24, సెప్టెంబర్ 2020, గురువారం

పి. బి. శ్రీనివాస్ - P.B. Srinivas -


పి. బి. శ్రీనివాస్ (ప్రతివాది భయంకర శ్రీనివాస్) - My pencil sketch

మధుర గాయకుడు, బహుభాషా గాయకుడు, బహుభాషా కోవిదుడు పి.బి.శ్రీనివాస్ (ప్రతివాది భయంకర శ్రీనివాస్) జయంతి (22 September) సందర్భంగా నా చిత్ర నివాళి. తెలుగువాడైనప్పటికీ కన్నడ భాషలో ఎక్కువ పాటలు, అందునా కన్నడ చలనచిత్ర అగ్రనటుడు రాజ్ కుమార్ కి పాడడం ఓ విశేషం.

వీరి గురించి ప్రముఖ విశ్లేషకులు శ్రీ రోచిష్మాన్ గారు ఇలా అంటున్నారు.

బహుభాషా చలనచిత్ర నేపథ్య గాయకులు, అష్టభాష కవి, నూతన కర్ణాటక సంగీత రాగ సృష్టికర్త, నూతన ఛందః సృష్టికర్త, వాగ్గేయకారులు, తొలితెలుగు గౙల్ గాయకులు, తొలి తెలుగు గౙల్ వాగ్గేయకారులు, ఇంగ్లిష్ గానం చేసిన తొలి తెలుగు గాయకులు, ఎనిమిది భాషల్లో గౙళ్లు వ్రాసిన తొలికవి ఆపై ఏకైక కవి, అమెరిక‌ అధ్యక్షులు నిక్సన్ (Nixon) ప్రశంసల్ని, చంద్రుడిపై కాలు మోపిన ఆంస్ట్రంగ్ (Armstrong) ప్రశంసల్ని అందుకున్న కవి-గాయకులు పి.బి.శ్రీనివాస్. ఆయన వర్ధంతి (ఏప్రిల్ 14)  సందర్భంగా ఆయన గొప్పదనాన్ని మరోసారి స్మరించుకునే ప్రయత్నంలో భాగంగా వారి అష్టభాషా కవితా సంకలనం "ప్రణవం"పై ఒక సమర్పణ.‌
 
ప్రణవం- ప్రపంచంలో తొలి ఆపై ఏకైక‌ అష్టభాషా‌ కవితా‌ సంకలనం. ఆ ఎనిమిది‌ భాషల కవితలను రాసిన‌ కవి తెలుగువారైన పి.బి.శ్రీనివాస్.‌ నమోదైన ప్రపంచఫు తొలి‌ అష్టభాషా కవి పి.బి.శ్రీనివాస్.‌
 
"నాచన సోముడు అష్ట భాషా కవి అని మనం చదివాం. కానీ ఆ అష్టభాషలు తెలుగు మాండలిక భేదాలే. వేర్వేరు భాషలు కావు" సి. నారాయణ రెడ్డి ఈ‌ మాటలు అన్నారు. "మనకు తెలిసిన‌ ఏకైక అష్టభాషా కవి పి.బి.శ్రీనివాస్" ఇవీ సినారె మాటలే.
 
పి.బి.శ్రీనివాస్ వ్రాసిన ప్రణవంసంస్కృతం, తెలుగు,‌ తమిళ్,‌ కన్నడం, మలయాళం, హిందీ, ఉర్దూ,‌ ఇంగ్లిష్ ఈ ఎనిమిది‌‌ విభిన్న భాషల‌ కవితల సంకలనం. భాషకు ఎనిమిది చప్పున ఎమినిది భాషలకూ ఎనిమిది‌ వేఱు వేఱు ఇతివృత్తాల కవితలు ఈ ప్రణవంలో పొదగబడినాయి. ఒక్క ఇంగ్లిష్ భాషకు తప్ప తక్కిన ఏడు భాషల కవితలకు ఇంగ్లిష్ లిపి అంతరీకరణమూ,‌ ఇంగ్లిష్ అనువాదమూ ఇవ్వబడ్డాయి. ఈ సంకలనంలోని కవితలూ, వాటి ఇంగ్లిష్ లిపి అంతరీకరణలూ, అనువాదాలూ కవి పి.బి.శ్రీనివాస్ చేతి‌వ్రాతలోనే ఉంటాయి. ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి ప్రయత్నమూ, ఇంతటి ప్రయోగమూ మఱెక్కడా జరగలేదు.
 
