30, డిసెంబర్ 2016, శుక్రవారం

అన్వేషిత - పెన్సిల్ చిత్రం - Pencil drawing

నా పెన్సిల్ చిత్రానికి స్పందిస్తూ Leela Kay గారు తన మనసు నుండి వెలువడిన భావాక్షరాలు ఇలా తెలియబరిచారు.
అన్వేషిత
రెప్పలమాటున దాగిన ఏ కల పలుకరించిందో
తలపు చినుకుల తడిసిన ఏ సుమం వికసించిందో
గతం లోకి కదలిపోయిన ఏ యామిని వెన్నెల పువ్వులు రాల్చిందో
ఏ తీపిపలుకు మనసును తాకిందో
మౌన తంత్రులపై హృదయం యే ప్రియరాగం పాడిందో
కనుల కడలి తీరంలో యే జ్ఞాపక గవ్వలు పోగవుతున్నాయో
విరహవర్ణంలో వియోగకుంచె యెవరి చిత్రం గీస్తోందో
పొంగుతున్న భావాల ఉప్పెనల భారంతో
జీవన నౌక యే తీరాలకు సాగి పోతోందో
కలల తెరచాప మాటున యే ఒంటరి శ్వాస కొట్టుమిట్టాడుతోందో
రెప్పలపై యే కలవరింత నిశితో సమరం చేస్తోందో
పెదవులపై పలవరింతగా ఎవరిపేరు నిలిచిందో
మనసు యే అనుభవాల మలుపులో నిలిచి మౌన పోరాటం చేస్తోందో
మనోవీధిలో జీవితం ఎవరికొరకు వేచివుందో
ఎవరి పలుకులు గాలిలో తేలి లీలగా చెవిని సోకుతున్నాయో
'నువ్వే ' నువ్వే'
అవును ఇది 'నేనే'
నాలోనేవున్నావన్న నిజం మరచి
నీకోసం నిరీక్షిస్తూ
రే పవలు నీకోసం అన్వేషిస్తూ .........
@నీలూ (Leela Kay)
మిచిగాన్
27th December 16

29, డిసెంబర్ 2016, గురువారం

మధురం - pen sketch


నేను వేసిన pen చిత్రానికి సుధారాణి గారు రాసిన కవిత.

నీకోసం వేచి చూస్తే ఎంతో మధురం 
నాకోసం నువ్వొస్తే మధురాతి మధురం 

నీకోసం తలపులన్ని ఎంతో మధురం 
నాకోసం నీ ఊసులు మధురాతి మధురం 

నీకోసం కులుకులన్ని ఎంతో మధురం 
నాకోసం అనురాగం పంచితే మధురాతి మధురం 

నీకోసం మల్లె లెదురుచూస్తే ఎంతో మధురం 
నాకోసం వలపు పల్లకిలో వస్తే మధురాతి మధురం 

నాకోసం నువ్వొస్తే ...
నీకోసం ప్రణయ రాగ ఝరినవుతా 
మురిపిస్తా...లాలిస్తా....

బ్రతుకంతా 'నీవుగా' జీవిస్తా...... (సుధారాణి)

