29, ఏప్రిల్ 2021, గురువారం

ప్రముఖ చిత్రకారుడు, illustrator, cartoonist చంద్ర

Chandra, Artist - My pencil sketch



చంద్ర
 కుంచె పేరుతో ప్రఖ్యాతి గాంచిన చిత్రకారుడు, శిల్పి, కార్టూనిస్టు పూర్తిపేరు మైదం చంద్రశేఖర్. వీరు తెలంగాణలో వరంగల్ కి చెందిన వారు. Fine arts లో పట్టబధ్రుడు. వీరు కొన్ని వేల కధలకి చిత్రాలు వేశారు. ఎన్నో పుస్తకాలకు, పత్రికలకు ముఖచిత్రాలు వేశారు. వీరు మంచి వ్యంగ్య చిత్రకారులు కూడా.  వీరి మొదటి కార్టూన్ 1959 లో ఆంధ్రపత్రికలో ప్రచ్రించబడింది. వీరు కొన్ని సినిమాలకు, documentaries కి కళాదర్శకుడుగా పనిచేసారు. దర్శకత్వం కూడా వహించారు. 

1946,   ఆగస్టు 25 వ తేదీన వరంగల్ జిల్లా, నర్సింహుల పేట మండలం, పెదముప్పారం గ్రామంలొ జనించిన వీరు 2021 ఏప్రిల్ 29 న హైదరాబాద్ లో మృతి చెందారు.





చంద్ర గారు చిత్రించిన ఓ అద్భుత చిత్రం.  శ్రుంగార చిత్రాలు వెయ్యడంలో వీరిది అందెవేసిన చెయ్యి.


27, ఏప్రిల్ 2021, మంగళవారం

ఓ. పి. నయ్యర్ - అద్భుత సంగీత దర్శకుడు


 My pencil sketch of the legend

Living life on  one's own terms - అంటే ఎక్కడా రాజీపడకుండా తనకు నచ్చిన రీతిలో తాను నడుచుకుపోవడం అని నా భావం. ఆ కోవకు చెందినవాడే ఓపి నయ్యర్, ఓ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు.


ఓపి నయ్యర సంగీతం అంటే నాకు చాలా చాలా ఇష్టం. వీరి గురించి ప్రఖ్యాత నటుడు, anchor,వ్యాఖ్యాత అను కపూర్ ద్వారా నాకు తెలిసిన విషయాలు తెలుసుకున్నాను. ఇటువంటి విషయాలు 'The Golden Era with Anu Kapoor' అనే కార్యక్రమం లో వీరు తెలియజేస్తుంటారు. ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా రాత్రి 9.00 గంటలకు 'మస్తీ' చానల్ లో ప్రసారమౌతొంది.


ఈ సూత్రానికి తగ్గట్టుగా తన జీవితాన్ని మలుచుకున్న వ్యక్తి ఓ.పి. నయ్యర్, ఎక్కడా రాజీ పడని ఓ అద్భుత సంగీత దర్శకుడు.


ఓ దశలో ఓపి నయ్యర్ సినీ సంగీతం యువ హృదయాలని ఉర్రూతలూగించింది.. దేశ వ్యాప్తంగా వీరి సినిమా సంగీతం అత్యంత ప్రజాదరణ పొందసాగింది. యువ హృదయాలను అంతలా ప్రభావితం చేస్తున్న సంగీతం, యువకులను తప్పుదోవ పట్టిస్తిందేమో అన్న భయంతో అప్పటి ఆకాశావాణి లో వీరు స్వరపరచిన పాటల్ని ban చేశారట. అయితే అవే పాటలు అప్పుడు అత్యంత ప్రజాదరణలో ఉన్న Radio Ceylone లో ప్రసారమయితే వాటికి సంగీతాభిమానులు నీరాజనం పట్టారు. ఇది తెలుసుకుని ఆకాశవాణి వారు తాము విధించిన ban ని ఉపసంహరించుకోవాల్సి వచ్చిందిట. That is OP Nayyar అనిపించుకున్నాడు.


