12, జూన్ 2020, శుక్రవారం

సి. నారాయణరెడ్డి - కవితలు, వ్యాఖ్యానాలు , గజళ్ళు - Pencil sketch

మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ :

పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..!
తెలుగువీణియ శృతి..తెలిసి మీటినారె భళారే..!
వన్నెచిన్నె లెన్ని నింపె..పరువాల చిత్రాంగికి..
దాచలేని వలపులెన్నొ..సృష్టి జే"సినారె" భళారే..!
పసిడితెలుగు రారాజే.. జ్ఞానపీఠ చక్రవర్తి..
పదప్రయోగ కుశలతకే..బాట వే"సినారె" భళారే..!
పెదవులపై చెరగని దరహాస విభుడతడే..
మధురభావ గగనాలను..భువికి దించినారె భళారే..!.
మాటలాడు వేళ ఎంత..విశుద్ధచక్ర గరిమయో..
అమ్మగుండె ఊయలలో..గజలు కురి"సినారె" భళారే..!
భారత భారతీ నర్తన..శాలా విలాస మాధవ..
నిజవాణీ మేఘమల్లె..జాలు వారినారె భళారే..!
-----------------------------------------------------------

మిత్రులు ప్రసాద్ కెవి గారి స్పందన :

మరణం నను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను
పాలుపట్టి జోలపాడి పడుకోమంటాను...
లంచం నను భజించి వస్తే ఏమంటాను నేనేమంటాను
తిరుమల గిరి హుండీలో జొరబడమంటాను...
కామం నను కలవరపెడితే ఏమంటాను నేనేమంటాను
అలిగి వున్న పడుచు జంటతో కలబడమంటాను...
క్రోధం నను కవ్విస్తుంటే ఏమంటాను నేనేమంటాను
పస చచ్చిన పేడి జాతిలో బుసలిడమంటాను...
లోభం నను బులిపిస్తుంటే ఏమంటాను నేనేమంటాను
తెగ వొలికే కవి పలుకుల్లో దిగబడమంటాను....
అహంకార మెదురై వస్తే ఏమంటాను నేనేమంటాను
నరుని వదలి కొండనెత్తిలో స్థిరపడమంటాను....
కాలం పులిలా గాండ్రిస్తే ఏమంటాను నేనేమంటాను
దిగులెందుకు ఓయి సినారె తెగబడమంటాను.
**************
అరిషడ్వర్గాలు.....కాలం....చివరికి మరణాన్ని కూడా కొంటెగా....చిలిపిగా ఓ ఆట పట్టించే కవిత్వం....ఈ గజల్.
దీనిలో.....కవి మరణానికి భయపడడు.
పైగా మరణంలో ప్రేయసిని....సహచరిని దర్శిస్తాడు.
దీనిలో ప్రదర్శించిన నవ్యత ఏమిటంటే మరణం అనివార్యమని గ్రహిస్తూనే తప్పని మరణాన్ని చూసి నీరుగారిపోక,....
దాన్ని శిశువుగా మార్చుకొని తాత్త్వికస్పర్శతో జోకొడతారు. మరణంలో మరోప్రాణి వికాసాన్ని భావించడం దీనిలో కనిపిస్తుంది.
చావులో చావకు. చావులో జన్మించు.
నిరంతర సజీవ చైతన్యవంతుడికి చావు పక్కలో నిదురపోయే పసిపాప వంటిది....
అద్భుతమైన భావన....ఆనందం అలముకున్న భావన.
****************
నవ్వని పువ్వు,
వెన్నెల వాడ,
జలపాతం,
ఋతుచక్రం,
దివ్వెల మువ్వలు,
మంటలు- మానవుడు,
నాగార్జున సాగరం,
కర్పూర వసంత రాయలు,
విశ్వంభర.....
ఇవన్నీ....పాత సినిమాల పేర్లనుకుంటున్నారా! అప్పట్లో తెలుగు సినిమా టైటిల్స్....ఇలాగే అందంగా ఉండేవి.
విశ్వంభర....మానవ జీవితాన్ని....ఆవిష్కరించిన...ఈ రచన...సాహిత్య అకాడమీ అవార్డు కూడా కొట్టేసింది.
ఇవన్నీ...డాక్టర్. సింగిరెడ్డి. నారాయణ రెడ్డి గారి రచనలు. ఇవి కొన్నే!....వ్రాస్తూ పోతే....ఇంకా బోలెడు మిగిలిపోతాయి!
ఈ నీలి నీలి ముంగురులు... ఇంద్రనీలాల మంజరులు....
ఈ వికసిత సిత నయనాలు...శతదళ కోమల కమలాలు....
అరుణారుణమీ అధరము....తరుణ మందార పల్లవము ....
ఎదలో పొంగిన ఈ రమణీయ పయోధరాలు....
పాల కడలిలో ఉదయించు సుధా కలశాలు!
ఎంత సుందరము....శిల్ప బంధురము...
ఈ జఘన మండలము...
సృష్టి నంతటిని దాచుకున్న..
ఆ పృథ్వీ మండలము!....
మనోహర మైన ఆ వర్ణన ఒక్క కలమే చేయగలదు. ఆ పాళి ఎవరిదో చెప్పక్కరలేదు. సంతకం చేసినట్లుండే శృంగార కవిత్వం వారికే చెల్లు!
**************
ఏ హరివిల్లు విరబూసినా....నీ దరహాసమనుకొంటినీ...
ఏ చిరుగాలి కదలాడినా.....నీ చరణాల శృతి వింటిని...
నీ ప్రతిరాకలో...ఎన్ని శశిరేఖలో....
నిను చూడక నేనుండలేను......
తాజ్ మహలు లో కురిసే వెన్నెల...పూరిగుడిసె పై కురియదా...
బృందావనిలో విరిసే మల్లియ ....పేద ముంగిట విరియదా !
మంచితనము పంచేవారికి....అంతరాలతో పని ఉందా!*
ఎవరు తల్లి, ఎవరు కొడుకు? ఎందుకు ఆ తెగని ముడి!
కొనఊపిరిలో...ఎందుకు అణగారని అలజడి...
కరిగే కొవ్వొత్తి పై కనికరం ఎవ్వరికి...ఎవ్వరికి...
అది కాలుతున్నా...వెలుగులె కావాలి అందరికి...అందరికి !
ఒక్క శృంగారమే కాదు....నవరసాలు అవలీలగా ఒలికించగల ధీమా వారిదే! గజళ్ళు....అద్భుతంగా వ్రాసి....ఆయనే గానం చేశారు!
కవి, నాటక కర్త, ఆచార్య పదవి నిర్వహించిన వారు,...
గజల్స్ గాయకుడు,...
తెలుగు రచనా నవ్యరీతులతో డాక్టరేట్ పొందిన వారు,
3 యూనివర్సిటీలనుండి...గౌరవ డాక్టరేట్ పొందిన వారు.
ప్రబంధ శృంగార సౌరభాలు...తన తొలి చిత్రమైన గులేబకావళి కథ లోనే చూపారు.
కలల అలల పై తేలెను....మనసు మల్లె పూవై...
ఎగసిపోదునో చెలియా...నీవే ఇక నేనై...
విరజాజులు పరిమళించు...విరులపానుపేమన్నది?
అగుపించని ఆనందం...బిగికౌగిట కలదన్నది!
సడి సవ్వడి వినిపించని నడిరాతిరి ఏమన్నది?
జవరాలిని..చెలికానిని జంట కూడి రమ్మన్నది!
కావ్య శృంగారమంటే ఇదికాక మరేమిటి?
3000 కు పైగా సినీ గీతాలు, 80 కావ్య రచనలు...ముఖ్యంగా వారి విశ్వంభర....అద్భుతమనే చెప్పాలి.
***************
వ్యక్తిగా సాధించనిదేమీ లేదు. పద్మశ్రీ, పఫ్మభూషణ్, కేంద్ర & రాష్ట్ర సాహిత్య అకాడెమీ పురస్కారాలు,రాజలక్ష్మి పురస్కారం, సోవియట్- నెహ్రూ పురస్కారం....ఎన్నో...ఎన్నెన్నో!
రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్షులు(1981),
1988 - జ్ఞానపీఠ పురస్కారం. - విశ్వంభర.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు(1989),
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘ సలహాదారుడు(1992),
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు
రాజ్యసభ సభ్యుడు(ఎం.పి).
నందమూరికి ఇష్టులైన కవీశ్వరులు కనుక ....చాలా పదవులు & పురస్కారాలు వారి హయాం లోనే వచ్చినట్లు అపప్రథ ఉన్నా....
అర్హత మాత్రం ఉన్న వారు *సినారె*..అంటూ ముద్దుగా పిలుచుకునే డాక్టర్. సి.నారాయణ రెడ్డి గారు.
నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము,
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు,
కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప,
చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప.
జ్ఞాన పీఠాలు....భారతరత్నలు.... మహావ్యక్తులెందరినో......కాలం తనలో లీనం చేసుకుంది.



--------------------------------------------------------------------------------------------------------------------------------------------

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...