28, డిసెంబర్ 2016, బుధవారం

మదిభావం॥మరుగేలరా॥


మదిభావం॥మరుగేలరా॥
~~~~~~~~~~~~~~
వసంతం వస్తుందంటే ఎలా వుంటుందో అనుక
నాలా నువ్వుకూడా అనుకున్నట్లున్నావేమో
మనకోసం మధువులు ఒంపుకు వచ్చింది వసంతం
ప్రతిరెమ్మా చిగురిస్తుంటే 
ప్రతికొమ్మా విరబూస్తుంటే స్తబ్ధతకు స్పందనలు అరువిస్తున్నా...
మధురోహాలు కోయిలపాటలౌతుంటే
మనభావాలు కోవెల గంటల్లో పలుకుతుంటే
ఉలికిపడే ముంగురులకు క్రమశిక్షణ నేర్పిస్తూ..
ఉప్పెనంత ప్రేమకు గుండెదారులు చూపిస్తూ
సతమతమౌతున్నా....
వలపు ఏరువాక అన్నపుడర్ధంకాలే
నీతలపులు నాలో సిగ్గుదొంతరలుపూయిస్తుంటే
ఇపుడర్ధమౌతోంది...
వచ్చి విచ్చుకుంటోంది వసంతం కాదని
నా సిగ్గుబుగ్గల్లో చేరిన వయస్సని.....
నీకై వేచి చూడమని....
మరుగేలరా మోహనా....J K28-12-16 )  --
 Jyothi Kanchi (Post in facebook) 
(చిత్రం- Pvr Murty బాబాయ్ గారు...ధన్యవాదాలు బాబాయ్ )

26, డిసెంబర్ 2016, సోమవారం

మొక్క యొకటి మాలికి దక్కినంత - pencil drawing


మొక్క యొకటి మాలికి దక్కినంత
పెంచునతడుదాని మహావృక్షముగను
శిశువు నారీతి తల్లియు క్షేమమొప్ప
తీర్చి దిద్దును దీక్షతో ధీయుతునిగ

(facebook లో వచ్చిన ఓ పద్యానికి బొమ్మ. )సంగీత దర్శకుడు నౌషాద్ - పెన్సిల్ చిత్రంనౌషాద్ గా సినీ ప్రప్రంచానికి చిరపరిచుతుడయిన నౌషాద్ ఆలీ ((25 December 1919 – 5 May 2006) ఒక గొప్ప సంగీత కారుడు. సినిమాలలో కూడా శాస్త్రీయ సంగీతానికి ప్రాధాన్యతనిచ్చి అద్భుతమయిన పాటలకు సంగీతం సమకూర్చిన ఘనుడు. 1940 సంవత్సరంలో నిర్మించిన ప్రేమ్ నగర్ చిత్రం ద్వారా ఒక స్వతంత్ర సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఆన్, ఉరన్ ఖటోలా, బైజు బావ్రా, ముగలెఆజమ్, గంగాజమున, మేరే మెహబూబ్, పాకీజా, వంటి ఎన్నో విజయవంతమయిన చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఎన్నో పురస్కారాలు పొందారు. 

25, డిసెంబర్ 2016, ఆదివారం

సిగ్గేస్తదోయ్ బావ సిగ్గేస్తదీ మొగ్గలేను ఒగ్గలేను మొగమెత్తి చూడలేను - (అర్ధాంగి చిత్రంలో పాటకి బొమ్మ)

'అర్ధాంగి' చిత్రం లో ఈ పాట అంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. ఈ పాట గుర్తుకొచ్చినప్పుడల్లా నేను వేసుకున్న ఈ బొమ్మ కూడా గుర్తుకొస్తుంది. 

సిగ్గేస్తదోయ్ బావ సిగ్గేస్తదీ
మొగ్గలేను ఒగ్గలేను
మొగమెత్తి చూడలేను “సిగ్గే”
పచ్చికా బయలులోన
మచ్చికగా మనముంటే
సిగ్గులేని చందమామ
చాటుగుండి చూస్తాడు “సిగ్గే”
రెప్పలార్పకుండా ని
న్నెప్పుడైనా చూస్తినా
టక్కులాడి చుక్కలన్ని
ఫక్రుమని నవ్వుతాయి “సిగ్గే”
గుట్టుగా చెట్టుక్రింద
గుసగుసలు చెప్పుకుంటే
చెట్టుమీది పిట్టలన్ని
చెవులు నిక్కబెడతాయి “సిగ్గే”
ఎందుకో అందరికి
ఇంత ఈసుమనమంటే
ఎవ్వరూ చూడలేని
ఏడకైన ఎళదాము “సిగ్గే”

ఆశాజీవులుఆశాజీవులు

పై వంతెన క్రింద ప్లాస్టిక్ గుడారాల్లో
ప్రకృతి ప్రకోపాలకి బలైపోతున్న బడుగుజీవులు
చింపిరి జుత్తులతో జీర్ణవస్త్రాలతో
అలనాపాలనా లేని అనాధ బాలలు
వార్తాపత్రికలకే పరిమితమయిన
పధకాలను అందుకోలేని నిర్భాగ్యులు
సంఘసంస్కరణల ముసుగులో జరిగే అవినీతిని
నిర్మూలించలేని నిస్సహాయులు
జీవిత చరమాంకంలో చేయూతకోసం
పరితపించే విధివంచితులు
కళాత్మక చిత్రాల వెండితెర దర్శకులకు
కధాంశాలు వీరి బతుకులు
ఉందిలే మంచికాలం ముందుముందునా
అనుకుంటూ ఎదురుచూసే ఆశాజీవులు
ఎందరో ఎందరెందరో …. … !!

- పొన్నాడ లక్ష్మి
చిత్రం : శ్రీ Pvr Murty గారు

24, డిసెంబర్ 2016, శనివారం

అమ్మ - color pencil drawing
శ్రీ పొన్నాడ మూర్తి గారికి కృతజ్ఞతా వందనాలతో..అమ్మకు..!
తన బాధను తీర్చేందుకు చిరునవ్వును నే..కానా..!
తన ఆశను తీర్చేందుకు ఓ దీపము నే..కానా..!
తానిచ్చిన ఈ ఊయల అక్షరాల తన సేవకె..
తన అలసట తీర్చేందుకు ఓ పవనము నే..కానా..!
ఎంత తల్లడిల్లేనో తన హృదయం నా కోసం..
