31, జనవరి 2021, ఆదివారం

నవ్వకే నా చెలీ... గజల్

డా. Umadevi Prasadarao Jandhyala గారి గజల్ కి  నా చిత్రం.  ఉమాదేవి గారికి నా కృతజ్ఞతలు.

గజల్ -- ( అంత్యప్రాస )

~~~~~~~~~


నవ్వకే  నాచెలీ ఎద గుబులు  చెందగా ! 

ఆ నవ్వు మత్తులో ననునేను మరువగా !


పూసే గులాబీలు చెక్కిళ్ళపై చూడు 

వ్రాసేను ఎదపైన ఓకవిత కమ్మగా !


ఎంచకే దోషాలు నమ్మవే నామాట 

పంచవా నీ ప్రేమ రేబవలు తీయగా ! 


తేటినని అనుకోకు నినువీడి పోనులే 

మనసులో మనసునై ఉందునే తోడుగా 


ఏనాటి బంధమో  కసిరినా మరలనే 

నీమేని గంధమై నిలుతునే చల్లగా !


నాదేవి నీవనీ గుడికట్టి గుండెలో 

దీపాలు వెలిగింతు కలలన్ని పండగా !


నాహృదయరాజ్ఞివై నాసేవలందుకో 

సూర్యచంద్రులె సాక్షి , ఉంటాను జంటగా ! !

~~~~~~~~<

 

29, జనవరి 2021, శుక్రవారం

విజయనగరం నేల





విజయనగరం ఓ మహా నగరం కాకపోవచ్చు. కాని చారిత్రక విశిష్టత కలిగిన నగరం. వివిధ కళలను పోషించి 'కళలకు కాణాచి' గా పేరొందిన నగరం. ఈ నగర ప్రతిభని facebook గ్రూపు 'The Golden Heritage of Vizianagaram' వారు ఎందరో దృష్టికి తీసుకువచ్చి నాలాంటి ఆసక్తి గల వ్యక్తులకు మహోపకారం చేస్తున్నారు. ఈ రోజు మిత్రులు శ్రీ రమణమూర్తి గారు ఓ చక్కని కవిత రాశారు.వారి అనుమతితో ఇక్కడ వారి రచనను పోస్ట్ చేస్తున్నాను.




...... విజయనగర నేల......
#################₹
మూడువందల వత్సరాల
చరిత్ర కు చెదరని జ్ఞాపకం
కుమిలి మట్టికోటరాజ్యానికి
గట్టిరాతి కోటనిచ్చిన నేలయిది
బొబ్బిలి యుద్ధ నల్లమరక ను
పద్మనాభయుద్ధరక్తం తో కడిగి
కోటను పునీతచేసిన నేలయిది
తల్లిపైడిమాంబ చల్లనిచూపు
జనులకిచ్చిన దైవభూమి ఇది
తెలుగుభాషకు "దిద్దుబాటు" కధ తో
కధాతిలకం దిద్దిన కధల భూమియిది
హరికధల ఆదిపురుష ఆధిభట్ల
సంగీత స్వరూప గానపాఠశాల
బొమ్మలువేసే పైడిరాజుగారి కుంచె
నాయుడుగారి వాయులీన కమాన్
సర్ విజ్జీ క్రికెట్ క్రీడా పతాకమెగిరిన నేల
సంపత్కుమార్ నాట్యమాడిన నేల
చదువులతల్లి గుడులున్న భూమి
సమయసూచికైన గంటస్తంభం
చంపావతి నది మధుర ఉదకం
అప్పలకొండమాంబ జలదానరూపమై
నలుగురి దాహార్తిని నాశనం చేసిన నేల
నిలిచిన్ కదా ఈ నేలనందే ఈనేలనందే
ఇల "విజయనగరంబని" పేరొందిన నేల
దశదిశలాఖ్యాతి గాంచిన నేల ఇదేనేల
నేనిష్టపడే మా "విజయనగరం" నేల.





 

24, జనవరి 2021, ఆదివారం

జాతీయ బాలికా దినోత్సవం -



కంటికి రూపం,ఇంటికి దీపం,,మమతకు అపురూపం..నిండు గుండెకు ఆడపిల్లే మణిదీపం..





విద్యా విజ్ఞానాలే తోడుగా
ఆటంకాలను అధిగమిస్తూ
ఆత్మవిశ్వాసమే తరగని బలంగా
ఆశయాలను సాధిస్తూ
నీభవితను నీవే తీర్చిదిద్దుకో
నేటి బాలికా నీవే రేపటి ఏలిక..!!

(అనూశ్రీ)

జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.

ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది.

నాటి ఆడపిల్లే రేపటి సృష్టికి మూలమైన అమ్మ.. సృష్టికి మూలం స్త్రీ. ఆడపిల్ల భారం కాదని, అవకాశాలు అందిస్తే ఆకాశమే హద్దుగా ముందుకుపోతామని అనేకమంది మహిళలు నిరూపించారు. జాతికా బాలికా దినోత్సవం సందర్భంగా బాల్యదశా నుండే ఆడపిల్లలను అన్ని విషయాలలో ప్రోత్సహించి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం.


(నేను వేసిన చిత్రాలతో పాటు నేను సేకరించిన మంచి విషయాలు, అభిప్రాయాలు. నా చిత్రానికి కవిత రాసిన 'అనూశ్రీ' కి నా శుభాశీస్సులు.)
 

21, జనవరి 2021, గురువారం

ఎన్టీఆర్ - ఏయన్నార్ - ఇద్దరూ ఇద్దరే



తెలుగు చిత్రసీమను ఏలిన ఇద్దరు మహానటులు. వారి గురించి ఓ చక్కని వ్యాసం 'సాక్షి' దినపత్రిక సౌజన్యంతో, ఈ క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చదవండి. నా pencil తో ఆ మహానటుల చిత్రాలు.








 

13, జనవరి 2021, బుధవారం

అంజలీ దేవి - Telugu actress 'Anjali Devi' (pencil sketch)


 ఆంజలీ దేవి (నా pencil sketch)

మిత్రులు డా. ప్రసాద్ కెవియస్ గారు నటీ నటుల గురించి సమగ్ర వివరాలు అందిస్తుంటారు. చాలామందికి తెలియని విషయాలు తెలియజేస్తుంటారు. ఆనాటి ప్రముఖ నటి అంజలీ దేవి గారి గురించి వారేం చెప్పారో చూద్దాం.


ఓ ప్రఖ్యాత నటుడు...అన్నమాట ఇది.

100 మార్కులు......నటన పరంగా పంచవలసివస్తే.....మహానటి సావిత్రి కి ఎన్ని ఇస్తారు?.....అంజలీదేవి గారికి...ఎన్ని ఇస్తారు?.....
అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులుగా....
ఆ నటుడు అన్న మాట ఇది.
సావిత్రి గారికి 49 అండి.....అంజలీదేవి గారికి 51 అండి....అన్నాడాయన.
అదేమిటండి? అందరూ సావిత్రి ని మహానటి అని ఆకాశానికెత్తేస్తుంటే...మీరు అంజలీదేవి గారిని...ఓ మెట్టు పైనుంచారే! ఆశ్చర్యంగ ఉంది!....
అన్న ఆ యాంకర్ ప్రశ్నకు....
అవునండి...నటనలో చూస్తే సావిత్రి గారిదే పై చేయి అనవచ్చు. కానీ ఒక్కసారి...ఇద్దరి కెరీర్ పరికిస్తే....అంజలీదేవి గారి వర్సటైలిటీ అర్థం అవుతుంది.
చిత్రసీమలో వ్యాంప్ వేషాలతో ప్రవేశించి.....సాత్విక వేషాలకు...సతీమతల్లి పాత్రలకు ప్రాణం పోసి...తెలుగింటి సీతమ్మ అనిపించుకుని....నీరాజనాలందుకుని....
తిరిగి...తన ప్రక్కన హీరో వేషాలేసిన అక్కినేని, ఎన్.టి.ఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్....లాంటి హీరోలకు...వదిన, అక్క,....
చివరికి తల్లి పాత్రలు కూడా వేసి మెప్పించిన గొప్ప నటీ మణి.
మరొకరికి ఈ క్రెడిట్ ఉంటుందని అనుకోను.ఏదో ఒకటి రెండు మూవీస్ కాదు....సెకండ్ ఇన్నింగ్స్ అంటూ లేకుండా...
ఓ జీవనది లా సాగిపోయిందావిడ గారి నట జీవితం.
పైగా....ఎన్ని అవస్థలు పడ్డా నిర్మాత గా కూడా సక్సెస్ అయ్యారు అంజలీదేవి.
అందుకే....అంజలీదేవి గారికి 51 ఇచ్చాను. సావిత్రి గారికి 49...అన్నారాయన!
**********
వాంప్ వేషాలేసేవాళ్ళే...హీరోయిన్ వేషాలూ వేసేయగలరా!? అని డౌటనుమానమొచ్చేసింది!
ఏదీ....జయమాలిని నో....జ్యోతిలక్ష్మినో పెట్టి....సతీ సుమతో...సతీ సక్కుబాయో....తీసుండొచ్చుకదా! అయినా...ఏ వేషం వేసే వాళ్ళు...ఆ వేషం....అని బ్రాండ్ వేసేస్తారు!
రజనీకాంత్....రాఘవేంద్ర స్వామి వేషమేస్తే....ఎవరు చూశారు?!
అలాంటి బ్రాండింగ్ నుండి...తప్పించుకుని...
ఆల్ రౌండర్ అనిపించుకున్న ఘనాపాటి మన తెలుగింటి సీతమ్మ...కీ.శే. అంజలీ దేవి గారు.
***********
ఏం...ఎందుకని?....ఈ సిగ్గెందుకని!...
ఆలుమగల మధ్య నున్నది ఎవరికి తెలియదని!.......
సృష్టిలో ప్రతి జీవికి....ప్రకృతే నేర్పిస్తుంది. మనిషి ఒక్కడిని చూస్తేనే భలే వింతగా ఉంటుంది!
నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుందో....అని......తలనెరిసిన ముసలివాడు కూడా...చూడాలనుకుంటాడు!
ఇక స్త్రీ ఒంపుసొంపుల ప్రదర్శన ఈ నాటిది కాదు!
కానీ ఈ మధ్య సినిమా మరీ వింత పోకడలు పోతోంది!
నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ & ప్రైం మూవీస్...లో స్ట్రీం అవుతున్న వెబ్ సీరీస్ & బాలీవుడ్ మూవీస్ కొన్ని చూస్తే....ఆ తరం వాళ్ళే కాదు! ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి చూడలేం!
న్యూడిటీ...ఊపులతో సహా చూపితే తప్ప పాపులారిటీ రాదనుకుంటే ఎలా?
ఈగలకు, దోమలకు, పక్షులకు & జంతువులకు కూడా తెలుసు....ఆడ - మగ మధ్య ఏం జరుగుతుందో అని!
మనిషికి మాత్రమే ఉన్న బలహీనత ఇది! అన్నీ తెలిసీ..... అదేదో....అపురూపంగా....అద్భుతంగా....ఆరాటంగా చూడటం!
************
1947 లో తెలుగు చిత్రసీమలో ఓ అందాలభామ తెరమీద....
తన హావభావ విన్యాసాలతో....మత్తుగొలిపే వలపు చూపులతో ప్రేక్షకులను సమ్మోహితురాలిని చేసింది...మోహిని వేషంలో.
చిత్రదర్శకులు...సి.పుల్లయ్య గారు...ఆ కాలంలోనే తొలి ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు.
అసలే క్రొత్తమ్మాయి! కంగారుపడిపోతున్న తనకు...ధైర్యం చెప్పి....
ముద్దు సన్నివేశాన్ని....ఏ యాంగిల్ లో చిత్రీకరిస్తారో వివరంగా చెప్పి...ఒప్పించారు. సీన్ అద్భుతంగా పండింది.
చిత్రం కూడా విజయ ఢంకా మ్రోగించింది. అదే 1947లో రిలీజ్ అయిన గొల్లభామ మూవీ.
అలా కేవలం గ్లామర్ డాల్ వేషాలకు....వ్యాంపిష్ వేషాలకు మాత్రమే పనికొస్తుందనుకున్నారు ఆవిడను!
అందుకే... బాలరాజు & మదాలస లలో అలాంటి పాత్రలనే పోషించారావిడ.
ఆవిడ గారే....అంజలీదేవి గా ప్రసిధ్ధి చెందిన అంజనీ కుమారి.
ఆ తరువాత 1949 లో కీలుగుర్రం లో అలాంటి వ్యాంపిష్ పాత్ర....మూవీకి కీలకమైన భువనసుందరి(భూతం పాత్ర) పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిందావిడ.
దాంతో ముద్ర వేసేశారు....వ్యాంప్ గా!
************
మొదట షూటింగ్ లో చూసినప్పుడు అక్కడ ఉన్నవారావిడను చూసి ఆశ్చర్యపోయారు!
వెతికి వెతికి...ఇంత పొట్టి అమ్మాయిని ఎక్కడ నుండి పట్టుకొచ్చాడురా మన పెద్దాయన. పైగా మోహిని వేషానికి!?..
ఇవి ఆవిడ మొట్ట మొదటి మూవీ..గొల్లభామ షూటింగ్ లో చుట్టుప్రక్కల జనం అనుకున్న మాటలు.
ఆ పెద్దాయన చిత్తజల్లు పుల్లయ్య గారు.సినిమా పులి...నాన్న గారు..ఇలా ఎన్నో బిరుదులుండేవి వారికి.
ఆ అన్న వాళ్ళకేం తెలుసు ఆవిడ అప్పటికే...కాకినాడ యంగ్ మెన్స్ హాపీ క్లబ్ మెంబరని...
థియేటర్లో ఎన్నో నాటకాలు...ఎస్.వి.ఆర్, రేలంగి, సూర్యకాంతం ఇత్యాది నటులతో కలిసి నటించారని!
ఆ క్లబ్ లోనే పరిచయమైన ఆదినారాయణరావు గారిని పెళ్ళాడి.. బిడ్డ ను కని..పెంచుతున్న తల్లి అని!
ఆదినారాయణ రావు గారికి అప్పటికే పెళ్ళై పిల్లలున్నా....
అంజలీదేవి ఆయన్నే....వివాహం చేసుకున్నారు!
ఇలా నటీ మణులు....రెండవ పెళ్ళి వారినే ఎక్కువగా చేసుకుంటారెందుకని!
బాలీవుడ్ యాక్టర్ శత్రుఘన్ ను అడిగితే....ఏముంది!....ఏ ఉద్యోగానికైనా పూర్వానుభవం అడుగుతారు కదా! ఇదీ అంతే....అని చమత్కరించాడు.
