24, సెప్టెంబర్ 2022, శనివారం

మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి

 


'మహామహోపాధ్యాయ' వైణికుడు ఈమని శంకరశాస్త్రి -



నా చిత్ర నివాళి

(వివరాలు WhatsApp ద్వారా సేకరణ.. అందించిన అజ్ఞాత వ్యక్తికి నా ధన్యవాదాలు)
ఆయన వేళ్లలో ఏదో తెలియని అమృతగుణం ఉంది
ఆయన ఆలోచనలో ఏదో తెలియని కొత్తదనం ఉంది
ఆయన వీణలో సాక్షాత్తు సరస్వతి కొలువై ఉంది
ఆయన వీణకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు
వీణ మీద సాంఘిక అంశాలను సైతం పలికించారు
వీణను అందరికీ చేరువ చేశారు...
ఆయనే మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి.
వీణానాదం శుభానికి ప్రతీక. వాస్తవానికి వీణ ప్రకాశించవలసినంతగా తెలుగునాడులో ప్రకాశించలేదనే చెప్పాలి. అటువంటి వీణకు అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లి, వీణానాదానికి వైభవాన్ని తీసుకువచ్చిన మహనీయుడు ఈమని శంకరశాస్త్రి. వీణ ధ్వని స్థాయి తక్కువగా ఉంటుంది. అందువల్ల... వేయి మంది కూర్చున్న సభలో, దూరంలో కూర్చున్నవారు వీణావాదం వినలేకపోయేవారు. ఆ కారణంగా వీణ కచేరీలకు శ్రోతలు అనుకున్న స్థాయిలో హాజరయ్యేవారు కాదు. వీణకు సరయిన ఆదరణ లేకపోవడం వల్ల, వీణను అభ్యసించేవారి సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ఈ రెండు కారణాల వల్ల వీణానాదనకు క్షీణదశ ఏర్పడింది. మైకులు అందుబాటులోకి వచ్చాక ఈ ధ్వనిని అందరూ ఇంపుగా వినగలుగుతున్నారు. సంగీత ముత్తుస్వామి దీక్షితార్ వీణ వాయించేవారని ప్రసిద్ధి. మహామహులెందరో వీణానాదం చేశారు. అయితే వారు మాత్రమే కీర్తిని సంపాదించుకున్నారు కాని, వీణకు ఘనత తీసుకురాలేకపోయారు. పరమశివుడు వీణ వాయించాడని ప్రతీతి. అటువంటి వీణకు ప్రఖ్యాతి తెచ్చినవారు ఈమని శంకరశాస్త్రి. శివుడే మళ్లీ జన్మించాడనో, మరే కారణమో కాని, ఆయనకు శంకరశాస్త్రి అని పేరు సార్థకం అయింది. మిగతా వాద్యపరికరాలతో సమానంగా వీణకు స్థాయి తీసుకువచ్చారు శాస్త్రిగారు.
1922, సెప్టెంబరు 23న, తూర్పుగోదావరి జిల్లా దాక్షారామంలో జన్మించిన శాస్త్రిగారు, వారి తండ్రిగారైన అచ్యుతరామశాస్త్రి గారి దగ్గర వీణ అభ్యసించి ఈ వాద్యాన్ని పూర్తిగా తెలుగువీణగా రూపుదిద్దారు. ఈయన విధానం ఎవ్వరికీ అనుకరణగా ఉండదు. వీణానాదంలో అతి సున్నితంగాను, అతి గంభీరంగాను... రెండువిధాలుగానూ ఆయన వీణానాదం ఉంటుంది. వీణ మీదే గిటారు, సితార్, గోటు వాద్యాలను పలికించేవారు. భారతదేశంలో కాంటాక్ట్ మైక్‌ను మొదటగా వీణకు వాడి, వీణానాదంలో నయగారాలు తెచ్చిన మొట్టమొదటి వైణికుడు ఈమని శంకరశాస్త్రి. లలితసంగీతం, శాస్త్రీయ సంగీతం... రెండింటినీ ఒకదానిలో ఒకటి సమ్మిళితం చేసిన ఘనత శాస్త్రిగారిదే. జెమినీ స్టూడియోలో వాసన్ గారి దగ్గర కొంతకాలం పనిచేసి, కొన్ని హిందీ సినిమాలకు, కొన్ని తెలుగు సినిమాలకు సంగీత దర్శకునిగా నిలబడగలగటానికి కారణం ఆయనలోని ఆధునికతే. ఆ తరవాత ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించారు.
సంగీతబ్రహ్మ త్యాగ్యం తన చివరి రోజులలో ‘మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు’ అనే కీర్తన పాడేవారని చరిత్ర చెబుతోంది. యాదృచ్చికమో ఏమో కాని, శాస్త్రిగారు గుంటూరులో చేసిన ఆఖరి కచేరీలో కూడా ఇదే కీర్తన వాయించారు. ఇక తన వీణానాదాన్ని అమరలోకంలో దేవతలకు వినిపించాలనుకున్నారో ఏమో 1986, డిసెంబరు 23న వీణాగానం చేస్తూ నారదునితో సంచారం చేయడం ప్రారంభించారు.



23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

సంగీత స్వరకర్త జైదేవ్

 



సంగీత స్వరకర్త జైదేవ్ - మూడు సార్లు జాతీయ పురస్కారాలు పొందినా అజ్ఞాతంగా తనువు చాలించిన అసమాన ప్రతిభావంతుడు.

సంగీత ప్రపంచంలో జైదేవ్ ఓ Unsung Hero. (కెన్యాలో 3 ఆగస్ట్ 1918 జన్మించాడు, మరణం 6 జనవరి 1987) - వారు స్వరపరచిన కొన్ని మచ్చుతునకలు :
"అభి నా జావో చోడ్ కర్ (Hum Dono)
"మైన్ జిందగీ కా సాథ్ నిభాతా చలాగయా" (Hum Dono)
"అల్లా తేరో నామ్,.." (Hum Dono)
"దో దివానే షెహర్ మే..." (Gharonda)
""తూ చందా మైన్ చాందినీ ... (Reshma aur Shera)
नदी नारे ना जाओ श्याम पैयाँ पडूँ (Muje jeene do)
రాత్ భీ హై కుచ్ భీగీ భీగీ" (Mujhe jeene do)
"యే దిల్ ఔర్ ఉన్ కీ నిగహోం కే సాయే" (Prem Parbat) etc.
మూడు సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న తొలి సంగీత దర్శకుడు జైదేవ్.
1961లో Hum Dono తో జైదేవ్ సంగీత ప్రియుల దృష్టిని ఆకర్షించాడు.
40 సినిమాలు మరియు దాదాపు 250 పాటలు ఉన్నప్పటికీ, ‘అన్‌సంగ్’ మరియు ‘జిన్క్స్డ్’ వంటి ట్యాగ్‌లు జైదేవ్‌ను వెనుకంజలో ఉంచాయి. సలీల్ చౌదరి, మదన్ మోహన్, రోషన్, వసంత్ దేశాయ్ వంటి మహానుభావుల సరసన చేరదగ్గ మహానుభావుడు.
వివాహం చేసుకోలేదు. ఒంటరి జీవితం. నెలకి ఎనభై రూపాయల అద్దె చెల్లించలేక తను ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చెయ్యాల్సి వచ్చింది. వారసులు లేరు. ఆస్థామా తో బాధపడుతూ అనాధ ప్రేతగా తనువు చాలించాడు. కాని అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

19, సెప్టెంబర్ 2022, సోమవారం

గురుతెరిగిన దొంగ కూగూగు వీడె | గురిలోనె దాగీనీ కూగూగు || - అన్నమయ్య కీర్తన


 

బొమ్మలు ః పొన్నాడ మూర్తి (బాపు బొమ్మలకు నకళ్ళు)


గురుతెరిగిన దొంగ కూగూగు వీడె | గురిలోనె దాగీనీ కూగూగు ||

|| నెలతల దోచీనీ నీళ్ళాడగానే | కొలని దరిని దొంగ కూగూగు |
బలువైన పుట్ల పాలారగించీనీ | కొలది మీరిన దొంగ కూగూగు ||

|| చల్లలమ్మగ చనుకట్టు దొడకీని | గొల్లెతలను దొంగ కూగూగు |
యిల్లిల్లు దప్పక ఇందరి పాలిండ్లు | కొల్లలాడిన దొంగ కూగూగు ||

|| తావుకొన్న దొంగ దగిలి పట్టుడిదె | గోవులలో దొంగ కూగూగు |
శ్రీ వేంకటగిరి చెలువుడో యేమో | కోవిదుడగు దొంగ కూగూగు ||

జానపదుల కోనం వారిశైలికనుగుణంగా వారి భాషవాడుతూ అన్నమాచార్యులవారు అసంఖ్యాకమైన కీర్తనలు చెప్పారు. ఆ మాటలు నేటి మన'ఆంగ్ల తెలుగు” మాత్రమే వచ్చిన మనలాంటి వారికి అర్ధంకావేమో.
వాడుకలో లేని కత్తి తుప్పు పట్టినట్లు 600 ఏళ్ళలో కొన్ని మాటలు నిఘంటువుల్లో కూడా కనుమరుగయిపోయాయి. 'కూగాగు అంటే సరియైన అర్ధం ఏమిటి? భాషమీద పట్టువున్న నా (సుబ్రహ్మణ్య దీక్షితులు గారి ) మిత్రులొకరి సూచనమేరకు కన్నడంలో 'కూగాగు' తెలుగులో 'దోబూచి గా అర్ధం చెప్పవచ్చు.

“గుఱుతెఱిగిన దొంగ అంటే జగత్‌ ప్రసిద్ధమైన చోరుడు అని అర్ధం
చెప్పుకోవచ్చు. వీడు జగత్‌ ప్రసిద్ధమైన దొంగ'దోబూచి. అంతేకాక ఈయన భక్తుల గుఱి లోనె (లక్ష్యములోనే) దాగియుందే కూగూగు (దోబూచి).
కొలనులో స్నానం చేద్దామని స్త్రీ లు నీళ్ళలో దిగగానే వాళ్ళ బట్టలను
యెత్తుకొనిపోయిన దొంగ కూగూగు ఇతడే. పెద్ద 'ఉట్లలో ఎత్తుగా కట్టిన పాలుకూడ తెలివిగా కాజేసిన అపరిమితమైన దొంగ కూగూగు ఇతదే. (మన తెలివితేటలు ఆయన చాకచక్యం ముందు పనిచేస్తాయా? ఎంత వెర్రివాళ్ళం మనం!!)
చల్లలమ్ముకోవటానికి గొల్లభామలు నెత్తిన చల్లకుండలు పెట్టుకొని నడుస్తుంటే
చనుకట్టు చలిస్తుండగా వాళ్ళవెంటబడి ఏడిపించే వాడే ఈ దొంగ కూగూగు.
వీరూవారని గాక రేపల్లెలో ప్రతి గోపిక స్తనవైభవాపహరణ ఈ దొంగ కూగూగే
గావించాడు. (ఎంత అదృష్టవంతులో!! సాక్షాత్తూ దేవతాస్రీలంతా, ఆ పురుషోత్తముని ప్రార్ధించి, వరముగా పొంది, గోపికలవలె జన్మించి ఆ సౌభాగ్యాన్ని పొందారట. అదికదా! జన్మ అంటే)
ఈ మహనుభావుడు (నేడు తిరుమలలో) నెలకొనిన దొంగ. ప్రయత్నించి
పట్టుకోండి (మీ తరమా?) గోవిందా అనండి. ఎందుకంటే ఈయన గోవులతో
సంచరించే దొంగ కూగూగు. శ్రీ వేంకటగిరి మీద స్థిరపడిన సుందరాకారుడో
ఏమో? అట్లా అయితే మాత్రం ఈ దొంగ కూగూగు జ్ఞానేశ్వరుడే. సందేహం లేదు.

భావం : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు

సేకరణ : గాన మాధురి - facebook group నుండి.

13, సెప్టెంబర్ 2022, మంగళవారం

మధురవాణి

 



కన్యాశుల్కం 'మధురవాణి'

మిత్రులు రజా హుస్సేన్ గారు నా చిత్రానికి facebook లో రాసిన అద్భుత వ్యాసం. వారికి నా కృతజ్ణతలు.


*సాని ' దానికి మాత్రం నీతుండొద్దా ?

‘మధురవాణి ' నోట గురజాడ ' సుభాషితం !!
గురజాడ వారు ఏ ముహూర్తాన “ కన్యాశుల్కం "నాటకం రాశాడో కానీ,ఆంధ్రదేశంలో దాని ప్రకంప
నలు ఇంతవరకూ తగ్గలేదంటే అతిశయోక్తికాదు. అందుకే ‘కన్యాశుల్కం‌'నాటికీ ,నేటికీ దృశ్యకావ్యం
గా నిలిచివుంది. మరోవందేళ్ళయినా ఈ నాటకం
సజీవంగానే వుంటుంది. నాటకంలోని నాటిసామా
జిక సమస్య ఇప్పుడు లేదు.ఈ సమస్య సమసి
పోయిచాలా కాలం అయింది.అయినా,ఈనాటకం
ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా వుందంటే దానికి
ప్రధాన కారణంనాటక కర్త ఇందులోని. పాత్రల్ని మలిచిన తీరు.!
కన్యాశుల్కం అనగానే నిలువెత్తు గిరీశం పాత్ర
మన కళ్ళముందు నిలుస్తుంది.అయితే “మధుర
వాణి "పాత్రే ఈ నాటకంలో సూత్రధారిలా కనిపి
స్తుంది. గిరీశం మాయలో పడి గురజాడ మధుర
వాణిని కాస్తంత నిర్లక్ష్యం చేశారనిపిస్తుంది.నాటకం ఆసాంతంలో ఆమె వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ఆవి
ష్కరించలేక పోయారు గురజాడ. అలాగని‌ పూర్తి
గానిర్లక్ష్యం కూడా చేయలేదు.మన చేతికి ....
"తీగ” ఇచ్చి, ఇక మీ ఓపిక.(లాగినోళ్ళకిలాగి
నంత ) ఊహించుకున్నోళ్ళకి 'ఊహించుకున్నం
త'అన్నట్లుమధురవాణిని తాకీ తాక కుండా చిత్రించారనిపిస్తోంది.
ఏదైతేనేం ?.....నా దృష్టిలో మధురవాణి
"జీనియస్ " లోకం తీరు తెలిసిన జాణ.!
కరటక శాస్త్రి ఆమెను “త్రిలోక సుందరి “ గా వర్ణిం
చడాన్ని బట్టి ఆమె అందచందాల్ని అంచనా..... వెయ్యొచ్చు".సొగసు కత్తెల అలకలో కూడా అదో శృంగారం “ అని రామప్ప పంతులన్నాడంటే ... మధురవాణి ఎంత'సొగసైన'దోఊహించుకోవచ్చు
ఆమె అంత అందగత్తె కాబట్టే శిష్యుడు మధుర
వాణి “ నవ్వులో పట్టుబడాలని “ శిష్యుడు కోరు
కోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.ఇక మధురవాణికి చదువు కూడా వుంది.గిరీశం దగ్గర కొంతకాలం ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల ఆమెకు విద్య కూడా వుందని నిర్థారించొచ్చు. ఆమెకు కేవలం ఇంగ్లీషే కాదు..సంస్కృతంలోని ‘ మృచ్ఛకటికం 'కూడా తెలుసన్న విషయం నాటకం చదివిన వారికెవరి
కైనా తెలుస్తుంది.’బుద్ధిమంతురాలైన తల్లి తర్ఫీ
దు వల్ల ఆమె విద్యావతి అయిందన్న ప్రస్తావన వుంది.” మా తల్లి ధర్మమా అని ,ఆమె నా చెవిలో గూడు కట్టుకొని బుద్ధులు చెప్పబట్టి “ తానింత దానైనట్లు" మధురవాణే చెబుతుంది.
ఇవన్నీ ఓ ఎత్తయితే ..లో మధురవాణి వ్యక్తిత్వం ఒక యెత్తు.కన్యాశుల్కం నాటకంలో కులానికి తక్కువైనాగుణానికి ఎంతో యెక్కువ. ఈ నాట
కంలో మధురవాణి కీలకమైన పాత్రే కాదు....! మొత్తాన్ని ఓ మలుపు తిప్పిన పాత్ర.ముఖ్యంగా ఆమె లౌక్యం గురించి చెప్పుకోవాలి.
గిరీశం కథను తారుమారు చేయాలని చూసినపు
డు ఆమె 'చక్రం ‘ అడ్డువేసి బుచ్చమ్మను ప్రమాదం
నుంచి కాపాడుతుంది.మరో మాట నాటకంలో పాత్రల మధ్య 'చిక్కు'వేసేది ఆమే,'చిక్కు ‘ విడగొ
ట్టేది ఆమే.రామప్ప పంతులు లౌక్యాన్ని, , కరటక శాస్త్రికార్యాలోచనను,గిరీశం సమయ స్ఫూర్తిని మిక్స్ చేసి గ్రైండర్ లో వేసి నూరితే వచ్చిందే ' మధురవాణి ' పాత్ర.!
‘వేశ్య'అనగానే చులకన,హేయ భావం స్ఫురిస్తుం
ది.సమాజంలో వేశ్యలది అథమస్థానం. అయితే మధురవాణిని చూసిన వారు ‌మాత్రం ‌ ఈ అభి
ప్రాయాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు.మధుర
వాణి వృత్తి చేత వేశ్య. అవకాశం వున్న మేరకు విటులవద్ద నుంచి‌సొమ్ము లాగుతుంది.అదివేశ్యా
ధర్మం.అంత మాత్రం చేత మధురవాణికి దయా
దాక్షిణ్యాలు సున్న అని తలవరాదు వేశ్యల్ని చుల
కనగాక చూసేవాళ్ళకు మధురవాణి మంచి చురకే అంటించింది.
"వేశ్య అనగానే అంత చులకనా ! పంతులు గారు .? సానిదానికి మాత్రం నీతి వుండొద్దా ?
అంటూ...ఎదురు ప్రశ్నిస్తుంది.
అసలు ఈ పాత్ర సృష్టి కర్త గురజాడ వారి అభి
ప్రాయం ఇది.గురజాడ వారు 1909 లో వంగ
వోలు ముని సుబ్రహ్మణ్యం కు రాసిన లేఖలో... వేశ్యల పట్ల తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
"వేశ్యలో మానుషత్వాన్ని మరిచిపోకండి. ఆమె
సుఖదుఃఖాలు మీవిగాని,నావిగాని అయిన సుఖ
దుఃఖాలకుప్రాముఖ్యతలో తీసిపోవు.సంఘంలో లెక్కలేని వ్యభిచారులైనా భర్తలు,భార్యలూవున్నా
రు.స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే వేశ్య...
వారందరికన్నా అథమురాలెట్లా అవుతుంది?
పైగా వేశ్య ఏ వివాహ ప్రమాణాన్నీ భగ్నంచేయడం
లేదు వీళ్ళవలె.”.!!
పై అభిప్రాయంతోనే మధురవాణి పాత్రను గుర
జాడ సృష్టించారు.అంతే కాదు కన్యాశుల్కం
నాటకంలో మధురవాణి పాత్రకు ఎంత పెద్ద పీట వేశారో చూడండి.
"మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి
యీకళింగ రాజ్యంలో వుండకపోతే భగవంతు
డి సృష్టికి ఎంత లోపం వచ్చి వుండును‌".
అని ఓ సందర్భంలో... కరటక శాస్త్రి చేత చెప్పిస్తాడు గురజాడ.
మరి సానిది అంటే ...ఒళ్ళమ్ముకునేదేనా?
సానిదానికి మాత్రం ప్రేమ ,వలపు వుండదా?
అంటేదానికీ మధురవాణినే ఉదాహరణగా నిలబెట్టాడు గురజాడ. సౌజన్యారావును
మనసు పడుతుంది.ప్రేమిస్తుంది‌ మధురవాణి.
అయితే తన ప్రేమను వలపును వ్యక్తీకరించడా
నికి వృత్తి న్యూనత అడ్డొస్తుంది.అందుకే మనసులో ఇలా అనుకుంటుంది మధురవాణి.” సానిదాని వలపు మనసులోనే మణగాలి “.!!
మధురవాణికి మనసూ,రూపం మాత్రమే కాదు.
స్నేహం ,ప్రేమా కూడా వున్నాయి.శృంగారం వన్నె
చెడినదగ్గర్నుంచి బంగారం కదా తేటుతేవాలి?
ఆ బంగారాన్ని కరటక శాస్త్రికి ధారపోసింది.ఆమె స్నేహం ఎన్ననేల? ఇక వలపా? పాపం ఆమెకి
బ్రతుకే లేదు.హెడ్డు కానిస్టేబుల్ దగ్గర్నుంచి సౌంజ్ఞ చేసేవాడే.అసిరిగాడి దగ్గర్నుంచి పంతులు ఇంట్లో లేనప్పుడల్లా కనిష్టీబు మధురవాణితో వుంటాడ
ని చెప్పి నానా... యాగీ పెట్టే వారే.ఈగల్లాగ ముసి
రే మగరాజులందరిలోనూ ఆమె హృదయాన్ని చూరగొన్నది ఒక్క కరటకుడి శిష్యుడుమాత్రమే.!
"ఈ చిల్లంగి కళ్ళు నీకేదేవుడిచ్చాడని ",?
వాడ్ని ముద్దు పెట్టుకుంటుంది మధురవాణి.
సౌజన్యారావును పట్టి మంచిదాన్ననిపించుకుంది.
మొత్తానికి ' సానిదానిక్కూడా నీతి వుంటుందన్న' విషయాన్ని గురజాడవారు. 'మధురవాణి ' పాత్ర
ద్వారా బహుచక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు గురజాడ.
*దటీజ్ గురజాడ !!
చిత్రం...పొన్నాడ మూర్తి.
*ఎ.రజాహుస్సేన్!
హైదరాబాద్.

