29, మార్చి 2023, బుధవారం

దేవ దేవం భజే దివ్యప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామమ్ - అన్నమయ్య కీర్తన


 

దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం రామమ్
రాజవర శేఖరం రవికుల సుధాకరం |
ఆజాను బాహుం నీలాభ్ర కాయం |
రాజారి కోదండ రాజదీక్షాగురుం |
రాజీవ లోచనం రామచంద్రం ||
నీలజీమూత సన్నిభ శరీర ఘన వి- |
శాల వక్షసం విమల జలజనాభం |
కాలాహి నగ హరం ధర్మ సంస్థాపనం |
భూ లలనధిపం భోగశయనం ||
పంకజాసన వినుత పరమ నారాయణం |
సంకరార్జిత చాప దళనం |
లంకా విశోషణం లాలిత విభీషణం |
వేంకటేశం సాధు విబుధ వినతం |
భావం :
ఈ కీర్తనలో పదకవితాపితామహుడు దేవభాషలో దశరథనందనుడిని ప్రస్తుతించాడు. పద్మావతీప్రియుడైన శ్రీనివాసుడిలో శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నాడు.
అన్నమయ్య దాశరధిని భజిస్తూ ఆయన దివ్యప్రభావాన్ని స్మరిస్తూ, అసురుడైన రావణుడుకి శత్రువై రఘువంశాన్నే శోభింపజేసాడంటూ ఈ సంకీర్తనకు శ్రీకారం చుడుతున్నాడు.
సూర్యవంశంలో జనించిన రఘురాముడిని రాజవరశేఖరుడని, సూర్యవంశ సుధాకరుడని, ఆజానుబాహుడని, నీలమేఘశ్యాముడని, కోదండాన్నిధరించిన దీక్షాగురుడని, రాజీవలోచనుడని కొనియాడాడు.
నీలమేఘమువంటి శరీరము కలవాడు, విశాలమైన వక్షంతో విరాజిల్లువాడని, కమలనాభుడైన విష్ణుమూర్తియని, సర్పసంహాకురుడైన గరుడుడినే వాహనం చేసుకున్నవాడని, ధర్మసంస్థాపకుడని, ఆదిశేషుణిపై పవళించే పరమపురుషుడని, భూమిజ అయిన సీతాదేవికి పతిదేవుడని కొనియాడాడు.

పంకజాశనుడైన బ్రహ్మదేవుడు వినుతించే పరమనారాయాణుడు, జనకుడి శివధనుస్సును అవలీలగా విరిచినవాడు, లంకను జయించి విభీషణుడిని లాలించి పట్టం కట్టినవాడు, కలియుగంలో వేంకటాద్రిపై వెలసి పూజలందుకుంటున్నాడని పులకించిపోతున్నాడు.

చిత్రం : Ponnada Murty
సహకారం : శ్రీమతి పొన్నాడ లక్ష్మి

22, మార్చి 2023, బుధవారం

అమ్మే దొకటియును అసిమలోని దొకటి ఇమ్ముల మా గుణములు ఎంచ చోటేదయ్యా ॥ - అన్నమయ్య కీర్తన


 


అమ్మే దొకటియును అసిమలోని దొకటి

ఇమ్ముల మా గుణములు ఎంచ చోటేదయ్యా ॥

 

ఎప్పుడు నేము చూచిన నింద్రియ కింకరులము

ఇప్పుడు నీ కింకరుల మెట్టెయ్యామో

తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము

చెప్పి నీ దాసుల మన సిగ్గుగాదా మాకు

 

పడతుల కెప్పుడును పరతంత్రులము నేము

పడి నీ పరతంత్రభావము మాకేది

నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ

ఎడయేది నిన్ను నుతియించే టందుకును

 

తనువు లంపటాలకు తగ మీదెత్తిత్తి మిదె

ఒనరి నీ ఊడిగాన కొదిగేటెట్టు

ననిచి శ్రీవేంకటేశ నాడే నీకు శరణంటి

వెనక ముందెంచక నీవే కావవయ్యా

 

భావం :

 

వెంకటేశ్వరా,  మా గుణాలను విశ్లేషించే ప్రయత్నం చేయకయ్యా ! మేము మూటలో ఉన్నవి ఒకరకమైతే ముందు మరో రకం వస్తువులు పెట్టి ఆకర్షిస్తున్న కపట వ్యాపారుల్లాంటి వాళ్ళము. ఇది నీకు తెలియంది కాదు.

ఇంద్రియాలకు యజమానులుగా ఉండాల్సిన మనం వాటికి కింకరులుగా మారిపోతున్నాం. అవి మన అధీనంలో ఉండాల్సిందిపోయి వాటి అధీనంలో మనముంటున్నాము. ధనమునకు దాస్యమైన మేము నీదాసులమని చెప్పుకొనుటకు సిగ్గు కాదా మాకు.

