27, మే 2019, సోమవారం

నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి.




కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి - నా pencil చిత్రం.

ఈ సందర్భంగా 26.5.2019 ఆంధ్రజ్యోతి లో ఈ మహామహుని గురించి వచ్చిన వ్యాసం యధాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. పత్రిక వారికి నా ధన్యవాదాలు.
వీరేశలింగం వితంతు పునర్వివాహాల గూర్చిన విమర్శలు అసంగతం. ఎన్ని వివాహాలు జరిగాయి? అందులో అంతర్వర్ణ వివాహాలు ఎన్ని? వివాహానంతరం వారి మంచి చెడ్డలను పట్టించుకొన్నాడా?... ఆయన విశాల కార్యరంగంలో, కొన్ని పొరబాట్లు జరిగినా, అవి అప్రస్తుతాలు. మహత్తరంగా, ఏటికి ఎదురొడ్డి నిలిచిన మహోద్యమంలో యివన్నీ భాగాలే! ఆ ఉద్యమంలోని జీవనాడిని పట్టుకోవాలి.

గత శతాబ్ది మధ్యకాలానికి, కళాశాల విద్యలో అడుగిడేనాటికి, ఆధునిక ఆంధ్ర దేశ వైతాళికులుగా, వీరేశలింగం, గురజాడ, గిడుగు, కొమర్రాజు మా ఎరుకలోకి వచ్చారు. సాంఘిక, సాహిత్య భాష, చరిత్ర రంగాల్లో వీరి కృషి ఫలితమే, ఇరవయ్యో శతాబ్ది మొదటి రెండు దశాబ్దాల్లో రూపుదిద్దుకొన్న ఆంధ్ర దేశంగా పరిగణించారు. వీరిలో ఏ ఒక్కరూ రాజకీయవాదులు కాదు. వారి వారి కార్యరంగాల్లో తలమునకలవుతున్నపుడు, జాతీయోద్యమం మితవాద దశలో వుండి, ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోలేదు. వీరేశలింగం కాంగ్రెస్‌ సంస్థ గూర్చి రాజమహేంద్రవరంలో ‘‘జాతీయ మహాసభయు దాని యుద్దేశములు’’ (The National Congress and its Aims) అనే మకుటంతో ఉపన్యసించినా, జాతీయవాది అనిపించుకోకపోగా, వందేమాతర ఉద్యమం తీవ్రమై బిపిన్‌ చంద్ర పాల్‌ రాజమండ్రికి వచ్చినప్పుడు, స్థానిక కళాశాల విద్యార్థులు, క్లాసులు బహిష్కరించడం, నూరుమందికి పైగా కళాశాల నుండి బర్తరఫ్‌ కావడం (వారిలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారొకరు), వారు వీరేశలింగాన్ని చూసినప్పుడు ‘నమస్తే’ బదులు ‘వందేమాతరం’ అని సంబోధించడంలో హేళన ఉంది. అలాగే గురజాడ మద్రాసు కాంగ్రెస్‌ మహాసభలకు హాజరై రాసిన ఆంగ్ల గేయం వ్యంగ్యంగా కాంగ్రెస్‌ను విమర్శించే రీతిలో వుంది. కొమర్రాజు, గిడుగులకున్న జాతీయ భావాలు వారు చేపట్టిన సాహిత్య, చారిత్రక కృషికి పూరకమే! ఇది కొమర్రాజువారి ఆంధ్రుల పరిశోధనల్లో ద్యోతకమైంది.
వీరు ముగ్గురూ సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక సేనానులు. వీరి సేవలను కొనియాడుతూ జయంతులు, చర్చాగోష్టులు జరిగేవి. వైతాళికులుగా పేర్కొనబడ్డ వీరి ప్రాభవం, 1920 దశకంలో జాతీ యోద్యమం వూపందుకొన్నాక (గాంధీ ప్రవేశంతో) కొంతమేరకు మసకబారింది. తిరిగి వీరి రచనలు, వీరిని గూర్చిన ప్రస్తావనలు 1930దశకం దాటాక, వారి వారసత్వాన్ని అభ్యుదయ సాహిత్యో ద్యమం వెలుగులోకి తీసుకొచ్చింది. వామపక్షవాదులూ యిందులో పాత్ర వహించారు. వీరేశలింగం సమగ్ర రచనలను ప్రచురించడం, చిలకమర్తి ‘స్వీయచరిత్ర’ పునర్ముద్రణ, వారికి సన్మానం, గురజాడ సమగ్ర రచనల్ని వెలుగులోకి తీసుకురావడంలో కృషి సల్పారు. ఈ కృషికి చారిత్రక ధ్యేయం వుంది. రాజకీయ మార్పులకు పూర్వ రంగంగా, సమాజంలో, ప్రజల మనోభావాల్లో సానుకూల మార్పు, ప్రగతిశీల భావజాలం రావాలన్నది చారిత్రకంగా రుజువైన అంశం. ఫ్రెంచి విప్లవానికి పూర్వం, అక్కడి ప్రజల్లో భావపరంగా మార్పు రావడానికి మేధావులు, రచయితలు కృషి సల్పారు ("Long before the french revolution, there was a revolution in the minds of people).
