25, జూన్ 2016, శనివారం

కటకటా యిటుచేసెఁ గర్మబాధ - అన్నమయ్య కీర్తన



పల్లవి: కటకటా యిటుచేసెఁ గర్మబాధ
యెటువంటివారికిని నెడయ దీబాధ
చ.1: దినదినముఁ బ్రాణులకు దీపనముచే బాధ
తనుపోషణములు కందర్పబాధ
మనసుశాంతికి సదా మమకారములబాధ
తనివోనికోర్కులకు దైవగతిబాధ
చ.2: వెడయాసచూపులకు వేడుకలచే బాధ
కడువేడ్కలకు వియోగములబాధ
తొడవైనయెఱుకలకు దురితబుద్దులబాధ
జడియుఁబరచింతలకు సంసారబాధ
చ.3: అరిది నిశ్చయమతికి ననుమానములబాధ
సరిలేని జీవులకు జన్మబాధ
తిరువేంకటాచలాధిపునిఁ గని మని కొలుచు-
వెరవుచేతనె కాని వీడ దీబాధ (రేకు: 0039-03సం: 01-239)
వాడుకలో లేని కొన్ని పదాలకు అర్థాల వెలుగు
ఎడయదీ బాధ= తొలగిపోదు ఈ బాధ;
తీపనముచే బాధ = కుతూహలముచే బాధ
కందర్పబాధ= మన్మథుని బాధ
తనివోని= తృప్తి పడని
దైవగతి = course of fate
వెడయాశ= విచ్చలవిడి ఆశ
తొడవైనయెఱుకల= అలంకారాలయిన జ్ఞానములకు
జడియు= భయపడు
అరిది= అపురూపము
మని = దేవుఁడు; ఎప్పుడు ఉండువాడు.
వెరవు= ఉపాయము

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...