పడతులకు పరతంత్రులమై పరంధాముడివైన నీకు పరతంత్రులము అవలేకపోతున్నాము. నానా రుచులకు అమ్ముడుపోయిన నాలుకతో నిన్ను నొతియించలేక పోతున్నాము. 

తనువు లంపటాలలో చిక్కుకున్న మేము నీ ఊడిగము చేస్తూ ఎప్పుడు తరించాలి? అందుకే నిన్నే శరణన్న మమ్మల్ని నీవే కాచుకోవాలని ఆర్ద్రతతో అడుగుతున్నాము.


చిత్రం : Ponnada Murty

 

 

 


17, మార్చి 2023, శుక్రవారం

హరి అవతారమే అతఁ డితడు పరము సంకీర్తన ఫలములో నిలిపె !! - అన్నమయ్య కీర్తన


 

ఫాల్గుణ బహుళ ద్వాదశి  పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి. ఈ సందర్భంగా  వారిని సంస్మరించుకుంటూ వారి తనయుడు పెద తిరుమలాచార్యులు  తన తండ్రిపై రచించిన కీర్తన.


చిత్ర రచన : పొన్నాడ మూర్తి

 

హరి అవతారమే అతఁ డితడు

పరము సంకీర్తన ఫలములో నిలిపె !!

 

ఉన్నాడు వైకుంఠమున నున్నాడు ఆచార్యునొద్ద

ఉన్నతోన్నత మహిమ నన్నమయ్య

ఉన్నవి సంకీర్తనలు ఒట్టుక లోకములందు

పన్నిన నారదాదులు పై పై పాడగను 

 

చరియించు నొకవేళ శనకాది మునులలో

హరిబాడు దాళ్ళపాక అన్నమయ్య

తిరమై యాళువారుల తేజము తానై యుండు

గరుడానంత ముఖ్య ఘనుల సంగడిని ॥

 

శ్రీవేంకటాద్రి మీద శ్రీపతి కొలువునందు

ఆవహించె దాళ్ళపాక అన్నమయ్య

దేవతలు మునులును దేవుడని జయవెట్ట

గోవిదుడై తిరుగాడి గోనేటి దండను

 

భావం సౌజన్యం : సాహిత్యశిరోమణి, మహామహోపాధ్యాయ కీ. శే.  సముద్రల లక్ష్మణయ్య, M.A.

 

అన్నమయ్య శ్రీహరి అవతారమే. ఇతడు మోక్షమును సంకీర్తనఫలముగా స్థాపించినాడు.

 

అన్నమయ్య వైకుంఠములో మహోన్నతమైన మహిమతో నొప్పారుచు ఆచార్యుని చెంతనే ఉన్నాడు. నారదుడు మున్నగువారు మాటిమాటికీ పాడగా అన్నమయ్య పాటలు లోకములం దెల్లెడల వ్యాపించి ఉన్నవి.

 

శ్రీహరిని కీర్తించు అన్నమయ్య ఒక్కొక్క వేళ సనకాది మునీంద్రులతో కూడి సంచరించుచుండును. గరుడుడు, శేషుడు మున్నగు నిత్యశూరుల చెంత తాను స్థిరమైన ఆళ్వారుల తేజోరూపముతో ప్రకాశించుచుండును.

 

తాళ్ళపాక అన్నమయ్య శ్రీవేంకటాచలముపై శ్రీకాంతుని కొలువుకూటమునందు నెలకొని యున్నాడు. దేవతలు, మునులు ఈయన దేవుడే అని జయజయధ్వానములు కావించుచుండగా ఆయన కోనేటిచెంత భగత్తత్త్వజ్ఞుడై సంచరించుచుండును.

 

9, మార్చి 2023, గురువారం

ప్రఖ్యాత సంగీత దర్శకుడు రవి


 

సినిమా title తో పాట స్వరపరచడం ఒకప్పటి trend. గురుదత్ Choudvi ka Chand సినిమాలో అప్పటికే   సంగీత దర్శకుడుగా establish అయిన రవిని నియమించుకున్నాడు. సినిమా title తోనే ఓ పాట స్వరపరచాలని రవి తన అభిమతం తెలియబరిస్తే గురుదత్ ఓకే అన్నాడు. కవి షకీల్ బదయూని కి కబురు పంపించాడు. చౌద్వీ కా చాంద్ హో ..  తర్వాత ఏం రాయాలి...'యా ఆఫ్తాబ్ హో' అన్నాడు షకీల్ .. ఓ అయిదు నిమిషాల్లో పాట lyric రెడీ. మహమ్మద్ రఫీ తొ rehearsel చేయించడం, పాట record చెయ్యడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ పాట భారతీయ సినిమా సంగీతంలోనే ఇదొక సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాట తెలియని సంగీత అభిమాని ఉండడంటె ఆశ్చర్యంలేదు.

సంగీత దర్శకుడు రవి, మహమ్మద్ రఫీ వీరాభిమాని. ఓసారి మహమ్మద్ రఫీ stage performance చూసి మాట్లాడే అవకాశం లభించింది. రఫీ playback singer అవాలంటే ఎలా సాధన చేయాలో చిన చిన్న tips ఇచ్చి ప్రోత్సహించాడు. కాని రవికి సంగీతంపట్ల ఉన్న ఆసక్తి గమనించిన హేమంత్ కుమార్ ఓ chorus లో పాడే అవకాశం ఇచ్చాడు. తర్వాత నాగిన్ చిత్రంలో తన aassistant గా పెట్టుకున్నాడు. తర్వాత స్వతంత్రంగా చాలా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. 


భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో  'నాగిన్' ఓ పెద్ద సంచలనం. ఈ చిత్రంలో గ్రామఫోన్ రికార్డులు రెండు సంవత్సరాల పాటు ఏకధాటిగా అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. నిజానికి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు హేమంత్ కుమార్. రవి ఆయనకు Assistant గా పనిచేసారు. ఈ చిత్రంలో  రవి స్వతంత్రంగా  been  music తో స్వరపరచిన  'మన్ డోలే మెర తన్ డోలే' యావద్భారతదేశంలో ఓ ఊపు ఊపేసింది. ఊరూ వాడా  నాగిన్ పాటలే.  

రవి ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోలేదు. Posts & Telegraphs department లొ electrician గా పనిచేసేవాడు.  తన career ని ప్రారంభించాడు.  చిన్న చిన్న electric పరికరాలు బాగుచేసి పొట్టగడుపుకునేవాడు..  కానీ సంగీతమంటే ప్రాణం. All India Radio లో అప్పుడప్పుడూ పాటలు పాడేవాడు. 


ఇప్పటికీ పెళ్ళిళ్ళలో 'మెరా యార్ బనా హై దుల్హా' 'ఆజ్ మెరి యార్ కి షాదీ హై' పాటలు band party వాళ్ళు వాయిస్తూనే ఉంటారు.   రవి స్వరపరిచిన పాటలే.. అప్పులేని సంసార మైనపాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన జాలు - అన్నమయ్య కీర్తన

అప్పులేని సంసార మైనపాటే చాలు  తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి // కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు  చింతలేని యంబలొక్క చేరెడే చాలు జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు  వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని // తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు  ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు  గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు  వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని // లంపటపడని మేలు లవలేసమే చాలు  రొంపికంబమౌకంటె రోయుటే చాలు  రంపపు గోరికకంటే రతి వేంకటపతి  పంపున నాతని జేరే భవమే చాలు // అప్పులేని //

చిత్రం : పొన్నడ మూర్తి

భావము : సౌజన్యం : 'సాహిత్య శిరోమణి' సముద్రాల లక్ష్మణయ్య, ఎం. ఏ. 

అప్పుచేసి ఆటోపముగా సంసారము జరుపుటకంటె అప్పులేని కాపురము జరిగినంతవరకే చాలును. అదే సుఖప్రదము. అట్లే తప్పు తోవలో ఆర్జించిన అధిక ధనముకంటె తప్పులేని జీతము నాలుగు కాసులైనను చాలును.

ఎండవానలవలని బాధ తప్పని పెద్ద గృహముకంటె చక్కగా కప్పబడిన ఇల్లు చిన్నదైనను మేలు. నానా చింతలకు లోనై తిను పంచభక్ష్య పరమాన్నములకంటే చీకుచింత లేని యంబలి చేరెడైనను సుఖకరమే. ధూర్తురాలైన కులస్రీకంటె గుణవతి యయిన వనిత తక్కువ జాతిదైనను మేలు. “స్త్రీరత్నం దుష్కులాదపి” అని పెద్దల వచనము. అన్యాయంగా క్షణములో ఆర్జింపబడి పదిమందికి వింతగొలుపు దొడ్డ సంపదకంటె న్యాయార్చితమైన విత్తము మిక్కిలి కొద్దిదైనను చాలు.

ఇతరుల దూషణకు లోనై శత సంవత్సరములు జీవించుటకంటె ఎట్టి దూషణలేక ఒక్కదినము జీవించినను మేలే. ఆపరిశుధ్ధమైన అన్నము కడుపునిండా తినుటకంటె పరిశుధ్ధమైన అన్నము ఒక్క కబళమైనను సుఖావహము. పెద్ద పెద్ద ఆశలతో ప్రాకులాడి పదిమందిలో గుట్టుచెడి బతుకుటకంటె ఏ కొంచెపు మేలుకలిగినను దానితో తృప్తినొందుట మేలు. లేనిపోని ప్రయాసలకు గురియై జాలిపడుటకంటె వచ్చినదానితో తనివిపొందుట మేలు.

పలు తగులములకు గురియై బాధపడుటకంటె ఏ లంపటములులేక వచ్చు మేలు కొదిదిపాటిదైనను చాలు. బురదలోని స్తంభమువలె నిలకడలేని జీవితముకంటె ఐహికసుఖములపై రోతపడి నిశ్చలముగా నుండుట మేలు. రంపమువలె బాధావహమైన కోరికలకు లోనగుటకంటె “మామేకం శరణం వ్రజ” అను భగవదాదేశము ననుసరించి ఆదేవుని సన్నిధి జేరుటకు ప్రయత్నించు మానవుని పుట్టుకే శ్రేష్ట,మైనది.
 

1, మార్చి 2023, బుధవారం

అన్నమయ్య కీర్తన : మాయామానుష మహిమ ఇది ఏ యెడ నీతని ఈశ్వరుడు

 అన్నమయ్య కీర్తన : మాయామానుష మహిమ ఇది ఏ యెడ నీతని ఈశ్వరుడుమాయామానుషమహిమ ఇది
ఏయెడ నీతని ఈశ్వరుడు !!
మొదట యశోదకు ముద్దులబాలుడు
అదె మునులకు బరమాత్ముడు
మది గోపికలకు మన్మధమన్మధు
డెదుటనె తిరిగీ నీశ్వరుడు !!
గోపబాలుడు గొల్లడు నాడే
చేపట్టెను లక్ష్మికి మగడు
కోపపుటసురులకు మృత్యు వీతడు
ఏపున మెరసీ నీశ్వరుడు !!
పాండవులకు దా బావయు మరదియు
వొండొకవసుదేవునికొడుకు
అండనె శ్రీవేంకటాద్రికి గృష్ణుడు
ఇందుల ముంగిళ్ళ నీశ్వరుడు
భావమాధుర్యం: సౌజన్యం : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు
పెదతిరుమలయ్య వినిపిస్తున్న శ్రీకృష్ణామృతాన్ని తనివితీర గ్రోలండి. ఈ అవతారము మాయామానిష మహిమను చూపిన అవతారం. ఏ విధంగా చూచినా ఈతడు ఈశ్వరుడు కాక మరెవ్వరు?
యశోద దృష్టిలో ఈయన ముద్దులొలికే బాలుడు. అదే మునీశ్వరులపాలిట పరబ్రహ్మమూ ఈతడే. మరులుగొన్న గోపికలకు మన్మధుని మించిన మన్మధుడు. మరి భక్తకోటికి ఎదుటనే తిరుగాడిన ఈశ్వరుడు. రేపల్లెలోని గోపబాలురకు తమతో ఆటలాడిన గొల్లపిల్లవాడు. లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణిని చేపట్టిన వుద్ధుండుడు. కోపముతో తననే చంపవచ్చిన తృణావర్తునివంటి అసురులపాలిటి మృత్యువు ఇతడే.
అదృష్టవంతులైన పుణ్యాత్ములకు మ్ముక్తినొసగిన ఈశ్వరుడు ఇతడే. పాండవులలో తనకంటె చిన్నవారికి బావ, తనకంటే పెద్దవారికి మరిది ఇతడే. అదృష్టవంతులైన పుణ్యాత్ములకు ముక్తినొసగిన ఈశ్వరుడు ఇతడే. పాండవులలో తనకంటే చిన్నవారికి బావ. తనకంటే పెద్దవారికి మరిది ఈతడే. వసుదేవుని కన్నకొడుకు. ఈ శ్రీవేంకటాద్రి వెలసిన కృష్ణుడు ఈ దేవదేవుడే. భక్తకోటి ఇండ్లముందు తిరుగాడే ఈశ్వరుదు ఇతగాడే.
చిత్రం : Pvr Murty

పొన్నాడ కుమార్ - రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి

 కీ. శే. పొన్నాడ కుమార్ గారు నాకు స్వయానా పినతండ్రి.  కుమార్ గారు గొప్ప రచయిత, నటులు, గాయకులు కూడా. వీరితో నా అనుబంధం మరువరానిది. నా చిన్నతన...