9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

"ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు" - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు" _డా. Umadevi Prasadarao Jandhyala
గారి వివరణతో

చిత్రం : పొన్నాడ మూర్తి
——🌺🌺——
ఓం నమో వేంకటేశాయ 🙏
ఒక ప్రార్థన పద్యం
ఉ॥
స్వాంతము పొంగ కన్గవకుఁబండువుగాగ ప్రభూ విలాస విక్రాంత పరావరాలయముఁబ్రహ్మ ముఖామర పూజితంబు దు
ర్దాంత దురంత దుఃఖములఁగ్రన్నన మాన్పుచు భక్తపాళికిన్
సంతసమిచ్చు నీ చరణసారసమున్ దరిసించుటెన్నడో !
(శ్రీ ముదివర్తి కొండమాచార్యులు)
🔷అన్నమయ్య కీర్తన లిరిక్స్
~~~~~~~~~~~~~~~
ప॥ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
చ॥
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు!
🔹కీర్తనకు చిత్రము వేసిన శ్రీ PVR మూర్తిగారికి ధన్యవాదములు.
🔸తెలిసినంత మేరకు నా వివరణ
*******************
స్వామీ! నీటికొలది తామర వలే మా ఆలోచనలను బట్టే మాకు భగవత్తత్త్వము అర్ధమౌతుందంటూ అన్నమయ్య ఈ కీర్తనలో ‘చేసుకున్న వారికి చేసుకున్నంత’అనే నానుడి గుర్తు చేస్తూ పరతత్త్వాన్ని బోధిస్తున్నాడు।
ఎవరు ఏరూపులో నిన్ను చూడదలిస్తే ఆ రూపులో కనబడతావు. ఎవరు ఎంత మాత్రం తలిస్తే అంత మాత్రమే భగవత్ప్రసాదం అందిస్తావు. నది దగ్గరకు మనం ఏపాత్ర తీసికొని వెళితే ఆపాత్ర వరకే నీరు తెచ్చుకోగలిగినట్లు నిన్నెంతమాత్రం పూజిస్తే అంత ఫలితం పొందుతాము. పిండికొద్దీ రొట్టె అన్నట్లు మా నమ్మకం కొద్దీ, మా భక్తికొద్దీ ఫలితం అందించే వాడవు నీవు.
వైష్ణవులు మనసారా నిన్ను విష్ణువని పూజిస్తారు.వేదాంతులు పరబ్రహ్మ అంటారు. శైవులు శివుడవని, శాక్తేయులు శక్తి స్వరూపమని, కాపాలికులు ఆదిభైరవుడని నిన్ను తలుచుకుంటారు. ఏపేరుతో పిలిచినా, ఏతీరుగా పూజించినా తలచినవారికి తలచినట్లు, కొలిచిన వారికి కొలిచినట్లు దర్శనమిచ్చే స్వామివి. అల్పబుద్ధులకు వారి ఆలోచనకు తగినట్లే ఉండగలవు. ఘనమైన బుద్ధిగలవారికి ఘనుడవుగానే ఉంటావు. నీ లోపం కాదది. గంగానది ప్రక్కనున్న బావులలో ఉండేది గంగాజలమే కదా. అదే విధంగా మాకు చేరువైన దైవము వేంకట పతి అయినప్పుడు, నిన్నే శరణు కోరినప్పుడు మాలో ఉండేది నీవే. ఇదే పరతత్వము .
~~~~~~~~~~~~~~
డా.ఉమాదేవి జంధ్యాల


 

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...