25, జూన్ 2016, శనివారం

కటకటా యిటుచేసెఁ గర్మబాధ - అన్నమయ్య కీర్తనపల్లవి: కటకటా యిటుచేసెఁ గర్మబాధ
యెటువంటివారికిని నెడయ దీబాధ
చ.1: దినదినముఁ బ్రాణులకు దీపనముచే బాధ
తనుపోషణములు కందర్పబాధ
మనసుశాంతికి సదా మమకారములబాధ
తనివోనికోర్కులకు దైవగతిబాధ
చ.2: వెడయాసచూపులకు వేడుకలచే బాధ
కడువేడ్కలకు వియోగములబాధ
తొడవైనయెఱుకలకు దురితబుద్దులబాధ
జడియుఁబరచింతలకు సంసారబాధ
చ.3: అరిది నిశ్చయమతికి ననుమానములబాధ
సరిలేని జీవులకు జన్మబాధ
తిరువేంకటాచలాధిపునిఁ గని మని కొలుచు-
వెరవుచేతనె కాని వీడ దీబాధ (రేకు: 0039-03సం: 01-239)
వాడుకలో లేని కొన్ని పదాలకు అర్థాల వెలుగు
ఎడయదీ బాధ= తొలగిపోదు ఈ బాధ;
తీపనముచే బాధ = కుతూహలముచే బాధ
కందర్పబాధ= మన్మథుని బాధ
తనివోని= తృప్తి పడని
దైవగతి = course of fate
వెడయాశ= విచ్చలవిడి ఆశ
తొడవైనయెఱుకల= అలంకారాలయిన జ్ఞానములకు
జడియు= భయపడు
అరిది= అపురూపము
మని = దేవుఁడు; ఎప్పుడు ఉండువాడు.
వెరవు= ఉపాయము

21, జూన్ 2016, మంగళవారం

'My Pencil Feats' పుస్తక ఆవిష్కరణ / చిత్ర ప్రదర్శన


గత నెల 29 వ తేదీన జరిగిన నా చిత్ర ప్రదర్శన / నా 'మై పెన్సిల్ ఫీట్స్' పుస్తక ఆవిష్కరణ పురస్కరించుకుని 'నమస్తే తెలంగాణ' దినపత్రికలో నాగురించి వచ్చిన న్యూస్ ఐటమ్ 

14, జూన్ 2016, మంగళవారం

పల్లె జంట - పెన్సిల్ చిత్రం - తెలుగు గజల్


'బొమ్మలు చెప్పిన గజల్లు' శీర్షికలో (తెలుగు గజల్ group) నా 'పల్లె జంట' చిత్రానికి శ్రీమతిUmadevi Prasadarao Jandhyala గారి గజల్. (బొమ్మ మీద క్లిక్ చేసి పద్దదిగా చూడగలరు).
।।తెలుగు గజల్।। పల్లె జంట।।
--------------------------------------
అలా వెళ్ళి జాబిల్లిని చూసొద్దాం ఔననవా?
కుందేలుకు కారెట్టును పెట్టొద్దాం ఔననవా?

పెళ్ళిరోజు వస్తున్నది కొత్తచీరకొందామా
పట్నంలో సరదాగా గడిపొద్దాం ఔననవా?

తాతనెపుడు చేస్తారని అయ్యఅడుగుతున్నాడే
కడుపుపండ అమ్మోరికి మొక్కొద్దాం ఔననవా?

కళ్ళేమో నేరేళ్ళూ - స్వర్గానికి వాకిళ్ళూ
కౌగిలినే చెరసాలగ మార్చొద్దాం ఔననవా?

అక్కినేని బిసరోజ అనిపిస్తామంటమనం!
కలరుఫొటో ఒకేఒకటి దిగివొద్దాం ఔననవా?

ఔననవూ కాదనవూ అన్నిటికీ నవ్వుతావు
నవ్వులన్ని పక్కమీద చల్లొద్దాం ఔననవా?

పాడిపంట పదంలాగ వీడిపోని జంటమనది
ఊరిచివరిదాకసిగ్గు తరిమొద్దాం ఔననవా?

నాలచ్చిమి ఈగుండెన చోటున్నది నీకేనే
ఊహలలో ప్రపంచాన్ని ఏలొద్దాం ఔననవా?
-----------------------------------------
ఉమాదేవి జంధ్యాల .

10, జూన్ 2016, శుక్రవారం

'నా తల్లి కృష్ణమ్మ...' - మహాకవి దాశరధి కృష్ణమాచార్య గేయం

మహాకవి దాశరధి కృష్ణమాచార్య ఆనాడు విశాలాంధ్ర ఏర్పడ్డ సందర్భంగా రచించిన గేయం
నా తల్లి కృష్ణవేణమ్మ కన్నీరొత్తి
కొనుచు నాపై ప్రేమ మినుమడించె
గోదావరమ్మ సమ్మోదమ్ముతో నాకు
ముఖమార్జనకు జలమ్ముల నొసంగె
తుంగమ్మ తన పైట కొంగుతో నా మోము
తుడిచి నిద్దుర చిన్నె లడచి వేసె
పెన్నమ్మ తన పయః పీయూషము నొసంగి
ఆకలి మంట చల్లార గొట్టే
మూడు చెరగుల నేలల మూడు కోట్లు
ముడివడినయట్లు కన్ను ముందు తోచె
అందలము నెక్కి యావజ్జనాళి మెచ్చ
సుందరోషస్సు వచ్చే వసుంధరకయి!

(Post courtesy in facebook by Sri Veera Narasimha Raju)

8, జూన్ 2016, బుధవారం

ఆవకాయ - కార్టూన్

ఆంధ్రులకు ఆవకాయకు గల అన్యోన్య అనుబంధం అనిర్వచనీయం. ‘మామిళ్ళ ముక్కపై మమకారమును చల్లి అందించు జిహ్వకు ఆవకాయ’ అంటూ మొదలుపెట్టి ‘ఆంధ్రమాత సింధూరమ్ము ఆవకాయ… అతివ నడుమైన జాడియె ఆవకాయ’ అంటూ ఆ ప్రాశస్త్యాన్ని ఆశువుగా పలికారు కవి. (మామిడి కాయ పై ఆదివారం జూన్ 5, 2016 ‘ఈనాడు’ సంపాదకీయం ‘రాజఫలం’ చదివాక స్ఫురణకు వచ్చిన నా కార్టూన్)

4, జూన్ 2016, శనివారం

SP Balasubramanyam - నా పెన్సిల్ చిత్రం


ఆ గళం ..గుడికట్టిన నుడి కారం (శ్రీబాలుగారిజన్మదినోత్సవంసందర్భంగా......'మధురవాణి' అంతర్జాలపత్రికసౌజన్యంతో)
-ఓలేటి శ్రీనివాసభాను
పాడటం ఓ కళ. అందులోనూ నేపథ్య గానం ప్రత్యేకమైన కళ.తెర మీది దృశ్యం, తెర వెనక గాత్రం - పాలూ తేనెల్లా కలిసిపోవాలి . వాటిని విడదీయలేని అనుభూతి ఆవిష్కృతం కావాలి . ఇంపుగా ఉండాలి . సొంపులు తిరిగి సోయగాలు పోవాలి . వీటన్నిటితోపాటు- స్పష్టత, స్వచ్ఛత గొంతులో గుడి కట్టాలి . ఇవన్నీ కొలువు తీరిన గొంతు శ్రీ బాలు గారిది . అందుకే యాభయ్యేళ్లుగా అది తెలుగు చలనచిత్ర గీతానికి పర్యాయపదమైపోయింది . పాటల చదువుకు పాఠ్యగ్రంథమైపోయింది . తరాల సంగీతాభిమానుల తరగని అభినందనల్ని అందుకుంటోంది.
**********************
'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న'లో "రావే కావ్యసుమబాలా .." అని తొలిసారిగా పల్లవించినప్పుడూ, 'ప్రైవేటు మాస్టారు'లో "పాడుకో పాడుకో .."అని పాడుతూ చదువుకోమని సందేశం ఇచ్చినప్పుడూ, అలాగే "మేడంటే మేడా కాదూ .." (సుఖ దుఃఖాలు),
, "రావమ్మా మహాలక్ష్మీ ..", "చుక్కలతో చెప్పాలని ..", చాలు లే నిదురపో .." (ఉండమ్మా బొట్టు పెడతా)లాంటి పాటలతో పూతరేకుల తీయదనాన్ని లేత గొంతులో పంచి ఇచ్చినప్పుడూ - తెలుగు చలన చిత్రాభిమానులు ఆనందించారు . "కొత్త గొంతు గమ్మత్తుగా ఉందే!" అని స్వాగతించారు . అ క్రమం లో "ఓ చిన్నదానా .."(నేనంటే నేనే) దూసుకొచ్చింది .హాల్లో చూసిన వారినీ, రేడియోలో విన్న వాళ్ళనీ ఒకే లాగ "ఓహో" అనిపించింది . నటుడు కృష్ణకి అచ్చంగాసరిపడే స్వరం వచ్చిందని జనం చెప్పుకొన్నారు .

