29, ఆగస్టు 2021, ఆదివారం

ఉట్టిని గొట్టగ కూడెన్ జట్టుగ గోపాలుడుండె సఖ్యత తోడన్ : Painting : Ponnada Murty


  చిత్రం : Ponnada Murty

నా చిత్రానికి శ్రీమతి పద్మజ చెంగల్వల గారు రచించిన కంద పద్యాలు. ఆమెకు నా ధన్యవాదాలు.
ఉట్టిని గొట్టగ కూడెన్ జట్టుగ గోపాలుడుండె సఖ్యత తోడన్ గుట్టుగ కొలగొట్టంగను పట్టుపడని రీతిగాను పధకము వేసే!!

కాంతలు దాచిన ధధిజము జెంతకు జేరె కనుగప్పి చిత్రంబుగ,తా సంతసమున బంచె నపుడు కాంతులు విరిజిమ్ము మోము కళకళలాడెన్!!

యల్లరి వెన్నుని తోడుగ మెల్లగ జేరెను చెలుండు మైత్రిని జూపన్ కల్లరి బంచెగ వెన్నను యుల్లంబది సంతసిల్లె ఒద్దిక పడగన్!!
కన్నయ్య చిలిపి చేష్టలు కన్నుల నిండుగ యశోద గాంచి తరించెన్ వెన్నెల యమునా తటిలో వెన్నుని లీలలు కనగను విస్మయమాయెన్ !

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి - అన్నమయ్య కీర్తన / చిత్రం : పొన్నాడ మూర్తి

మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

వారం వారం అన్నమయ్య కీర్తన


సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
కతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు

భావం సౌజన్యం డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల

మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

వారం వారం అన్నమయ్య కీర్తన

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
కతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు

పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు


భావం సౌజన్యం డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం । దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ! అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. దేవకీ యశోదల ముద్దుల పట్టి లేలేత చరణ పద్మాలకు ఒక తెలుగు పద్యం కూడ సమర్పించుకుందాం। శా|| అందెల్ చిన్ని పసిండి గజ్జెలును మ్రోయన్ మేఖలా ఘంటికల్ క్రందై తోఁపఁగ రావిరేకు నుదుటన్ గన్పింప గోపాంగనా నందంబొందఁగ వెన్నముద్దలకునై వర్తించు నీ బాల్యపున్ చందంబాది విజుల్ నుతింపఁదగుఁగృష్ణా, దేవకీనందనా! ఈ వారం అన్నమయ్య కీర్తన —~~~~~~~~
విశ్లేషణ

వెంకటేశ్వరస్వామికి మహాభక్తుడైన అన్నమయ్య ఆ స్వామి అవతారమే అయిన శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ అనేక కీర్తనలు వ్రాసాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి గనక కృష్ణుడి జన్మవృత్తాంతం తోకూడిన “సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి కతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడూ “ అనే కీర్తన విశేషాలు మీతో పంచుకుంటాను । ఈ కీర్తనలో అన్నమయ్య తానూ ఓ గోపెమ్మ అయిపోయి పక్కనున్న సతులతో “పుట్టేటప్పుడే శంఖుచక్రాలతో , కిరీటంతో ఎలాపుట్టాడే”? అని ఆశ్చర్యపోతూ అడుగుతున్నాడు.

మరి అట్లా ఎలా పుట్టాడో ఆ కథేమిటో చూద్దాం ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకు ఎనిమదో సంతానంగా పుట్టిన వాడే మన కృష్ణుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే! ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ధర్మసంస్థాపనార్థం శ్రీమన్నారాయణుడు ఎన్నో సార్లు అవతారించాడు. వాటిలో దేవకీ వసుదేవులకు పుత్రునిగా పుట్టిన కృష్ణావతారం ఒకటి. ఈ అవతారంలో స్వామి లీలామానుష రూపుడు. ఈ జన్మలోనే కాదు దేవకీ వసుదేవులు మూడు జన్మల నుంచి ఆ శ్రీహరిని పుత్రుడిగా పొందుతున్న పుణ్య దంపతులు.