తన వేదన తీర్చేందుకు ఓ కావ్యము నే..కానా..!
బుద్దులెన్ని నేర్పిందో పెదవి విప్పి మాటాడకె..
తన మథనను తీర్చేందుకు ఆ మౌనము నే..కానా..!
పూజలెన్ని చేసిందో నను బిడ్డగ పొందాలని..
తన రుణమును తీర్చేందుకు తన అమ్మను నే..కానా..!
మాధవుడను నేనైతే సార్థకమే ఈ జన్మం..
తన కలతను తీర్చేందుకు ఓ తీరము నే..కానా..!

- Madavarao Koruprolu

23, డిసెంబర్ 2016, శుక్రవారం

నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి
ఓ శృంగార గీతానికి నా బొమ్మ
నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని
చల్లగ తాకే పాల వెన్నెల, నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ చిరుగాలి, నా కోరికలే వినిపించు
నా కోవెలలో, స్వామివి నీవై మనసే దివ్వెగా వెలిగించు
నింగి సాక్షి, నేల సాక్షి, నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన, మనుగడ లోన, నాలో నీవే సగపాలు
వేడుకలోను, వేదనలోను, పాలు తేనెగా ఉందాము

16, డిసెంబర్ 2016, శుక్రవారం

నటన - గిరీశం


శ్రీ Vemuri Mallik గారి 'నటన' చదివాక నాకు ఎందుకో 'గిరీశం' గుర్తుకొస్తాడు. 'గిరీశం' అనగానే ఆ పాత్ర అద్భుతంగా పోషించిన NTR గుర్తుకొస్తారు. నేను వేసిన ఆ బొమ్మ గుర్తుకొస్తుంది. ఆ బొమ్మతో పాటు పక్కన drama masks కూడా జతపరచి ఓ slide తయారుచేసాను. ఈ ప్రేరణ కలిగించిన శ్రీ మల్లిక్ గారికి ధన్యవాదాలు.
నటన రానివారెవ్వరు..
నటులు కానివారెవ్వరు ?
కడుపు నింపే బతుకు తెరువుకో..
మోడౌతున్న బతుకు తరువుకో..
నటనని ఎన్నుకోనిదెవరు..
నటనని అద్దుకోనివారెవ్వరు ..?
తనని తాను దాచుకోడానికో....
సాటి మనిషిని దోచుకోడానికో..
నటనని నమ్ముకోనిదెవరు..
నటనని ఎన్నుకోనివారెవ్వరు ..?
మనసుని చంపుకోడానికో..
మమతని తుంచుకోడానికో..
నటననాశ్రయించని వారెవ్వరు..
నటనని పెంచుకోనివారెవ్వరు..?
గాయం మాపుకోడానికో....
గుండెని అతుకుకోడానికో..
నటనని వాడుకోనిదెవ్వరు....
నటనని హత్తుకోనివారెవ్వరు..?
పెదవుల నవ్వులు పూయించడానికో..
కన్నుల నీరు దాచుకోడానికో..
నటనని వాడుకోనిదెవ్వరు..
నటనని అద్దుకోనివారెవ్వరు.?
నేస్తం...
నిన్ను నువ్వు కాచుకో్డానికి..
కాకులంటి సంఘం లో కల దిరగడానికి..
మమతలెరుగని మనుషుల తప్పించుకోడానికి..
గుండె దాటి వస్తామన్న భావాలని అడ్దుకోడానికి..
మనసుకు ముసుగులు వేసుకోవాలి..
కళ్లకి గంతలు కట్టుకోవాలి..
కట్టెలో కట్టై కడతేరిపోయే దాకా..
నటిస్తూనే నటించలేక చస్తూ బతికుండాలి.. !!
నటన రానివారెవ్వరు..
నటన నేర్వని వారెవ్వరు..
జగన్నాటకం లో.. పాత్ర ధారులం..
నటించక తప్పని మూగ రోదనలం.
నటిస్తూనే ఉందాం..
నటనలోనే కడతేరిపోదాం..!!

14, డిసెంబర్ 2016, బుధవారం

"మనసు చిగురిస్తేచాలు-వయసెపుడూ వసంతమే" - pencil sketch

నన్ను ఎంతో ఆప్యాయతో బాబాయ్ అని పలకరించే 'జ్యోతి కంచి' నా పెన్సిల్ చిత్రానికి అల్లిన కవిత. జ్యోతి కి నా శుబాశీస్సులు.
మదిభావం॥పచ్చదనం॥
~~~~~~~~~~~~~
ఒకరాగమేదో ఊరించి చూస్తోంది
తన భావమేదో నాలో పులకించి పూస్తోంది
ఆలోచనా కుంచె నుదుట గీసిన మడతలివిగో
ఆ 'లోచనా'ల్లోని అంచెలంచల ముడుతలివిగో
నా బతుకు నిండిన కుండ
తొణకదు బెణకదు
నా వయసు పండిన పూదండ
వాడినా తను ఓడదు
ఆఘ్రాణించే మనసు
ఆస్వాదించే మమతలుండాలేకానీ...
వయసొక వరం
అనుభవాల పట్టుపూలసరం...
తనివితీరేలా మరలా మరలా జీవించేయాలి
చవులూరేలా జీవనగానాన్ని మోగించాలి
మొన్నల్లో గతానికి సరిగమలు సవరించేస్తూ
నిన్నల్లో గమనానికి గమకాలను తగిలించేస్తూ
నేడో,రేపో ఏదైతేనేం
ఊహల రాగాలకుచిగురులుతొడిగిస్తూ... కొత్తపాటలను కోకిలమ్మకు అరువిస్తూ
జీవనవనమంతా పచ్చదనం పరిచేస్తూ
ఇదిగో నేనిక్కడే వున్నా....
ఎలా ఇలా అని అడక్కండి
"మనసు చిగురిస్తేచాలు-వయసెపుడూ వసంతమే"
J K14-12-16
(చిత్రం- Pvr Murty బాబాయ్ గారు.. ధన్యవాదాలు బాబాయ్ గారూ)