1997లో ఈ ప్రణవం‌ పుస్తకం విడుదలయింది. ముఖపత్రంలోనే ఎనిమిది భాషలూ కనిపిస్తాయి. అష్టభాషా‌ కవితా సంకలనం ప్రణవం తెలుగు సృష్టించిన అద్భుతం. ఒక‌ తెలుగు మేధ మాత్రమే అందించగలిగిన అద్భుతం. ఈ‌ ప్రణవం లో సంస్కృతం, ఉర్దూలతో సహా ఇతర భాషల గౙళ్లూ, అంతర్లాపి కవితలూ, అష్టపదులూ, సామాజిక వచన కవితలూ,‌ గేయాలూ, భక్రి గీతాలూ, జానపద గేయాలూ, భజన్‌లు, చోటు చేసుకున్నాయి.
 
సంస్కృతంలో‌ ... "స్తుతిగాన పియూష పానానురక్తమ్" అనీ, తెలుగులో " భావాలకు పుట్టినిల్లు తెలుగు భాష , పలువన్నెల వానవిల్లు తెలుగు భాష" అనీ, తెల్లనైన నీడలాగా" అనీ "తనువు వేడిని తనువు కొలిచింది" అనీ, తమిళ్‌లో "ఒకామే మనకు మాత ఆమే భారతమాత" అనీ, "అహంకారం మూర్ఖత్వానికి సంతానం" అనీ, కన్నడంలో "ప్రకృతి‌ ఒడిలో మనమందఱమూ కలిసిపోదాం" అనీ, "మధురమర్మం" అనీ మలయాళంలో " నా హృదయం ఒక ఆలయం అది కళల ఆశ్రమంగా కట్టబడింది"‌ అనీ, హిందీలో "భాషా‌ పుల్ హై దీవార్ నహీ(భాష వంతెన, గోడ కాదు ) భాషా గుల్ హై తల్వార్ నహీ (భాష పుష్పం, ఖడ్గం కాదు)" ‌అనీ, ఉర్దూలో "హుస్న్ కీ జబీన్ పర్ మాహ్ తాబ్ హై గౙల్ / షాయిరీ కీ షాన్ కా ఆఫ్ తాబ్ హై గౙల్ ( సౌందర్యం ఫాలభాగం పైన జాబిల్లి గౙల్/ కవిత్వం ఔన్నత్యం పైన సూర్యుడు గౙల్) అనీ, "చార్ దిన్ కీ జిందగానీ క్యూన్ కిసిసే దుష్ మనీ/ దుష్ మనీ చాహేతొ కర్ లే దుష్ మనీ సే దుష్ మనీ
 
(నాలుగు రోజులదీ జీవితం ఇతరులతో ఎందుకు శత్రుత్వం/ శత్రుత్వమే కావాలనుకుంటే చేసుకో శత్రుత్వంతోనే శత్రుత్వం) అనీ, ఇంగ్లిష్‌లో "English never gets old. as it is energetic and eternally young in age" అనీ "Oh Death, it is high-time for you to die!" అనీ, Optimism is a prism of colour ful rays / Noble and bold minds receive God's grace" అనీ "Love is whiter than the pure snow" అనీ ఈ‌ ప్రణవం కవి పి.బి. శ్రీనివాస్ తమ‌ కావ్య వాక్యాలనూ, వాక్య కావ్యాలనూ మనకు అందించారు.
 
"అరుదైన అనర్ఘ‌ రత్నం‌ ఈ అష్టభాషా‌ కవితా‌ సంకలనం ప్రణవం" అని అనడం సరికాదు. ఈ ప్రణవంలోని ఎనిమిది భాషలనూ వెదికి అంతకన్నా అద్భుతమైన అభివ్యక్తితో ఈ ప్రణవంను అభివర్ణించాలి. 

Courtesy ఆంధ్రజ్యోతి April 14, 2019

22 September 2020 నాడు వీరి గురించి మిత్రులు కొంపెల్ల శర్మ గారి ఆధ్వర్యంలో సమాలోచన సభ జరిగింది. ఈ లింక్ క్లిక్ చేసి వీక్షించమని మనవి. 

కామెంట్‌లు లేవు:

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...