అదెలా గంటే పృశ్ని, సుతపుడు అనే దంపతులు శ్రీహరిని ధ్యానిస్తూ తపస్సు చేసారు. విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. “నీవంటి కొడుకు కావాల”ని వరం అడిగారట। తనవంటి వాడు మరొకడు లేడు గనక తానే మూడు జన్మలలో వాళ్ళకు కొడుకుగా పుట్టాడు. పృశ్ని గర్భుడు అనేపేరుతో వారికి జన్మించాడు।

ఈ అవతారంలో ధృవలోకాన్ని నిర్మించి ధృవుడికి ఉన్నత స్థానం ఇచ్చాడు. ఈ దంపతులు తరవాత జన్మలో అదతి, కశ్యపులు. అప్పుడు వారికి వామనుడిగా పుట్టి బలిచక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కాడు. దేవకీ వసుదేవులకు బిడ్డగా జన్మించబోతున్నాడు. “నీకు పుట్టబోయే శిశువు శ్రీ మహావిష్ణువు”అని సాక్షాత్తు బ్రహ్మ రుద్రులే వచ్చి దేవకికి చెప్పి ఆశీర్వదించారు. చతుర్భుజాలతో, శంఖుచక్రాలతో పుట్టిన ఆ బిడ్డ తల్లిదండ్రులకు నమస్కరించి వారి పూర్వజన్మ వృత్తాంత మంతా చెప్పి పరమానందం కలిగించాడు. ఈ జన్మతో వారికి ముక్తి లభిస్తుందని చెప్పాడు.తనను వ్రేపల్లెలో నందుని భార్య యశోద దగ్గరకు చేర్చమన్నాడు. అదుగో ఆ విధంగా దేవకీ నందనుడు యశోదానందనుడైనాడు

శ్రీకృష్ణ పరమాత్మ పరిమార్చవలసిన దుష్టులలో ప్రముఖుడు కంసుడు. గతజన్మలో మారీచుని కొడుకైన కాలనేమనే రాక్షసుడు. రాక్షసాంశతో జన్మించి రాక్షసకృత్యాలు చేయడంలో శృతిమించి పోయాడు. దేవకీ దేవి కంసునికి పినతండ్రి కూతురు. అంటే కృష్ణయ్యకు కంసుడు వరసకు మేనమామన్నమాట.

మూడుజన్మలలో తమకు కొడుకుగా విష్ణువు జన్మించినా పెంచుకునే భాగ్యం ఈ దంపతులకు కలగలేదు. కానీ ఆ భాగ్యం గోకులంలోని యశోదానందులకు లభించింది. అదెలా దక్కిందో చూడండి. ద్రోణుడు అనేవసువును, అతని భార్య ధరను భూలోకంలో పుట్టమని బ్రహ్మ ఆదేశించాడట. మాకు శ్రీహరిని కొడుకుగా పొందే వరమిస్తే వెళతామన్నారుట. బ్రహ్మ వారిని ఎందుకు భూలోకానికి వెళ్ళమన్నాడో వాళ్ళూ అదే కోరడం వలన వారికోరికను అనుమతించాడు బ్రహ్మ. ఇదంతా దైవలీల !

సతులతో ముచ్చటలాడుతున్నట్లు వ్రాసిన ఈ అన్నమయ్య కీర్తన ఇన్ని విశేషాలను మనకు గుర్తు చేసుకునేలా చేసింది. కృష్ణుని పుట్టుక విశేషాలు చెప్పి “సతులారా! ఆ ఇద్దరుతల్లుల ముద్దుల పట్టి కృష్ణుడే ఇప్పుడు శ్రీవేంకటపతిగా సతి అలమేలుమంగతో కలిసి మనఎదుట ఉన్నాడు.” అని ఆనందపడతాడు. అన్నమయ్య కీర్తన వినగానే మనకు పోతన గారి భాగవతం లోని ఈ పద్యం గుర్తు వస్తుంది.

సీ॥ జలధరదేహు నాజానుచతుర్బాహు- సరసీరుహాక్షు విశాలవక్షుఁ జారు గదా శంఖ చక్ర పద్మ విలాసుఁ- గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు- శ్రీవత్సలాంఛనాంచిత విహారు నురుకుండలప్రభాయుత కుంతలలలాటు- వైడూర్యమణిగణ వరకిరీటు తే.గీ బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ జూచి తిలకించి పులకించి చోద్య మంది యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె! (కృష్ణుని పేరు గురించి - ~~~~

