25, జూన్ 2019, మంగళవారం

నీ వలపుల మాటలలో .. కవిత



నా చిత్రానికి శ్రీమతి పుచ్చా గాయత్రీ దేవి గారి కవిత


నీ వలపుల మాటలలో నేను తడిసిపోతున్న 

తేలికబడి మేఘమువలె కదిలిపోతూ నేఉన్నా.
అందమైన ఆంక్షలే నీకు నాకు సారధిగా.
గగనాన హరివిల్లె మన మధ్యన వారధిగా.

జతకూడిన కోకిలమ్మ మౌనమే తన భాషగా
కరబంధన దండలే అమరెను దరి చేర్పుగా.
చిగురించే కొత్త ఆశ మొలకొచ్చిన విత్తులా.
మన జీవన వాహినిలో సరి కొత్త సంగతిగా.

కనబడని మదనుడే నీ నవ్వుల శరము వేసే
జపియిస్తూ నీ పేరే మరో బ్రహ్మ అస్త్రముల.
చెలియలికట్టలే దాటినా ఈ ఆనందపు తరుణములో
అంబరమే అవధిగా సాగుదామా ఎచటికో.......
పి. గాయత్రిదేవి.. 

17, జూన్ 2019, సోమవారం

వలపులజడి వానలోన - తెలుగు గజల్

- నా చిత్రానికి పద్మజ చెంగల్వల గారి తెలుగు గజల్

వలపులజడి వానలోన తోడొచ్చిన ఆనందం
దాగివున్న ఊసులకే బలమొచ్చిన ఆనందం
చెలికాడే చెంతనుండ చింతలన్ని వీడిబోయె
గుబులుతీరి మౌనానికి మాటొచ్చిన ఆనందం
ప్రాణసఖుడు ఊరడించ దరిజేరగ తన్మయమే
సిగ్గుపడే చినదానికి ఉబికొచ్చిన ఆనందం
కలతలన్ని కరిగిపోవ కౌగిలిలో ఒదగగనే
కనుపాపల మెరుపులన్ని తిరిగొచ్చిన ఆనందం
ప్రియకాంతుని చేరువలో జీవితమే వెన్నలాయె
చెంగల్వకు బతుకుబాట అందొచ్చిన ఆనందం

-

12, జూన్ 2019, బుధవారం

ఈ బాల్యం మాకొద్దు - pencil sketch


నా చిత్రానికి శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి గారి కవిత  

ఈ బాల్యం మాకొద్దు

బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న

బుజ్జి బుజ్జి పాదాలను
బూట్లు సాక్సులతో బంధించి
మోయలేని బరువును భుజాలకెత్తి
క్రిక్కిరిసిన ఆటోలో
ఉక్కిరిబిక్కిరి చేస్తూ
క్లాసురూములోనే 
ఖైదీలుగా మార్చేసి
గంటకొక్క టీచరొచ్చి
గంటకొట్టినట్లుగా
అర్థంకాని భాషలో
అనర్గళంగా 
చెప్పేసిపోతుంటే
చెయ్యలేనంత హోం వర్కుతో
వసివాడిపోతున్న
పసితనం మాకొద్దు

అమ్మ గోరుముద్దలకోసం
ఆరాటపడే ఆకలి
ఆయమ్మ సాయంతో
ఎంగిలిపడటం నేర్చుకుంటోంది
క్లాసులో టీచరు కన్నెర్రజేస్తే
కావలించుకుని ఓదార్చే 
అమ్మ దగ్గరలేక
బిక్కచచ్చిన మనసు
వెక్కిళ్ళుపడుతూ
కన్నీళ్ళు మింగింది

మాతృభాష మహానేరమైన
పాఠశాల పంజరంలో
ఆంగ్లభాష చిలకపలుకు
భావ ప్రకటన స్వేచ్ఛను 
బాల్యంనుండి హరించింది

ఆడుకోవటం అల్లరి చేయటం
కబుర్లు చెప్పటం కథలు వినటం
కాన్వెంట్ కల్చరు క్రమశిక్షణ మాటున
కల్లలుగా మారి
కలగా మిగిలింది
ఆటస్థలాలు లేని 
అంతస్థుల బడిలో
బాల్యాన్ని మూల్యంగా చెల్లించి
పొందబోయే భవిష్యత్తు
బంగారమైనా గానీ
అది మాకొద్దు
ఈ బాల్యం మాకొద్దు.

సింహాద్రి జ్యోతిర్మయి
నరసం ఉపాధ్యక్షురాలు.

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...