27, సెప్టెంబర్ 2020, ఆదివారం

కవిత 'బాలు' - అమర గాయకుడు SP Balasburahmanyam 


మా తమ్ముడు చి.
Umamaheswar Rao Ponnada
అమర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పై రాసిన కవిత యధాతధంగా :
బాలు
---------
అయిదున్నర దశాబ్దాలు అలరించిన
ఓ గొంతు మూగబోయింది!
అఖండంగా కురుస్తున్న ఓ అమృతధార
హఠాత్తుగా ఆగిపోయింది!
వెన్నెల కరిగి సన్నగా అతని
గొంతులోంచి జారినట్లు ఉండేది.
సన్నజాజి అతని పెదవుల మీదనే
విరిసి పాటతో పరిమళించినట్లుండేది.
ఎవరైనా అనుకున్నామా?
నిశ్శబ్దంగా మొలిచిన ఓ లేత స్వరం
తేనెల జల్లులు కురిపిస్తుందని,
కోట్లాది మనసులని మురిపిస్తుందని,
భాషా హద్దులని చెరిపేస్తుందని!
ఎవరైనా ఊహించామా!
పాట అతని గొంతులో మరో గుండెగా వెలుస్తుందని,
పాటే అతనికి ఊపిరిగా నిలుస్తుందని!
మన ప్రతి ఉదయం అతని పాటతో పలకరిస్తుందని,
ప్రతి తెలుగు గుండె అతని పాటతో పులకరిస్తుందని!
ఏమైందో, ఏమో?
పై నుంచి ఎవరైనా చేతులు చాచి పిలిచారో?
ఈ బాలు ఇక మీకు చాలు అని తలచాడో?
హడావుడిగా తన పాటల మూటల్ని
భుజాన వేసుకొని మరొక కొత్త వేదికను
వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు!
ఇకపై
అక్కడ గంధర్వలోకంలో రోజూ
అతని గానకచేరీ కొనసాగుతూనే ఉంటుంది!
ఇక్కడ గాలి ఉన్నంత వరకు మనకోసం
అతని పాటను మోసుకొస్తూనే ఉంటుంది!
.........
రాతలు పొన్నాడ ఉమామహేశ్వర రావు
గీతలు: శ్రీ పొన్నాడ వెంకటరమణమూర్తి

26, సెప్టెంబర్ 2020, శనివారం

గంగా యమునా తరంగాలతో - కొసరాజు రచన, ఘంటసాల గాత్రం

 


కొసరాజు గారంటే ఎప్పుడూ జానపద గేయాలే గుర్తుకొస్తాయి. వాటికి భిన్నంగా చక్కటి లలిత గీతాలు కూడా రచించారు. అటువంటిదే ఓ దేశభక్తి గీతం 'గంగా యమునా తరంగాలతో".  ఈ గీతాన్ని ఘంటసాల అద్భుతంగా గానం చేశారు. సాహిత్యాభిమానులకోసం ఆ పాట సాహిత్యాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.  కొసరాజు-హంటసాల గారి చిత్రాలతో నేను తయారు చేసిన వీడియో లింక్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. వినండి.