పసివాడి రూపంలోని ఈ పరమాత్మకు కృష్ణుడు అనే పేరెవరు పెట్టారో తెలుసుకోవడం అప్రస్తుతం కాదు. కృష్ణ వర్ణం లో ఉండటం ఒకకారణం. గర్గ మహర్షి ఉయ్యాలలోని పసివాడి రూపంలో పరబ్రహ్మ కనపడగా కృష్ణ అన్నాడు. క అంటే బ్రహ్మ. రు అంటే అనంతుడు. ష అంటే శివుడు. ణ అంటే ధర్మము. అ అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. ) ఆనాటి వ్యావహారిక భాషకు అద్దం పడుతుంది ఈ కీర్తన! సతులాల= సతులార. కతలాయ -=( గడసరి) కొదతీర=కొరత తీరగ ఇలాగే మరికొన్ని. తేట తెనుగు పదాలను ఎంతో ఇష్టంగా వాడుతూ మనోహరమైన వేలకీర్తనలను వ్రాసి మనసులనూయలలూపిన అన్నమాచార్యులవారికి తెలుగుజాతి ఋణ పడి ఉంటుంది. చిన్నకృష్ణునికి జన్మదిన శుభవేళ జేజేలు పలుకుదాం.
జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః| జయతు జయతు మేఘ శ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః||

స్వస్తి .

27, ఆగస్టు 2021, శుక్రవారం

కవి నీరజ్


కవి నీరజ్ - pencil drawing 

కవి నీరజ్ - ఒక టైపిస్ట్ గా జీవితం ప్రారంభించి పద్మభూషన్ వరకూ ఎదిగిన అతి సామాన్య వ్యక్తి. వీరి పూర్తి పేరు గోపాల్ దాస్ నీరజ్.


"ఖిల్తె హైఁ గుల్ యహాఁ ఖుల్ కె బిఖర్ నే కో" కవి నీరజ్ రచించిన ఈ పాట వినని హిందీ సినీ/సంగీత ప్రియులు ఉండరు. ఈ పాట ఎంతలా హిట్ అయ్యిందంటే ఈ బాణీని "నీ మది చల్లగా స్వామీ నిదురపో" అనే పల్లవితో 'ధనమా దైవమా" చిత్రంలో టీ.వీ.రాజు సంగీత దర్శకత్వంలో మనవాళ్ళు దిగుమతి చేసుకున్నారు.

నీరజ్ నిరుపేదలు, కూలీలు, శ్రామికుల మధ్య తిరిగాడు, వారితో పాటు టీ తాగుతూ, బీడీలు కాలుస్తూ, పేకాట ఆడుతూ వారి జనజీవనంలో ఓ భాగమయ్యాడు. హృదయాంతరాలలోకి వెళ్ళి వారి బాధల్ని అర్ధం చేసుకున్నాడు. వాటినే తన కవితలు, గజల్స్ రూపంలో ప్రతిబింబచేసాడు.

1955 సం.లో నీరజ్ రచించిన గజల్ “కార్వాన్ గుజార్ గయా” రేడియోలో ప్రసారం చేయబడింది, 1966 సం.లో. ఇది “నయీ ఉమర్ కి నయీ ఫసల్” చిత్రంలో చేర్చబడింది. ఈ పాట భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శకులైన ఎస్డీ బర్మన్, శంకర్ జై కిషన్, నటులు నిర్మాతలు దేవ్ ఆనంద్, రాజ్ కపూర్ వంటి దిగ్గజాలను నీరజ్ రచించిన గేయాలు, గజల్స్ ని విపరీతంగా ఆకర్షించాయి.

నీరజ్ రచించిన కొన్ని సూపర్ హిట్ పాటలు :

ఏయ్ భాయ్ జర దేఖ్ కే చలో (మీరా నామ్ జోకర్)
సప్న్ ఝరే ఫూల్ సే (నయీ ఉమర్ కీ నయీ ఫసల్)
కైసె కహేఁ హమ్ ప్యార్ నే హమ్ కో (షర్మీలీ)
మేరే మన్ ప్యాసా (గేంబ్లర్)
లిఖే జో ఖత్ తుఝే (కన్యాదాన్)
ఫూలోం కే రంగ్ సే (ప్రేమ్ పుజారి)
రంగీలారే తెరె రంగ్ సే (ప్రేమ్ పుజారి)
4 జనవరి 1925 సం.లో జన్మించిన నీరజ్ 19 జూలై 2018 సం.లో స్వర్గస్తులయ్యారు.