నటుడైనా, గాయకుడైనా తమ లో వైవిధ్యాన్ని రుజువు చేసుకోవాలనుకుంటారు. హుషారు పాటలతో పాటు లలిత శాస్త్రీయ సంగీత ఛాయలున్న పాటల్ని కూడా పాడగలనని ఆ స్వరం నిరూపించుకునే దశలో బాలు గారికి 'శ్రీరామ కథ'లో సముద్రాల రాఘవాచార్యుల వారి చివరి గీతం -"రామ కథ.. శ్రీరామ కథ "ను రాగమాలిక లో పాడే అవకాశం వచ్చింది . గాత్రం లో వైవిధ్యాన్ని చూపించడానికి దోహదపడింది . అలాగే 'ప్రతీకారం; చిత్రం లో "నారీ రసమాదురీ..", 'ఆంధ్ర పుణ్యక్షేత్రాలు'(జానకి గారితో కలిసి పాడిన ప్రైవేటు ఆల్బం)లాంటివి కూడా ఆయన లోని గాయకుడు ఆశించే వైవిధ్య ప్రదర్శనకు ఊతమిచ్చాయి !
కానీ, అప్పటి చలన చిత్ర అవసరాల దృష్ట్యా అలాంటి అవకాశాల కోసం బాలుగారు మరికొంత కాలం నిరీక్షించాల్సి వచ్చిందేమో! అదృష్టం వల్ల అవకాశాలు వస్తాయోమో గానీ, వాటిని సద్వినియోగం చేసుకోడానికి కృషి, పట్టుదల,ప్రతిభ ముప్పేటలా తోడు కావాలి .ఆ మూడూ ఉన్న బాలూ గారి గొంతు ఎప్పటికప్పుడు సత్తాను నిరూపించుకుంటూనే, ఎదురైన పరీక్షల్లో విజయాన్ని ప్రథమ శ్రేణిలో సాధిస్తూనే వచ్చింది .

సంపూర్ణ నేపథ్యగాయకుడిగా ఎదిగే ప్రస్థానం లో ఆయనకు మరో ముఖ్యమైన సవాలు ఎదురయింది. అదే-"అగ్రనటులు ఎన్టీఆర్ , ఏయన్నార్ లకు బాలుగారి గొంతు సరిపోతుందా?"అన్న మీమాంస! అప్పటికి ఎన్టీఆర్ కి ఆయన "పట్టాలి అరక దున్నాలి మెరక .."(చిట్టి చెల్లెలు), "నిద్దురపోరా స్వామీ.."(కోడలు దిద్దిన కాపురం), అలాగే ఏయన్నార్ కి "నాహృదయపు కోవెల లో .." (ఇద్దరు అమ్మాయిలు) లాంటివి పాడారు. కానీ మీమాంస తీరడానికి మరికొంత సమయం పట్టింది . ఆ లోగా వైవిధ్యం, సంకల్పం, పట్టుదల, తపన, రాజీపడని తత్త్వం,ఒడిసిపట్టి ఒదిగిపోయే నైపుణ్యం- ఈ ఏడు లక్షణాలూ సప్తస్వరాలై బాలుగారి గొంతులో స్థిరపడిపోయాయి . ఫలితం ఏమిటో అగ్రనాయకులకు ఆయన పాడిన పాటలే చెప్పాయి . 'దానవీరశూర కర్ణ' వచ్చింది. దుర్యోధనుడిపాత్ర లో ఎన్టీఆర్ కి యుగళగీతం -"చిత్రం ..భళారే విచిత్రం" ఒక ఊపు ఊపింది ..సరి కొత్త పోకడ సృష్టించింది . 'ఆలుమగలు ' వచ్చింది . "ఎరక్కపోయి వచ్చాను .." పాట అక్కినేని హావభావాలకు అచ్చమైన శబ్దరూపాన్నిచింది . ఇద్దరు అగ్రనటుల గొంతుల్లోనూ , కవళికల్లోనూ వ్యక్తమయే విభిన్నత్వానికి నూరుపాళ్ళ న్యాయం చెయ్యడానికి బాలుగారిలో ధ్వన్యనుకరణ నైపుణ్యం అక్కరకు వచ్చింది . ఆ ఆతర్వాత -'అడవిరాముడు', 'ప్రేమాభిషేకం'లాంటివి చారిత్రిక అధ్యాయాలు ! చలనచిత్రానికి అవసరమైన మోతాదులో శాస్త్రీయ సంగీత ఛాయల్ని మేళవించి, ఓ సినిమా ఆద్యంతాల వరకు న్యాయం చేకూర్చడం ఆ తర్వాతి చరిత్ర! అది 'శంకరాభారణం'తో సాకారమయింది . బాలు గారికి జాతీయ పురస్కారాన్ని అందించింది .
యాభయ్యేళ్ళ ఈ సుదీర్ఘ ప్రస్థానం లో బాలుగారి ప్రతిభ కేవలం తెలుగు పాటలకే పరిమితం కాకపోవడం మరో ప్రత్యేకత . తమిళ, కన్నడ చలనచిత్రాభిమానులు "బాలూ తమ వాడే " అని ప్రేమించి, అభిమానించేలాగా ఆయా భాషల్లో పాటలకు న్యాయం చేశారాయన . అంతేకాదు చిరుతెర మీద తన అనర్గళమైన వ్యాఖ్యాన ప్రతిభతో పొరుగు రాష్ట్రాల వారిప్రశంసలు కూడా అందుకుంటున్నారు . అలాగే తన హిందీ పాటలతో ఉత్తరాది మెప్పును , హిందీ పాటకు జాతీయ పురస్కారాన్నీ పొందారాయన!
మాతృభాష లో కావచ్చు, మరో భాష లో కావచ్చు ..బాలుగారి విజయ రహస్యం - భాషల పట్ల ఆయనకున్న అపారమైన గౌరవం! ఉచ్చారణ లో స్పస్టత కోసం, సహజమైన పలుకుబడి లో నిబిడీకృతమైన అందాల్ని అందించడం కోసం, తన పాట వింటున్న ప్రతీ వ్యక్తినీ -"ఈయన నా భాషను నాలాగే పలుకుతున్నారు"అని ఒప్పించి, మెప్పించి ,తనతో పాటు తీసుకువెళ్ళడం కోసం, బాలు గారు పడే తపన, రాజీ లేని కృషి, నిరంతర అధ్యయనం, ఇలా ఎన్నో ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి .వివిధ వేదికల మీద నుంచి, మాధ్యమాల నుంచి ఔత్సాహిక గాయనీ,గాయకులకు ఆయనిచ్చే సూచనల్లో,సలహాల్లో ఇవన్నీ అంతర్లీనంగా ఉంటాయి . అందుకే బాలుగారు ఏ భాషలో పాడినా ఆ నుడికారానికి అది రక్షణ కవచం లాగా నిలిచిపోతుంది.

(Thanks to Sri Voleti Srinivas Banu for his article in facebook)

Iravati Karve - Anthropoligist - charcoal pencil sketch

My charcoal pencil sketch of Iravati Karve Irawati Karve was a pioneering Indian sociologist, anthropologist, educationist and writer from M...