10, డిసెంబర్ 2016, శనివారం

నీటి కోసం - pen sketch


నా ఈ చిత్రానికి Leela Kay గారు facebook లో చక్కని కవిత అందించారు.

PVR మూర్తిగారి చిత్రం 'నీటికోసం ' పై నా చిత్ర స్పందన

నడక తాను నేర్చింది కోసుల దూరాలను
కొలవాలని కాబోలు కర్మ భూమి తానౌతూ
బ్రతుకులోని భారమంతా అడుగులలో మోస్తోంది
ఎడారంటి వట్టినేల నీటిచెలమ జాడలకై
కళతప్పిన కన్నులతో వెదుకుతోంది చుక్కచుక్క
గుక్కెడు నీళ్లంటే అమృతమే దప్పిగొన్న గొంతుకు
కడివెడు కన్నీళ్లను కనులకుండ నింపుకుంటు
కదులుతోంది వడివడిగా కడవనెత్తి కఱకునేల
కనికరము లేని మబ్బు కురవనంటు అలిగింది
కరుణలేని కరిమబ్బులు దాచినాయి వానచినుకు
పుడమిగుండె నెఱ్ఱలీని సెగలపొగలు చిమ్మింది
పాలిచ్చే పొదుగుఎండి రుధిరాలను చిందింది
పచ్చగడ్డి రుచిమరచిన పశులమంద వగచింది
గుక్కెడునీటికి గూడువిడచి మండుటెండ వెన్నెలగా
ఆశలతడి అలసిన అడుగుల లేపనముగ
బంజరంటి బతుకుబాట వ్యథ ముగియుట ఎన్నటికో !
కడసారిగ తీర్చేనని అమ్మగొంతు దాహాన్ని
పొడిబారిన గుండెలలో అశ్రుచెలమ దాచుకుంది
గుక్కెడు నీటిని గొంతులోన జారవిడచ
కన్నకొడుకు వచ్చేనా? కన్నులతడి తుడిచేనా ?
@నీలూ
మిచిగాన్
8th December 16

9, డిసెంబర్ 2016, శుక్రవారం

నన్ను ప్రేమిస్తే నా హృదయం పూలపాన్పు - కవితశ్రీమతి పొన్నాడ లక్ష్మి గారి కవిత కి నా వర్ణ చిత్రం.