వారి భవిష్యత్తు కు భరోసా ఉంటే....ఎవరినైనా పెళ్ళాడుతారు.
దేనికైనా కావలసింది నమ్మకం. అంతే!
*************
చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ కు లోనవుతుంటారు....ఈ తరం తారలు కొందరు.
కానీ 1949 లోనే....ఇక అంజలీదేవి పని అయిపోయింది. ఆమె తెర జీవితం ముగిసినట్లే....అని అనుకున్నారు అందరూ.
దానికి కారణం ఓ అగ్ని ప్రమాదం.
1949 లో గొల్లభామ నే తమిళం లో మంగయార్ కరసి అని తీస్తూ....మోహిని రోల్ మళ్ళీ అంజలీదేవి కే ఇచ్చారు.
ఓ సన్నివేశంలో అగ్ని కీలలు దహిస్తున్నట్లు చూపాల్సొచ్చింది.
వెలుగుతున్న కాగడాల మీద....నోటిలో పుక్కిట పట్టి....కిరోసిన్ ను జూనియర్ ఆర్టిస్టులు కొందరు....వాటిపై వేగంగా విరజిమ్ముతారు నోటినుండి.
టైమింగ్ సరిగా లేక....అంజలీదేవి సీన్లో కాగడాకు....అతి దగ్గరగా ఉండగానే....ముఖం మీదకు మంటలు ఎగిసేలా రావడం తో....ముఖం కాలి....స్పృహ తప్పి పడి పోయారు.
హాస్పిటల్ లో 3 నెలలున్నాక.....కోలుకుని మళ్ళీ నటించడం....కేవలం దైవకృపగా చెప్పేవారు ఆవిడ!
************
1950లో వచ్చింది బ్రేక్...శ్రీలక్ష్మమ్మ కథ రూపంలో.
శోభనాచలా వారితో పోటీగా ప్రతిభా ఘంటసాల బలరామయ్య గారు అదే కథ తో నిర్మించారు.
అబ్బే...వాంప్ వేషాలేసుకునే ఆవిడకు పతివ్రత వేషమా!..ఆడినట్లే! అనుకున్నారు.
కృష్ణవేణి గారి లక్ష్మమ్మ కు లాభాలొచ్చాయి.
శ్రీ లక్ష్మమ్మ కథ తో తెలుగుతెరకు క్రొత్త నాయిక దొరికింది అంజలీ దేవి రూపంలో.
పల్లెటూరిపిల్ల, స్వప్నసుందరి, మాయారంభ, నిర్దోషి, సర్వాధికారి, మాయలమారి, స్త్రీ సాహసం (1951)...
టాప్ పొజిషన్ నాయిక గా మారిపోయింది.
నాట్యం పెద్దగా రాదు.అని కొందరి ఆక్షేపణ.
అయితే ఏం...ఆ ముఖారవిందం లో పలికే హావ భావాలు....నటన అద్భుతం అనేవారు మరికొందరు.
ఎవరేమన్నా....1953 వచ్చేటప్పటికి హిందీ రంగంలో లడ్కీ అనే మూవీ కూడా చేసింది.
***********
అప్పట్లో కన్నాంబ, కృష్ణవేణి, భానుమతి,ఎస్. వరలక్ష్మి, షావుకారు జానకి వంటి నటీమణలే కాక....
ఆ తరువాత వచ్చిన....సావిత్రి, కృష్ణ కుమారి, జమున...లాంటి తారలు మరో ప్రక్క దూసుకొస్తున్నా....
తనకంటూ....ఓ ప్రత్యేకబాణీని...పరిపూర్ణ శైలిని సంతరించుకుని....తన స్థానం సుస్థిరం చేసుకున్న ఉత్తమ నటీమణి శ్రీమతి. అంజలీదేవి.
ప్రాథాన్యత ఉంటే చాలు. ప్రక్కన హీరో ఎవరు?....అనికూడా ఆలోచించేవారు కారు!
నిర్ధోషి(1951) లో ముక్కామలకు....ప్రక్కింటి అమ్మాయి(1953) లో రేలంగి కి జోడీగా నటించి.....విజయం సాధించారు.
అన్ని భాషలలో కలిపి షుమారు 450 పైచిలుకు సినిమాలలో నటించారు.
నిర్మాతగా....భర్త ఆదినారాయణరావు గారి సహకారంతో...అన్ని భాషలలో కలిపి 27 సినిమాలు నిర్మించారు.