https://www.youtube.com/watch?v=876k6fP9BP0


గంగా యమునా తరంగాలతో

సుందర నందన మధువనాలతో

సౌభాగ్యముతో కళకళలాడే

ఎంత చక్కనిది మనదేశం

ఎంత చక్కనిది మనదేశం


గంగా యమునా తరంగాలతో

సుందర నందన మధువనాలతో

సౌభాగ్యముతో కళకళలాడే

ఎంత చక్కనిది మనదేశం

ఎంత చక్కనిది మనదేశం


కన్నుచెదురు పంజాబు గోధుమల

చెన్నపురికి అందించెదము

కన్నుచెదురు పంజాబు గోధుమల

చెన్నపురికి అందించెదము

నేయిగారు నెల్లూరు బియ్యమును

నేయిగారు నెల్లూరు బియ్యమును

నేస్తముగా చెల్లించెదమూ

నేస్తముగా చెల్లించెదమూ


కాశ్మీరున గల కమ్మని కస్తూరి

గంపల కొలదిగ తెచ్చెదమూ

కాశ్మీరున గల కమ్మని కస్తూరి

గంపల కొలదిగ తెచ్చెదమూ

మైసూరున గల చందన గంధము

మైసూరున గల చందన గంధము

బహుమానముగా పంచెదమూ

బహుమానముగా పంచెదమూ


బ్రహ్మపుత్ర కావేరి నధులకు

బాంధవ్యమ్మును కలిపెదము

బాంధవ్యమ్మును కలిపెదము

కులమత బేధములరయక శ్రమతో

కులమత బేధములరయక శ్రమతో

బంగారము పండించెదమూ

బంగారము పండించెదమూ


గంగా యమునా తరంగాలతో

సుందర నందన మధువనాలతో

సౌభాగ్యముతో కళకళలాడే

ఎంత చక్కనిది మనదేశం

ఎంత చక్కనిది మనదేశం

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

బోయి భీమన్న - Boyi Bheemanna, pen sketch

బోయి భీమన్న - నా pen sketch


బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుపద్మ భూషణ్తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే ఆయన వీటిని నిరసించాడు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా  చేశాడు. 

మరిన్ని వివరాలు వికీపీడియా లింక్ లో ...   


 https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BF_%E0%B0%AD%E0%B1%80%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8

 

24, సెప్టెంబర్ 2020, గురువారం

పి. బి. శ్రీనివాస్ - P.B. Srinivas -


పి. బి. శ్రీనివాస్ (ప్రతివాది భయంకర శ్రీనివాస్) - My pencil sketch

మధుర గాయకుడు, బహుభాషా గాయకుడు, బహుభాషా కోవిదుడు పి.బి.శ్రీనివాస్ (ప్రతివాది భయంకర శ్రీనివాస్) జయంతి (22 September) సందర్భంగా నా చిత్ర నివాళి. తెలుగువాడైనప్పటికీ కన్నడ భాషలో ఎక్కువ పాటలు, అందునా కన్నడ చలనచిత్ర అగ్రనటుడు రాజ్ కుమార్ కి పాడడం ఓ విశేషం.

వీరి గురించి ప్రముఖ విశ్లేషకులు శ్రీ రోచిష్మాన్ గారు ఇలా అంటున్నారు.

బహుభాషా చలనచిత్ర నేపథ్య గాయకులు, అష్టభాష కవి, నూతన కర్ణాటక సంగీత రాగ సృష్టికర్త, నూతన ఛందః సృష్టికర్త, వాగ్గేయకారులు, తొలితెలుగు గౙల్ గాయకులు, తొలి తెలుగు గౙల్ వాగ్గేయకారులు, ఇంగ్లిష్ గానం చేసిన తొలి తెలుగు గాయకులు, ఎనిమిది భాషల్లో గౙళ్లు వ్రాసిన తొలికవి ఆపై ఏకైక కవి, అమెరిక‌ అధ్యక్షులు నిక్సన్ (Nixon) ప్రశంసల్ని, చంద్రుడిపై కాలు మోపిన ఆంస్ట్రంగ్ (Armstrong) ప్రశంసల్ని అందుకున్న కవి-గాయకులు పి.బి.శ్రీనివాస్. ఆయన వర్ధంతి (ఏప్రిల్ 14)  సందర్భంగా ఆయన గొప్పదనాన్ని మరోసారి స్మరించుకునే ప్రయత్నంలో భాగంగా వారి అష్టభాషా కవితా సంకలనం "ప్రణవం"పై ఒక సమర్పణ.‌
 
ప్రణవం- ప్రపంచంలో తొలి ఆపై ఏకైక‌ అష్టభాషా‌ కవితా‌ సంకలనం. ఆ ఎనిమిది‌ భాషల కవితలను రాసిన‌ కవి తెలుగువారైన పి.బి.శ్రీనివాస్.‌ నమోదైన ప్రపంచఫు తొలి‌ అష్టభాషా కవి పి.బి.శ్రీనివాస్.‌
 
"నాచన సోముడు అష్ట భాషా కవి అని మనం చదివాం. కానీ ఆ అష్టభాషలు తెలుగు మాండలిక భేదాలే. వేర్వేరు భాషలు కావు" సి. నారాయణ రెడ్డి ఈ‌ మాటలు అన్నారు. "మనకు తెలిసిన‌ ఏకైక అష్టభాషా కవి పి.బి.శ్రీనివాస్" ఇవీ సినారె మాటలే.
 
పి.బి.శ్రీనివాస్ వ్రాసిన ప్రణవంసంస్కృతం, తెలుగు,‌ తమిళ్,‌ కన్నడం, మలయాళం, హిందీ, ఉర్దూ,‌ ఇంగ్లిష్ ఈ ఎనిమిది‌‌ విభిన్న భాషల‌ కవితల సంకలనం. భాషకు ఎనిమిది చప్పున ఎమినిది భాషలకూ ఎనిమిది‌ వేఱు వేఱు ఇతివృత్తాల కవితలు ఈ ప్రణవంలో పొదగబడినాయి. ఒక్క ఇంగ్లిష్ భాషకు తప్ప తక్కిన ఏడు భాషల కవితలకు ఇంగ్లిష్ లిపి అంతరీకరణమూ,‌ ఇంగ్లిష్ అనువాదమూ ఇవ్వబడ్డాయి. ఈ సంకలనంలోని కవితలూ, వాటి ఇంగ్లిష్ లిపి అంతరీకరణలూ, అనువాదాలూ కవి పి.బి.శ్రీనివాస్ చేతి‌వ్రాతలోనే ఉంటాయి. ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి ప్రయత్నమూ, ఇంతటి ప్రయోగమూ మఱెక్కడా జరగలేదు.
 
1997లో ఈ ప్రణవం‌ పుస్తకం విడుదలయింది. ముఖపత్రంలోనే ఎనిమిది భాషలూ కనిపిస్తాయి. అష్టభాషా‌ కవితా సంకలనం ప్రణవం తెలుగు సృష్టించిన అద్భుతం. ఒక‌ తెలుగు మేధ మాత్రమే అందించగలిగిన అద్భుతం. ఈ‌ ప్రణవం లో సంస్కృతం, ఉర్దూలతో సహా ఇతర భాషల గౙళ్లూ, అంతర్లాపి కవితలూ, అష్టపదులూ, సామాజిక వచన కవితలూ,‌ గేయాలూ, భక్రి గీతాలూ, జానపద గేయాలూ, భజన్‌లు, చోటు చేసుకున్నాయి.
 
సంస్కృతంలో‌ ... "స్తుతిగాన పియూష పానానురక్తమ్" అనీ, తెలుగులో " భావాలకు పుట్టినిల్లు తెలుగు భాష , పలువన్నెల వానవిల్లు తెలుగు భాష" అనీ, తెల్లనైన నీడలాగా" అనీ "తనువు వేడిని తనువు కొలిచింది" అనీ, తమిళ్‌లో "ఒకామే మనకు మాత ఆమే భారతమాత" అనీ, "అహంకారం మూర్ఖత్వానికి సంతానం" అనీ, కన్నడంలో "ప్రకృతి‌ ఒడిలో మనమందఱమూ కలిసిపోదాం" అనీ, "మధురమర్మం" అనీ మలయాళంలో " నా హృదయం ఒక ఆలయం అది కళల ఆశ్రమంగా కట్టబడింది"‌ అనీ, హిందీలో "భాషా‌ పుల్ హై దీవార్ నహీ(భాష వంతెన, గోడ కాదు ) భాషా గుల్ హై తల్వార్ నహీ (భాష పుష్పం, ఖడ్గం కాదు)" ‌అనీ, ఉర్దూలో "హుస్న్ కీ జబీన్ పర్ మాహ్ తాబ్ హై గౙల్ / షాయిరీ కీ షాన్ కా ఆఫ్ తాబ్ హై గౙల్ ( సౌందర్యం ఫాలభాగం పైన జాబిల్లి గౙల్/ కవిత్వం ఔన్నత్యం పైన సూర్యుడు గౙల్) అనీ, "చార్ దిన్ కీ జిందగానీ క్యూన్ కిసిసే దుష్ మనీ/ దుష్ మనీ చాహేతొ కర్ లే దుష్ మనీ సే దుష్ మనీ
 
(నాలుగు రోజులదీ జీవితం ఇతరులతో ఎందుకు శత్రుత్వం/ శత్రుత్వమే కావాలనుకుంటే చేసుకో శత్రుత్వంతోనే శత్రుత్వం) అనీ, ఇంగ్లిష్‌లో "English never gets old. as it is energetic and eternally young in age" అనీ "Oh Death, it is high-time for you to die!" అనీ, Optimism is a prism of colour ful rays / Noble and bold minds receive God's grace" అనీ "Love is whiter than the pure snow" అనీ ఈ‌ ప్రణవం కవి పి.బి. శ్రీనివాస్ తమ‌ కావ్య వాక్యాలనూ, వాక్య కావ్యాలనూ మనకు అందించారు.
 
"అరుదైన అనర్ఘ‌ రత్నం‌ ఈ అష్టభాషా‌ కవితా‌ సంకలనం ప్రణవం" అని అనడం సరికాదు. ఈ ప్రణవంలోని ఎనిమిది భాషలనూ వెదికి అంతకన్నా అద్భుతమైన అభివ్యక్తితో ఈ ప్రణవంను అభివర్ణించాలి. 

Courtesy ఆంధ్రజ్యోతి April 14, 2019

22 September 2020 నాడు వీరి గురించి మిత్రులు కొంపెల్ల శర్మ గారి ఆధ్వర్యంలో సమాలోచన సభ జరిగింది. ఈ లింక్ క్లిక్ చేసి వీక్షించమని మనవి. 

ప్రపంచ పదులు - డా. సి. నారాయణ రెడ్డిపద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు 

ప్రపంచ పదులు 

➿➿➿➿➿➿➿

సముద్రానికి చమురు పూస్తే నల్ల బడుతుందా?

హిమన గనికి బొగ్గుపూస్తే నల్లబడుతుందా?

తలుపులూ కిటికీలు ఎంతగా మూసుకొని ఉన్నా

తరుముకొచ్చే కాల వాహిని తిరిగిపోతుందా?

ముసురుకొచ్చే ముదిమి తన వల విసరకుంటుందా? 

--------------------------------------------------------

చేదు సత్యం మింగగలిగితె జీవితం వైద్యాలయం

మనసు పుటలను చదవగలిగితే అనుభవం విద్యాలయం.

ఎవ్వరో నేర్పాలనే భ్రమ యెందుకంట వృధావృధా!

--------------------------------------------------------------------------

అడుగు తప్పక ఆడగలిగితె అవనియే నృత్యాలయం 

కనులు తిప్పక చూడగలిగితె ఆణువణువు తత్వాలయం.

----------------------------------------------------------------------------


మింటికుందో యేమొగానీ కంటికేదీ పరిమితి ?

దిక్కుకుందో యేమొగానీ మొక్కుకేదీ పరిమితి ?

అన్నిటికి గిరిగీసి చూపే ఆ ప్రయత్నం వ్యర్థమే –

భాషకుందో యేమొగానీ ధ్యానకేదీ పరిమితి ?

శ్వాసకుందో యేమొగానీ ఆశకేదీ పరిమితి ? 

-------------------------------------------------------------------------------


కవితలలో కొన్ని భాగాలు

ఎన్ని సార్లు చెక్కితే ఒకశిల్పం

ఎన్నిసార్లు తీర్చితే ఒక చిత్రం

కబుర్లు చెప్పకే ఓ కాలమా 

ఎన్ని సార్లు చస్తే ఓ జీవితం 

————————

ఆ మబ్బు సంతకం ఉంది చినుకుల్లో

ఈ మామ సంతకం ఉంది చిగురుల్లో

ఏ దస్తావేజులను చూసి ఏం లాభం

నా మనసు సంతకం ఉంది పరుగుల్లో 

———————

🌷విశ్వంభరనుండి


నేను( మనిషి )పుట్టకముందు మబ్బులెంతగా

ఎదురుచూసాయో

చూపుల సోపానాలపై సాగివచ్చి తమను పిండుకునే తపన ఏదని !