నన్ను ప్రేమిస్తే నా హృదయం పూలపాన్పు
కాదని నిరసించితివా నా ఎద కఠిన శిల

నన్ను అనురాగంతో చేరదీస్తే నీ పాదదాసిని
కాదన్నచో నీపాలి నిరంతర అశాంతిని

నన్ను దయగా చూచితివా వరాలిచ్చే దేవతను
నిర్దయగా హింసిస్తే నీపాలి మృత్యుదేవతను

నన్నాదరించి ఆప్యాయతను పంచితివా 
నిన్ను శిరసున నుంచి పూజింతును

నన్ను విడనాడినా నే బ్రతుకలేను
నిన్నే నమ్మిన నన్ను కాధన్నా నిన్ను బ్రతకనివ్వను

రచన : పొన్నాడ లక్ష్మి 
(చిత్రం : Pvr Murty గారు)

కనుపాప అద్దంలో - కవిత


నా చిత్రానికి కవిత అల్లిన వాణి వెంకట్ గారికి ధన్యవాదాలు
Pvr Murty గారి పిక్ ....
....
కనుపాప అద్దంలొ ప్రేమగా నీ రూపు తాకుతూ ఉంటుంది ||
చీకటిని చేధించి వెన్నెలగ మదిలోన మెదులుతూ ఉంటుంది ||
కాలమే కరిగినా ఙ్ఙాపకం గుండెల్లొ జాతరే చేస్తుంది
మినుకంత చిత్రంలొ మనసంత చెమరింత ఒలుకుతూ ఉంటుంది ||
గతమేలె చిరునవ్వు తడిఇంకి పోనట్టి వేలాడు గాయాలు
కథనాల కన్నీరు మౌనాల మదిలోన అలుకుతూ ఉంటుంది ||
ఓ స్వప్న కాంక్షలో రేయంత మెలుకువగ మిగిలి పోయింది
తచ్చాడు ఆశేదొ శూన్యంతొ చెలిమిగా వెతుకుతూ ఉంటుంది ||
నిశ్శబ్ద మేలేటి రాతిరిని ఓదార్చి విడ్కోలు చెప్పేదెల
ఏమార్చి వెంటాడి తెరచాటు పవనాలు వీచుతూ ఉంటుంది ||
ఉద్విగ్న దృశ్యాలు నిన్నటికి నేటికీ మధ్యంత తిమిరాలు
మౌనంగ ఓ వాణి మాటల్ని పెదవెనుక దాచుతూ ఉంటుంది ||
.........వాణి ,09 Dec 16

8, డిసెంబర్ 2016, గురువారం

ఇల్లాలు - రేఖా చిత్రం - గజల్నేను వేసుకున్న రేఖా చిత్రానికి 'హంసగీతి' గారి గజల్
॥తెలుగు గజల్॥ ఇల్లాలు॥
పనులన్ని చక్కగా చేస్తుంది ఇల్లాలు
అందరికి అమర్చే ఇస్తుంది ఇల్లాలు
తీరికే లేకుండ ఉంటుంది రోజులో
పొద్దుటే తొందరగ లేస్తుంది ఇల్లాలు
ఊరికే కూర్చోక ఊసులను చెబుతుంది
మగనికే జీవితానిస్తుంది ఇల్లాలు
నలుగురికి పెట్టాక మిగిలితే తింటుంది
ఏలోటు రాకుండ చూస్తుంది ఇల్లాలు
అమ్మగా పిల్లలని లాలించి తిపిపించు
అడిగినవి కాదనక తెస్తుంది ఇల్లాలు
విసుగుదల పడదమ్మ ఎంతపని చేసినా
పొదుపుగా ఖర్చులని రాస్తుంది ఇల్లాలు
భూదేవి సహనాన్ని కలిగుండు ఓర్పుగా
తనవారి భారాన్ని మోస్తుంది ఇల్లాలు
మంచి చెడు గ్రహించే శక్తుంది 'హంసలా'
కుటుంబ గౌరవం కాస్తుంది ఇల్లాలు
హంసగీతి
4.12.16

6, డిసెంబర్ 2016, మంగళవారం

మౌనం - కవిత - గజల్

మిత్రులు శ్రీ Vemuri Mallik గారి కవిత కి నేను వేసుకున్న బొమ్మ. వారికి నా ధన్యవాదాలు.
మౌనం.. ..
అబద్ధం చెప్పకూడదనుకున్నప్పుడు..
నిజాన్ని చెప్పలేనప్పుడు..
మౌనం ఒక పరిష్కారం..!!
మనిషిని మానసికంగా చంపాలనుకున్నప్పుడు..
మానసికంగా మనిషి చావాలనుకున్నప్పుడు..
మౌనం ఒక ఆయుధం..!!
అనుబంధాలు నిలవాలనుకున్నప్పుడు..
సంబంధాలు వొద్దనుకున్నప్పుడు....
మౌనం ఒక బలం..!!
మౌనం మదిని మురిపిస్తుంది..
మౌనం కళ్లని తడిపేస్తుంది..
మౌనం హృదిని తడిమేస్తుంది..
మౌనానికి మాటై నిలుస్తే రాజీ..
మౌనానికి మౌనం కలిస్తే సంఘర్షణ..!!.
మౌన సమయం తెలిసున్నవాడు విజేత..
మౌన స్థానం తెలియనివాడే పరాజిత.!!
మౌనం లో మూగ బాధలుంటాయి....
మౌనం లోనే సరాగాలూ దాగుంటాయి..!!
మౌనం వాడే దమ్మూ..
మౌనం వాడే ఒడుపూ..నీదైతే..
సమర్ధుడికి మౌనం కన్నావరమేముంటుంది..?
చేతకాని వాడి్ని ఆ కవచమేరకంగా కాచుకుంటుంది.. ?!!
మౌనం....
సమర్ధుడికది ఏకాంతం..
నిర్భాగ్యుడికదో ఒంటరి తనం.. !!
మౌనం ....
సాహసికదో అవకాశం..
పిరికివానికి అదే పలాయన వాదం...!!
ఆనందాలకు... ఆవేదనలకు..
వినోదాలకు.. విషాదాలకు..
సంకేతాలకు.. సందేహాలకు..
పరవశించడానికీ... నిరశించడానికీ...
ఆమోదించడానికీ.. నిరాకరించడానికీ..
ఏకాంతానికీ... ఒంటరవడానికీ..
నవ్వులు విరబూతకూ..
గుండెలు చెలమలవ్వడానికీ..
మౌనాన్ని మించిన భాషుందా..?
మౌనవించని మనసుందా..?!!

ఇదే బొమ్మకి తర్వాత వాణి వెంకట్ గారు తన గజల్ తో ఇలా స్పందించారు. చదవండి.

Pvr Murty గారి పిక్ కి నా గజల్ ...
ఊహల్లొ ఊసులే చెప్పేది మౌనం ॥
భావాలు రాసిగా పోసేది మౌనం ॥
అనుభూతి అద్దమో కన్నీటి కాలమో
జ్ఞాపకం తాకుతూ తడిమేది మౌనం ॥
కలలన్ని కధలుగా కూర్చుకుంటున్న
తిమిరాన్ని తరచుగా తాకేది మౌనం ॥
చిలిపితనం చిత్రాలు బాల్యాల చెలిమి
చిరునవ్వు చెక్కిలిని చుట్టేది మౌనం ॥
విజయమో ఓటమో గుర్తుగా మిగిలి
ఓ స్మృతిని మదిలోన తలచేది మౌనం ॥
బంధాల మాధుర్యం మరుగైన కాని
మధురంగ ఎదలోన గుచ్చేది మౌనం ॥
పరిణయం ప్రణయం పరవశం కాదా
ఓ మధుర మధువునే గ్రోలేది మౌనం ॥
తడిస్పర్శ గుండెలో చెమరించు కనులు
ఓ బాధ బరువుగా తడిపేది మౌనం ॥
....వాణి ,

Image may contain: drawing


జయలలిత - పెన్సిల్ చిత్రం


తమిళ రాజకీయరంగంలో ఓ శకం ముగిసింది. ఆనాటి ప్రఖ్యాత నటి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిన్న రాత్రి కన్నుమూసారు. 'అమ్మ' గా కొలిచే తమిళుల ఆరాధ్యదేవత జయలలిత. తెలుగు చిత్ర సీమలో కూడా అగ్రనటులయిన ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారితో నటించి శెభాష్ అనిపించుకున్నారు. ఆమెకు నా పెన్సిల్ చిత్రం ద్వారా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. -- పొన్నాడ మూర్తి.