ఇది పూర్వ రంగం. వీరేశలింగం తన సమకాలీన సామాజిక పరిస్థితులకు స్పందించి తత్సంబంధ సంస్కరణపూరిత సాహిత్యాన్ని సృష్టించడంతోపాటు, సంస్కరణల కార్యాచరణకు పూనుకొన్నాడు. 19వ శతాబ్దంలో వీరేశలింగానికి వెనుకా, ముందూ, ప్రముఖ సంస్కర్తలు బెంగాల్‌, మహారాష్ట్ర, కేరళ తదితర ప్రాంతాల్లోనూ వున్నారు. వారిలో బెంగాల్‌కు చెందిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌తో ప్రత్యక్ష పరిచయం లేకున్నా, వితంతు వివాహాలకు సంబంధించిన వారి రచనలను తెప్పించుకొని, వాటిని ఆచరణలో పెట్టి ‘దక్షిణ భారత విద్యాసాగరుడ’ని పిలువబడ్డాడు. మద్రాసులోని బ్రహ్మ సామాజికులతో నిత్య సంబంధాలు పెట్టుకొని అక్కడున్న రఘునాధ రావు, చెంచల్రావు ప్రభృతులను సమీకరించి, అన్ని కులాలవారితో సహపంక్తి భోజనాలు జరిపించాడు. మద్రాసులో బ్రహ్మ సమాజ మందిర నిర్మాణానికి సాయపడ్డాడు. కర్నాటక ప్రాంతంలో బెంగు ళూరు దాకా పర్యటించి, బ్రహ్మసమాజ శాఖలను నెలకొల్పాడు. తాను నిర్వహిస్తున్న సంస్కరణ కార్యక్రమాలకు విరాళాలు సేకరిస్తూ, నైజాం పాలనలోవున్న హైదరాబాద్‌కు వచ్చి నిధులు సేకరించాడు. తాను కర్తృత్వం వహించి వివాహం జరిపించిన కవయిత్రి సరోజినీ నాయుడు కుటుంబాన్ని కలిశాడు.
వీరేశలింగం కార్యరంగం ప్రధానంగా అప్పటి ఆంధ్ర దేశం. హైస్కూలు దాటని మెట్రిక్యు లేషన్‌ చదువు. అధ్యాపక వృత్తి. వరుంబడి తక్కువ. పిత్రార్జితం లేదు. సంస్కరణ కార్యక్రమాలకు సరిపడేంత ఆర్థిక వనరులు లేవు. తన వెంట నడిచే అనుచరులు కొద్దిమందే! వారిలో తుది దాకా నిలబడింది ఒకరో, యిద్దరో! ఇన్ని ప్రతికూలతలను తట్టుకొని నిలబడి వితంతు పునర్వివాహాలు జరపడం ఏటికి ఎదురీదడమే! వీటి గూర్చి విపులంగా తన స్వీయ చరిత్రలో చెప్పుకొన్నాడు. విరూపాక్ష పీఠాధిపతి శంకరా చార్యతో వాగ్వివాదానికి దిగి, తుదకు సంఘ బహిష్కరణకు గురైనా ప్రాయశ్చిత్తం చేసుకో నిరాకరించాడు. ఈ కృషిలో వీరేశలింగానికి దన్నుగా నిలబడి, ప్రాచశ్చిత్తం చేసుకోకుండా, సుమారు 30వేల రూపాయలు విరాళమిచ్చి ఆదుకొన్నది, కాకినాడకు చెందిన వైశ్య ప్రముఖుడు పైడా రామకృష్ణయ్య.
వితంతు పునర్వివాహాలు గూర్చిన విమర్శలు అసంగతం. ఎన్ని వివాహాలు జరిగాయి? అందులో అంతర్వర్ణ వివాహాలు ఎన్ని? (చూడు: నాళం కృష్ణారావు ‘వితంతు వివాహ చరిత్ర’). వివాహా నంతరం వారి మంచి చెడ్డలను పట్టించుకొన్నాడా?... ఆయన విశాల కార్యరంగంలో, కొన్ని పొరబాట్లు జరిగినా, అవి అప్రస్తు తాలు. మహత్తరంగా, ఏటికి ఎదురొడ్డి నిలిచిన మహోద్యమంలో యివన్నీ భాగాలే! ఆ ఉద్యమంలోని జీవనాడిని పట్టుకోవాలి. అనాదిగా వస్తున్న అమానుష సాంఘిక దురాచారాన్ని ప్రశ్నించి, సవాలుగా తీసుకొని, ‘శాస్త్రయుక్తంగా’ అది సమ్మతమేనని చూపడం యిందులోని ముఖ్యోద్దేశం. నాటి సమాజంలో అవినీతిని, న్యాయ స్థానాలుగా చెప్పబడ్డవాటిలో ప్లీడర్లు, న్యాయమూర్తుల లంచగొండి తనాన్ని ఎండగట్టడం, రాజమండ్రి పురపాలక సంఘ కార్యకలా పాల్లో ప్రత్యక్షంగా కలుగచేసుకొని, పట్టణ సమస్యల్ని సరిదిద్దడం- ఇలాగ మరెన్నో! ఇవన్నీ ‘స్వల్ప’ విషయాలుగా అన్పించవచ్చు. నేడున్న పరిస్థితి ఏమిటి? వీరేశలింగం చనిపోయి నూరేండ్ల తర్వాత, దేశం స్వాతంత్య్రం పొంది, రాజ్యాంగ చట్టాలు అమల్లోకి వచ్చాక, సమాజం, అన్ని విధాల సమర్థనీయంగా వుండాల్సిన తరుణంలో, రోజుకొక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం! అవినీతి, సమాజపు మూలుగల్ని పీల్చేస్తున్నప్పుడు, స్త్రీలకు రక్షణ కొరవడిన ప్పుడు- విచ్చలవిడితనం సర్వవ్యాప్తమైనపుడు-వీరేశలింగం, ఆనాటి వైతాళికులు ఆశించిన సమాజాన్ని నిర్మిస్తున్నామా? సమాజపు రుగ్మతలను రూపుమాపి, కలుషపూరిత సమాజాన్ని శుభ్రపరచా లనుకొన్నాడు. ఆధునిక యుగానికి వైతాళికుడైనాడు. గురజాడ అన్నట్టు, వీరేశలింగం ‘నిశ్చయముగ మహాపురుషుడు’.
(నేడు కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి)
వకుళాభరణం రామకృష్ణ

