టువడగా కదా
ఆపదలతోడి దేహము మోపవలసె
చూపులకు లోనైన సుఖము కానక కదా
దీపన భ్రాంతిచే తిరుగాడ వలసె ॥
*జీవితం ఆపదల మయం. రోగాలు, రొస్టులు, కష్టాలు అనేకం . అది సుఖంగా ఉంటుందనుకోవడం భ్రమ. అటువంటి జన్మకు కారణం పాపపు రాసిలో కూరుకు పోయి లేవలేక పోవడమే। కళ్ళకు కనిపించే సుఖాలలోని నిజమెంతో గ్రహించ లేక పోవడం వల్లనే ఇంత భ్రాంతిలో తిరగవలసి వస్తున్నది!
౩.)
హితుడైన తిరువేంకటేశు కొలువక కదా
ప్రతిలేని నరక కూపమున బడవలసె
అతని కరుణామృతంబబ్బకుండక కదా
బతిమాలి నలుగడల పారాడ
వలసె !!
*మనకు అసలైన హితకరుడు ఆ పరమాత్మే. ఆ వేంకటపతిని సేవింపని, ధ్యానింపని కారణం చేతనే నరకకూపంలో పడుతున్నాం. ఇవేవీ వదలలేని వారికి , పరమాత్మను కొలవని వారికీ నరకకూపంలో పడటం తప్ప మరో దారి లేదు.
ఆ స్వామి దయ మనకు లభించక పోవడం వల్లనే ఎవరెవరినో బతిమాలుకుంటూ బ్రతకవలసి వస్తున్నది!
ఉద్ధరింప వలసిన వాడు ఆ భగవంతుడే.
మనం ఉద్దరిపబడాలంటే ఆయన దయ కావాలి.
స్వామి దయచూపాలంటే మనం నిర్మోహత్వంతో జీవిస్తూ ఆ జగన్నాథుని పై భారం వేసి బ్రతకాలి!
మన కష్ట సుఖాలు, జన్మలూ అన్నీ మన కర్మఫలితాలే! నిష్కామ కర్మతోనే మనకు జన్మరాహిత్యం కలుగుతుంది. పరబ్రహ్మను గాక అన్యులను వేడుకుంటే ప్రయోజనంలేదు.
ఇంత వివరంగా అన్నమయ్య ఈ కీర్తనలో మనకు కర్తవ్యం బోధించాడు.
కొందరిది అనినమయ్య వార్థక్యంలో వ్రాసిన కీర్తనగా భావిస్తున్నారు. కానీ పరమ భక్తుడు, జ్ఞాని అయిన అన్నమయ్య పునరపి జననం … పునరపి మరణం వెనకగల జీవిత సత్యాన్ని ఒక సామాన్యుడిలా ముసలితనందాకా ఆగి వ్రాయడని నా ఉద్దేశం !
స్థితప్రజ్ఞుడైనఅన్నమయ్య జీవుల దేహధారణ గురించి మనలను హెచ్చరిస్తున్నాడు.!
************************
(కొన్ని పదాలకు అర్థాలు
ననుపు- అధిగమించు
వడిగొను- మెలికలు పడు/ వేగముగా
దిడ్డి- ఇరుకు దారి
దీపన భ్రాంతి- మితిమీరిన భ్రాంతి )
~~~~~~~~~~~~~
తే.గీ
చావుపుట్టుకలబడుచు జీవుడిట్లు
గర్భ నరకంబు నొందుట కర్మ ఫలము
వీడి భ్రాంతి, నీ పదముల వేడుకొనక
గలగునేముక్తి శ్రీతిరుమలనివాస!
తే.గీ
మోహ పాశంబునంబడి యహముఁదోడ
హితుడవైనట్టి నినుగాంచు మతియు లేక
నిదియె సుఖమని దల్చుచు వదలలేము
పాపకూపంబు వెల్వడఁబ్రాపు నీవె!
స్వస్తి 🙏
~~~~~~~~~।।
డా. ఉమాదేవి జంధ్యాల

త్రిపురనేని గోపీచంద్

త్రిపురమేని గోపీచంద్ + charcoal pencil sketch  త్రిపురనేని  గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 - నవంబర్ 2, 1962) సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత,...