21, ఆగస్టు 2021, శనివారం

అమర గాయకుడు మహమ్మద్ రఫీ ఔదార్యం


 

నాకు తెలిసిన సినిమా కబుర్లు - తెర వెనుక కథలు

జగమెరిగిన అమర గాయకుడు మహమ్మద్ రఫీ.

జంజీర్ చిత్రం లో 'దీవానా హై దీవానోంకొ' super hit song అని మన అందరికీ తెలుసు. సంగీతం కళ్యాణ్ జీ ఆనంద్ జీ..కొన్ని takes తర్వాత ఈ పాట రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన అమితాబ్ బచ్చన్ పై పాటలు చిత్రీకరించలేదు. గాంభీర్యం తో నిండిన పాత్ర అది. హీరోకి పాటలు పెడితే ఆ పాత్ర ఔన్నత్యం చెడిపోతుంది. అందుకని street singers మీద ఓ పాట చిత్రీకరించారు. ఆ పాట, సన్నివేశం సూపర్ హిట్ అయ్యాయి.

అయితే ఈ duet లో తను సరిగ్గా పాడలేకపోయానని, మరొక take తీసుకుంటే బాగుంటుందని లతా మంగేష్కర్ అన్నారట. అది రంజాన్ మాసం. రఫీ గారు ఉపవాసంలో ఉన్న కారణంగా మరొక టేక్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ పాట రచించిన కవి గుల్షన్ బావ్రా కూడా మరొక్క take తీసుకుంటే బాగుంటుందనిపించింది. రికార్డింగ్ పూర్తి చేసి కారెక్కి వెళ్ళిపోతున్న రఫీ గారి వద్దకు పరుగెత్తుకుని వచ్చాడు గుల్షన్. మరొక్క take ఇవ్వమని అభ్యర్ధించాడు గుల్షన్. ససేమీరా ఒప్పుకోలేదు రఫీ గారు. 'ఈ పాట ఎవరిమీద చిత్రీకరిసున్నారో తెలుసా?' అని అడిగాడట గుల్షన్. తెలియదన్నట్లుగా అడ్డంగా తలూపాడు రఫీ. ఈ పాట తనమీదే చిత్రీకరిస్తున్నారని తెలియగానే రఫీ కొంత ఆశ్చర్యపోయి వెంటనే అంగీకరించాడట. అదండీ ఈ అద్భుతమయిన పాట వెనుక ఉన్న history.

20, ఆగస్టు 2021, శుక్రవారం

ఉత్పల్ దత్ - Utpal Datt


ఉత్పల్ దత్ - ఆటు నాటకరంగంలోనూ, ఇటు చలనచిత్ర రంగంలోనూ వివిధ రకాల పాత్రలు పోషించిన అద్భుత నటుడు (నా pencil drawing). తన నటనా ప్రాభవానికిగాను వీరికి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి.

వీరి గురించి వికీపీడియా చూసి తెలుసుకోవచ్చు.  వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడండి.


 

17, ఆగస్టు 2021, మంగళవారం

జడ పదార్ఢం కాదు జడ


జడ - Pencil sketch

జడ పదార్ఢం కాదు జడ - మరి జడ వెనుక ఎంత అంతరార్ధం ఉందో తెలుసా .. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు 'జడ' గురించి విపులంగా ఇలా చెప్పారట. (నా సేకరణ)

"స్త్రిల జడలలో మూడూ పాయలు ఉంటాయి. వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా!!!
జడలోని మూడు పాయలు ఇడా, పింగళ మరియు సుషుమ్న అనే మూడు నాడులకు సంకేతాలు. వెన్నెముకు సమాంతరముగా చివర వరకూ సాగే ఈ జడ మూలాధారమునుండి సహస్రారమునకు చేరుకొనే కుండలినీ సంకేతము.

జడ పై భాగము తలపై విప్పారిన పాము పడగవలే సహస్రార పద్మమునకు సాంకేతికము. మూడు పాయల ముడుల వలె ఇడా,పింగళ నాడులు పెనవేసుకు ఉంటాయి. అంతర్లీనముగా ఉన్న మూడవ పాయ సుషుమ్న నాడికి సంకేతము.

ఇంత ఆధ్యాత్మిక రహస్యాన్ని మన సంస్కృతి స్త్రీల జడలలో దాచింది. ఈ విధముగా స్త్రీలు కొన్ని స్త్రీలకు మాత్రమే కలుగు వ్యాధులనుండి వారి స్వయం రక్షణకు మార్గములు పొందు పరిచారు.
నాగరీకత పేరుతో ఇపుడు శిరోజములు అల్లుకొనకుండా, పెరిగినవి కత్తెర వేసి పొట్టిగా చేసుకొనుట జరుగుతున్నాది.

ఎంత దురదృష్టకరం.

(బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనములు)"

 

15, ఆగస్టు 2021, ఆదివారం

కవి ప్రదీప్ - దేశభక్తి పాటల రచయిత


 భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి గీతాల రచయిత

'కవి ప్రదీప్' ని స్మరించుకుందాం. (My pencil sketch of the lyrical legend)
కవి ప్రదీప్ (6 ఫిబ్రవరి 1915 - 11 డిసెంబర్ 1998). అసలు పేరు రామచంద్ర నారాయణ్‌జి ద్వివేది, ఆయన రచించిన దేశభక్తి పాట "ఏ మేరే వతన్ కే లోగోం" చైనా-భారత్ యుద్ధంలో అసువులుబాసిన భారతీయ సైనికులను ఉద్దేశిస్తూ రచించిన గేయం అత్యంత ప్రాశస్త్యాన్ని పొందడమే కాకుండా లతా మంగేష్కర్ ఈ పాట పాడినప్పుడు నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్ర భావోద్వేగంతో కంటతడి పెట్టారు.
వీరు స్వయంగా రచించి పాడిన పాట 'దేఖ్ తెరే సంసార్ కి హాలత్ క్యా హోగయి భగవాన్ కిత్నా బదల్ గయా ఇన్శాన్' ఓ సూపర్ హిట్.
బంధన్ (1940) చిత్రానికి అతని దేశభక్తి సాహిత్యానికి అతని మొదటి గుర్తింపు వచ్చింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలి స్వర్ణొత్సవ చిత్రం 'కిస్మత్' లో వారు రచించిన 'దూర్ హటో ఏ దునియావాలో" పాట ఓ పెద్ద సంచలనం సృష్టించడమే కాకుండా నాటి బ్రిటిష్ పాలకులను గడగడలాడించింది. వీరిని arrest చెయ్యాలని ఆదేశించిన కారణంగా కొన్నాళ్ళు ప్రదీప్ ఆజ్ఞాత జీవితం గడపవలసి వచ్చింది.
ఐదు దశాబ్దాల కెరీర్ వ్యవధిలో, కవి ప్రదీప్ దాదాపు 1,700 పాటలు మరియు జాతీయవాద కవితలు కొన్ని 72 చిత్రాలకు సాహిత్యంతో సహా వ్రాసారు, ఇందులో బంధన్ (1940) మరియు "ఆవో బచ్చో తుమ్హీన్ దిఖాయెన్" లోని "చల్ చల్ రే నౌజవాన్" వంటి ప్రభోదాత్మక, దేశభక్తి హిట్‌ పాటలు ఉన్నాయి. మరియు జాగృతి (1954) చిత్రంలో "దీ దీ హమే ఆజాది" 1958 తో పాటు 13 పాటల ఆల్బమ్‌ను HMV విడుదల చేసింది. అతను రాష్ట్రకవి (జాతీయ కవి) గా గుర్తించబడ్డాడు.
1997 లో జీవితకాల సాఫల్యానికి గాను 'దాదా సాహెబ్ ఫాల్కే' పురస్కారంతో భారతదేశం వీరిని సత్కరించింది. భారతీయ తపాలా శాఖ వీరి స్మృత్యర్ధం తపాలా బిళ్ళ విడుదల చేసింది.

13, ఆగస్టు 2021, శుక్రవారం

రేలంగి వెంకట్రామయ్య


 


తెలుగు చిత్రసీమలో నాటికీ నేటికీ తిరుగులేని హాస్యనటుడు 'రేలంగి'.. వారి మహత్తు గురించి టూకీగా నా స్నేహితులు నేను చిత్రీకరించిన 'రేలంగి' వారి చిత్రానికి చక్కటి పద్య స్పందన ఇచ్చారు. వారికి నా ధన్యవాదాలు.