19, మే 2019, ఆదివారం

మధుర గాయని పి. లీల - P. Leela

మధుర గాయని పి. లీల జయంతి సందర్భంగా నా pencil చిత్రం.

వ్యాసం 'విశాలాంధ్ర (16 July 2011)' సౌజన్యంతో

సంగీతం వింటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసిన మనసుకు మానసిక ప్రశాంతత, విశ్రాంతిని ఇచ్చే సాధనం సంగీతం. సంగీతమంటే కచ్చేరీల్లో పాడే కీర్తనలు, రాగాలే కానక్కరలేదు. జానపదగీతాలు కావచ్చు, సినీ పాటలు కూడా కావచ్చు. కాకుంటే అవి భావయుక్తమై, రాగప్రధానమై, ఎటువంటి రణగొణధ్వనులు లేకుండా ఉంటేచాలు. అమ్మఒడిలోని పాప జోలపాటకు ఏడుపునాపి హాయిగా నిద్దరొయినట్లు సంగీత ప్రధానమైన పాటలను వింటున్నప్పుడు మనసుకు కలిగే ఆనందం, విశ్రాంతి అనుభవించేవారికే తెలుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాల్లో సంగీతం, సంగీతంతో కూడిన పాటలు వినడం ఒక మార్గం. అటువంటి వాటిలో సినిమా పాటలు కూడా ఒకటి. 50 యేళ్ళక్రితం నిర్మించగా విడుదలైన సినిమాల్లోని పాటలను సైతం నేటికీ విని ఆనందిస్తున్నామంటే ఆ పాటల్లోని భావం, వాటి సంగీతం, పాడిన గాయనీగాయకుల గొప్పతనమే అనిచెప్పకతప్పదు. అలా పాతతరంనాటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలకు ప్రాణప్రతిష్టచేసి నేటికి పాడుకునేలా చేయగలిగిన గాయనీమణుల్లో పి.లీల ఒకరు.

దక్షిణ భారత భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషచిత్రాల్లో వేల సంఖ్యలో పాటలు పాడారు. అలాగే బెంగాలీ, సింహాళ చిత్రాలలో కూడా పాటలు పాడారు. కేవలం సినీపాటలే కాదు భక్తిగీతా లను సైతం అద్బుతంగా ఆలపించారు. భారతదేశం గర్వించదగ్గ సంగీతసరస్వతులు ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి, ఎం.ఎల్‌. వసంతకుమారి, డి.కె. పట్టామ్మాళ్‌ వంటి వారి సమకాలీకురాలు కావడం ఆమెకు సంగీతంపై మక్కువకు కారణంకావచ్చునేమో. కేరళ, పాలక్కడ్‌ లోని చిట్టూర్‌లో 1934 సంవత్సరంలో పుట్టారు పొరయాతు లీల.లీలతో పాటు ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. తల్లితండ్రులు సంగీతప్రియులు కావడంతో లీలకు స్వతహాగానే సంగీతంపై మక్కువ ఏర్పడటం గమనించి ఆమెకు కర్నాటక సంగీతం నేర్పించారు తల్లిదండ్రులు. ఆమె గొంతు కొద్దిగా లావుగా ధ్వనించేదని విమర్శించినా అదే పాటకు నిండుదనం తెచ్చిందని చెప్పాలి. అద్భుతమైన గాత్రం ఆమెకు ఓ వరం. ఎందరో ప్రముఖ విద్వాంసుల వద్ద సంగీతాన్ని అభ్యసించారు. మరింత సాధనకోసం, సంగీతం కోసం మద్రాసు చేరింది లీల కుటుంబం. మద్రాసులో ప్రముఖ సంగీత విద్వాంసుల సంగీతం వినడం, నేర్చుకోవడం ద్వారా సంగీతంలో మరింతగా రాణించి పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సాధించారు.
ఈ సందర్భంలో కొలంబియా రికార్డింగ్‌ కంపెనీవారు తాము విడుదల చేసే పాటలకు పాటలు పాడే గాయనీ కోసం వెతుకుతుండగా లీలగారి గురించి తెలిసి ఆమెను గాయనిగా ఎంచుకున్నారు. అది ఆమె సినీరంగ ప్రవేశానికి మార్గమయిందని చెప్పొచ్చు. అయితే ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో పట్టులేని కారణంగా కీర్తనలను మళయాళంలో రాసుకుని సాధనచేసి పాడేవారట. ఆ తర్వాత ట్యూటర్‌ను నియమించుకుని భాషపై పట్టును సాధించారు. గాయనీగాయకులకు ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణం భాషపై పట్టు సాధించడం. ఇది నేటితరం గాయనీ గాయకులు ఆదర్శంగా తీసుకోవాలి.1948 సంవత్సరంలో తొలిసారిగా తమిళంలో పాడిన పాటతో సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటికి ఆమె వయసు 14 సంవత్సరాలు. ఆ సినిమాలో హీరోయిన్‌కు అన్నిపాటలు ఆవిడే పాడారు. అలా తమిళంలో పాడుతూ, 1949 సంవత్సరం తెలుగులో పాడే అద్భుత అవకాశం వచ్చింది. నాగయ్యగారు నటించిన మనదేశం చిత్రంలో ఘంటసాలమాస్టారి సంగీతదర్శకత్వంలో పి.లీలను తొలిసారిగా తెలుగువారికి గాయనిగా పరిచయం చేస్తూ అందులో పాటలు పాడించారు. ఆ చిత్రం ద్వారానే ఆంధ్రుల ఆరాధ్యనటుడు స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌. పరిచయమయ్యారు. ఆ యేడాది విడుదలైన మనదేశం, కీలుగుర్రం, గుణ సుందరికథ చిత్రాల్లో ఆమె పాటలు పాడగా ఆ మూడు చిత్రాలు కూడా అద్భుత విజయం సాధించి ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టడమే కాదు తెలుగులో గాయనిగా స్థిరపడ్డారు. అంతేకాదు వాహిని, విజయా సంస్థలు నిర్మించే చిత్రాల ఆస్థానగాయనిగా పేరుపడ్డారావిడ. ఆ తర్వాత మిస్సమ్మ, షావుకారు, పాతాళభైరవి, సువర్ణ సుందరి, పెళ్ళినాటి ప్రమాణాలు, శాంతినివాసం, చిరంజీవులు, బాలనాగమ్మ, మాయాబజార్‌, జగదేకవీరునికథ, పెళ్ళిచేసిచూడు, గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు సంపూర్ణరామాయణం, బభ్రువాహన, తిరుపతమ్మ కథ, మహామంత్రి తిమ్మరసు, దక్షయజ్ఞం, శ్రీసీతారామకళ్యాణం, దీపావళి, శ్రీ వేంకటేశ్వరమహాత్మ్యం, పెళ్ళి సందడి, పాండురంగ మహాత్మ్యం, సారంగధర, భలేరాముడు, జయం మనదే, పరమానందయ్య శిష్యులకథ, నవ్వితే నవరత్నాలు, పల్లెటూరు, అనార్కలి వంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడారు. సుశీల, జిక్కి, వంటి గాయనీమణులతో కూడా కలిసి ఎన్నో చక్కని గీతాలను కూడా ఆలపించారు. కేవలం సినీ గీతాలే కాకుండా ప్రైవేటుగా భక్తిగీతాలు, శ్లోకాలు, పద్యాలు కూడా పాడారు. లవకుశ చిత్రంలో ఆమె పాడిన పాటలు నేటికీ సినీప్రియులు పాడుకుంటూనే ఉంటారు. భావప్రధానంగా, రాగయుక్తగా పాడటం ఆమెకే చెల్లు. ఉత్తమగాయనిగా ఆంధ్ర, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల నుండి అవార్డులను అందుకున్నారు. ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందారు. ఆమె పాడిన పాటల్లో గుణసుందరికథలో 'శ్రీ తులసి జయతులసి జయమునియ్యవే..', బ్రతుకుతెరువు చిత్రంలో 'అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.' జయసింహ చిత్రంలో 'ఈనాటి ఈరేయి కలకాదోరు నిజమోరు,' మిస్సమ్మ చిత్రంలో 'కరుణించుమేరిమాత,' 'తెలుసుకొనవే యువతి', 'యేమిటో ఈ మాయ, చల్లనిరాజా వెన్నెల రాజా', వంటి పాటలు, చిరంజీవులు చిత్రంలో 'తెల్లవారగ వచ్చే తెలియక నాస్వామి మళ్ళీ పరుండేవు లేరా', మాయాబజార్‌ చిత్రంలో 'చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ,' 'విన్నావా యశోదమ్మ', జగదేకవీరుని కథలో 'నను దయగనవా నా మొరవినవా..', లవకుశ చిత్రంలోసుశీలగారితో 'రామకథను వినరయ్య,' ఊరకే కన్నీరు నింప,', 'వినుడు వినుడు రామాయణగాథ, ' శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ' వంటి పాటలు కలిసి పాడారు. పాండవవనవాసం చిత్రంలో 'దేవా దీనబాంధవా', రహస్యం చిత్రంలో 'శ్రీలలిత శివజ్యోతి సర్వకామద' గీతాలాలపించారు. హుషారు, విషాదం, భక్తి ఇలా అన్నిరకాల పాటలు పాడారు. 'చిన్నారిపాపలు' అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. దక్షిణభారతదేశంలో అద్భుత పాటలకు ప్రాణప్రతిష్ట చేసిన గాయనీ మణుల్లో ప్రముఖురాలిగా సినీ ప్రియులచే అభిమానించబడిన పి.లీల 2005 అక్టోబరులో చెన్నైలో మరణించారు. ఆమె మరణించినా ఆమె పాడిన పాటలు సినీ ప్రియుల మదిలో సజీవమై ఉన్నంతకాలం ఆమె పాటలరూపంలో బ్రతికే ఉంటారు.

12, మే 2019, ఆదివారం

మాతృదినోత్సవం

 మాతృదినోత్సవం సందర్భంగా మిత్రురాలు ఉమాదేవి జంధ్యాల గారు నా చిత్రానికి అల్లిన కంద పద్యాలు.

అమ్మలకు కందాలలోవందనాలు
————————
అమ్మనుమించినయాప్తుల
నిమ్మహి గానంగవశమె యెవ్వరికైనన్
అమ్మిచ్చినయీజన్మను
వమ్మునుగానీకమనముఁబయనింపవలెన్ !

అమ్మా యెటుబోయితివో
అమ్మా యనిబాధతోటియరిచిన రావే
కమ్మగ ముద్దలుబెట్టిన
యమ్మామరియొక్కసారియగపడరాదా !
అమ్మకు ప్రాణము నైతిని
అమ్మై ప్రాణంబునిచ్చియాలించితిగా
నమ్మలకునేనుమ్రొక్కెద
నమ్మేయిలదైవమనుచునర్మిలితోడన్!
అమ్మా నీయొడి బడిగా
నమ్మా నేర్చితినినేను నడకను ,నడతన్
అమ్మా చెట్టంతయితిని.
యమ్మకునీడివ్వదలపనమ్మేలేదే !
అమ్మనుజూచినపగిదిని
యిమ్ముగనద్దంబుముందు నిలబడతోచున్
నెమ్మది గుణమును పొందక
నమ్మకు ప్రతిరూపమనుచుననుకొనగలనా ?
ఉమాదేవి జంధ్యాల
( చిత్రం - శ్రీపొన్నాడ మూర్తిగారు )

8, మే 2019, బుధవారం

" ఆంధ్ర పౌరుష ప్రతీక : అల్లూరి "


నా చిత్రానికి మిత్రులు డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ గారు రాసిన కవిత.





" ఆంధ్ర పౌరుష ప్రతీక : అల్లూరి "............ డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ.

తెల్ల వాళ్ళ గుండెలన్ని ,
కుళ్ళ బొడిచి పెళ్ళగించి !
కల్ల బొల్లి కపటాల ,
కీళ్ళు విరచి , వెళ్ళగ్రక్కి !

నల్లవాడి పౌరుషాన్ని,
నలుదిశలా వెదజల్లి !
భరత మాత సంకెళ్ళ ను ,
చేధించగ ప్రతినబూని !

చైతన్యపు ధనుసు బట్టి ,
వైషమ్యమె ఎరుగనట్టి ,
మన్య ప్రజల తోడుతోడ ,
విప్లవాన్ని నడిపిన వాడా ,
వీరుడా తెలుగోడా !

అల్లూరంటేనే ,
తెల్లవాడు భీతిల్లుగ !
అల్లూరున్నాడా ,
నల్లవాడు చెలరేగుగ !!

స్వాంతంత్ర్య సమరాన ,
అల్లూరో ఉత్తేజం !
స్వాంతంత్ర్య సమరాన ,
అల్లూరో ఉద్దీపం !

భరత మాత ముద్దు బిడ్డ ,
అల్లూరో అణు క్షిపణి !

ఆంధ్ర పౌరుష మంటే ,
అల్లూరే సాక్షి రా !
ఆంధ్ర పౌరుషానికి
అల్లూరే రక్ష రా ! ( 2 )


7, మే 2019, మంగళవారం

మదిభావం॥సిరులు॥




నా చిత్రానికి శ్రీమతి జ్యోతి కంచి రాసిన కవిత.

మదిభావం॥సిరులు॥
-------------------------------------
చిన్ని నవ్వేదో దాచేసుకున్నట్లు
మగని మనసు గుర్తొచ్చినట్లు
వలపు మల్లెలు విరహించినట్లు
కనులు బాసలతో కలహించినట్లు
తేనె పదాలు ఏర్చికూర్చినట్లు
తీగలా హృదిని చుట్టేసినట్లు
కరిమేఘమై కమ్మేసినట్లు
కంటి కాటుకై గిరిగీసినట్లు
అగ్రభాగమై మేన ఒదిగినట్లు
సిరులు మూటగట్టి ముడివేసినట్లు
పెద్దరికమై హుందాగ నవ్వినట్లు
అందమై సంసారబంధమైనట్లు

అవునవును
అచ్చంగా అమ్మాయి అమ్మైనట్లు
ఆమె "సిగ"...

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...