ఉషస్సులెంతగా ఉద్వేగ పడ్డాయో

విచ్చుకున్న తమ కంటికడలిలో

పిచ్చిగా నురగెత్తే విముక్తాత్మలేదని !సేకరణ -డా. ఉమాదేవి జంధ్యాల 

చిత్రం - శ్రీ Pvr Murtyగారు

ధూళిపాళ సీతారామ శాస్త్రి - Dhulipala Seetarama Sastryధూళిపాళ సీతారామ శాస్త్రి (సెప్టెంబర్ 24, 1922 - ఏప్రిల్ 13, 2007) - నా pencil sketch

ధూళిపాళ సీతారామ శాస్త్రి (సెప్టెంబర్ 241922 - ఏప్రిల్ 132007) తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి 

తెలుగు చిత్రసీమలో శకుని అనే పేరు వినిపించగానే గుర్తుకొచ్చే నటులు... సీఎస్సార్, లింగమూర్తి. వాళ్ల తర్వాత ఆ పాత్రపై తనదైన ముద్ర వేసిన నటుడు ధూళిపాళ. ప్రత్యేకమైన వాచకం, హావభావాలతో శకుని పాత్రకి ప్రాణ ప్రతిష్ట చేశారాయన. తెలుగు నాటక, చలన చిత్ర రంగాలపై బలమైన ప్రభావం చూపించిన ఆయన... 1922 సెప్టెంబరు 24న గుంటూరు జిల్లా, దాచేపల్లిలో శంకరయ్య, రత్నమ్మ దంపతులకి జన్మించారు. ఆయన పూర్తి పేరు ధూళిపాళ సీతారామశాస్త్రి చిన్నప్పట్నుంచే రంగస్థలంపై మక్కువ పెంచుకొన్నారు. బతుకు తెరువు కోసం గుంటూరులో కొంతకాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేసిన ఆయన 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటక రంగ ప్రవేశం చేశారు. 1941లో స్టార్‌ థియేటర్‌ని స్థాపించి నాటక ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన రంగస్థలం మీద దుర్యోధన, కీచక పాత్రల్ని పోషించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకి వెళ్లినప్పుడు, ఆ పోటీల న్యాయ నిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే కాకుండా, దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకి పరిచయం చేశారు. దాంతో బి.ఎ.సుబ్బారావు ‘భీష్మ’ (1959)లో దుర్యోధనుడి పాత్రని ఇచ్చారు. అందులో భీష్ముడిగా ఎన్టీఆర్‌ నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభని మెచ్చుకున్న ఎన్టీఆర్‌ తర్వాత నత సంస్థలో నిర్మించిన ‘శ్రీకృష్ణ పాండవీయం’లో శకుని పాత్రని ధూళిపాళకి ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి పలు పౌరాణిక పాత్రలు పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి మెప్పించిన ఆయన ‘దానవీర శూరకర్ణ’, ‘మాయాబజార్‌’, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘నర్తనశాల’, ‘బొబ్బిలియుద్ధం’, ‘వీరాభిమన్యు’, ‘పూలరంగడు’, ‘శ్రీకృష్ణావతారం’, ‘జగన్మోహిని’, ‘కథానాయకుడు’, ‘ఆత్మగౌరవం’, ‘ఉండమ్మా బొట్టు పెడతా’... ఇలా ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేశారు. తమిళ పత్రికలు సైతం ఆయన నటనని, ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చి నటనలో పులి... నడతలో గోవు అని అర్థం వచ్చేలా ‘నడిప్పిళ్‌ పులి నడత్తల్‌ పసువు’ అని కీర్తించాయి. బాంధవ్యాలు చిత్రంలో నటనకిగానూ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి ‘చూడాలని ఉంది’, ‘శ్రీఆంజనేయం’, ‘మురారి’ వంటి చిత్రాల వరకు... మూడున్నర దశాబ్దాలకి పైగా సాగిన ఆయన నట ప్రయాణంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఉన్నట్టుండి ఆయన ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టారు. తనకున్న సంపదని త్యజించి, 2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా సన్యాస దీక్షని స్వీకరించారు. అప్పట్నుంచి ఆయన శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో చలామణీ అయ్యారు. గుంటూరు మారుతీనగర్‌లో మారుతీ దేవాలయాన్ని నిర్మించి... రామాయణం, సుందరకాండలని తెలుగులోకి తిరగరాశారు. ధూళిపాళ ట్రస్టుని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేశారు. కొద్దికాలం ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడిన ఆయన 2007, ఏప్రిల్‌ 13న తుదిశ్వాస విడిచారు

  భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala చిత్రాలు : Pvr Murty సహకారం : శ్రీమతి Ponnada Lakshmi ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె...