30, డిసెంబర్ 2020, బుధవారం

సూపర్ స్టార్ 'రాజేష్ ఖన్నా' -


(My pencil sketch of Rajesh Khanna)

కళ్ళు చికిలిస్తూ....తల కాస్త క్రిందకు వాల్చి...గోముగా చూస్తూ...రొమాంటిక్ భావ సుగంధంతో.....

అమ్మాయిల గుండెల్లో అలజడి రేపిన హీరో.

అర్థం లేని జీవితాన్ని అందంగా....ఆనందంగా గడిపేయడమే కావల్సింది....

అంటూ.... నవ్వును...లవ్వునూ...కిషోర్ కుమార్ గొంతుతో చాటి చెప్పిన లవర్ బాయ్.

లోకుల గురించి ఆట్టే పట్టించుకోకోయ్....వాళ్ళెప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది వాళ్ళ పని!...

నీ పని నువ్వు కానీ...అంటూ ....అక్షరాలా ఆచరించే చూపాడు.

నా మనసే తెల్లని కాగితం...దానిమీద ఒక్క నీపేరే వ్రాసి ఉందంటూ....

ఎందరికో చెప్పి ఒప్పించాడు!

ఇది...ఏమిటి...ఎప్పుడు...ఎందుకు...ఎలా... జరిగిపోయింది?.... అని ఆలోచిస్తూ కూర్చోకు.

ఎప్పుడేది జరగాలో....అప్పుడది జరిగే పోతుంది. వదిలెయ్....అంటూ...

జీవితంలో కూడా పట్టుకంటే...విడుపుతోనే...దోస్తీ చేశాడు.

జీవన యానంలో తప్పో...ఒప్పో....ఏదో ఒకటి....ఎవ్వరినీ పట్టించుకోకుండా చేస్తూ పో...

ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా...ప్రయాణం మధ్యలోనే ఆపేయకు. జీవితం....జీవించడానికే.

దాని అంతు చూడు.

లైఫ్ కు టాటా చెప్పే టైం వస్తుంది.

అప్పుడు.....ఆనందంగా చెప్పేయ్....

*ప్యాక్ అప్....టైం ఈజ్ అప్*......అంటూ.

జీవన సారాన్ని సినిమా పాటలలో...కిషోర్ కుమార్ స్వరంతో...ఒలికించడమే కాదు....

అక్షరాలా ఆచరించాడు....రాజేష్ ఖన్నా...ఉరఫ్...జతిన్ ఖన్నా....కాకా...ఆర్.కె.....

**********

మాయామేయము జగము....

మానవుడా....కాదేదీ నిత్యము....

ధన, జన, యవ్వన,గర్వం...సర్వం.....

హరియించునురా...క్షణమున కాలం!..

మహానుభావులు....సిధ్ధులు.....ఋషులు....ఎందరో.....మళ్ళీ మళ్ళీ బోధించినా.....

మనకే అది సత్యమని....

చివరకు అంతా శూన్యమే అని తెలిసినా....

అనంత మాయ ముందు....

మనిషి....మళ్ళీ...మళ్ళీ ఓడిపోతూనే ఉంటాడు!

మానవజీవిత ఉత్థానపతనాలకు....

మహామాయే కారణం!

జీవితంలో ఆటుపోట్లు...ఎత్తు పల్లాలు సహజమే.

కానీ జీవన యానం లో ఎవరెస్ట్ అంత ఎత్తుకెదిగి....

తిరిగి పసిఫిక్ లో పడ్డ అనుభూతి .....

అనుభవిస్తే కాని తెలియదా పరిస్థితి !

*********

రాజేష్ ఖన్నా...అసలు పేరు జతిన్ ఖన్నా.

భారతీయ సినిమా మొదటి సూపర్ స్టార్ గా వ్యవహరింపబడే....రాజేష్ ఖన్నా 1975 వ సంవత్సరంలో జరిగిన ఆల్ ఇండియా టేలెంట్ పోటీ లో పాల్గొన్న పదివేలమందిలో కేవలం ఎనిమిది మందిని మాత్రమే
ఎంపిక చేసుకున్నారు. ఆ ఎనిమిది మందిలో రాజేష్ ఖన్నా ఒకడు. ఆరాధన చిత్రంలో రాజేష్ ఖన్నతో సహ నటిగా నటించిన ఫరీదాజలాల్ కూడా ఈ ఎనిమిదిమందిలో ఎంపిక అయ్యింది. చేతానానంద్ నిర్మించిన ‘ఆఖ్రీ ఖత్’ తో రాజేష్ ఖన్నా సినీ ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఈ చిత్రం విజయవంతం కాకపోయినా 1967 ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ కి ఓ ఎంట్రీ గా ఎంపిక అయ్యింది. .... 163 చిత్రాలలో నటించారు. 1969 - 71... తను సోలోగా నటించిన చిత్రాలు వరుసగా 15 విజయవంతం కావటంతో రాజేష్ ఖన్నా కు పేరు సార్థకమైనది.