కం.
రేలంగి హాస్య చతురత
కాలము గడచినను తలుప కడుపుబ్బించున్
రేలంగే నారదుడన
రేలంగియె సుబ్బిశెట్టి లేరిల సాటిన్

(నా చిత్రానికి మిత్రులు శ్రీ వేంకటేశ్వర ప్రసాద్ గారు రచించిన పద్యం)

నా చిత్రానికి చక్కని పద్యాలు రాసిన మిత్రులు, 'పొన్నాడ వారి పున్నాగవనం' వనమాలి డా. Vijayavenkatakrishna Subbarao Ponnada గారికి నా ధన్యవాదాలు)

'హాస్యరంగ' మందు 'ఔరా' యని , జనులు
మురిసి పోదు రయ్య , మొగము జూడ !
లేడు సమము నీకు ! లేడురా , 'రేలంగి' !
నిముసమయిన చాలు నిండు మనసు !
'గిరిజ' నీకు తోడు గిలిగింతలిడగాను ,
'ఇల్లరికము' లోన ఎంత హాయి !
'సూర్యకాంత' మున్న చూడ ముచ్చటగును !
నటన కాదు సుమ్మి నగవు లూట !

ఆటవెలది : హాస్యానికే హాస్యం నేర్పిన శ్రీ 'రేలంగి ' గారి జన్మ దిన సందర్భాన నా ఆటవెలదుల నివేదన

చక్రపాణి - సినీ, పత్రికా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయుడు


చిరస్మరణీయుడు 'చక్రపాణి'
(pencil drawing).

వారి గురించి సంక్షిప్తంగా ..

ఆలూరు వెంకట సుబ్బారావు (ఆగష్టు 5, 1908 - సెప్టెంబరు 24, 1975 ) (కలంపేరు 'చక్రపాణి') బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకడు. విజయవంతమైన విజయా చిత్రాల దిక్సూచి.

సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డితో కలసి1947 జూలై లో పిల్లల కోసం అత్యంత విజయవంతమైన 'చందమామ' కథల పుస్తకం ప్రారంభించాడు.

1934-1935 లో కొడవటిగంటి కుటుంబరావుతో కలసి తెనాలిలో యువ మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించాడు. రెండుసార్లు ప్రతిష్టాత్మకమైన filmfare పురస్కారాలు అందుకున్నాడు.

మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో .. courtesy 64 కళలు పత్రిక web magazine


10, ఆగస్టు 2021, మంగళవారం

ఆర్. డి. బర్మన్ - RD Burman


 

RD Burman, Pencil sketch

భారతీయ చలనచిత్ర సంగీతంలో తనకంటూ ఓ విశిష్ట స్థానం సంపాదించుకున్న అద్భుత సంగీత దర్శకుడు ఆర్. డి. బర్మన్.  నా pencil చిత్రం.


అద్భుత గాయని శ్రీమతి ఉషా మోహన్ రాజు గారు నేను వేసిన ఎన్నో చిత్రాలకు తత్సంబంధిత వ్యకుల పై చిత్రీకరించిన పాటలు గాని, సంగీతం అందించిన సంగీత దర్శకులు గాని పెడుతూ background లో తన గానం వినిపిస్తుంటారు. ఆర్.డి.బర్మన్ స్వరపరచిన ఓ గానం, నా చిత్రంతో, తను సేకరించిన వివరాలతో facebook లో పెడుతుంటారు. 

ఆమె పాడిన పాట క్రింది లింక్ క్లిక్ చేసి వినండి. ఆర్.డి. బర్మన్ గురించి తను సేకరించిన వివరాలు కూడా అందులో పొందుపరచడం ఓ విశేషం. ఉషా మోహన్ రాజు గారు చేస్తున్న ఈ కృషి ఇటువంటి విషయాలపై ఆసక్తి గలవారకి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఆమెకు నా ధన్యవాదాలు. శుభాశీస్సులు.


https://www.facebook.com/100002226885163/videos/1616673578530375/


సాలూరు రాజేశ్వరరావు - చలనచిత్ర సంగీత దిగ్గజం

నా పెన్సిల్ చిత్రం - రాజేశ్వరరావు గారి గురించి చాలా విషయాలు తెలియపరిచిన శ్రీ షణ్ముఖాచారి గారికి ధన్యవాదాలు .  _*ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ స...