20, జూన్ 2018, బుధవారం

యద్దనపూడి సులోచనారాణి - Yaddanapudi Sulochanarani

 యద్దనపూడి సులోచనారాణి - నా పెన్సిల్ చిత్రం


యద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళామణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు. ఎక్కడా నేల విడిచి సాము చేయకుండానే తనదైన శైలితో అరుదైన రచనలు చేశారు. ముఖ్యంగా 1970వ దశకంలో ఆమె రచనలు సినీ ప్రపంచాన్ని కూడా ఓ ఊపు ఊపాయి. స్త్రీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనా రాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు.

యద్ధనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను వస్తువులుగా తీసుకొని మొదట రచనలు చేయడం ప్రారంభించారు. తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి, వారి ఊహల్లోంచి, కలల్లోంచి వచ్చిన పాత్రలను సృష్టించారు. అయితే వాటిని సజీవపాత్రలకు దగ్గరగా ఉండే విధంగా మలిచారు. వీరి నవలల్లో, కథల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఎక్కువగా కోటీశ్వరుడైన నాయకుడు, కిందిస్థాయి నాయిక, విరిద్ధరి మధ్యా అంకురించే ప్రేమ. ఇదే వీరి నవలా సూత్రం. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం... ... ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు.

వర్ణనల విషయానికి వస్తే వీరి నవలల్లో ఇళ్లు, పరిసరాలు, ప్రకృతి, మానసిక వర్ణనలు సహజత్వాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని బట్టి సాగుతాయి. ఇవి ఎక్కువ ప్రచారం పొందడానికి కారణం- మెజారిటీ ప్రజల జీవన విధానాలను, అనుభూతులను పొందుపరచడమే. వీరి నవలా పాత్రలు విచిత్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతాయి. కొద్ది సంతోషాన్ని పొందగానే వెంటనే దుఃఖానికి లోనవుతాయి. అందుకేనేమో బహుశా సాధారణ ప్రజల జీవితాలకు ఇవి దగ్గరయ్యాయి. ధైర్యం - అధైర్యం, ప్రేమ - కోపం, పేదరికం - సంపద, శాంతి - అశాంతి, ఆశ -  నిరాశ... ఇలాంటి సహజాతాల మధ్య వీరు సృష్టించే పాత్రలు తలమునకలవు తుంటాయి. చదివే పాఠకులకు ఆసక్తిని, ఉత్కంఠను కలిగిస్తుంటాయి.

యద్దనపూడి సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ప్రతి యువకుడు ఓ రాజశేఖరంలా, ప్రతి యువతీ ఆత్మాభిమానం గల జయంతిలా ఉండాలనుకునే వారు. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు మీనా నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి సినిమాగా తీసింది.

సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు. ఆత్మాభిమానం గల ఆడపిల్లలను తన నాయికలుగా ఎన్నుకున్నారు. ధనవంతుల యువకులను నాయకుడిగా చేశారు. వీరి రచనలు నేటికీ టీవీలలో ధారావాహికలుగా వస్తూనే ఉన్నాయి. ప్రముఖ ఛానల్లో వచ్చిన రాధ మధు సీరియల్ కథ వీరిదే. నేటికీ చాలామంది పాఠకుల హృదయాల్లో వీరి నవలలు నిక్షిప్తమయి ఉన్నాయి. చాలామంది పాఠకులు నేటికీ వీరి రచనలను విస్తృతంగా చదువుతున్నారు. 
సులోచనారాణి మే 21, 2018 సంవత్సరంలో కాలిఫోర్నియా, అమెరికాలో స్వర్గస్తులయ్యారు.

(సేకరణ - ఇక్కడా అక్కడా)


(సేకరణ - ఇక్కడా అక్కడా)



కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...