ఇంతవరకూ రికార్డుని ఎవరూ బద్దలకొట్టలేక పోయారు.

*********

రవి కపూర్ (జితేంద్ర)తో బొంబాయి లోని సెయింట్ సెబాస్టియన్ గోవన్ హై స్కూలులో విద్యాభ్యాసం సాగించాడు....కాకా

ఇద్దరి స్నేహితుల తల్లులు కూడా స్నేహితురాళ్ళే.

నాటక రంగం పైన ఆసక్తి గల ఖన్నా పాఠశాల, కళాశాల స్థాయిల్లో తన ప్రదర్శనలకు గాను చాలా బహుమతులనందుకొన్నాడు.

కిషోర్ కుమార్....ఖన్నాకి అధికారిక నేపథ్యగాయకుడిగా స్థాపించబడ్డాడు.

ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు అంటే నమ్మలేనంతగా ఖన్నాకి కిషోర్ గొంతు సరిపోయిందంటే అతిశయోక్తి కాదు.

1991 వరకూ ద్వయం అనేక విజయాలని నమోదు చేసింది.

ఖన్నా-కిషోర్-ఆర్.డి.బర్మన్....త్రయం.

కటీ పతంగ్, అమర్ ప్రేం, షెహ్జాదా, అప్నా దేశ్, మేరే జీవన్ సాథీ, ఆప్ కీ కసం, అజ్నబీ, నమక్ హరామ్, మహా చోర్, కర్మ్, ఫిర్ వహీ రాత్, ఆంచల్, కుద్రత్, అశాంతి, అగర్ తుం హోతే, ఆవాజ్, హం దోనో, అలగ్ అలగ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని....

సంగీత మయం చేసి....ప్రేక్షకులను సమ్మోహనం చేసింది.

**********

1969 లో ఆరాధన రిలీజ్ అయ్యాక అమ్మాయిలు.. ఆయన ఫొటోను పెళ్ళిచేసుకున్నారు!

ఆంటీలు...రహస్యంగా...తమ హాండ్ బ్యాగ్ లలో దాచుకున్నారు అదే చిత్రాన్ని.

బహిరంగ ప్రదేశాలలో... కనబడినప్పుడు.... అతని అభిమానులు గుంపులు గుంపులుగా తరలి వచ్చేవారు.

లిప్ స్టిక్ ముద్రలతో అతని కారుని నింపేస్తూ, రోడ్డుకిరువైపుల నిలబడి అతని పేరుని బిగ్గరగా ఉఛ్ఛరించేవారు.

మహిళా అభిమానులు తమ రక్తంతో రాసిన లేఖలు అతనికి పంపేవారు.

అతని బంగళా ఎదుట నిర్మాతలు, వెర్రిగా అభిమానించే ఫ్యాన్లు వరుస కట్టేవారు.

ఖన్నా ఫోటోలతో పెళ్ళిళ్ళు చేసుకొని,

వారి వ్రేళ్ళని కోసుకుని వచ్చిన రక్తంతో అమ్మాయిలు సింధూరంగా దిద్దుకొనేవారు.

ఖన్నాని వారు దైవంగా కొలుచుకొనేవారు.

ఒక కథానాయకుడికి అభిమానం ఇంతగా ఎప్పుడూ హద్దులు మీరలేదు!!!.....అని అంటారు.

***********

1973 లో ఆయన తనకన్న 15 ఏళ్ళు చిన్నదైన డింపుల్ కపాడియా ను పెళ్ళి చేసుకున్నప్పుడు..

ఎందరి కన్నె పిల్లల గుండెలో బాధపడ్డాయి. కొంతమంది ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారని వినికిడి!

ఇది మనకు అతిశయోక్తి గా అనిపించవచ్చు. కానీ ఉత్తర భారతావనిలో ఖచ్చితంగా నమ్ముతారు.

1969 - 1971....వరుసగా 15 సూపర్ హిట్స్...ఇచ్చి ఇండియాలోనే రికార్డ్ సృష్టించిన ఘనత కీ.శే..రాజేష్ ఖన్నా దే నని చెప్పొచ్చు!

ఆనంద్, అమర్ ప్రేం,అందాజ్, హాథీ మరే సాథీ, దాగ్, నమక్ హరాం, సఫర్, ఆప్ కి కసం...లాంటివి ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి.

ప్రేమ కథ లన్నీ ఆయనకే!

ప్రేమ సామ్రాట్ అనిపించుకున్నాడు!

***********

1973 లో డింపుల్ కపాడియ తో వివాహం తో షాక్ తిన్నారు అమ్మాయిలు.

ఇప్పుడున్నంత మీడియా ప్రాపగాండా...అప్పుడు లేదు.

అందరూ...ఆయన చేసిన సినిమాలలో...కేరక్టర్ల తో కనెక్ట్ అయ్యారే గానీ...

పర్సనల్ విషయాలు....ఇప్పుడు బయటకు వచ్చినంతగా...అప్పుడు వచ్చేవి కావు.

రాజేష్ ఖన్నామేనియా నుండి బయటపడడానికి అమితాబ్ రాక సహాయ పడ్డది!

యాంగ్రీ యంగ్ మాన్...ఇమేజ్ తో, దూసుకుపోయాడు అమితాబ్!

లవ్ స్టోరీస్ తగ్గి....డాన్లు, రివెంజ్ లు, దూకుడులు, స్టంట్ లకు షో పెరిగింది. రాజేష్ ఖన్నా ప్రాభవం తగ్గింది!

డింపుల్ తో వివాహానికి ముందే...అంజూ మహేంద్ర అనే నటి, ఫాషన్ డిజైనర్ తో 3ఏళ్ళు సహజీవనం చేసిన...కాకా తో డింపుల్ సర్దుకుపోయింది!

తన కెరీర్ ను కూడా ఒక్క సినిమా (బాబీ) తో ఆపేసింది.

రాజేష్ పుట్టిన రోజే....ట్వింకిల్ కూడా పుట్టింది. 29 డిసెంబర్ 1973. తండ్రి తో పుట్టిన రోజు షేర్ చేసుకోవడం. వెరీ నైస్!

1977 లో రింకీ పుట్టింది. అప్పటికే...రాజేష్ ఖన్నా ప్రాభవం తగ్గి...

ఆల్కహాల్ ప్రభావం ఎక్కువై...భార్య భర్తల మధ్య గొడవలు మామూలైపోయాయి.

**********

1980లలో అమర్ దీప్, బందిష్, దర్ద్, అవతార్, ఆవాజ్, నజ్ రానా, అంగారే, అమృత్ లాంటి మూవీస్ తో నెట్టుకొచ్చాడు.

1985 లో అలగ్ అలగ్ అని సొంతం గా మూవీ తీస్తే...అది వాష్ ఔట్ అయ్యింది.

డింపుల్ పిల్లలతో కలిసి...కాకా ఇల్లు ఆశీర్వాద్ వదలి పోయింది!

సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది సినిమాలలో సాగర్ మూవీతో!

తరువాత 7 సంవత్సరాలు సహజీవనం చేశాడు టీనా మునీం తో! ఆవిడ అనిల్ అంబానీ ని పెళ్ళి చేసుకోవడం తో అది ముగిసింది!

1991 లో పాలిటిక్స్ లో ప్రవేశించి...1991- 1996 వరకు డిల్లీ ఎం.పి. గా ఉన్నాడు.

ఆశ్చర్యం గా విడిపోయిన డింపుల్ ఎన్నికల ప్రచారం లో సహాయపడ్డారు!

2005 లో లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్,...

కెరీర్ లో 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు...కైవసం చేసుకుని...

2008 వరకు కూడా కేరక్టర్ రోల్స్ చెశారు.

2011 లో కాన్సర్ పేషంట్ అయి...ట్ర్రీట్ మెంట్ తీసుకుంటూ..18 జూలై 2012 స్వర్గస్తులయ్యారు కాకా.

**********

టైం ఈజ్ అప్.....పాక్ అప్.......

ఇవి ఖన్నా చివరి మాటలని....... అమితాబ్ అన్నారు.

ముందుగానే రికార్డ్ చేసుకున్న మెసేజ్ లో.....

అభిమానులకు, స్నేహితులకు, సన్నిహితులకు....

ఇంతకాలం ఆదరించినందుకు తన ధన్యవాదములు తెలిపారు.

25 జూలై 2012- అస్తికలు గంగా జలం లో కలిసిపోయాయి.

గొప్ప వ్యక్తి కాక పోవచ్చు. గొప్ప నటుడు రాజేష్ ఖన్నా.

యువతుల హృదయ సామ్రాట్ గా ఉత్తర భారతాన...

ఉవ్వెత్తున లేచిన రొమాంటిక్ హీరో రాజేష్ ఖన్నా

(సేకరణ: మిత్రులు డా. ప్రసాద్ కెవి గారు అందించిన వివరాలు, ఇంకా ఇక్కడా అక్కడా)


 

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...