************
మైలురాయి గా నిలిచిన పాత్ర లవకుశ లోని సీతాదేవి. తెలుగు వారి సీతమ్మ గా అంజలీదేవి పేరు మారుమ్రోగిపోయింది.
ఎక్కడకెళ్ళినా...ఎంతో ఆరాధనతో...సీతమ్మవారిలాగే భావించేవారు ప్రజలు.
ఆస్తి పన్ను వ్యవహారంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు!
తనను తాను మలచుకుని......
తనతో హీరోలుగా నటించిన ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ లకు కూడా తల్లి, వదిన లాంటి పాత్రలు ధరించి మెప్పించిన ఘనత అంజలీదేవిది!
వారు నటించిన చివరి చిత్రం పోలీసు అల్లుడు(1994).
*************
కరుణా మూర్తిగా ఎన్నో పాత్రలను అద్భుతంగా పోషించిన అంజలీదేవి గారు....నిజ జీవితంలో కూడా...అందరితో ఎంతో ఆప్యాయతతో ఉండేవారు.
చిత్ర రంగంలో పతనమైపోతున్న విలువల గురించి...ఆవేదన వ్యక్తం చేసేవారట.
నిర్మాత కె.మురారి గారు....తన ఆత్మకథలో వ్రాసుకున్న సంఘటన ఒకటి ఇక్కడ చెప్పాలి.
అవి... కళ్యాణ మంటపం...షూటింగ్ జరుగుతున్న రోజులు. కె.మురారి గారప్పుడు....విక్టరీ. మధుసూధనరావు గారికి అసిస్టెంట్ డైరెక్టర్.
సెట్లో పైనుండి....ఓ పెద్ద లైట్ క్రింద నుంచున్న మురారి గారిమీద పడింది. రక్తం కారుతుంటే....
సీన్లో నటిస్తున్న అంజలీదేవి గారు...పరుగున వచ్చి...మేకప్ బాక్స్ లోని ఐస్ ముక్క తీసి....చీర చెరగులో పెట్టి...తల మీద తగిలిన గాయం మీద అద్దుతూ....
అబ్బా ఎంత పెద్ద తగిలింది నాయనా....అంటూ....బాధ పడుతుంటే....దర్శకుడు మధుసూధనరావు గారు...ఉన్న చోటే ఉండి....
అబ్బా...చీరచెరగంతా తడిచి పోయింది. కంటిన్యుటీ దెబ్బతింటుందే!......అంటూ విసుక్కున్నారట!
ఎవరి బాధ వారిది! కొన్ని సంఘటనలు....వ్యక్తుల నిజరూపాలను బహిర్గతం చేస్తాయి. అంతే.
************
అవార్డుల విషయానికోస్తే....4 ఫిల్మ్ అవార్డులు(అనార్కలి, సువర్ణసుందరి, చెంచులక్ష్మి & జయభేరి),...
రఘుపతి వెంకయ్య అవార్డ్- 1994,
నాగార్జున యూనివర్సిటీ - డాక్టరేట్
&
ఎ.ఎన్.ఆర్. నేషనల్ అవార్డ్- 2008....ముఖ్యమైనవి.
వ్యక్తిగతమే అయినా పేర్కొనాలి....పుట్టపర్తి సత్యసాయి బాబా వారికి...షిర్దీ సాయిబాబా గారికి...భక్తురాలు కావడమేకాదు!
కోట్ల ఖరీదు చేసే ఎకరాల స్థలాన్ని...సాయిబాబా మందిరానికి విరాళం గా ఇచ్చారావిడ చెన్నై లో.
షిర్దీ సాయి - పర్తిసాయి - దివ్యకథ.....అనే... టెలీ ఫిల్మ్ నిర్మించి...
ఇద్దరు బాబాలకు తల్లి పాత్ర పోషించారు అంజలీదేవి.
ఇది ప్రపంచంలో ఎన్నో భాషలలో అనువదింపబడింది. బాబా భక్తిలో ఓ అనిర్వచనీయమైన ఆనందం...మనశ్శాంతి పొందేవారని....ఆవిడ గారే చెప్పేవారు.
నటీమణి గా..నిర్మాత గా...ఇల్లాలు గా...తల్లిగా...పరిపూర్ణ జీవితం గడిపిన అంజలీ దేవి 13 జనవరి 2014లో స్వర్గస్తులయ్యారు.

నందా.. ప్రముఖ బాలీవుడ్ నటి



ఏహ్ సమా..సమా హై యే ప్యార్ కా
కిసి కే ఇంతజార్ కా... 
దిల్ న చురా లే కహి మేరా ...
మౌసమ్ బాహర్ కా .....

ప్రముఖ బాలీవుడ్ నటి కుమారి నందా .


కుమారి నందా మహారాష్ట్ర కుటుంబంలో 1939 జనవరి 8 న జన్మించారు.తండ్రి మాస్టర్ వినాయక్ విజయవంతమైన మరాఠీ నటుడు నిర్మాత దర్శకుడు.ప్రముఖ దర్శకుడు వి శాంతారాం కజిన్ అవుతారు.మాస్టర్ వినాయక్ మంగేష్కర్ కుటుంబానికి మంచి స్నేహితుడు.తన చిత్రం పహిలీ మంగళగౌర్ ద్వారా లత మంగేష్కర్ ను చిత్రసీమకు పరిచయంచేసారు.

మాస్టర్ వినాయక్ 41 సం.ల వయసులో 1947 లో మరణించారు.అప్పుడు నందా వయసు 8 సం.లు. తనకంటే చిన్నవారైన ఆరుగురు తమ్ముళ్ల చెల్లెళ్ళ పోషణభారం ఆమెపై పడింది. 1948 లో మందిర్ చిత్రంతో బాలనటిగా నటజీవితం ప్రారంభించింది.అప్పుడు ఆమెను బేబీ నందా అని పిలిచేవారు. 1948 నుండి 1956 వరకు బాలనటి గ నటించింది.నటజీవితంతో ఆమె చదువు కుంటుపడింది.పేరుపొందిన ఉపాధ్యాయుని ద్వారా ఇంటివద్దనే విద్యనభ్యసించింది. 

వి శాంతారాం గారు తన చిత్రం తూఫాన్ ఔర్ దియా ( 1956 )లో అవకాశమిచ్చారు.అందులో తనది అంధురాలైన చెల్లెలి పాత్ర. తరువాత 1959 లో ఎల్ వి ప్రసాద్ గారు నిర్మించిన చ్చోటి బహెన్ చిత్రంలో ఇద్దరు అన్నలకు అంధురాలైన చెల్లెలుగా నటించారు.ఈచిత్రం ఎంతో విజయవంతమయ్యింది.ఆమె పాత్రను అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు గారు ఎంతో మెచ్చుకున్నారు.తాను రాజ్ కపూర్ రాజేంద్ర కుమార్ గార్లతో హీరోయిన్ గ నటించారు. 
కుమారి నందా వర్ధమాన నటులను ఎంతో ప్రోత్సహించేది.వర్ధమాన నటుడు శశి కపూర్ తో 8 చిత్రాలలో నటించారు. 

1965 లో సూరజ్ ప్రకాష్ అనే దర్శకుడు తో పెళ్లి ప్రస్తావన జరిగింది.కానీ అది సఫలీకృతం కాలేదు. 1992 లో తన నడివయసులో దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ గారితో నిశ్చితార్ధం జరిగింది.కానీ ఆకస్మికంగా ఆయన కొద్దిరోజులకే మరణించటం జరిగింది. ఇలా ఆమె అవివాహితగానే మిగిలిపోయారు. 2014 మార్చ్ 25 న ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.
 

11, జనవరి 2021, సోమవారం

తుర్లపాటి కుటుంబరావు

My pen sketch


ప్రముఖ జర్నలిస్ట్ పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు (10th August 1933 - 11th January 2021)

1933 ఆగస్టు 10న జన్మించిన తుర్లపాటి 14 ఏళ్ల వయస్సులో జర్నలిజంలోకి అడుగు పెట్టారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఎడిటోరియల్ ఎడిటర్‌గా తుర్లపాటి పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంకు సెక్రెటరీగా పని చేశారు. జాతక కథలు, జాతి రత్నాలు, జాతి నిర్మాతలు, మహా నాయకులు, విప్లవ వీరులు, 18మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు, నా కలం..నా గళం లాంటి పుస్తకాలను ఆయన రచించారు. విదేశాల్లో 20,000లకు పైగా సభల్లో ఉపన్యాసాలు చేసిన తుర్లపాట గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. 


మరిన్ని వివరాలు courtesy వికీపీడియా :

ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకీయాల ప్రభావంతో తుర్లపాటి పత్రికారచన ప్రారంభించాడు తుర్లపాటి కుటుంబరావు పత్రికా రచన 1947 మార్చి నెలలో కేవలం 14 సంవత్సరాలవయస్సులో స్వరాజ్యంలో స్వరాష్ట్రం అనే శీర్షికతో మద్రాసు నుండి వెలువడే మాతృభూమి రాజకీయ వారపత్రికతో ప్రారంభమైంది. ఆ రచన స్వాతంత్ర్యోద్యమం ఫలితంగా 1947 పిభ్రవరి 20 న బ్రిటీషు ప్రధాని స్వాతంత్ర్య ప్రకటన చేసిన సందర్భంగా ఇక ఆంధ్రరాష్ట్రం పై దృష్టిపెట్టవలసిన ఆవశ్యకతను వివరిస్తూ రాసింది. ఎన్.జి. రంగా నిర్వహించిన వాహిని కి సహ సంపాదకునిగా, చలసాని రామారాయ్ నిర్వహించిన ప్రతిభ కు సంపాదకునిగా ప్రకాశం పంతులు గారి ప్రజాపత్రిక లో ఆంధ్ర ప్రాంత వార్తల సంపాదకునిగా పనిచేశాడు.1955 లో డాక్టర్ టివిఎస్ చలపతిరావు గారి ప్రజాసేవ ఆ తరువాత ఆంధ్రజ్యోతిలో 1960 మే 21 నుండి 1963 జూన్ వరకు, 1965 నుండి 1991చివరి వరకు పనిచేసి తదుపరి స్వేచ్ఛా పాత్రికేయనిగా తన వ్యాసంగం కొనసాగించాడు. 1960 లో ప్రారంభించిన వార్తలలోని వ్యక్తి అనే శీర్షికను మొదటి నాలుగు సంవత్సరాలు రోజువారీ శీర్షికగా ఆ తరువాత వారంవారీ శీర్షికగా 1991 వరకు కొనసాగించి ఆ తరువాత వార్త పత్రికలో 2010 నాటికి 50 సంవత్సరాలు నిర్వహించిన ఘనత తుర్లపాటిదే. ఈ శీర్షికలో భాగంగా నాలుగు వేలకుపైగా వ్యక్తుల జీవితరేఖాచిత్రాలు రచించాడు. ప్రజా జీవితంలో కాని రాజకీయరంగంలో కాని ప్రాచుర్యం లభించటానికి ఉపన్యాసాల తరువాత ఈ శీర్షికే కారణమని తన ఆత్మకథలో పేర్కొన్నాడు

చలనచిత్రాలపట్ల వున్న ఆసక్తిని గమనించి ఆంధ్రజ్యోతిలో చిత్రజ్యోతి విభాగానికి తదుపరి ప్రారంభించిన జ్యోతిచిత్రకు సంపాదకునిగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం కుటుంబరావుని నియమించింది.అయితే జ్యోతిచిత్ర పనిలో పెద్ద పాల్గొనలేదని, వివేకానందమూర్తి, తోటకూర రఘు చూసుకొనే వారని అత్మకథలో పేర్కొన్నాడు.

స్వాతంత్ర్యం తరువాత తొలి మంత్రివర్గంలో ఆంధ్రునికి చోటివ్వకపోవడాన్ని నిరసిస్తూ "స్వాతంత్ర్యోద్యమంలో అగ్రశ్రేణిలో నిలబడి అశేష త్యాగాలు చేసిన ఆంధ్రుల కివ్వవలసిన గౌరవమిదేనా? ఆంధ్రులలో కేంద్రమంత్రిత్వం నిర్వహించగల దక్షులు కాంగ్రెస్ హై కమాండ్ కు కానరాలేదా? అని ఆంధ్రప్రభలో రాసిన లేఖ చాలా సంచలనం కలిగించింది. వయోధికుడైనప్పటికీ 2003 మేలో తెలుగుకి ప్రాచీన భాషా ప్రతిపత్తి ఇవ్వాలని హిందీ తరువాత రెండవ అధికార భాషగా చేయాలన్న ఉద్యమాలకు బీజం వేశాడు.

పాత్రికేయ వృత్తిలో తన వ్యక్తిత్వాన్ని విశ్వమానవుడుగా భావించుకొని జాతి, మత, కుల, వర్ణ, వర్గ, స్త్రీ, పురుష విభేదాలకు అతీతమైన మానవుడు మానవునిపట్ల మానవీయదృక్పథంతో వ్యవహరించే మానవీయ వ్యవస్థ ఆవిర్భవించాలన్న అభిమతం పెంచుకున్నాడు.



శ్రీరామచంద్రుడు

  నా చిత్రానికి మిత్రులు, కవిగ శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి పద్య స్పందన యధాతధంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ PvrMurty గారు చిత్రించిన అయోధ్య రామ...