అతని వ్యక్తిత్వాన్ని మరో సంఘటన. ఓసారి మధ్యప్రదేశ్ ప్రభుతం 'లతామంగేష్కర్ అవార్డ్'  ఇచ్చే పురస్కారానికి ఓపి నయ్యర్ ని ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని ఓపి నయ్యర్ సున్నితంగా తిరస్కరించారు. కారణాలు   : ఒకటి - సంగీత దర్శకుడు ఎప్పుడూ గాయనీగాయకులకంటే ఓ మెట్టు పైనే ఉంటాడు. రెండు  - జీవించి ఉన్న వ్యక్తి పేరున పురస్కారం ఇవ్వడం సరైన పధ్ధతి కాదు, మూడు - తన సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ చేత ఎప్పుడూ పాడించలేదు.


వీరి సంగీతం అంటే ప్రఖ్యాత నటి, అందాలరాశి మధుబాల కి చాలా ఇష్టం. తను నటించే చిత్రాలకి ఓపి నయ్యర్ ని సంగీత దర్శకుడు గా పెట్టుకుంటే,  నటి గా తనకు రావల్సిన పారితోషకాన్ని కూడా తగ్గించుకుంటానని చెప్పేదట. 


Great OP Nayyar lived on his own terms అని చెప్పుకోవడానికి ఇంతకంటే ఏమి కావాలి?





26, ఏప్రిల్ 2021, సోమవారం

ఏడిద నాగేశ్వరరావు.. చిత్ర నిర్మాత


 నేడే ( ఏప్రిల్ 24 ) న ప్రముఖ నిర్మాత 

శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 87 వ జయంతి .

   శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర చిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 87వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం సాధించారు . ఆ విజయం ఇఛ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు . అది మంచి విజయం సాధించింది .తదుపరి చిత్రం కళా తపస్వి కే. విశ్వనాధ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం . తెలుగు చిత్ర ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకు వెళ్లిన అద్భుత కావ్యం . ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు , box office కలెక్షన్స్ గాని , జాతీయ - అంతర్జాతీయ - రాష్త్ర అవార్డులు ఏ చిత్రానికీ రాలేదంటే , అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం . అలాగే ఏ దేసేమెళ్లినా శంకరాభరణం గురించి ప్రస్తావనే అప్పట్లో .ఆ తర్వాత వచ్చిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కధా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ఇన్స్పిరేషన్ . ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది . ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కే.విశ్వనాధ్ కాంబినేషన్ లో సాగర సంగమం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . అవార్డులు తో పాటు రివార్డులు సొంతం చేస్కుకున్నదీ చిత్రం . తెలుగు, తమిళం & మలయాళం లో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది . తదుపరి చిత్రం మరో క్లాసిక్ - సితార . ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వంశీ దర్శకత్వం లో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ever green classic . సితార కి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది .ఇక స్వాతిముత్యం - కే.విశ్వనాధ్ కమలహాసన్ రాధిక ల కలయిక లో వచ్చిన ఆణిముత్యం . 1986 లో విడులయ్యిన ఈ చిత్రం , అప్పటికి బాక్స్ ఆఫీస్ records ని బీట్ చేసింది . జాతీయ అవార్డు , రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిషాత్మక ఆస్కార్ అవార్డులకు భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం . ఇక స్వయంకృషి - మెగాస్టార్ చిరంజీవి తో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా , ఓ సాధారణ చెప్పులు కొట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే . అది విజయవంతం చేసి అందరి మన్ననలూ పొందారు ఏడిద . మంచి విజయం సాధించిన ఈ చిత్రం , చిరంజీవి కి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది .ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరో గా చేసిన స్వరకల్పన ఆశించనంతగా ఆడలేదు . మళ్ళీ విశ్వనాధ్ - చిరంజీవిలతో తీసిన చిత్రం , ఆపత్బాంధవుడు . చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ . రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా నంది అవార్డు .అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచంలో మిస్ అయ్యింది . ఇన్ని గొప్ప చిత్రాలు నిర్మించడానికి సాహసించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారికి , మన ప్రభుత్వం తరపున సరైన గుర్తింపు లభించలేదు అంటే సినీ అభిమానులకు చాలా నిరాశే . పద్మ అవార్డుల్లో కానీ , రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డుకి కానీ ఆయన అన్నివిధాలా అర్హులే .  కనీసం కీర్తిశేషులైన తర్వాత ఆయనకీ తగిన విధముగా పురస్కారం మన తెలుగు ప్రభుత్వాలు అందిస్తే , చిత్ర సీమలో ఆయన చిత్రాలు ఎలాగైతే మరపురాని ఆణిముత్యాల్లా మిగిలాయో, అలాగే ఆయన కీర్తి ప్రతిష్టలను 

గౌరవించిన వారౌతారు .


పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ 


సిరి సిరి మువ్వ

తాయారమ్మ బంగారయ్య 

శంకరాభరణం

సీతాకోకచిలక 

సాగర సంగమం 

స్వాతిముత్యం  

సితార 

స్వయంకృషి

స్వరకల్పన

ఆపత్బాంధవుడు

25, ఏప్రిల్ 2021, ఆదివారం

ఉండుండి మేఘాలు కమ్మడం చూసాను - తెలుగు గజల్


 

తెలుగు గజల్ - డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారి సౌజన్యంతో


ఉండుండి మేఘాలు కమ్మడం చూసాను!

శోకాల జడివాన కురవడం చూసాను!

మోయలేనీబరువు- అంటోంది ప్రతిగుండె

ఆనందమను పదం తొలగడం చూసాను!

పల్లేరు కాయలను నల్లేరుగా నమ్మి

శకటమే పల్టీలు కొట్టడం చూసాను!

దుఃఖసంద్రంలోన పడవలొస్తున్నాయి

ఒడ్డుచేరగలేక ఊగడం చూసాను !

మనసుపడి గీసాడు చిత్రాన్ని పైవాడు

రంగులే ఒకటొకటి వెలవడం చూసాను !

పలుకు తేనెలు లేవు వెలుగు సోనలు లేవు

భావాలపై తెరను వేయడం చూసాను!

అందాల ఈబొమ్మ చేజారి పగిలింది !

మునిగాక సేతువును కట్టడం చూసాను!

~~~~~~~~~~~~~~~

డా. ఉమాదేవి జంధ్యాల


23, ఏప్రిల్ 2021, శుక్రవారం

సింహాచలం సంపెంగలు


 



#కందము#
ముచ్చటగ సంజె వేళకు
పచ్చని సంపంగి విరులు పరిమళములతో...
విచ్చగనే హాయి గొలుపు
వెచ్చని తలపులు మనసున వేడుక చేయున్!

సంపెంగల గురించి శ్రీమతి పద్మజ మంత్రాల చక్కని పద్యం రచించారు. 

సంపెంగలు అంటే సింహాచల క్షేత్రం గుర్తుకొస్తుంది. ఇక్కడ సంపెంగలు చాలా ప్రసిధ్ధి. కొండ మీద సంపెంగ చెట్లు కూడా ఉన్నాయట. 
.

సింహాచలం మా ఇంటినుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓ వృధ్ధురాలు రోజూ మా ఇంటికి వచ్చి సంపెంగలు ఇచ్చి వెళ్తుండేది. మాకు తోచిన డబ్బులు ఇచ్చి, కాస్త ఊరగాయ ఇస్తే చాలు చాలా సంతోషపడేది. పద్మజ గారి పద్యం చదివాక మాకు ఆ రోజులు గుర్తుకొచ్చాయి.

సింహాచలం అప్పన్న స్వామికి భక్తులు సమర్పించిన విరాళాలతో దేవస్థానం అధికారులు స్వర్ణ సంపెంగలు తయారు చేయించారు. 96 మంది దాతలు సమర్పించిన రూ.82 లక్షలతో మొత్తం 132 స్వర్ణ సంపెంగ పుష్పాలను తయారు చేయించారు. ప్రస్తుతం ఆలయంలో ప్రతి గురు, ఆదివారాల్లో స్వర్ణ సంపెంగ పుష్పార్చన నిర్వహిస్తారు.

22, ఏప్రిల్ 2021, గురువారం

దోసిలిలో మోము దాచి / అబ్బో అదెంత సిగ్గే - చిత్రానికి పద్య రచనలు



నా చిత్రానికి పద్య రచనలు :


 #కందము#

ఏ సురభామిను లైనను
నీ సరి తులతూగరనుచు నెయ్యుడు పొగడన్...
హౌసుగ సిగ్గిల్లుచు తన
దోసిలిలో మోము దాచి తొయ్యలి నగియెన్!

(నెయ్యుడు=చెలికాడు, హౌసు=సొగసు, తొయ్యలి=ఇంతి)

పద్య రచన : శ్రీమతి పద్మజ మంత్రాల

--------------------------------------------------------------------------------------------------------------

అబ్బో యదంత సిగ్గే?
తబ్బిబ్బైపోయి వరుడు దరుణిని దాకెన్
సబ్బువలెజారిపోవగ
అబ్బా చాలింపుమనుచు నరచె విసుగుతో !

కొంచెం హాస్యం మేళవించి పద్యం రచించారు శ్రీమతి ఉమాదేవి జంద్యాల


20, ఏప్రిల్ 2021, మంగళవారం

సుసర్ల దక్షిణామూర్తి - సంగీత దర్శకుడు


సుసర్ల దక్షిణామూర్తి (1921-2012)


(Pencil sketch by Ponnada Murty, that is me)

సుసర్ల దక్షిణామూర్తి అనగానే మనకు సినీ సంగీత దర్శకుడు, ‘నర్తనశాల’ సినిమా, లతా మంగేష్కర్‌ ‘నిదురపోరా తమ్ముడా’ పాట ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులకు మాత్రం మంగళంపల్లి బాలమురళికృష్ణ, ఆయన గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, వారి గురువు - సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి గుర్తొస్తారు.


నిజమే ఈ గుర్తుకి ఆ గుర్తుకి, మధ్య గుర్తుంచుకోదగ్గ బంధుత్వమే ఉంది. త్యాగరాజ శిష్య పరంపరకి చెందిన ఆ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి - సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తికి స్వయానా తాత. ఆ సుస్వర సంపదను వారసత్వంగా పుణికి పుచ్చుకోవడం వల్లనే వయొలిన్‌తో పదమూడో ఏట రాజస్థానాల్లో తన ప్రతిభను ప్రదర్శించి పదహారవ సంవత్సరంలోనే గజారోహణ సత్కారాన్ని అందుకున్నారు కూడా.


తరువాత ఆల్‌ఇండియా రేడియోలో ఏ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొంది చాలా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సౌతిండియన్‌ మ్యూజిక్‌ విభాగానికి స్టేషన్‌ డైరక్టురుగా ఆహ్వానాన్ని అందుకున్నారు. ఆ ఆహ్వానాన్ని స్వీకరించకుండా మద్రాసు వైపు ఆయన సాగించిన సినీ సంగీత ప్రస్థానంలో శ్రోతలకు మిగిల్చిన కొన్ని మధురైమైన మలుపులు, మజిలీలు గురించి తలపుల తలుపులు తెరిచి తల్చుకుందాం - ఆయనకు ఓ నివాళిగా.


* కొన్ని కొన్ని జిలుగులు తళుక్కుమని మెరిసి వెళ్లిపోతుంటాయి. అలాంటివి పాటలో ఎక్కడో దగ్గిర వేసి ఆ పాటకు కొత్తందాలు తీసుకురావడంలో సుసర్ల వారి శైలి విభన్నంగా ఉంటుంది. ఉదాహరణకి ‘బండరాముడు’లో ‘ఒక సారి ఆగుమా ఓ చందమామ’ అంటూ ఓ అద్భుతమైన మలుపు ఊహించని విధంగా తిరుగుతుంది. విన్నవాళ్లే కాదు - ఎప్పుడు ఎక్కడ ఎవరు పాడినా సరే ఈ మలుపుని ఎంజాయ్‌ చెయ్యకుండా పాడడం జరగదు. అదీ సుసర్లంటే. అలాగే ‘ఎవ్వరి కోసం ఈ మందహాసం’ (నర్తనశాల) పాట చివర్న పల్లవి రిపీట్‌ కాగానే వచ్చే వయొలెన్‌ బిట్‌. ఇది మొత్తం పాటలో ఒకేసారి వస్తుంది. అయినా ఆ పాట ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ బిట్‌ని హమ్‌ చెయ్యని సంగీత ప్రియులుండరు. ‘నర్తనశాల’లోనే ‘సఖియా వివరించవే’ పాటలో.. చిట్ట చివరకి ల్యాండింగ్‌గా వచ్చే ఆలాపన.. పాడే వారి నోట ఈ ఆలాపన రాగానే వినే వారి ముఖంలో వెలుగుతో కనిపించే ఎక్స్‌ప్రెస్‌ని కెమెరాతో క్యాచ్‌ చేసి చూపించాలే తప్ప ఎంత వర్ణించినా అది ఆ అనుభవానికి నీడలా ఉంటుందే తప్ప ప్రతిబింబంలా ఉండలేదు.

 

* జగపతి వారి తొలి చిత్రం ‘అన్నపూర్ణ’లో హీరో జగ్గయ్యకి పీబీ శ్రీనివాస్‌ చేత (‘మనసేమిటో తెలిసిందిలే...’ అనే పాట), హాస్య పాత్రధారి రేలంగికి ఘంటసాల చేత పాడించడం. జగ్గయ్యకి పీబీ శ్రీనివాస్‌ బావుంటుంది. కానీ రేలంగికి ఘంటసాల చేత పాడించాల్సిన అవసరం లేదు. అప్పటికే ఎస్టాబ్లెష్‌ అయిపోయిన మాధవపెద్ది ఉన్నారు. పైగా గతంలో తనే రేలంగికి - ‘సంసారం’లో ‘సొగసైన క్రాఫ్‌ పోయే నగమోము చిన్న బోయే..’ అనే పాటనీ, ‘ఇలవేల్పు’లో ‘సాంబ్రాణి ధూపమేసి పట్టనా’లాంటి పాటనీ పాడి హిట్‌ చేసిన చరిత్ర ఉంది సుసర్లకి. అయినా ఘంటసాల చేత (‘వగలాడి వయ్యారం భలే జోరు..’ అనే పాట) పాడించడం.. అదీ మహా లబ్జుగా! ఇది సాహసం కాదు..సామర్థ్యం.


* ఇవి కాక తెలుగువారికి సంప్రదాయానికి సుసర్లవారు తన వంతుగా సమర్పించిన గీతాలు ఓ రెండున్నాయి. ఒకటి ‘సంసారం’లో ‘అమ్మా శ్రీ తులసీ దయారాశివమ్మా’ పాటైతే, ఇంకొకటి ‘నర్తనశాల’లో ‘జయగణనాయక విఘ్న వినాయక’. మొదటిది లేకుండా తులసి పూజ, రెండవది లేకుండా నృత్యపూజ జరగడం తెలుగింట అరుదు.

* సుసర్లవారి శరీరం ఎంత ధృడమైనదో ఆయన శారీరం (గాత్రం) అంతకంటే ధృడమైనది. అది ఎంత ఎత్తుకి వెళ్లగలదో తెలుసుకోవాలంటే ‘సంతానం’లో ఘంటసాల చేత పాడించిన రెండు పాటల్ని గమనిస్తే చాలు. మొదటిది ‘కనుమూసిన కనిపించే నిజమిదే’ అనే విషాద గీతం. రెండవది అందరికీ తెలిసిన ‘దేవీ శ్రీదేవి’ అనే ప్రేమ గీతం. షణ్ముఖప్రియ రాగానికి ఉదాహరణగా సినీ గీతాన్ని చెప్పమంటే ఎవరైనా సరే మొదట చెప్పే పాట - దేవీ శ్రీదేవి. ఈ పాటను ఆ రేంజ్‌లో పాడగలగడం ఘంటసాల అభిమానులకు ఓ స్టేటస్‌ సింబల్‌. అలా రేంజ్‌లోకి వెళ్లగల గాత్రాలుంటే అంతరేంజ్‌లో పాటల్ని స్వరపరచడమేకాక పాడి - పాడించడంలో దిట్ట సుసర్ల. అందుకు మరో ఉదాహరణ ‘సంతానం’ అనగానే గుర్తొచ్చేపాట తెలుగువారు గర్వంగా చెప్పుకునే పాట సుసర్లవారి కీర్తి కిరీటంలో కలిగితురాయిగా నిలిచిపోయిన పాట ‘నిదురపోరా తమ్ముడా’. ఈపాటలో ‘జాలి తలచి కన్నీరు తుడిచే దాతలే కనరారే’ దగ్గర లతా వాయిస్‌ని ఎంత రేంజ్‌కి వేళ్లేటట్టు చేశారో తిరిగి అదే పాట ఘంటసాల వెర్షన్‌తో రిపీట్‌గా వచ్చినప్పుడు ఆయన వాయిస్‌ని కూడా అదే రేంజ్‌లో వాడుకున్నారాయన. (ఈ పాట పాడి ఇంటికెళ్లాక - ‘లతా మంగేష్కర్‌ వచ్చిందని సూట్‌లో వచ్చాడు దక్షిణామూర్తి’ అని చెప్పారట ఘంటసాల తన భార్య సావిత్రమ్మతో).


* ఇలా రేంజ్‌ ఉన్న పాటలతో పాటు మాధుర్యంతో తొణికిసలాడే మృదువైన గీతాలను అభిమానించే వారి కోసం కూడా తక్కువేం చెయ్యలేదు సుసర్ల. అందుకు మొదట మంచి ఉదాహరణ ‘చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో’ (సంతానం) పాటనే చెప్పుకోవాలి. ప్రభుదేవా నటించిన ‘ప్రేమికుడు’ సినిమాలో అతనితో మందు తాగిస్తూ ‘ఎవర్ని ప్రేమించావు?’ అని అతని తండ్రి (ఎస్పీబాలు) అడిగే సీన్‌ గుర్తుందా? అక్కడ సరదాగా బాలూ హమ్‌ చేసిన పాట ఇదే. నిజానికి అది డబ్బింగ్‌ సినిమా కాబట్టి ఏ పాట హమ్‌ చేసినా చెల్లిపోతుంది. కానీ ఈపాటనే బాలూ ఎన్నుకోవడానికి గల కారణం ఆ పాçపై బాలూకున్న మక్కువతోపాటు ఆ ఎంపికను ప్రేక్షకుల ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం కూడా. అలానే జరిగింది. అలా ఆ క్రెడిట్‌లో కొంత పరోక్షంగా సుసర్ల వారికి వెళ్తుంది.

 

* ‘సంతానం’ సినిమాలోని ‘సంతోషమేలా సంతోషమేలా’ పాట గురించీ చెప్పాలి. నిజానికి ఈ పాట ట్యూన్‌ సుసర్లవారిది కాదు. శాంతారాం తీసిన ‘సుభా కా తారా’ సినిమాలోని ‘గయా అందేరా హువా ఉజాలా’ అనే గీతం తాలూకు బాణీ అది. తెలుగు పాటను ఎస్పీ కోదండపాణి (జమునారాణితో కలిసి) ఆలపించారు. గాయకుడిగా ఎస్పీ కోదండపాణి అనగానే ‘ఇదిగో దేవుడు చేసిన బొమ్మ’ (పండంటి కాపురం) పాటనే ఆయన మొదటి పాటనుకుంటారు. ఆయనతో సుసర్ల వారెప్పుడో పాడించారని చాలా మందికి తెలియదు. అలాగే ఎమ్మెల్‌ వసంతకుమారితో ‘వచ్చిన కోడలు నచ్చింది’లో పాడించిన ఘనత కూడా ఈయన అకౌంట్‌లో ఉంది. కోదండపాణితో పాడించడానికి కారణం సుసర్లవారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడమే. ఒక్క కోదండపాణే కాదు. ఎమ్మెస్‌ విశ్వనాథం, ఎ.ఎ.రాజ్‌ వీరంతా సుసర్ల వద్ద పని చేసిన వారే.


* ఎమ్మెల్‌ వసంతకుమారితో పాడించినట్టే ఒరియా గాయకుడు రఘునాథ పాణిగ్రహితో ‘చల్లని రాజా ఓ చందమామా’ (‘ఇలవేల్పు’) పాటని పాడించడం, ఆ పాట అటు పాణిగ్రహి కెరీర్‌కి, ఇటు తెలుగు సినీ సంగీత చరిత్రకే ఒక ల్యాండ్‌ మార్క్‌గా మిగిలిపోవడం సుసర్లవారి క్రెడిట్స్‌లో చేరదగ్గవి.

* ఇక్కడ మరో రెండు విషయాలు చెప్పాలి. అక్కినేనికి ఘంటసాల అలవాటు పడుతున్న రోజుల్లో రఘునాథ పాణిగ్రహి ‘చల్లనిరాజా ఓ చందమామా’ పాడించడం ఒక్కటైతే, ఘంటసాల బాగా అలవాటయిపోయిన తరువాత ఎన్టీఆర్‌కి ‘బండరాముడు’లో పిఠాపురం నాగేశ్వరరావుతో (రకరకాల పూలు.. అనే పాట) పాడించడం, అదే సినిమాలో నాగయ్యకి ఘంటసాలతో (రాధా మోహన రాస విహారీ..అనే పాట) పాడించడం.. వీటినేమంటారు? ఇదివరకు అనుకున్నట్టు సాహసమా.. సామర్థ్యమా..లేక ప్రయోగమా? అలా అయితే ఒకే సినిమాలో (నర్తనశాల) ఎన్టీఆర్‌కి (బృహన్నలగా ఉన్నప్పుడు) అటు ఘంటసాలతో (జయగణ నాయక), ఇటు బాలమురళితో (సలలిత రాగ సుధా రససారం) పాడించడాన్ని ఏం అంటారు.



* ఇక ‘నర్తనశాల’ విషయానికొస్తే ఏ పాటని హిట్‌ కాని పాటగా తీసెయ్యగలం? ‘నరవరా ఓ కురువరా’, ‘జననీ శివ కామినీ’, ‘జయగణ నాయక’, ‘సలలిత రాగసుధరస’, ‘ఎవ్వరి కోసం ఈ మందహాసం’, ‘సఖియా వివరించవే’, ‘దరికి రాబోకు రాజా’ ఇలా ఏ పాటని మర్చిపోగలం..మరి పద్యాలు..ఏనుగు నెక్కి పెక్కేనుంగలిరుగడరా.. కాంచన మమ వేదికా.. వీటికి అమృత ధారలద్దినది సుసర్ల సుస్వరాలే కదూ!?

 

* ఈ సందర్భంగా మరో సంగతి చెప్పుకోవాలి. ‘నర్తనశాల’ వచ్చిన పదహారేళ్ల తరువాత అదే కథాంశంతో ‘శ్రీమద్విరాట్‌ పర్వం’ వచ్చింది. దీనికీ సుసర్లే సంగీత దర్శకుడు. ఆ సినిమాతో పోలిస్తే మిగిలిన పాటలకి లేని ఇబ్బంది ఓ పాటకి వచ్చి పడింది. ‘నర్తనశాల’లో సైరంధ్రి - కీచకుణ్ణి ఆహ్వానిస్తూ ‘దరికి రాబోకు రాబోకు రాజా’ అంటూ పాడుతుంది. అది సోలో. ఇక్కడ ‘మద్విరాట్‌ పర్వం’ విషయానికొచ్చేసరికి (ఎన్టీఆర్‌ కీచకుడు కనుక) కీచకుడు కూడా గొంతు కలుపుతాడు. పైగా నెగిటివ్‌ రోల్‌లో ఎన్టీఆర్‌ అభినయించిన ‘చిత్రం హాయ్‌ భళారే విచిత్రం’ పాట (‘దాన వీర శూర కర్ణ’) అప్పటికే హిట్టు. దానికి సుసర్ల ఓ తమషా చేశారు. ‘మనసాయెనా మతిపోయెనా’ అని సైరంధ్రి అంటే ‘ఎప్పుడు మనసౌవుతుందో, ఎప్పుడు మతిపోతుందో, అప్పుడే కథ మొదలవుతుంది’ అని ఎత్తుకుంటాడు కీచకుడు. సరిగ్గా కీచకుడి లైన్స్‌ రాగానే వెనుక ఇన్‌స్ట్రుమెంట్స్‌ అన్నీ వెస్ట్రన్‌ స్టయిల్లో ఫాలో అవుతాయి. జనం కొత్తదనం ఫీలయ్యారు. ఆనందించారు.


* ఇలా చెప్పుకొంటూపోతే సుసర్ల వారి పాటల గురించి ప్రత్యేకంగా ఓ పుస్తకమే వెయ్యొచ్చు. ‘నారద నారది’ సినిమాతో స్వతంత్య్ర సినీ సంగీత దర్శకుడిగా మొదలైన ఆయన జీవనం ఎన్నో మలుపులు తిరిగింది. ‘లక్ష్మమ్మకథ’, ‘స్త్రీ సాహసం’, ‘పరమానందయ్య శిష్యులు’ చిత్రాల్లో అక్కినేనికి ప్లే బ్యాక్‌ పాడడం, ‘సర్వాధికారి’ చిత్రంలో ఎన్టీఆర్‌కి డబ్బింగ్‌ చెప్పడంలాంటివి కూడా వాటిలో కొన్ని. సంగీత దర్శకుడిగా వర్క్‌ తగ్గాక ఖాళీగా కూర్చోలేదు. చక్రవర్తి ఆర్కెస్ట్రాలో వయొలిన్‌ వాయించే వారు. ఆ పనిని ఆయన చిన్నతనంగా ఫీలవ్వలేదు. అది కూడా సంగీతారాధనే అనుకునేవారు. చక్రవర్తి కూడా ఈయన్ని ఎంతో గౌరవంగా చూసుకునేవారు.

* ఓసారి రికార్డింగ్‌ థియేటర్లోకి వెళ్తుతున్నారు సుసర్ల. అంతకు కొన్నేళ్ల క్రితమే చక్రవర్తి ఆర్కెస్ట్రాలో చేరిన ఓ కుర్రాడు కాళ్లు బార్లా జాపుకుని అడ్డంగా కూచున్నాడు. అతన్ని దాటుకుని వెళ్లడం కుదరక తప్పుకుని వేరే రూట్లో థియేటర్‌కి వెళ్లారాయన. అదంతా గమనించిన చక్రవర్తికి కోపం నసాళానికి అంటింది. స్పీడుగా వెళ్లి కుర్రాడు కూర్చున్న కుర్చీని ఓ తాపు తన్నారు. ‘‘ఆయన ఎవరనుకుంటున్నావురా? ఆయనకున్న విద్వత్తు మనకి రావాలంటే జన్మలెత్తాలి మనం’’ అన్నారు గట్టిగా అరుస్తూ. ఈ సంఘటన ఒక్కటి చాలు సుసర్ల పట్ల విషయం ఉన్న సీనియర్‌ సంగీత దర్శకులు ఎంత గౌరవాన్ని కనపర్చేవారో చెప్పడానికి.

* కాలక్రమేణా షుగర్‌ వ్యాధి ముదరడం వల్ల ఆయనకు చూపుపోయింది. వయోభారతంతో వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది. చివరగా ఓ ఎఫ్‌.ఎమ్‌.రేడియో వాళ్లు ఇచ్చిన లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డే సుసర్ల అందుకున్న ఆఖరి అవార్డు. వ్యాధిగ్రస్తుడైపోలేదాయన. పోయే ముందు కూడా ‘నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లవద్దు’ అని స్పష్టంగా చెప్పి మరీపోయారు.

* ఏదీ ఏమైనా చంద్రుడున్నంత కాలం తెలుగువారికి ‘చల్లని రాజా ఓ చందమామా’ పాట ఉంటుంది. కంటికి నిద్ర సుఖం తెలిసున్నంతవరకూ ‘నిదురపోరా తమ్ముడా’ గుర్తుంటుంది. మంచి సంగీతం మీద గౌరవం ఉన్నంతవరకూ ‘సలలిత రాగ సుధా రస సారం’ ఆగకుండా ప్రవహిస్తూ ఉంటుంది. అదే సుస్వర వాహిని. సుసర్ల వాహిని.

(వ్యాసం సౌజన్యం : Musicologist Raja)


 

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...