9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

"ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు" - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు" _డా. Umadevi Prasadarao Jandhyala
గారి వివరణతో

చిత్రం : పొన్నాడ మూర్తి
——🌺🌺——
ఓం నమో వేంకటేశాయ 🙏
ఒక ప్రార్థన పద్యం
ఉ॥
స్వాంతము పొంగ కన్గవకుఁబండువుగాగ ప్రభూ విలాస విక్రాంత పరావరాలయముఁబ్రహ్మ ముఖామర పూజితంబు దు
ర్దాంత దురంత దుఃఖములఁగ్రన్నన మాన్పుచు భక్తపాళికిన్
సంతసమిచ్చు నీ చరణసారసమున్ దరిసించుటెన్నడో !
(శ్రీ ముదివర్తి కొండమాచార్యులు)
🔷అన్నమయ్య కీర్తన లిరిక్స్
~~~~~~~~~~~~~~~
ప॥ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
చ॥
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు!
🔹కీర్తనకు చిత్రము వేసిన శ్రీ PVR మూర్తిగారికి ధన్యవాదములు.
🔸తెలిసినంత మేరకు నా వివరణ
*******************
స్వామీ! నీటికొలది తామర వలే మా ఆలోచనలను బట్టే మాకు భగవత్తత్త్వము అర్ధమౌతుందంటూ అన్నమయ్య ఈ కీర్తనలో ‘చేసుకున్న వారికి చేసుకున్నంత’అనే నానుడి గుర్తు చేస్తూ పరతత్త్వాన్ని బోధిస్తున్నాడు।
ఎవరు ఏరూపులో నిన్ను చూడదలిస్తే ఆ రూపులో కనబడతావు. ఎవరు ఎంత మాత్రం తలిస్తే అంత మాత్రమే భగవత్ప్రసాదం అందిస్తావు. నది దగ్గరకు మనం ఏపాత్ర తీసికొని వెళితే ఆపాత్ర వరకే నీరు తెచ్చుకోగలిగినట్లు నిన్నెంతమాత్రం పూజిస్తే అంత ఫలితం పొందుతాము. పిండికొద్దీ రొట్టె అన్నట్లు మా నమ్మకం కొద్దీ, మా భక్తికొద్దీ ఫలితం అందించే వాడవు నీవు.
వైష్ణవులు మనసారా నిన్ను విష్ణువని పూజిస్తారు.వేదాంతులు పరబ్రహ్మ అంటారు. శైవులు శివుడవని, శాక్తేయులు శక్తి స్వరూపమని, కాపాలికులు ఆదిభైరవుడని నిన్ను తలుచుకుంటారు. ఏపేరుతో పిలిచినా, ఏతీరుగా పూజించినా తలచినవారికి తలచినట్లు, కొలిచిన వారికి కొలిచినట్లు దర్శనమిచ్చే స్వామివి. అల్పబుద్ధులకు వారి ఆలోచనకు తగినట్లే ఉండగలవు. ఘనమైన బుద్ధిగలవారికి ఘనుడవుగానే ఉంటావు. నీ లోపం కాదది. గంగానది ప్రక్కనున్న బావులలో ఉండేది గంగాజలమే కదా. అదే విధంగా మాకు చేరువైన దైవము వేంకట పతి అయినప్పుడు, నిన్నే శరణు కోరినప్పుడు మాలో ఉండేది నీవే. ఇదే పరతత్వము .
~~~~~~~~~~~~~~
డా.ఉమాదేవి జంధ్యాల


 

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...