నవ్వాలి గలగలా జలజలా

My Pen sketch.
'నవ్వడం ఒక యోగం నవ్వకపోవడం ఓ రోగం' అనే వారు జంధ్యాల గారు. నిజమే మరి !! facebook లో  బాబాయి అంటూ అభిమానించే Bhavani Ssa గారి కవిత చదివాక గుర్తుకొచ్చిన ఎప్పుడో అలాఅలా వేసుకున్న నా pen చిత్రం. మరి ఆమె రాసిన కవిత కూడా చదవండి.
చుక్కలన్నీ ఏదో ఎడారిలో రాల్చేసుకున్న ఆకాశంలా
ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు
అలా చిర్రుబుర్రులొద్దు - ఆ చిటపటలొద్దు
నవ్వాలి - గలగలా - జలజలా
అలా బడుల్లోకి పోయి
చిన్న పిల్లల ముందు నిలబడు
నాలుగు నవ్వులు నీ చేతుల్లో పడేస్తారు
తోటల్లో పక్షుల గూళ్ళల్లో తోంగి చూడు
నీ కళ్ళు నవ్వుల దీపాలవుతాయి.
మట్టి మొక్కలా నవ్వుతుంది
చెట్టు నీడలా నవ్వుతుంది
మనం నవ్వితే
ఇల్లంతా మాటలు నేర్చిన మల్లెపందిరవుతుంది
మనం నవ్వితే
వీధులూ ఆఫీసులూ రోడ్లూ
తంబురాలూ-వీణలు-గిటార్లయిపోతాయి
మనకు నవ్వడం కూడా తెలుసని
మన పిల్లలు అబ్బురాల అలలై
ఆనందంతో మన కాళ్ళను చుట్టేసుకుంటారు.
నవ్వాలి - హాయిగా - తీయగా
పువ్వులు జలజలా రాల్చుకుంటూ
ఒక చెట్టు మన మధ్యనుండి
అలా నడిచిపోవడం నవ్వు.
ఆఫీసునుండొచ్చిన అమ్మను చూసి
ఉయ్యాల ఆనందంగా ఊగడం నవ్వు.
మాఘమాసం చలిలో
ఓ అనాథ శరీరం మీద
ఉన్నట్టుండి ఒక ఉన్నిశాలువా వాలడం నవ్వు
ఒక పలకరింపు నవ్వు - ఒక స్పర్శ నవ్వు
నవ్వు ఔషధం - నవ్వు అవసరం
చేప పిల్లల్నీ తామరపువ్వుల్నీ
ఒక్క సారే పోగొట్టుకున్న చెరువులా
ఎప్పుడూ అదోలా ఉండొద్దు
నవ్వాలి - ముచ్చటగా - మురిపెంగా.
అజ్ఞాత వీరుల్ని జోకొడుతున్న
అడవి పాట నవ్వు
నలుగురు కూర్చున్న చోట
మానవహక్కుల గీతం గొంతు విప్పినట్టు నవ్వాలి
ప్రేమగా చేయి చాపడం నవ్వు
అణకువగా భుజాలు పంచడం నవ్వు
నవ్వితే ఎగురుతున్న పక్షి
ఓ సారి వెనక్కి చూడాలి
పైకెగసిన కెరటం ఓ సారి ఆగిపోవాలి
నది దేహం మీద పడవరాసిన పాట నవ్వు
ఆకాశానికి పక్షి ఇచ్చే షేక్హ్యాండ్ నవ్వు
చెట్టు బుగ్గ మీద గాలి ముద్దు నవ్వు
ప్రకృతి విశ్వవిద్యాలయం
మనుషులకు ప్రసాదించే పట్టా నవ్వు
నవ్వడం చేతకాక పోతే
బతకడం చేతకానట్టే.

  భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala చిత్రాలు : Pvr Murty సహకారం : శ్రీమతి Ponnada Lakshmi ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె...